Site icon Sanchika

కొత్తకాపు

[box type=’note’ fontsize=’16’] ‘హోస ఫసలు’ అనే పేరుతో కన్నడంలో వసుంధర కడలూరు వ్రాసిన కథని సంచిక పాఠకుల కోసం అనువదించి తెలుగులో అందిస్తున్నారు కోడీహళ్లి మురళీమోహన్. [/box]

[dropcap]”ఈ[/dropcap] బస్సుకు ఎందుకన్నా వచ్చానో..?” అంటూ దీనితో కలిపి ఒక ఇరవై సార్లు మనసులో తనను తనే తిట్టుకుంది మధు. ‘చేతినిండా జీతమొచ్చే పని ఉంది. వేరే పెద్ద ఖర్చులేమీ లేవు. జుమ్ అంటూ టాక్సీ చేసుకుని రావచ్చు కదా. నేనెప్పుడూ ఇంతే. అవసరమైనప్పుడు అనుకూలం చూసుకోను. అవసరం లేనప్పుడు కారో, ఆటోనో ఎక్కేస్తాను…’ అంటూ మళ్ళీ విసుక్కుంటూ కిటికీ ప్రక్కన సీటు దొరకనందుకు మరింత అసహనానికి లోనయ్యింది. బస్సులోని జనాల శరీరపు దుర్గంధం, ఎండ వేడిమికి మేను సందుగొందుల్నుండి పీక్కువస్తున్న ఆమె చెమట ఆమెకే చీకాకు పుట్టిస్తున్నది. బస్సు నిండా జనముండి సరిగ్గా గాలి కూడా ఆడటం లేదు. ‘ఈ బస్సు డ్రైవర్ ఇంకా ఎవరికోసం చూస్తున్నాడో. బస్సు ముందుకు కదిలితే కొంచెం గాలైనా వీచి నెమ్మదిగా వుంటుంది ‘ అని కొందరు గట్టిగానే గొణుక్కుంటున్నారు.

మధు మనసు ఎంత ఆందోళనగా ఉందంటే ఆమె తన చుట్టుముట్టూ ఉన్నవాటిని గమనించే స్థితిలోలేదు. కండక్టర్ అందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చి ‘ఎక్కడికమ్మా?’ అని అడగగానే ‘కావేరీ సర్కిల్ ‘ అని చెప్పి సరైన చిల్లర ఇచ్చి టికెట్ తీసుకుంది. బస్సు వాళ్ళ నుండి చిల్లర తీసుకోవడం ఆమెకు నచ్చదు. ఎంగిలి అంటించిన టికెట్లను, చిల్లరనోట్లను ముట్టుకోవడం అంటే డోకు వస్తుందామెకు.

బస్సు ఎలాగోలా హెబ్బాళ్ వదిలి మేక్రీ సర్కిల్ దాటి బాలబ్రూయి సిగ్నల్ చేరడానికి ఒక గంటకన్నా ఎక్కువ సమయం తీసుకునే సరికి మధు మనసు కుతకుతా ఉడికిపోయింది. ఈ మధ్యలో ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ‘బస్సు దిగి ఆటో ఎక్కేద్దామా? క్యాబ్ బుక్ చేసుకుందామా? లేక ఈ రోజు సెలవు పెట్టేద్దామా? సెలవు పెట్టినా తిరిగి హాస్టల్‌కు పోయి చేసేదేముంది? అదే టీ.వి. ఆటో ఎక్కినా, క్యాబ్‌లో పోయినా ఇదే రోడ్డుపైనే కదా వెళ్ళాలి? రోడ్డు నిండా వాహనాలే ఉన్నప్పుడు వారు మాత్రం ఆకాశంలో ఎగురుకుంటూ పోతారా?’ ఇలా మధు మనస్సు తర్కవితర్కాలను పట్టించుకోకుండా క్షణానికో విధంగా ఆలోచిస్తోంది. ‘అదీకాక ఈ నెల పిరియడ్స్ వారమైనా రాకుండా స్కిప్ అవుతోంది. వచ్చేవారం పండగ టైముకు సరిగ్గా అయితే ఏం చెయ్యాలి. మంచి కిరికిరి.’ అని కూడా ఆలోచిస్తోంది. పైగా ఆ బస్సు కూడా మధు ద్వంద్వ మనస్సులా అక్కడక్కడా ఆగి ఆగి సాగుతోంది. దానికి బెంగళూరు ట్రాఫిక్ అని పేరు కూడా.

