Site icon Sanchika

కొత్త మలుపు

[box type=’note’ fontsize=’16’] ఐతా చంద్రయ్య కథనంలో- ‘కొత్త మలుపులు’ తిరిగిన జీవితాల కథ. [/box]

[dropcap]అ[/dropcap]మ్మతో మనసు విప్పి మాట్లాడి చాలా కాలమైంది. కాలగమనం, కడలి కెరటం మనిషి కోసం ఆగవు గదా! అయినా… నేనిప్పుడు ఏ మొహం పెట్టుకుని అమ్మ ముందుకెళ్ళాలి?… ఆనంద్ నరాల్లో అనుమాన స్వరాలు.

ఆనాడు అమ్మ “బాబూ! నందా! మీ నాన్న పాముకాటుతో చనిపోయిండురా! వెంటనే కోడల్తోని రా” పుట్టెడు దుఃఖాన్ని పొట్టలో దాచుకుని ఫోన్‌లో గోడు వెళ్ళబోసుకుంది. గొంతు వణుకు వినబడింది గూడా. అప్పుడు తన విచక్షణ సుడిగాలిలో చుట్టుకుపోయింది. బయటి లోకాన్ని చూడనివ్వలేదు. నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని కాయకష్టం చేస్తూ స్వేద బిందువులతో వ్యవసాయ క్షేత్రాన్ని తదిపి, తననో ఆవాస విద్యాలయములో చదివించాడనే సంగతిని వ్యామోహం మింగేసింది.

అప్పుడు తన ఓరచూపు కోర వయసులో కువకువ లాడ్తున్న రోజీ అంగాంగాన్నీ ఆత్రంగా తడుముతున్నాయి. “అమ్మా! ఇది అమెరికా. ఈ అగ్రరాజ్యములో రూల్స్ పక్కాగా పాటిస్తారు. కంపెనీలో లీవు దొరకదు. మీ కోడలు రాదు. జరగాల్సింది జరిపించండి. నీ బాంకు ఎకౌంటులో డబ్బులు వేస్తా ఖర్చులకు” అలవోకగా సక్కులు పలికిండు.

గుండెలు బాదుకుంటున్నట్టుంది. గొంతు గొల్లుమంది. తమాయించుకుందేమో.. “ఆనందా! ప్ప… పైసలు ఆత్మీయత నివ్వవురా. నీ బోడి పైస లొద్దులే!” ఫోన్ కట్టైంది. అంత్యక్రియ లెట్లా జరిగినాయో!

ఉద్యోగానందముతో ఒంటరిగా అమెరికా కొచ్చిన తాను రోజూ ఆఫీసులో రోజీ అంగాంగాన్ని చూపులతో తడుముతూ నీలం కళ్ళు, రాగి రంగు జుట్టు, వయసు పొంగుల్లో బందీయై మన్మథ బాణాలందుకున్నాడు. రోజీ తాల్తలు తెలుగువారేనట. ఆ అందాల బొమ్మతో కలిసి తిరిగిన క్షణాలు గమ్మత్తైన మత్తులో ముంచెత్తినై. రోజీకి తెలుగు వచ్చు కాబట్టి స్వేచ్ఛగా మాట్లాదుకుని ప్రేమ వివాహంతో ఒక్కటైనారు. ఐదేళ్ళ ఒప్పంద వివాహము… అక్కడి ఆచారములో బంధించింది. సంవత్సరంలోగా కొడుకు పుట్టి సంతోష సాగరములో మునకలు వేయించిండు. తన అమ్మానాన్నల ఆప్యాయతలు రోజీ దుమారంలో కొట్టుకుపోయినై.

పెళ్ళై నాలుగున్నర సంవత్సరాలయ్యాక, రోజీ అసలు రంగు అవగతమైంది. తమ కంపెనీలోనే తోటి ఉద్యోగి రాబర్ట్‌కు దగ్గరైంది. తనంటే మొహం మొత్తిందేమో రోజీ అతని వెంటనే తుట్ట చుట్టూ తిరిగే తేనెటీగలా తిరగసాగింది.

తానది సహించలేక, “రోజీ! ఇది అనైతికం. నువ్వు రాబర్ట్‌తో రాసుకుపూసుకు తిరగడాన్ని భరించలేను. పెళ్ళంటే నూరేళ్ళ పంట గదా!” మందలించాడు. రోజీ కళ్ళు నిప్పుల్లాగైనాయి. “నూరేళ్ళ పంట కాదు, ఐదేళ్ళ తంటా మాత్రమే” అసహనంగా గుర్తు చేసింది.

