[box type=’note’ fontsize=’16’] ఆషాఢ శుద్ధ పూర్ణిమ 24-7-2021 దివాకర్ల వేంకటావధాని గారి 109వ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు రాజేశ్వరి దివాకర్ల. [/box]
[dropcap]క[/dropcap]ళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు ఉత్తమ పరిశోధకులు, విమర్శకులు, బహు గ్రంథ పీఠికా రచయిత. మహా వక్త. విశ్వ విద్యాలయ ఆచార్యులు. ప్రవృత్తి మహితంగా అవిశ్రాంత గురోత్తములయిన వారు ఆషాఢ శుద్ధ పూర్ణిమ (గురు పూర్ణిమ) నాడు జన్మించారు.
వివిధ వాఙ్మయ ప్రక్రియలకు నిధానమైన దివాకర్ల వారికి నాటక సాహిత్యం అంటే ప్రత్యేకమైన అభిరుచి. “నాటకాంతం హి సాహిత్యం”.., సర్వ కళా సమాహారం అయిన దృశ్య రూపక రచనను ఉన్నతమైన కావ్య ప్రక్రియగా సంభావించారు. ‘ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యుల’ వారిపై పరిశోధన గ్రంథం రాసి ఎం.ఎ. ఆనర్సు, పదవిని పొందారు. సామాన్య ప్రజానీకానికి సంప్రదాయ కవిత్వ మాధుర్యాన్ని సాహిత్య రూపకాల ద్వారా ప్రచారం కావించారు.
సంస్కృత నాటక సాహిత్యాన్ని ఆమూలాగ్రం పఠించిన అవధాని గారు ఆ నాటక పారమ్యాన్ని గురించి అనేక వ్యాసాలను రాసారు. శ్రీహర్షుని నాగానందము నాటకాన్ని, శ్రీ వేటూరి వారు రెండు అంకాలను అనువదించి, దివంగతులు కాగా మిగిలిన మూడంకాలను అనువాదం చేసి ముగించారు. ఈ నాటకం 1954లో ముద్రితం అయింది.
అవధానిగారు క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందిన విజ్జిక అను కవయిత్రి రంచిన కౌముదీ మహోత్సవం నాటకాన్ని 1943లో అనువదించారు. ఆ నాటక అనువాదాన్ని గురించి సంగ్రహంగా తెలుపడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.
సంస్కృత కౌముదీ మహోత్సవం నాటక కర్తను గూర్చి భిన్నాభిప్రాయాలున్నాయి.
విజయ. విద్య, విజ్జ అని ప్రసిద్ధినొందిన సంస్కృత కవయిత్రి విజ్జిక. ఆమె కవితలను మధ్యకాలపు కవుల చరిత్రలో ఉదహరించారు. ఆమెనే విద్యాకరుడు ‘విద్యా’ అని, సారంగధర ‘పద్ధతి’లో ప్రాకృతం నామం ‘విజ్జకా’ అని పేర్కొని, “నలుగురు ప్రసిద్ధ సంస్కృత కవయిత్రులలో విజ్జ ఒకరు –వారు –శీల భట్టారిక, విజ్జ, మరుల, మోరిక. ఈ నలుగురు కవిత్వం రాయటంలో, విద్యావేత్తలతో సంభాషించటంలో అన్ని శాస్త్రాలలో మేటి అనిపించుకోన్నవారు, వాదాలలో మహామహులను ఓడించి గెలుపొందినవారు. వీరు మాత్రమే ఆ కాలంలో లబ్ధ ప్రతిష్ఠులైన కవయిత్రులు’’ అన్నాడు. వల్లభ దేవుని కవుల చరిత్రలో ‘విజ్జకా’ అనీ ‘విజ్జాక’ అనీ పేర్కొన్నారు. విజ్జకా లేక విజయా౦కను గూర్చి, “జల్హణుని ‘సూక్తి ముక్తావళి’లో రాజ శేఖరుడు చెప్పినట్లు ఉదాహరించిన శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో – కర్నాటకకు చెందిన ఆ ‘విజయా౦క’ సరస్వతీదేవిలాగా విజయం సాధిస్తుంది. కాళిదాసు లాగా ఆమె వైదర్భీ రీతి కవిత్వంలో మేటి”. సరస్వతీవ కర్ణాటీ విజయాంకా జయత్యసౌ, యా వైదర్భీ గిరాంవాసః కాలిదాసాదనంతరమ్. అని రాజశేఖరుడు విజయాంకను కాళిదాసుని తరువాత అంతటి కవిగా ఎన్నినట్లు తెలుస్తుంది.
విజ్జక జ్ఞాన సంపదలో సరస్వతీ దేవితో సమానం, కాని రంగులో నల్లగా ఉండేదట. “దండి” కవి సరస్వతీదేవిని పూర్తి శుద్ధ స్పటిక సంకాశంగా ఉన్నది అని ‘తన కావ్య లక్షణ సారం’లో ప్రారంభంలో అనటం తప్పు అని విజ్జిక అన్నట్లుగా శ్లోకం ఒకటి ఉంది.
