[box type=’note’ fontsize=’16’] “కొత్తరాతియుగం : తెలంగాణలో పశుపాలకవ్యవస్థ – (కురుమ) సంస్కృతి” గురించి సంచిక పాఠకులకు శ్రీరామోజు హరగోపాల్ ప్రత్యేక వ్యాసం అందిస్తున్నారు. [/box]
[dropcap]ద[/dropcap]క్షిణదక్కను ప్రాంతాలైన తెంగాణ, రాయలసీమ, కర్నాటకలోని గడ్డిభూములున్న పీఠభూమి ప్రాంతాకు గొర్రెలు, మేకల మందలతో కొన్ని పశుపాలక(Pastoral)సమాజాలు విస్తరించాయి. ఆ సమూహాలు కర్నాటక, రాయసీమల్లో కురుబ లేక కురుమ అని, తెలంగాణలో కురుమ లేక కురువ లేక గొల్లలుగా పిలువబడుతున్నాయి. వీళ్ళ ప్రధాన జీవనవృత్తి గొర్రెల్ని, మేకల్ని కాయడమే. అక్కడక్కడ వీళ్ళకు పశుపాలకత్వంతోపాటు వ్యవసాయ వృత్తికూడా వుంది. దాదాపుగా ఈ ప్రజాసమూహాలు గ్రామాల్లో స్థిరపడి, ఆయాగ్రామాల సామాజిక, ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపగలుగుతున్నాయి. చారిత్రకకాలాల్లో వ్యావసాయిక, రాజ్యస్థాయి సమాజాల్లోను వీళ్ళ జోక్యం స్పష్టంగా తెలుస్తున్నది.
మొదట్లో దక్షిణదక్కన్లోని గొర్రె, మేకల పోషకసమూహాలు సంచారజీవనాన్నే (Nomadic life) గడిపాయి. వాళ్ళు పోషకజంతువులకు మేత, నీళ్ళకోసమే సంచారం చేయాల్సి వచ్చింది. అవి లభించిన చోట్లలో వాళ్ళు స్థిరపడ్డారు. గడ్డి దొరకని కాలంలో ఉగాది తర్వాత అశ్వనికార్తెలో తమ మందలతో 3 నుంచి 6 నెలలదాకా గడ్డిభూములకు తాత్కాలికంగా వలసపోతారు. అర్ధసంచారజీవనం గడుపుతారు. దీన్నేవాళ్ళు రాజ్యం లేదా దేశం పోవడమని అంటారు.
కురుమలలో రెండురకాల వాళ్ళుంటారు. ఒకరు ‘ఉన్ని’ కంకణంవాండ్లు. వీళ్ళు గొర్రెలకాపరి జీవనం గడుపుతారు. గొర్రెలనుండి తీసిన ఉన్నితో ‘గొంగళ్ళు’ నేస్తారు. మరొకరు పత్తికంకణం వాండ్లు. వీరు ఎక్కువగా వ్యవసాయాధార జీవితం గడుపుతుంటారు.
***
దక్షిణదక్కనులో గొర్రె – మేక పోషణసంప్రదాయం ఒక గుర్తింపదగ్గ ఆర్థికవ్యవస్థ. పురావస్తు ప్రదేశాలో వీళ్ళఆవాసాలు ఎక్కడా ప్రత్యేకంగా గుర్తించబడలేదు. చారిత్రకంగా గణిస్తే ఈ పశుపోషకసమాజాలు కొత్తరాతి (తామ్ర)యుగంలో గ్రామాల్లో స్థిరజీవనం ఏర్పరచుకున్నట్లు తొస్తున్నది. క్రీ.పూ. 3 వే యేండ్లనాటి తొలి వ్యావసాయిక, గ్రామీణసమాజాల్లోని భాగమే ఈ గొర్రె, మేక పశుపోషకనమూనా అని(ఆల్చిన్-1963, ఆరు-1990, క్లేసన్-1979, కాజలె-1991, థామస్-1989) చరిత్రకారుల రాతలవల్ల తోస్తున్నది.