* * *

మధు ఉద్యోగనిమిత్తం ప్రస్తుతం బెంగళూరు నివాసి. ఆమె భర్త ప్రభు తన తల్లిదండ్రులతోపాటు మండ్య సమీపంలోని సోమనహళ్ళిలో ఉంటున్నాడు. వారికి ఆరేళ్ల చిన్మయ్ ఒక్కడే కొడుకు. ప్రభు బి.ఇ., ఎం.ఎస్. చదివి కొన్నాళ్ళు ఒక కంపెనీలో చాకిరీచేసి, విదేశాలకూ వెళ్ళి వచ్చాడు. తన పని వత్తిడితో విసిగి వేసారి ఇటువంటి పని కన్నా పొలమూ, తోటా చూసుకోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అదీకాక ఎంతో ప్రేమతో తాము పిలిచినా పట్టణానికి వచ్చి తమతోనే ఉండటానికి ఇష్టపడని తన ముసలి తల్లిదండ్రులతో జీవించడమే తన కర్తవ్యమని భావించి పల్లెబాట పట్టాడు. ప్రస్తుతం అతడు యశస్వియైన ఒక కర్షకుడు. ప్రగతిశీల రైతు.

‘ఊరికి వెళ్ళిపోదాం మధూ’ అన్న ప్రభు మాటకు మధు ఒప్పుకోలేదు. పెళ్ళికన్నా ముందే కష్టపడి సంపాదించుకున్న, అదీ మెరిట్‌పై దొరికిన ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా వదిలిపెట్టాలి? అనుకుంటూ మధు ‘ప్లీజ్ ప్రభూ! ఇంకొంత కాలం ఉద్యోగం చేస్తాను. ప్రభుత్వ ఉద్యోగం అందరికీ అంత సులభంగా దొరకదు. ఆ సంగతి మీకు తెలుసు కదా? ఇక్కడ ఒక్కదానికే ఉండడం కష్టమైతే ఊరికి వచ్చేస్తాను’ అంటూ భర్తను, అత్తమామలను ఒప్పించింది. వారానికొకసారి తానే ఊరికి వస్తానని చెప్పింది. ప్రభు మాత్రం కొడుకు చిన్మయ్‌ను స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో పెంచడానికి నిశ్చయించి, నాన్నమ్మ, తాతయ్యలకు పిల్లాడి ఆలనాపాలనా కావాలని ఊరికి తీసుకెళ్ళాడు. ఈ విషయంలో మాత్రం ప్రభు మధుతో రాజీపడలేదు. అలా ఇంటిలో ఎవరూ లేకపోవడంతో మధు వర్కింగ్ విమెన్స్ హాస్టల్‌లో చేరింది. వారానికోసారి ఊరు వెళ్తూ, వస్తూ ఎలాగో నెట్టుకొస్తున్నది.

ఏది ఏమైనా మధుకు అత్తమామల, భర్త సపోర్ట్ ఉంది. అయితే వ్యతిరేకించేది మాత్రం కొడుకు చిన్మయ్. ఆమె బెంగుళూరు నుండి ఊరికి వచ్చినప్పుడు పురివిప్పిన నెమలిలా హుషారుగా ఉండే చిన్మయ్ తిరిగి ఆమె బెంగళూరుకు బయలుదేరినప్పుడు కడుపుచించుకుని ఏడ్చేవాడు. పాపం అతనికింకా ఆరేళ్ళే. ఆమె బయలు దేరడాన్ని గమనించిన చిన్మయ్ అమ్మా అంటూ రాగం తీసేవాడు. ఆమె ఒకటి రెండు గంటలు ఆగి వాడిని మురిపించి, సమాధానపరిచి వాడి కన్నుకప్పి వెళ్ళాల్సి వచ్చేది. ప్రతివారం ఇదొక సాహసకృత్యమే.

