కొత్త కాంతి

0
1

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]సి[/dropcap]టీకి దూరంగా విసిరేసినట్టుంది బోయపల్లి. బోయపల్లి మూడనమ్మకాల పొరల్లో కప్పబడిపోయింది.

ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోతున్న ఆలోచనలు ఇంకా బోయపల్లి చేరుకోలేదు! ఊర్లో అందరికీ ఏవో భయాలు, ఆవుకి ఐదుకాళ్ళ దూడ పుడితే ఏదో అరిష్టం అనే భయం. అతిగాలికి వేపచెట్టు పెద్దకొమ్మ విరిగితే ఊరికి అరిష్టం అనే చింతనతో పూజలు చెయ్యకపోతే ఊర్లో ఎవరికీ నిద్రపట్టదు!

ఇటువంటి ఆలోచనలు ఊరిపెద్ద రమణయ్యకు కూడా ఉన్నాయి. ప్రజలతోనే తనుకూడా మరి. వేరేవిధంగా ఆలోచించలేడు కదా! అసలే చిన్న ఊరు – పెద్ద కులాల వాళ్ళ ఇళ్ళకు దూరంగా నిమ్నకులాల వాళ్ళ గుడిసెలు ఉన్నాయి. వారంతా కూలిపనులు శుద్ది పనులు చేసుకుని బతుకుతారు. చిత్రమేమిటంటే వాళ్ళు నీళ్ళు చేదుకునే బావి వాళ్ళ ఇళ్ళ మధ్యనే ఉంది. వాళ్ళు ఊళ్ళో పెద్దబావిలో నీళ్ళు చేదుకోకూడదనే అంక్ష ఉంది!

ముత్తయ్య నిమ్నకుల కాలనీలోవాడే. చదువులేకపోయినా వాడివి పెద్ద ఆలోచనలు. పెద్దకులం వాడూ మనిషే, మేము మనుషులమే. మరి ఎందుకు ఈ భేదం అని వాడి ఆలోచనలు సాగేవి. ఏది ఏమైనా తన కాలనీలోనే కాదు ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ధన సహాయం చెయ్యకపోయినా తనవంతు చేతి సహయం చేసేవాడు.

వాడి పట్ల ఊరిపెద్ద కులస్తులకు ఒకవిధమైన గౌరవం ఉన్నా, కట్టుబాట్లను తప్పించుకోలేక వాడిని ఒక తాకరాని వాడిగానే చూచేవారు.

బోయపల్లి శివాలయం శివరాత్రి పర్వదినంతో కళకళలాడుతోంది. ఊర్లో జనాలు శివయ్యకు అభిషేకాలు చేస్తున్నారు. లౌడ్ స్పీకర్లో శివస్తుతులు మారుమ్రోగుతున్నాయి. పెద్దకులాల వాళ్ళు దేవాలయం లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకుని పులకిస్తున్నారు. పూలు, పండ్లు శివయ్యకు అర్పిస్తున్నారు. టెంకాయ కొట్టి తరిస్తున్నారు.

గుడికి కొంతదూరంలో నిమ్నకుల గుంపులో ముత్తయ్య కూడా నిలుచుని వచ్చేపోయే జనాల్ని చూస్తున్నాడు. కేవలం అరమోడ్పులతో స్వామికి భక్తిని సమర్పించుకొంటున్నారు! మరి వారికి దేవాలయం ప్రవేశం లేదాయే! వీళ్ళు లోపలికి వెళ్ళినా, నందీశ్వరుని కొమ్ముల మద్య నుండి శివయ్యను దర్శించినా శివుడు ’మైల’ పడిపోయాడట! ఆ ఊర్లో పెద్ద కులాల వారి నమ్మకం అది.

నిమ్న కులాల వారు గుడిలో ప్రవేశిస్తే ఆ శివయ్య మైలపడిపోయేంతటి బలహీనుడా?

ఆ దేముడు ఒక్కొక్కసారి తన మహిమను చూపిస్తూంటాడు. దేవాలయం ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి సిటీలో పేరుమోసిన్ ప్రముఖ డాక్టర్ విశ్వేశ్వరరావు గారు దిగారు. ఊరిపెద్ద రమణయ్య ఆయనకు ఎదురుగా వెళ్ళి సాదరంగా దేవాలయంలోకి ఆహ్వానించాడు. ముత్తయ్య ఆయన ముందుకొచ్చి “నమస్కారం సార్!” అన్నాడు.

”ముత్తయ్య! బాగున్నావా?” అని చిరునవ్వుతో పలకరించి డాక్టరుగారు ముత్తయ్య భుజంమీద ఆప్యాయంగా చెయ్యివేశాడు.

ఊరిపెద్ద రమణయ్య డాక్టర్ గారు ముత్తయ్యను ఆప్యాయంగా పలకరించడం చూసి ఆశ్చర్యపోయాడు.

దేవాలయంలో శివయ్య దర్శనం తరువాత డాక్టర్ విశ్వేశ్వరావు రమణయ్యతో ”ఆ ముత్తయ్యలో చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ ఉంది తెలుసా? ఆతను తన రక్తం ఇచ్చి ఎందరో ప్రాణాలు కాపాడాడు” అని చెప్పావు.

డాక్టర్ చెప్పినమాటలు విని రమణయ్య ఆశ్చర్యపోయాడు. ఒక నిమ్నకుల మత్తయ్య తన రక్తం ఇచ్చి ఎందరినో కాపాడాడంటే రమణయ్య నమ్మలేకపోయాడు.

శివరాత్రి పర్వదినం ముగిసింది.

ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.