దక్షిణదక్కన్లో ఈ కొత్తరాతియుగం పుట్టుక ఉప ‘ప్రాంతీయవికాసమేం’ కాదు. వ్యావసాయిక, పశుపోషక సమాజాలు తమ, తమ ఆవాసాల్లో స్థిరపడ్డం ద్వారా ఏర్పరచుకొన్న చిన్న, చిన్న గ్రామాలవల్ల వచ్చింది. ఉట్నూరు, కుప్గల్, పావాయ్, పిక్లిహాల్, మాస్కి, బ్రహ్మగిరి, టెక్కకోట, సంగనకల్లు, హల్లూరు, నర్సిపూర్, కోడెకల్, బుధ్‌హాల్ మొదలైన చోట్ల చేపట్టిన తవ్వకాల్లో దొరికిన ఆధారాలనుబట్టి పశుపోషణ, చిరుధాన్యాలసాగు, గొర్రె-మేకల మందల పెంపకం తొలి వ్యావసాయికసమాజ నిర్మాణదశని ఆల్చిన్, పద్దయ్య, కొరిసెట్టర్, సుబ్బారావు, రామిరెడ్డి, థాపర్, వీర్ మొదలైన చరిత్రకారులు చెప్పారు.
‘కురుమ’ సంస్కృతి:
కురుమల సంస్కృతి ఒక సంస్థాగతజ్ఞానం మరియు అనూచానంగా వస్తున్న వాళ్ళ ఆట, పాటలు, కులపురాణగాథలు, వాళ్ళ ఆర్థిక, సామాజిక వ్యవస్థలు, వారి భావజాలం చారిత్రకమైన కొనసాగింపుగా వుంది. (లెష్నిక్, సాంతీమర్ 1975), సెల్దాస్-1997. Studies in Historyలో పశుపోషకత్వంపై వ్యాసం)
మైసూరు జనాభాగణన నివేదిక – 1981:
చరిత్రపూర్వపుమనిషి పశుపోషకవ్యవస్థలోనికి పరిణమించినపుడు గొర్రెలుకాసే పురాతనవృత్తిని చేపట్టిన గిరిజనజాతే ‘కురుబ’. వీరు దేశమంతటా గుర్తింపబడేవారు, ఎదిగినసమూహాలలోనివారు, వ్యాపారులు, ప్రభుత్వోద్యోగులు, ‘ఊరు’ వాండ్లు (Civilised), నాగరికులు, భూమిదున్నేవారు ‘కాడు లేదా ఆటవిక కురుబ లేదా కురుంబలకు ‘ఎదురు పాదాలవాండ్లు’ (Antipodes).
Original Inhabitants of India-లో G. Opport ‘‘కురుబలు లేదా కురుంబలు’’ ద్రవిడజాతులతో కలిసి నివసించి, విడిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. దేశంలో వీరికంటు ఒక ప్రత్యేకప్రదేశం లేదు. ద్రవిడబంధువులతో పోటీపడలేక ఎక్కడెక్కడో అవశేషాలుగా మిగిలిపోయినా వీరు దేశంలోని మూలవాసులే. నదీ HB Grigg ప్రకారం వీరు Lower Countryలో కురుబ, చురుబరు అనిపిలువబడ్డ వీరు ఆనే లేదా ఏనుగు, నాయి లేదా కుక్క లేదా గుట్ట కురుంబ కుటుంబాలుగా విభజించబడ్డారు.