ఏడ్చే కొడుకును ఎలాగా సమాధానపరిచి వచ్చినా ఇక్కడ ఒంటరిగా గడుపుతున్న మధు మనస్సును సమాధానపరిచే వారెవరున్నారు? ఆమె మటుకు అసమాధానపు కొలిమిలో రోజూ కాలుతున్నది. తిరిగి ఊరెళ్ళడానికోసం వారాంతానికై ఎదురుచూస్తూ యాంత్రికంగా పనిచేస్తూ ఉంది. ఒక్కోసారి ‘ఏ పురుషార్థం కోసం నేనొక్కదానే ఇక్కడుండాలి? నా సంపాదనకోసం ఎవరు కాచుకుని ఉన్నారు? భర్త, కొడుకు, ఇంటిల్లిపాదినీ వదిలిపెట్టి నేను సాధిస్తున్నదేమిటి? నేనెవరిని మెప్పించాలి? లేక ఇలా బతుకుతున్నందుకు నానెత్తిమీద ఏమైనా కిరీటం పెట్టి గౌరవిస్తారా?’ ఇలా ఆలోచిస్తోంది. ఐతే సర్కారీ కొలువును వదిలిపెట్టే తలపు వచ్చినప్పుడు మధు మనస్సు చలించేది కాదు.

‘వచ్చే వారం తమిళనాడు టూర్ వెళుతున్నాను. మీరూ వస్తారా మధుగారూ! ఒకటి రెండు సీట్లు ఖాళీ ఉన్నాయని ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. మీకు టికెట్ బుక్ చేయమంటారా?’ హాస్టల్లో తన రూంమేట్, లేబర్ డిపార్ట్‌మెంట్లో పనిచేసే ప్రతిభ అడిగినప్పుడు మధు ఆశ్చర్యపోయింది. ‘ఏమండీ ప్రతిభా! వారం రోజులు శెలవు పెడుతున్నారా? అన్ని రోజులు లీవ్ శాంక్షనయ్యిందా? మా ఆఫీస్‌లో లీవ్ దొరకడం డౌటు’ అంది. ‘మధూ మీరు క్యాలెండర్ చూడలేదనుకుంటాను. వచ్చే వారం ఒక్క మంగళ వారం మాత్రం వర్కింగ్ డే. సోమవారం ఒక ఆర్.హెచ్.ఉంది. దానితో పాటు మంగళవారం ఒక్క క్యాజువల్ లీవ్ పెట్టుకుంటే చాలు. బుధవారం నుండి శనివారం వరకూ గవర్నమెంటే హాలిడేస్ ఇచ్చింది చూడండి. పూర్తిగా ఒక వారం సెలవు దొరుకుతుంది. ప్రతివారం మీ వూరికి పరిగెడుతుంటారుకదా? ఈసారి నాతోపాటు మధుర, పాండిచ్చేరి, కన్యాకుమారి అన్నీ చూడడానికి రండి. ఊరికి ఆ పైవారం వెళ్లొచ్చు’ అని అడిగింది.

ఐతే ఒకవారం సుదీర్ఘ కాలాన్ని ముద్దులకొడుకుతో గడపకుండా టూర్ వెళ్ళడానికి మధు మనసొప్పలేదు. ‘సారీ ప్రతిభా! మీతో పాటు యాత్రలకు రాలేను. అయితే సెలవుల సమాచారం ఇచ్చినందుకు మీకు చాలా థాంక్స్. సెలవు పెడతాను. శాంక్షన్ అయితే ఊరికి పోయి కొడుకుతో వారం రోజులు గడుపుతాను.’ అని చెప్పి లీవ్ లెటర్ వ్రాయడానికి ఉపక్రమించింది.

మధు అదృష్టం కొద్దీ లీవ్ వెంటనే శాంక్షనయ్యింది. ఈ సుదీర్ఘ సెలవే ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఆమె ఊహించలేదు.

ఊరిలో కొడుకుతో వారమంతా సంతోషంగా గడపడటం, ప్రభుతో తోటల్లో తిరగాడటం, కంటికింపుగా పచ్చదనం, మట్టి వాసన, చల్లని కొబ్బరినీళ్ళు, నీటి చలమలు, కొత్తగా చంద్రికలలో పట్టుపురుగులను సాకడం, తేనెటీగల పెంపకం, వీటిపై ప్రభు చూపిస్తున్న శ్రద్ధ, సంతోషం, అత్తమామల అన్యోన్య దాంపత్యం ఇవన్నీ చూసి మధు హృదయం విచ్చుకోవడానికి బదులు కృంగి పోయింది.