ఆ రోజు ఎప్పటిలాగే రమణయ్య భార్య పార్వతమ్మ బావిదగ్గర నుండి బిందెలో నీళ్ళు తీసుకుని పరధ్యానంగా ఇంటివైపు అడుగులు వేస్తోంది. పెద్దగాలి వీచింది. కొద్దిదూరంలో ఉన్న వేపచెట్టు పెద్దకొమ్మ పెళపెళ విరిగింది. పార్వతమ్మ వెనుక కొద్దిదూరంలో ఉన్న ఓ ఎద్దు కొమ్మ విరిగిన శబ్దానికి బయపడి పరుగెత్తి పార్వతమ్మను ఢీకొట్టింది! అంతే పార్వతమ్మకి ఎద్దుకొమ్ము తగిలి చెయ్యివిరిగింది. పార్వతమ్మ ముందుకు పడబోగా అక్కడ ఉన్నరాయి ఆమె తలకు తగిలింది. బొటబొట రక్తం కారింది. అందరూ పరుగెత్తుకొచ్చారు. ఆమెను జాగ్రత్తగా ఎత్తారు. అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. పదిహేను నిమిషాల్లో 108 వచ్చింది. రమణయ్య సిటీలోని డాక్టర్ విశ్వేశ్వరరావు నర్సింగ్ హోమ్‌కి తీసుకువెళ్ళాడు.

డాక్టర్ ఆఘమేఘాలమీద చికిత్స మొదలుపెట్టాడు.

”అయ్యా! ఊరిలో గాలికి వేపచెట్టు పెద్దకొమ్మ విరిగింది! అదే అరిష్టం మా ఇంటిదానికి చెయ్యిరిగింది. రక్తం పోయింది!” అని నీళ్ళు నిండిన కళ్ళతో చెప్పాడు రమణయ్య.

”ఇంక మీ ఊరువాళ్ళు మారలేదయ్య, కొమ్మ గాలికి విరిగితే అది ప్రకృతి వైపరీత్యం. ప్రతిదానిని మీరు జరిగే చెడుకు అపాదించడం చాలా తప్పు. అదిగాక మొన్న గమనించాను. ఆ నిమ్నకులస్తులు గుడి బయట నిలబడి అమాయకంగా చూస్తున్నారు. వాళ్ళకి గుడిలో ఎందుకు ప్రవేశం లేదు? వాళ్ళు గుడిలోపలికి వస్తే దేముడు మైలపడిపోతాడా పడిపోయేంత బలహీనుడా? అందరం ఆ దేవుని సృష్టేకదా! కాస్తంత బుర్రపెట్టి ఆలోచించండి. ఆ భగవంతుడి లీలలు అర్థం అవుతాయి” అని డాక్టర్ విశ్వేశ్వరరావు గట్టిగానే చెప్పాడు.

రమణయ్యకు మాటలు రాలేదు. ఈ విషయాల మీద తీవ్రంగా ఆలోచించసాగాడు. ఈ లోపల పార్వతమ్మ బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. ఆమెకు రక్తం ఎక్కించాలి. చిత్రమేమిటంటే ఆమె రక్తం గ్రూపు ఎ.బి. నెగెటివ్. చాలా అరుదైన గ్రూపు రక్తం!

డాక్టర్ విశ్వేశ్వరరావు చిరునవ్వుతో చెప్పాడు. ”చూడు రమణయ్య! ఇన్నాళ్ళు ఏ నిమ్న కులస్తుణ్ణి దూరంగా ఉంచుతున్నారో, అ ముత్తయ్యే నీ భార్య ప్రాణాలు కాపాడబోతున్నాడు. నీ భార్యలో, అ ముత్తయ్యలో ఒకటే బ్లడ్ గ్రూప్ రక్తం ఉంది. వెంటనే అతన్ని పిలిపించు ఆ గ్రూపు రక్తం ఇప్పుడు సిటీలో ఎక్కడా దొరకదు. అది చాలా అరుదైన ఎ.బి. నెగెటివ్” అని వివరించాడు డాక్టర్.

ఇక రమణయ్య ఆలోచించలేదు. వెంటనే తన మనుషులని పంపి ముత్తయ్యని రప్పించాడు. ముత్తయ్య రక్తం పార్వతమ్మలో ప్రవహించి ఆమె ప్రాణాలు నిలబెట్టింది! రమణయ్య ముత్తయ్యకు నమస్కారం పెట్టాడు. “అయ్యా! నమస్కారం నాకు పెట్టకండి” అని మర్యాదగా అన్నాడు ముత్తయ్య.

***

ఆ రోజు రమణయ్య బోయపల్లి రచ్చబండ ఓ మీటింగ్ ఏర్పాటు చేసి డాక్టర్ విశ్వేశ్వరరావు చెప్పిన మాటల్ని అందరికి చెప్పాడు. ముత్తయ్య రక్తం తన భార్య ప్రాణాలు కాపాడిన వైనం గురించి వివరించాడు. రమణయ్య చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. రెండో రోజు రమణయ్య డాక్టర్ విశ్వేశ్వరరావుని పిలిపించి ఆయన చేత కూడా కులవ్యవస్థ మీద సమానత్వం మీద మాట్లాడించాడు.

ఆయన మాటలు ఊర్లోవారిలో మరింత మార్పు తెచ్చాయి!

శివాలయంలో కార్తీకమాస పూజలు జరుగుతున్నాయి. ఈసారి నిమ్నకులస్తులు శివయ్య స్పర్శదర్శనం చేసుకున్నారు! శివాలయం మీద దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.

లింగమయ్యలో ఏదో కొత్త కాంతి కనబడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here