ఒక కథనంప్రకారం కర్నాటకలో కురుమ/కురుబ కులం వాళ్ళు 4 ఉపకులాలుగా విభజించబడ్డారు. హత్తికంకణ కురుమ, ఉన్నికంకణ కురుమ, లేదా కురుబర్, లింగాయత్ కురుబర్ మరియు బీర్లోల్లు. బీర్లోల్లు వీరభద్రుని పూజారులు. వారు కురుమకులాన్ని ఆశ్రయించి జీవిస్తుంటారు. కర్నాటక ఉన్ని, పత్తికురుబలు తెలంగాణ ఉన్ని, పత్తికురుమలు సాంస్కృతికంగా ఒకేవిధమైన పోలికలు కలిగి వుంటారు. మల్లన్న ఒకప్పుడు ‘బసవ’ను కలిసి లింగాయతుగా మారిపోయాడట. కురుబకులం నుండి కొందరు లింగాయతులైనారు. కురుమలు అనేక తెగలుగా విడిపోయినా వారందరిది ఒకే ‘చండియ్య లేదా చౌండేశ’ గోత్రమే.
తెలంగాణ, రాయలసీమ, కర్నాటకల్లో కురుమ, గొల్లలు, మహారాష్ట్రలో ధన్‌గర్లు. వీరికి మౌఖిక పురాణ గాధలున్నాయి. అవివాళ్ళు చెప్పుకునే మూలవాసులకథలు. వారి కులపురాణాలు. వీటి ఆధారంగానే ఈ తెగప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని నిర్వచిస్తున్నారు.
కురుమ పూజార్లు బీర్లోల్లు, ఒగ్గోల్లు చెప్పే కురుపురాణం ప్రకారం వీళ్ళ మూలపురుషులు కాపు ఆదిరెడ్డి, ఆయనభార్య ఆదెమ్మ (MLK మూర్తి), వారి ఏడో కొడుకు ‘ఎలనాగిరెడ్డి’. ఆయన తర్వాత బీరదేవుడు బీరప్పగా ప్రసిద్ధుడు. గొల్లలపూర్వీకులు మర్యాదరెడ్డి వారి ఏడో కొడుకు మల్లారెడ్డి, మల్లన్న. ఎడ్గార్ థర్‌స్టన్ (1909) ప్రకారం వారి పూర్వీకులు మాసిరెడ్డి, నీలమ్మలు. కొడుకు ‘ఉండేల పద్మన్న’. సయ్యద్ సిరాజ్` ఉల్`హసన్ రాత ప్రకారం (1920) వాళ్ళదేవుడు మల్లన్న. పూర్వీకుల కథలేదు. నల్గొండజిల్లా రాజపేట మండలం సోమారంలోని ఒగ్గుపూజారి బండిసాయిమల్లయ్య బరమదేవుడు, సూరమ్మల కొడుకు బీరప్ప అని, మల్లన్న తల్లిదండ్రులు ఆదిరెడ్డి, నీలమ్మని చెప్పాడు. నల్లగొండ జిల్లా ఆలేరులోని బీర్ల పూజారి మల్లెరాజయ్య శివా దొంతికరాయుడు, అమరకన్నె సంతానం నారదుడు, సురమాదేవులలో సురమాదేవికి పుట్టినకొడుకు ‘బీరప్ప’ అని వివరించాడు.
కురుమ, గొల్లలిద్దరికి దేవుడు మల్లన్నే.వారి కులగురువు, దేవునంతటివాడు బీరప్ప అని అందరు సమానంగానే చెప్పారు. అందరి పౌరాణిక, కులపురాణగాథల్లో గొర్రెలు అడవిలోని చెదపుట్టనుండే బయటి కొచ్చాయని వాటిని కాచేకాపు మల్లన్నయిండని వివరిస్తున్నాయి. మల్లన్నకిద్దరు (కొందరు 4గురు భార్యలంటారు) భార్యలు. మల్లన్నకు, రత్నాంగి అనే బ్రాహ్మణయువతికి పుట్టినవారు ‘ఉన్ని’ దారం కంకణంగా ధరించే ‘ఉన్ని కంకణం’ వాండ్లు, మల్లన్నకు మరొక భార్య పద్మాక్షికన్నవారు ‘పత్తి’దారం కంకణంగా కట్టుకునే ‘పత్తికంకణంవాండ్లు’ అయ్యారు.