కాలచక్రం గిరగిరల్లో వారం తిరక్కుండానే కిరాయి గుండాలు తన గారాల కొడుకుని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. అదంతా రాబర్ట్ నిర్వాకమే అని తెలిసినా తానేమీ చెయ్యలేక పోయాడు. ఐదేళ్ళ గడువు పూర్తవగానే రోజీ రాబర్ట్‌ను పెళ్ళి చేసుకుంది

తనలో ప్రతీకార వాంఛ… ఆఫీసులో అందరి ముందు రోజీని తిట్టి, చెయ్యి చేసుకోబోతుంటే తోటి ఉద్యోగులు ఆపేశారు. ఉద్యోగం ఊడింది.

అదంతా అమ్మకు చెప్పి ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఫోన్ రింగ్ చేశాడు. ఆ నెంబరు మనుగడలో లేదంది. మరోదారి లేక ఇంటిదారి పట్టాడు.

***

శారద కళ్ళలో ఈశ్వర్ రూపం కదలాడి గతంలోకి లాక్కెళ్ళింది.

ఆనాడు… తాము ఆనంద నందనవనములో విహరిస్తున్నప్పుడు ఈశ్వర్ “శారదా! మన ఆనంద్‍ను వాని ఇష్టమున్నంత వరకు… అంటే ఇంజనీరింగ్ వరకు చదివించినం. మన కష్టం వానికి సుఖాన్నిస్తుంది. అమెరికాల అవ్వల్‍దర్జా ఉద్యోగం లున్నడు” మురిపాలు మూటగట్టిండు.

“నిజమే” శారద మొహం పున్నమి కలువలా విచ్చుకుంది. “వానికి పెళ్ళి చేస్తే  మనకు మన బాధ్యత తీరిబోతుంది” గుండెల మీద ఒదిగిపోయింది.

“మనమిప్పుడు స్వేచ్ఛాజీవులం. కొడుక్కి పెళ్ళైతే కోడలొస్తుంది. అప్పుడిలా చిలకా గోరింకల్లా ఉండగలమా?” ఆయన ఆరాటం. చెంపల మీద తన పెదాల ముద్ర వేసింది.

“మన సంగతి ఆపేసి కొడుకు పెళ్ళి గురించి ఆలోచించాలి. మన గుమస్తా నారాయణ కూతురు కుందనపు బొమ్మ. డిగ్రీ చదివింది. ఆ పిల్ల మనవాడికి తెలుసు. నారాయణన్న ఒప్పుకుంటాడు. అయినా సరే… ఇప్పుడు మనవాడికి ఇష్టమా, కాదా అనే సంగతి ఫోన్‌లో కనుక్కుందాం”

“వారెవ్వా! నువ్వు కరణేశు మంత్రివి శారదా!”

తానే కొడుక్కి ఫోన్ చేసి అడిగింది. వాడు మాత్రం “అమ్మా! నాకిక్కడి అమ్మాయితోని పెళ్ళైంది. ఓ కొడుకు కూడా పుట్టిండు” చల్లగా చెప్పేసి మెల్లగా ఫోన్ కట్ చేసిండు. ఇద్దరూ తనివితీరా ఏడ్చారు. అప్పట్నించి కొడుకుతో మాటలు బంద్. కొంత కాలం గడిచింది.

ఈశ్వర్ పచ్చని మక్కచేనులో నడుస్తూ నాగుపాము మీద అడుగేయంగానే అది పడగ విప్పి కాటేసిందట. గట్టిగా అరిచాడట. నలుగురు గుమిగూడారట. నురగలు కక్కుతూ విషయమంతా చెప్పి ప్రాణాలొదిలాడట. శవాన్ని ఇంటికి తెచ్చి విషయం చెప్పారు. నడినెత్తి మీద నాటుబాంబు పేలినట్టైంది. గుండెలు బాదుకుంటూ ఏడ్చి, కొడుక్కి ఫోన్ చేసింది.

అదంతా జనారణ్య రోదనమైంది. అనాథాశ్రమం ఒడిలో చేర్చుకుంది. అది తనదే.

“అమ్మా!” అంటూ అనాథశ్రమంలో పెరుగుతున్న యువతి వచ్చి భుజాలు కుదిపింది. శారద గతంలోంచి వర్తమానంలోకి వచ్చింది.

“ఏంది జాహ్నవీ?” కొనకొంగుతో కళ్ళద్దుకుంది. జాహ్నవి మొహం విచ్చుకుంది.

“నాకుద్యోగం దొరికిందమ్మా” అంటూ ఆర్డర్ కాయితం చూపించింది.

“తల్లీ తండ్రీ లేని నన్ను అన్నీ నీవై పెంచినవు గదా! నీ మంచితనమే నాకు ఉద్యోగ మిప్పించిందమ్మా!” అంది.