“నన్ను నల్లకలువ రెక్కలున్న విజ్జక అని తెలుసుకోకుండా దండి సరస్వతీ దేవిని అతి తెల్లగా ఉంటుందని రాశాడు” అన్నదట. – ఏది యెమైనప్పటికీ ఈమె దక్షిణ భారత దేశ సంస్కృత కవయిత్రి అని విమర్శకులు నిర్థారించారు.
ధనదేవుడు విజ్జను తెలివి తేటలున్న కవయిత్రిగా మెచ్చాడు. అంతేకాక విజయాంక అనే కవయిత్రి వైదర్భీ రీతిలో దిట్ట అని చెప్పాడు. అయితే ఆ ఇద్దరూ ఒకరేనా కాదా అన్న సందేహం మిగిలింది.
నీలోత్పలదలశ్యామాం విజ్జికాం మామజానతా, వృథైవ దండినా ప్రోక్తా సర్వశుక్లా సరస్వతీ, ‘దండికి తన గురించి తెలియకనే శ్వేతవర్ణురాలిగా సరస్వతీదేవిని వర్ణించినాడు.’ అని ఈ కవయిత్రి తానే సరస్వతినని గర్వంగా ప్రకటించుకుందని తెలియ జేసాడు.
విజ్జిక ‘కౌముదీ మహోత్సవము’ నాటకాన్ని రచించింది. అజ్ఞాతకర్తృత్వకమైన ‘కౌముదీమహోత్సవము’ కావ్యాన్ని ఆమెయే రాసినట్లు విమర్శకులు నిర్ణయించారు.
10వ శతాబ్ది రాజశేఖరుడు,11 శతాబ్ది భోజుడు విజ్జ పేరు ఉదాహరించారు. 7-8 శతాబ్ది దండి ఆమె శ్లోక ప్రస్తావన కావించాడు. వీటన్నిటి బట్టి విజ్జ 8 లేక 9 శతాబ్ది సంస్కృత కవి అని తేల్చారు.
లభ్యం అయిన ‘కౌముదీ మహోత్సవం’ సంస్కృత నాటక ప్రతిలో రచయిత పేరున్న చోటమొదట్లో ఒక పెద్ద చిల్లి కనిపించింది. చదవటానికి వీలున్న చోట చివరగా ‘కయా’ అని ఉంది. కనుక రచయిత స్త్రీ అయి ఉండాలి అని, మాననీయులు మానవల్లి రామకృష్ణయ్యగారు అది కయాకాదు జా అని తేల్చి చివరకు పేరు ‘జకయా’ అన్నారు. పరిశోధకులు ‘విజ్జకయా’ అన్నారు. ఈమెయే విజ్జ అనీ చెప్పారు.
ఈమె కర్ణాటక దేశస్థురాలని, రెండవ పులకేశి కుమారుడైన చంద్రాదిత్యుని (610-642) భార్య యని క్రీ.శ. ఏడవ శతాబ్దికి చెందినదని సాహిత్య విమర్శకుల అభిప్రాయం. “ఏకో భూన్నలినాత్ తతశ్చ పులినాద్వల్మీకతశ్చాపరః, తే సర్వే కవయో భవంతి గురవ స్తేభ్యో నమస్కుర్మహే।, అర్వాంచో యది గద్యపద్య రచనై శ్చేతశ్చమత్కుర్వతే తేషాం మూర్ధ్నిదదామి వామచరణం కర్ణాటరాజప్రియా॥” అని విజ్జిక రచనగా లభించిన శ్లోకంలో కవయిత్రి ‘బ్రహ్మ, వ్యాస, వాల్మీకులు మాత్రమే కవులు, గురువులు. అట్టివారికి మాత్రమే నమస్కరిస్తున్నాను. తదితరులు గద్యపద్యరచనా చమత్కారమును వినోదము కొరకే కలుగ జేయువారు గాన అట్టివారి తలపైన కర్ణాట రాజప్రియయైన తాను వామపాదమునుంచెదన’ని ప్ర కటించు కుంది.
ఈ తెలుగు అనువాదం మూలానికి విధేయ అనుసరణమని దివాకర్ల వేంకట అవధాని గారు పేర్కొన్నారు.
మూల నాటకం నాలుగవ అంకం 19వ శ్లోకంలో విజయా శబ్దం ప్రయోగం అయింది. విద్యకు ప్రాకృత రూపం విజ్జ. 19వ శ్లోకం లోనే అనంతనారాయణ పదం కూడా ఉంది. సంస్కృత కవులలో చంద్రికా జనమేజయమును రచించిన అనంతనారాయణ కవి ఒకరు ఉన్నారు. భరత వాక్యంలో నీలకంఠ పదాన్ని బట్టి, నీలకంఠ కవి రచించాడని కొందరు భావించారు. అనువాద కర్త కౌముదీ మహోత్సవాన్ని విజ్జికా విరచిత నాటకానువాదం గానే పేర్కొన్నారు. తాళ పత్ర లేఖకుడు నాటకాంతంలో కౌముదీ మహోత్సవం అని పేర్కొనడాన్ని బట్టి, నాటకానికి ఆ పేరు స్థిరపడి ఉండవచ్చునని మానవల్లి కవిగారు తమ ఉపోద్ఘాతంలో అభిప్రాయం తెలిపారు.