అడవిని నరికి, భూమిని దున్నడానికి యోగ్యంచేసి, సొంతనాగలి, ఎద్దు ఏర్పాటు చేసుకున్న వ్యావసాయిక, పశుపోషక, సామాజికక్రమాన్ని పునఃస్మరించిన కథలివి. కొత్తరాతియుగం నాటి సామాజికపరిణామ మిందులో కనిపిస్తుంది. మల్లన్నైనా, బీరప్పైనా ఇద్దరు అడవికి తేబడినవారే. గొర్రెల్ని కాసినవాళ్ళే. వ్యవసాయంచేసిన మన పూర్వీకులే. తర, తరాలుగా వారి జాతిజనులచేత దేవతలుగా పూజింపబడుతున్నారు.
కర్నూలుగుహల్లో అంత్యశిలాయుగపు వేట`ఆహారసేకరణదారులకు, కొత్తరాతియుగపు రైతులకున్న సాంస్కృతిక సంబంధాలు, మార్పిడులకు సాక్ష్యం దొరికింది. (మూర్తి 1985).
‘కురి’ అంటే గొర్రె అని అర్థం. (తమిళంలో ‘కొరి’ అంటారు). HA Stuart కురుబలు పురాతన పల్లవులకు ఆధునిక ప్రతినిధులంటారు. వారు దక్షిణ భారతాన్నేలినవారు. కొంగు, చోళ, చాళుక్యులు పల్లవులను గెలిచారు. కురుంబలు చెదిరిపోయి నీలగిరులు, వైనాధ, కుర్లు, మైసూరు ప్రాంతాల్లోని గుట్టల్లోకి పారిపోయారు’’అని రాసాడు. మరొకచోట స్టువర్టే ,కురుంబలు శైవులు ‘బీరే దేవరు’ (బీరప్పదేవుడు)ను పూజిస్తారన్నాడు. మైసూరు ‘హాలుకురుబ’ల్లో (పాలకురుమలు) కొందరు‘ఆదివారద, సోమవారద, గురువారద’ అని వారదేవులను పూజిస్తారు. కురుబలు చిన్న గుంపులుగా విభజించబడ్డారు. ఆ గుంపులు మళ్ళీ వేర్వేరు ఇంటిపేర్లవాళ్ళుగా వర్గీకరించబడ్డారు. వీటికి ‘టోటెమిస్టిక్’ మౌలికతవుంది. వీరిలో కొన్ని వియ్యంపొత్తున్న కులవిభాగాలు.
అవి: అగ్ని, ఎలిగి, అందార, ఆనె, అరిసన, అరి, ఆవు, బండి, బిన్న, బట్లు, బేలు, చెండె, బోల, చండ్ర, చిల్ల, చిన్న, దేవ, ఎమ్మె, గాలి, గౌడ, పత్తి, ఇరుల, జలకుప్ప, కల్లె, కంచు, కావటి, కొరి, మల్లె, మించు, ముగ్గ, నాయి, పుట్టరత్న, శంకు, తుప్ప, ఉంగర, ఉప్పరి’ (ఇంకా చాలా ఉన్నాయి) ` కొన్ని ఇంటిపేర్లు.
శైవులైన కురుబలు ‘రేవణ సిద్దేశ్వరుని’ పేరుమీద లింగధారణ చేస్తారు. కురుబ రక్షకరుషి, గురువు బీరప్ప లేదా బీరప్పదేవుడు. వాళ్ళ దేవునివాహనం ‘గుర్రం’. కనుక వాళ్ళు గుర్రానెక్కరు.
F.Faweett నివేదికలో ‘లేపాక్షి దేవాలయమంటపంలో ఒకమనిషి చేతులమీద గడ్డమానించి నిలుచున్న శిల్పమొకటుంది. ఇది ఆ దేవాలయనిర్మాతకు, కూలీలకు, మధ్యవర్తిగా తగువుతీర్చిన ‘కురుబ’శిల్పం. దాని కిప్పటికి నూనెపోసి స్థానికకురుబలు పూజిస్తుంటారని’ రాసాడు.
