Site icon Sanchika

కొత్త పూల కాంతి

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘కొత్త పూల కాంతి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వే[/dropcap]దన గాయాల మట్టి రక్తసిక్తం ఈడ
గుడిసెలు పడిపడి రోదించే ఊరు
నిద్రిస్తున్నది చీకటి కిటికి ఎండిని చెరువు నీడ

చేతికందిన ముద్ద దిగలేదు గొంతు దాటి
ఆకలి అరుపులది నిత్య గోలే విశ్వంలో
ఏ మార్పు తీర్చని మాట రోదన వ్యథ

భిక్షకు తను పాపం కొత్త
తికమక అడవి నింపదు కడుపు
కాపలా ఇల నిజం లేని డొల్ల సాగుబడి

నిరుపేదల ఇళ్లూ నోళ్ళూ కాదు
కూల్చేది పేదరికం మూలాలు
యోజనకూ యోచనకూ మనసు కరువు

మనుగడ లేని ఊహలూగే ఉట్లు
ఆశలీదే లోయల తొట్లు
మూసిన కనుల దారి మెట్లు
స్వార్థం తెరిచిన వరద గోదారి గేట్లు

నీవేకాదు
వాడు కూడా ఉన్నాడని ఓ మనిషీ
చెమట గుర్తుచేస్తుంది

ఆత్మీయ ఏరువాకే తెస్తుంది
నీలోనాలో వేదన రోదనల్లేని
కొత్త పూల కాంతి ప్రపంచాన

Exit mobile version