శారద ఆనందానికి హద్దులు లేవు.

***

ఊర్లో తనింటికి ‘ఈశ్వర్ స్మారక అనాథాశ్రమము’ అని బోర్డు చూసిన ఆనంద్‍లో అయోమయం. తాబేలులా నడుస్తూ లోపలికెళ్ళాడు. ఎదురుగా శారద. ముఖాలు పాతవి, చూపులు కొత్తవి. ఓ నిముషం గడ్డకట్టుకుపోయింది.

“అమ్మా!” ఆనంద్ నవనాడుల్లో ఆనందాశ్చర్యాలు. తల్లికి పాద నమస్కారం చేశాడు. శారద పొత్తి కడుపులో పుత్ర ప్రేమ పొంగులు.

“అనుకోకుండా వచ్చావా? కోడలు, మనవడెక్కడరా?” కంటి ధారలు.

తన అమెరికా అనుభవాలన్నీ చెప్పేశాడు. “నువ్వెట్లున్నావమ్మా? ఇది…”

“అనాథాశ్రమమేరా. మీ నాన్న స్మృతి చిహ్నంగా నేనే మార్చాను. పొలాలు అమ్మి బ్యాంకులో ఫిక్స్‌డ్ చేసిన డబ్బుకు వచ్చే వడ్డీ తోన నడిపిస్తున్నాను. ఈయనకొచ్చె గ్రాట్యూటీ, పెన్షన్ గూడా ఈ పవిత్రాశ్రమానికే ఖర్చవుతోంది” అంటూ అటువైపు వచ్చిన పెద్దాయనను చూపించింది. “ఈయన దుర్గాప్రసాదు గారు. ఒక్కగానొక్క కూతురు – అల్లుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.”

“అంటే… ఈయన…”

“ఈ మధ్యనే రిటైరైండు. ఇప్పుడు… మేము ఒకరికొకరం ఆసరా. ఆయనకు భార్య లేదు. నాకు భర్త లేడు. మీ నాన్న ఫొటోలు రోజూ పూజ చేస్తున్నాం…”

“మరి… ఈ యువతి ఎవరమ్మా?” తల్లి పక్కనున్నామెను చూపించాడు.

“ఈ యువతి జాహ్నవి. కొన్ని సంవత్సరాల నుండి మన ఆశ్రమములోనే ఉంటున్న అనాథ. ఈ మధ్యనే డిగ్రీ పూర్తయ్యింది. ఈమెకు పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత నా మీదుంది” అంటూ జాహ్నవి తలను ఆప్యాయంగా నిమిరింది.

అంతకుముందే శారద ఆత్మకథలోని ఆనంద్ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకున్న దుర్గాప్రసాద్, జాహ్నవిలకి అంతా అవగతమైంది.

“అబ్బో!… ఈయన అందగాడే!” జాహ్నవి మనసులో తియ్యదనం.

‘హమ్మా! జాహ్నవి పున్నమి వెన్నెల లాగుంది…’ ఆనంద్ మందహాసం. ఇద్దరి చూపులు ఒకర్నొకరిని ఆపాదమస్తకం తడుముకున్నై..

వాళ్ళ ఓరచూపులు శారద, దుర్గాప్రసాద్ కళ్ళల్లో కాంతులు విరజిమ్మినై. ఎందుకైనా మంచిదని ఆనంద్ గురించి మరోసారి చెప్పింది శారద. జాహ్నవి అభిప్రాయాన్ని చదివేసిండు దుర్గాప్రసాద్.

“శుభం శారదమ్మా! ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. నీ కొడుకు జీవితంలో దెబ్బతిన్నా… ఇప్పుడు తోవలోకొచ్చిండు. ఆనంద్ – జాహ్నవిల ఈడుజోడు దివ్యంగా ఉంటుంది” అంటూ శారదకు అర్థవంతంగా సైగ చేశాడు. ఆనంద్ పెదాల మీద చిరునవ్వు చిందులేసింది.

జాహ్నవి చెంపలు సిగ్గులతో కెంపులైపోయినై. శారద, దుర్గాప్రసాద్‌లకు పాదాభివందనం చేసి “నా జీవితం కొత్త మలుపు తిరుగుతోంది” అంది.

ఆనంద్ ముందుకొచ్చి జాహ్నవి చేతులందుకుని చెంపల కద్దుకున్నాడు. విషయం అందరికీ తెలిసింది.

ఆశ్రమవాసుల మనసుల్లో మలయమారుతం వీచింది.

ఆశ్రమం నవ వసంతాన్ని పులుముకుంది.

Exit mobile version