మైసూరులోని కడూరులో బీరప్పగుళ్ళో దేవుళ్ళప్రతినిధులుగా గుండ్రటిరాళ్ళు పెట్టి వున్నాయి. కొన్నింటి మీద పాముబొమ్మలు చేర్చి వున్నాయి. కొందరు ‘కురిభట్రాయున్ని’ (గొర్రెదేవుడు) పూజిస్తారు. శివునిభార్యను ‘ముస్ని’ అని పిలుస్తారు. ఒక చెక్కనో, రాయినో గుహలోపెట్టి కాని, బంతిరాళ్ళ(బడగల కురుంబ కోవెల)లో పెట్టి కాని ‘హిరియదేవు’డంటు పూజిస్తారు. (Indian Antiquity Vol.VI- 1877). లో Walhouse
‘‘నీలగిరి పీఠభూముల్లో ‘ఇరుల మరియు కురుంబ’లలో నీళ్ళలో దొర్లి నున్నగైన గుండ్రటిరాళ్ళను తమలో చనిపోయిన ప్రతివారికొకటి చొప్పున (దేవకొత్తకల్లు) తెచ్చి పాతగుడుల(క్రోమ్‌లెక్స్)లో పెడతారు. కొన్నిచోట్ల ఈ రాళ్ళు కప్పురాయిని తాకుతున్నంత నిండుగా, కుప్పపోసి కన్పిస్తాయని రాసాడు
Breeks తననివేదికలో ‘‘నీలగిరి పీఠభూమిలోనే రంగస్వామిశిఖరం మరియు బార్లియర్ వాళ్ళు మరణించిన వారిని దహనం చేసాక ఒక ఎముకను, ఒక చిన్న గుండ్రటి రాయిని ‘సావుమానె’ (Death House) లో వుంచుతారు. ’’ అని వివరించాడు.
చాలా గొప్పగా, విస్తారంగా ‘డోల్మన్’ సమాధులను నిలిపిన అవశేషజాతే ‘కురుంబలు’ కావచ్చని ఫెర్గుసన్ అభిప్రాయపడ్డాడు. కొన్నిచోట్ల మరణించిన వారికి ‘విశ్రాంతివేదిక’లుగా డోల్మన్లు నిలుపుతుంటారు.
తెలంగాణాలోని నల్గొండజిల్లా ఆలేరులోని మల్లెరాజయ్య(బీర్లపూజారి), సోమారంలోని బండిసాయి మల్లయ్య(ఒగ్గు పూజారి) ‘‘పండుగలప్పుడు లింగాలను ఒగ్గోల్లు తెస్తారు లేదా మల్లన్న పండుగ చేసుకునే ఇంటివాండ్లు శ్రీశైలం వెళ్ళి, గంగలో (కృష్ణానది) స్నానమాడి చూసి పెట్టుకున్న చిన్న, చిన్నగుండ్రని రాళ్ళను ఏరి రెండో, మూడో జతలు తెచ్చుకుంటారు. తెచ్చిన లింగాలను తాంబాళంలో పెట్టి, 5బావుల నుండి తెచ్చిననీళ్లను పోస్తారు. కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్ళను కూడా తాంబాళంలో పోస్తారు. 5రకాల పత్తిర్లు (ఆకు, పత్రాలు) ` లంకపత్రి, మారేడుపత్రి, నేరేడు పత్రి, నిమ్మపత్రి, తులసిపత్రి లేక దానిమ్మ పత్రి, జామపత్రిలు తెచ్చి 2 నిమ్మకాయలు కోసి రసం అందులో పిండి, ఆవుపాలు తెచ్చి తాంబాళం నీటిలో కలిపి లింగాలను శుభ్రంగా కడుగుతారు. కడిగిన లింగాలను కొత్త గొంగట్లో పెట్టి, నూనెపూసి, నిండార బండారి పూసి పూజిస్తారు. పుట్టబంగారం (పుట్టమన్ను) తెచ్చి దేవునింట్లో గద్దెకట్టి, దాంట్లో చేసిన గుంటలో ముత్యం, పగడం, పంచలోహం, నవధాన్యాలు, పసుపు, కుంకుమలు వేస్తారు. పూజకట్టిన లింగాలను తెచ్చి పసుపు, కుంకుమలతో పూదిచ్చిన గద్దెమీద ప్రతిష్టిస్తారు. అగరువత్తులు వెలిగిస్తారు. ‘మైసాచ్చి’ పొగవేస్తారు. టెంకాయ, గుమ్మడికాయలను కొడతారు. 2 విస్తరాకుల్లో పరమాన్నం నైవేద్యంగా పెడతారు. ఇట్లే బీరప్ప గుళ్ళల్లో బీర్లోల్లు లింగాలను నిలుపుతారు. ఇండ్లల్లో ఒగ్గు పూజారులు లింగాలను నిలుపుతారు అని చెప్పారు’’.
