కొత్తరాగం ఎత్తుకుందం

0
2

[dropcap]మ[/dropcap]నకు ఎన్నడు తుమ్ములు రాలేదా?
దగ్గు పడిశెం లెవ్వలేదా?
గిప్పుడేంది…తుమ్ముతే
సావు మబ్బులు కమ్ముతున్నయి
దగ్గుతే పానం దడీల్మంటుంది

సేయి సేయి కలుపుదామన్నది నిన్నటి మాట…
సోయి తోటి దూరముండుడు…ఇయ్యల్లటి మాట
కనిపియ్యని పురుగచ్చి
ఎన్నిటినో ఎర్క జేసింది
ఆగమాగపు బతుకులను
అనామతు ఆంబుక్క అన్నది
కాళ్లకున్న గీరెలను
ఇప్పి ఇసిరేసింది…

ఆకిట్ల పామురపు ముగ్గులేసింది
అరుగు మీద ఆనందపు సాప పరిసింది
అంటిల్లు సాయిమాన్ల ఉషారు శారు కాసింది
పెద్దోలను సుత పోరగాండ్లను జేసి
పచ్చీసు ఆడిత్తుంది
సూర్యుని మొకం సూడకుంట డేరా కట్టింది
ఎండ పొడకు నల్లవడ్డ మొకాలను
తెల్లగ జేసిందని అనుకున్నమా…
మల్ల గిప్పుడు ఎప్పటి సిప్ప
ఎనుగులకచ్చింది…
పురుగేమో సర్రాసుగ సందులల్లకత్తుంది..
సడీ సప్పుడు లేకుంట పెయిల సొత్తుంది…

బుగులు తోటి బుద్దిగలిగి
మొగులును సూడకుంట మోపున వుంటే
అది అలిగి అటు దిక్కు సూడుమన్నా సూడది
అలాయి బలాయిలు పంజుల పంచాదులు
మూటిగట్టి ముచ్చెట్లు పెట్టుడు అంటే
గదానికి లవు సంబురం

దునియనంత దుక్కముల ముంచిన
కొత్త రోగంను కోరి తెచ్చుకుంటమా
ఓల్లకాల్లం ఒచ్చొరకుండి
మన బతుకు పాటల
కొత్త రాగంను ఎత్తుకుందం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here