మగధ రాజు సుందర వర్మకు దండనాథుడుగా ఉన్న చండసేనుడు లిచ్ఛవులతో కుట్ర పన్ని పాటలీ పుత్రం మీద దండెత్తాడు. ఆ యుద్ధంలో సుందర వర్మ మరణించాడు. చండ సేనుడు మగధ రాజయ్యాడు. సుందరవర్మకు మంత్రియైన చంద్ర (మంత్ర) గుప్తుడు రాజ కుమారుడైన కల్యాణ వర్మను పంపాతీర సమీపంలో ఉంచి రాజకుమారుని సింహాసనం ఎక్కించడానికి యత్నించాడు. ఆ ప్రయత్నంలో సఫలతను పొందాడు.
శూరసేనాధిపుని కూతురు కీర్తిమతి, కల్యాణ వర్మల ప్రణయ వృత్తాతం ఈ నాటకంలో రసవంతంగా ఒప్పింది. వారిరువురి వివాహంతో నాటకం శుభాంతం అవుతుంది. నాటక వస్తువు సాధారణమైనది. బుద్ధునికి విధేయులు, మహా వీరులు,శూరులు అయిన లిచ్ఛవులు మగధ రాజ్యం మీదకు దండెత్తుటను చరిత్ర తెలుపుతుంది. క్రీశ 2వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు మగధ అన్యాక్రాంతమగుట సంభవించింది. కాని చారిత్రక వ్యక్తులకూ, నాటక పాత్రలకూ గల సంబంధాన్ని నిర్ణయించడానికి వీలు కలుగుట లేదని అవధాని గారు చరిత్రను పరిశీలించి తెలిపారు.
సంస్కృత నాటక లక్షణాన్నీ అనుసరించిన కౌముదీ మహోత్సవము అయిదు అంకాల నాటకం. ఈ నాటకానువాదం సరళమైన భాషలో కొనసాగింది. సంసృత నాటకంలో గద్యం కంటె పద్యాల సంఖ్య అధికంగా ఉంది. ప్రధాన రసం శృంగారం. వీర, హాస్య రసాలు, సందర్భానుసారంగా చోటు చేసుకున్నాయి. పద్యాల అనువాదం లలిత పదజాలంతో ఛందస్సులతో శోభించింది.
ప్రథమాంకంలో కల్యాణ వర్మ కీర్తిమతిని తొలిసారిగా చూసిన సందర్భంలో ఆమెను, ఊరు సంజనిత ఊర్వశి తోను, నాగటి చాలుకు జనించిన జనకజ తోనూ, అగ్ని గర్భ సంభవ ద్రౌపది తోనూ పోల్చి చెప్పడం ఆయా సౌందర్య రాశులను కనులకు చూపి కీర్తిమతి రూపాన్ని సందర్శింప జేస్తుంది.
పంచమాంకంలో కౌముదీ మహోత్సవాన్ని వర్ణిస్తూ
సదమల మున్నతమ్మయిన సౌధము నగ్రము నెక్కి భూవిభుం
డుదిత విశేష సంభ్రమ సమత్వటమౌ పురి జూడ గోరెడిన్
ఉదయ నగేంద్ర కూటము నుండి, శశాంకుడు దీయ మానుడై
ముదమున నుచ్చలోర్మియయి పొంగులు వారు సముద్రమువ్వలెన్
..అని చక్కని ఉపమానాలతో రాజును రేరాజుతో, నగరాన్ని సముద్రంతో ఉపమించి సారస్యాన్ని సాధించారు. ఈ దృశ్య కావ్యంలో పద్యాలను వర్ణనాత్మకంగా మూలానుసరణం కావించారు అవధాని గారు.
చెలి నెదుట గాంచు చున్నను,
గలుగదు ప్రత్యయము వింత గలగెడు నాకున్
బలు సారులు తలపుల చూ
పుల బడియునునామె మోస పుచ్చిన కతనన్. ..
వంటి అనువాద పద్యాలు సంస్కృత కవుల భావనలకు సమీపంగా గోచరిస్తాయి.
అవధాని గారికి సంస్కృత నాటక సాహిత్యము అభిమాన విషయం. స్త్రీల సాహిత్య రచన పై ప్రత్యేకమైన ఆదరము. అందు వలననే వారు విజ్జిక రచనను తెలుగు వారికి ప్రీతి పాత్రముగా అందించారు.