మల్లన్న, బీరప్పలు వాళ్ళసంతానాలు కాలం గడిచినంక లింగాలైనారట. ‘నమ్మినాగవనం’ల పడ్డది ‘బీరప్ప’ లింగమట. మల్లన్న, బీరప్ప ప్రతినిధులుగానే ఈ లింగాలనుపెట్టి పూజించే ఆచారం నెలకొన్నది.
అయితే శ్రీరామోజు హరగోపాల్ పరిశీలనలో కొత్తతెలంగాణ చరిత్రబృందానికి డోల్మన్ ఆకారంలో వున్న చిన్న, చిన్న రాతిబండల బీరప్పగుళ్ళలోనైనా, కొత్తగాకట్టిన బీరప్ప, మల్లన్న గుళ్ళల్లోనైనా అక్కడ పూజింప బడుతున్న లింగాలలో కొత్తరాతియుగంనాటి పనిముట్ల వంటి నున్ననైనవి, నూరివున్న చేతిగొడ్డండ్లు (Hand Axes), అపుడపుడు చీర్పుడురాళ్ళు (Cleavers) కనిపించాయి. వీటి పరిశీలనకోసం నల్గొండ జిల్లా ఆలేరు మండంలోని ఆలేరు, సాయిగూడెం, షారాజిపేట, ఇక్కుర్తి గ్రామాలు, యాదగిరిగుట్ట మండంలోని చొల్లేరు, రాజాపేట మండంలోని సోమారం గ్రామాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామాలో ఇక్కుర్తి, సాయిగూడెంలోని బీరప్ప గుళ్ళో డోల్మన్ల రూపంలో రాతిబండలతో కట్టివున్న చిన్నగుళ్ళు. మిగతావి కొత్తగా కట్టిన గుళ్ళు. ఈ గుళ్ళల్లో పూజించ బడుతున్న లింగాలలో కొన్ని పూర్వమానవుల (కొత్తరాతియుగపు) రాతిపనిముట్లుగా గుర్తించడం జరిగింది.
