Site icon Sanchika

కొత్తగా ఆలోచన..

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘కొత్తగా ఆలోచన..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప[/dropcap]ట్టిన పీడకల వలలు వదిలేలా
మనసు మాయగాని మెదడు పదునెట్టి
రానీ ఆలోచన కొత్తగా

బార్లా సాచిన కాళ్ళు
అలసటదీరా సేదదీరు సకిలంముకులం
కునుకులేచిన కదలికలో
తొలి అడుగు అభినయం మొదలు

రాత్రికీ పగలుకూ
నిద్ర మెలకువలో చీకటి వెలుగులు
కొత్తగా కదిలే నడకల గూడు

ఊపిరి నిర్విరామంగా రాస్తూ
కొనఊపిరి చివరాఖరి గీతం దాక బతుకు
అటూఇటూ ఆడే లోలకం చేతుల

రాసే కావ్యం చేతన స్వచ్ఛత
అంగవస్త్రాల శుభ్రత బతుకు కళ

ఏ ఇంటి బట్టలు ఆ ఇల్లు దరిజేరే సోయి
మా ఇంటి చాకలి కొమురవ్వ
మతిమరుపులేని వెలుగుల నిఘంటువు
ఆర్టిజాన్ స్పృహ బతుకున స్కిల్ ఆమె

నిశ్శబ్ద పేజీల తిరిగేసే శబ్దలయ
వృత్తినమ్మిన సృజనలో బంగారు తీగ

పట్టాగొలుసు అల్లికలో
తెల్లతీగల వెండి దారాలు వెలిగే
స్వర్ణకారుడు ఆగయ్య మామ చేతి నడకలు

చిన్నారి పొన్నారి అమేయ ప్రేమ
కంటి దరువుల మోగె కాలి అందియ

వేప పుల్ల ఆటలే నోటి మైదానమై ఆడె
దంతధావన క్రీడ ఉదయ నడక ఆరోగ్య పథాన
కప్పు చాయ్ వెలిగిన ఆలోచన సరసరా
నెరినెరి చూపుల గిరగిరా బుర్ర

కవిత పొంగిన కుండ
పొట్టనింపే అమృతాత్మలో అన్నం
శిలనూ కలనూ తొలిచి వలచిన లేఖిని
రాయివి కాదు సూదంటురాయి నీవు

కొత్తగా రాయి ఆలోచన పెంచ
ఎగురే పావురాయి రెక్కల
ఝుమ్మను ఝంకారమే
తుమ్మెదలు నినదించు తోటలో
పరిమళించే చేతివృత్తుల గెలాక్సీగా..

Exit mobile version