‘కేవలం ప్రభుత్వోద్యోగమే తన అర్హతా? ఇంత మంచి సంసారాన్ని వదలి తానొక్కతే అక్కడుండి ఒంటరిగా సాధించిందేమిటి? బదిలీ, ప్రమోషన్లు లేని ఉద్యోగం. ఇక్కడ ఎంత వైవిధ్యభరితమైన బ్రతుకు. తాను ఉద్యోగం మానేస్తే వచ్చిన నష్టమేమిటి? వ్యవసాయంలో భర్తకు తోడ్పాటుగా ఉండొచ్చు. ప్రభు కూడా నోరువిప్పి చెప్పనప్పటికీ తన ఉనికిని ఎంతగా కోరుకుంటున్నాడు. చిన్మయ్ తానున్న ఈ కొద్ది రోజులకే ముఖంలో ఎంత కళ వచ్చింది. నేనైనా అంతే కదా! నగరజీవనంపై విరక్తి కలిగింది. ఇక్కడ రోజంతా పనిచేసినా తెమలని పనులున్నాయి. వయస్సు మళ్ళిన అత్తమామలను నేను కాక ఇంకెవరు చూసుకోవాలి? నా నిజమైన బ్రతుకు ఇదే. ఔను ఇదే. ఇప్పటికైనా నేను ఒక గట్టి నిర్ణయానికి రావాలి.’ మధు సెలవులు ముగిసి బెంగళూరుకు వెళ్ళేముందు రోజు రాత్రి గట్టిగా హత్తుకుని పడుకున్న కొడుకును విడిచిపెట్టడం మనసొప్పక ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది.

ఐతే ఊరిలో ఉన్నప్పుడు తెలియకుండా పరిగెత్తిన కాలం, ఆఫీసులో తనకోసం కాచుకుని ఉన్న గుట్టలా కరగని పనులు ఆమెకు గుర్తురాలేదు. వెళ్ళితీరాల్సిన అనివార్యతతో బెంగళూరుకు మరలింది. ఊరు నుండి వాపస్ వచ్చి వారం రోజులైనా మధు మనస్సు అక్కడ గడిపిన క్షణాలను మళ్ళీమళ్ళీ గుర్తు చేసుకుంటోంది. భర్త సన్నిహిత సాంగత్యం, ప్రియమైన కొడుకు ముద్దు మురిపాలు, పెద్దల సాన్నిహిత్యం సదా పొందాలని ఆమె మనస్సు కోరుకొంటోంది.

* * *

ప్రొద్దున లాగే సాయంత్రం కూడా హాస్టల్‌కు వెళుతున్నప్పుడు ట్రాఫిక్ రద్దీగా ఉంది. రోజంతా ట్రాఫిక్ గొడవతో హాస్టల్‌కు చేరిన మధు మనస్థితి బాగోలేదు. రాత్రి ఫోన్ చేసిన ప్రభు తాను ప్రకృతి సేద్యంద్వారా ఒక ఎకరంలో నాటిన మామిడి చెట్లు కాపుకు వచ్చాయని చెప్పినప్పుడు మధు మనసు ఏదో గుర్తుచేసుకుని సంతోషించింది. రేపు ప్రొద్దున్నే పక్కనే ఉన్న మెడికల్ షాపుకు వెళ్ళి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కిట్ తెచ్చుకుని పరీక్షించుకుని మరోసారి నిర్ధారించుకోవాలని అనుకుంటూ తన శరీరంలో కాస్తుందనుకుంటున్న కొత్తకాపు సంగతి ఊరు వెళ్ళిన తర్వాతే చెప్పాలని నిర్ణయించుకుని రిజిగ్నేషన్ లెటర్ వ్రాయడానికి అర్ధరాత్రి లేచి కూర్చుంది.

కన్నడ మూలం: వసుంధర కడలూరు

తెలుగు అనువాదం: కోడీహళ్లి మురళీమోహన్

Exit mobile version