క్ర. సం. | గ్రామం | గుడి | పూజిస్తున్న లింగాలు | రాతి పనిముట్లు |
1. | ఇక్కుర్తి | బీరప్పగుడి డోల్మన్ ఆకృతి | 16 | 12 పనిముట్లు, (చేతి గొడ్డండ్లు 6, వడిసెలరాళ్ళు2, గీకుడు రాళ్ళు 4) |
2. | ఆలేరు | బీరప్పగుడి | వందల లింగాలకుప్ప | 4 చిన్నరాతిగొడ్డలిచిప్పలు |
3. | సాయిగూడెం | డోల్మన్ ఆకృతి | 21 | 4 చేతిగొడ్డండ్లు, 2 క్లీవర్లు |
4. | షారాజిపేట | కొత్తబీరప్పగుడి | 18 | 3చేతిగొడ్డండ్లు |
5. | సోమారం | కొత్తబీరప్ప గుళ్ళు | 21 | 2 పెద్ద చేతిగొడ్డండ్లు,1 గొడ్డలిచిప్ప |
6. | చొల్లేరు | కొత్తబీరప్పగుడి | 24 | 3 చేతిగొడ్డండ్లు,2 చీల్పుడురాళ్ళు |
ఈ రాతిపనిముట్లు వాటి తయారీనిబట్టి, నునుపు, నూరిన అంచును బట్టి కొత్తరాతియుగానికి చెందినవిగా తెలుస్తున్నది. వీటిలో కొన్ని చివరి కొత్తరాతియుగపు కాలానికి చెందిన చిన్నరాతిగొడ్డండ్లు (Celts) 5, 6 అంగుళాల పొడవున్నాయి. వాడిగా వున్నాయి. మిగతా పనిముట్లలోని చేతిగొడ్డండ్లు అడుగుపొడుగైనవి, గొడ్డండ్ల అంచులు అరిగి వున్నాయి. అవి వాడిన పనిముట్లని తెలుస్తున్నది. అయితే ఈ పరికరాలు కురుమలు పూజించే లింగాలలో చేరడానికి కారణాలుః
- కురుమలు గొర్రెకాపరులుగా వాటికి ఆహారంగా యివ్వడానికి తుమ్మవంటి చెట్లను కొట్టడానికి గొడ్డళ్ళు ఉపయోగిస్తారు. కురుమల చేతిఆయుధం చేతిగొడ్డలే. నిత్య జీవితావసరమైన పనిముట్లను దాచడం, గౌరవించడం సనాతనసంప్రదాయం. తమ ఆయుధమైన గొడ్డలిని బీరప్పయిచ్చిన శక్తిగా భావించి, లింగంగా పూజించే ఆచార మేర్పడి వుంటుంది.
- తమపెద్దలు మరణించినపుడు వాళ్ళ స్మృతిలో లింగాలుపెట్టే సంప్రదాయంగా వారు వాడిన ఈ రాతిపనిముట్లనే లింగాలుగా బీరప్పగుళ్ళో పెట్టి వుంటారు.
- బీరప్పగుళ్ళో లింగాలను ప్రతిష్టించడానికి తగిన గుండ్రటిరాళ్ళను వెతికే ప్రయత్నంలో తమ గ్రామాల, ఆవాసాల సమీపంలో ప్రవహిస్తున్ననదులు, వాగులలోను, వాటి ఒడ్డుమీద లభించిన గుండ్రటిరాళ్ళతో పాటు ఈ రాతిపనిముట్లు లభించివుంటాయి. వాటినే గుళ్ళల్లో ప్రతిష్టించి వుంటారు.
కొన్ని రుజువులుః
- తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ దగ్గరలోని దిగువ కామ్తిలో దొరికిన సరీసృపశిలాజాలను అక్కడి ప్రజలు గుడిలోపెట్టి పూజిస్తున్నారని సేన్గుప్త(1970) తననివేదికలో వివరించాడు. గిరిజనజాతు ఆరాధనారీతుకు ఇదొక రుజువు.
- పి. వి. పరబ్రహ్మశాస్త్రి ‘ప్రాచీనాంధ్ర దేశచరిత్ర-గ్రామీణ జీవనం’లో ‘‘ప్రముఖంగా, తొలికాలపు అసంఖ్యాక దేవీదేవతలు మూలంలో తమదేశీయలక్ష్యాన్ని వెలారుస్తూ పూర్వచారిత్రక యుగానికి చెందినవారు. మరింత ఆసక్తికరమైన విషయమేమిటంటే గ్రామీణప్రాంతంలోని ఈ దేవతలు పూజలందే చోట్ల ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల్లో ‘కొత్తరాతియుగపు గొడ్డళ్ళు’, మట్టిబొమ్మను పూజార్హమైన వస్తువుగా భావించడం జరుగుతుంది. అలాంటి దేవతల్ని తెలుగుపేర్లతోనే ‘పుట్టమ్మ, చింతామ్మ, నూకాలమ్మ, పొలిమేరమ్మ, కొండప్ప, గురప్ప, మైలార’ ఆదిగా పిలుస్తారు. ఈ దేవతలను పెరియాల(మాల, మాదిగలు)తో సహా సమాజపు నిమ్నస్తరపు ప్రజలు అబ్రాహ్మణీయపద్ధతిలో పూజిస్తారు. భూమికిసంబంధించిన నిజసమాజంలో అధికసంఖ్యాకులైన శూద్రులు, స్థానిక దేశీయశాఖవారు ఈ దేవీదేవతలపూజలు జరుపడం ఒకప్రాక్తన చారిత్రకలక్షణం’’ అని రాసారు.
- తమిళనాడు రాష్ట్రంలోని వెల్లోరుజిల్లా ‘జావది’గుట్టపై వున్న కీరనానూర్ అనే కుగ్రామంలోని చిన్ననది/వాగు పరిసరాలనుంచి 75 నున్నని, నూరిన రాతి చేతిగొడ్డండ్లను సేకరించి ఆ గ్రామస్తులు వారివూరిలోని గణేశునిగుడిదగ్గర పెట్టి పూజిస్తున్నారు. వారు వాటిని ‘సామికల్’(Divine stones) అని పిలుస్తారు. అక్కడికి దగ్గర్లోని పరుపుబండమీద రాతిగొడ్డండ్లను నూరిన 21 నూరుడుగుంటలు(Grooves) కనిపించాయి. ఈగుంటలను అక్కడిప్రజలు పశువులు నీళ్ళు తాగడానికి మోకాళ్ళమీద వంగినపుడు పడ్డ గుంటలుగా భావిస్తున్నారు. ఈ రాతిబండను ‘కుఝి ఎరుథు పరాయ్’ అని పిలుస్తారు.
- పాండిచ్చేరి యూనివర్సిటి చరిత్రవిభాగంలో UGC special Assistance programme కింద పనిచేస్తున్న క్షేత్రపరిశోధకుడు ఆర్. రమేశ్ ఈ చారిత్రకవిషయాన్ని కనుగొన్నాడు. అదే యూనివర్సిటి చరిత్రవిభాగం ఆచార్యుడు కె. రాజన్ ఈ ప్రదేశాన్ని సందర్శించి, ఆ విషయాన్ని రూఢిపరిచాడు. ఈ రాతిపనిముట్లు 5వేల యేండ్ల కిందటివని (ప్రస్తుత గతానికి) కొత్తరాతియుగంలో మనుషులు వాడినవని, పనిముట్లు మొండివైనపుడు(blunt) ఆ బండమీది గుంటలో నూరేవారని వివరించారు. (16 Feb 2013,News from Hindu daily,Chennai).
References:
1. Sheep/Goat Pastoral Cultures in the Southern Deccan:The Narrative as a Metaphor- MLK Murthy, Archaeology and Historiography, Indian Archaeology in Retrospect, Vol. IV- Edited: S. Settar, Ravi Korisettar, ICHR, 2002
2. Archaeology and Human Ecology of Late Pleistocene and Early Holocene Cultures in India: Implications for Transition to Agriculture- MLK Murthy, Puratattva, No. 45, 2015 (Indian Archaeological Society, New Delhi)
3. Castes and Tribes of Southern India-Vol. IV, Edgar Thurston-1909
4. The Castes and Tribes- (Nijam’s Dominion) Vol. I, -Syed Siraj Ul Hassan, 1920
5. Pre Historic background to Pastoralism in the Southern Deccan in the light of Oral Traditions and Cults of some Pastoral Communities- MLK Murthy and Gunther D. Sontheimer.
6. ప్రాచీనాంధ్ర దేశచరిత్ర – గ్రామీణజీవనం – పి. వి. పరబ్రహ్మశాస్త్రి (2012)