కౌసల్య మనసు

1
3

[dropcap]రా[/dropcap]త్రి ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో గుర్తు రాలేదు శ్రీరామ్‌కి – వచ్చాడు. పూర్తిగా తాగేసి ఒళ్ళు తెలీని స్థితిలో అక్కడికి వచ్చాడు.

తల్లి లోకువ. ఎవరికైనా, ఎప్పటికైనా. ఎదురుబడి అడగలేక, ధైర్యం చాలక తాగాడా? ఏమో!

ధైర్యం కోసం తాగాడో, మనసులో బాధ ఎలా హ్యాండిల్ చేయాలో తెలీక తాగాడో, తనకే తెలీదు.

మంచం మీద మగతగా దొర్లుతున్నాడు.

హ్యాంగోవర్ మెదడులో, మనసులో, ఆత్మలో –

ఇంట్లో జరిగింది యింకా గుర్తుంది.

ఆ గుర్తు వుండడం, ఇబ్బందిగా, భారంగా వుంది.

సిగ్గు లేకుండా తాగింది, సిగ్గు లేకుండా అడగడానికే.

యింకా ఎంత కాలం అడుగుతాడు?

ఏం అడుగుతాడు?

ఎలా అడగాలో తెలీక చేసిన పని యిది.

అసలు అడగడంలో న్యాయం వుందా?

న్యాయాన్యాయాలు తల్లీ కొడుకుల మధ్య వుంటాయా?

కాసేపు భార్య, కొడుకుల మీద కోపం –

మరి కాసేపు అమ్మ మీద కోపం.

అమ్మ అడిగిన వెంటనే ఆలోచించకుండా

ఎందుకో చేస్తుంది.

అలా చేస్తూ చేస్తూ… ఎప్పటికీ చేస్తూనే ఉంటుందా?

ఏడాది దాటిపోయింది.

వూరి లోనే ఉంది.

కనీసం చూడకుండా వుండి… ఫోన్ కూడా చెయలేదు. తల్లి చేస్తే ఎత్తాడా?

ఎత్తి ఏ రోజు అయినా మాట్లాడాడా?

ఎప్పుడూ పూర్తిగా యోగక్షేమాలు అడగలేదు. “తరువాత చేస్తాను” అనేవాడు. ఆ తరువాత ఎప్పుడో ఎవరికీ తెలీదు. అమ్మకి తెలుసో, తెలీదో, అర్థమయిందో, కాదో అర్థం కాలేదు.

ఏ మాత్రం తెలుసుకోకుండా – నాన్నగారు కాలం చేస్తే ఎలా పెంచింది?

ఏ విషయాలు తెలుసని, నాన్నగారి ఆఫీసుల చుట్టూ తిరిగి, కష్టపడి, వుద్యోగం వేయించింది?

అదీ నాన్నగారు పోయిన పదేళ్లకి –

ఎవరో చెప్పార్ట. తండ్రి వుద్యోగం సర్వీసులో చనిపోతే కొడుక్కి వస్తుందని.

అప్పటికి తను చిన్నవాడు.

అన్నేళ్ళు ఎలా గడిపిందో, ఎవరి కాళ్లు పట్టుకొని వుద్యోగం వేయించిందో తెలీదు.

ఆ తరువాత, అతనకి పెళ్ళయిన వెంటనే, వ్యాపారం చేస్తానన్నాడు.

నెల తిరిగేసరికి వచ్చే జీతంతో, జీవితం ఎదగలేదన్నాడు. వుద్యోగం రాజీనామా చేశాడు. వ్యాపారం మొదలుపెట్టాడు.

అంత కష్టపడి వేయించిన వుద్యోగం ఎందుకు మానేశావ్? అని అడగలేదు.

“కౌసల్య గారూ… మీరైనా చెప్పండి…” అని బైట వారు చెప్పినా –

“వాడి యిష్టం… వాది ఆనందం” అంది.

‘ఆనందం’ అనే మాటకి కొత్త నిర్వచనం యిచ్చింది. ఆమెకి ఆనందాలు లేవా? తన ఆనందమే ఆమె ఆనందమా?

వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు చేయగలిగింది, యివ్వగలిగింది ఇచ్చింది. అన్నిటికీ మించి ‘మోరల్ సపోర్ట్’ పుష్కలంగా అందించింది.

వ్యాపారంలో నిలదొక్కుకోగలిగాడు.

పెద్ద యింట్లో ఓ గదికి పరిమితమయిపోయింది.

ఎప్పుడూ రామకోటి రాసుకుంటూనో, రామాయణం చదువుకుంటూనో –

తన గొడవల్లో తను.

యింట్లోనే వున్నా ‘తీరిక’ దొరికేది కాదు.

కానీ – ఏడాది క్రితం – ‘తీరిక’ చేసుకున్నాడు. భార్య వ్యాపారం మొదలు పెడ్తానంది.

ఆ వ్యాపారానికి ‘సెంటిమెంట్’గా ‘అమ్మ గది’ కావాలి.

ఆ గది ఈశాన్యంలో ఉంది. ఎవరో పెద్దయాన చెప్పాడు.

అమ్మ కోసం ‘శతమానం భవతి’ అనే వృద్ధాశ్రమం మాట్లాడాడు.

అమ్మని ఒప్పించటం – ఎంత కష్టపడాలో అనుకున్నాడు.

అదే యింట్లో నాన్న వున్నారు. అమ్మ ఉంటోంది. అక్కడ్నించి కదలమంటే –

ఏం గొడవ చేస్తుందో!

బైట అద్దెలు ఎక్కువ.

బెరుకుగానే అడిగాడు – ఎదురు కాబోతున్న ప్రశ్నలకి సమాధానాలు సిద్ధం చేసుకొని.

భార్య వ్యాపారానికి ఇల్లు కావాలన్నాడు. అమ్మ ఏం అంటుందోనని –

“నీకు ఆనందమా?” ఎప్పటి లాగ ఒకే ప్రశ్న.

“ఆఁ” అన్నాడు.

తన కన్నా ముందే ఆవిడ బట్టలు, వస్తువులు తీసుకొని

“నీ యిష్టం… ఎక్కడ వుంచినా పర్లేదు” అంది.

తను సిద్ధం చేసుకున్న సమాధానాలు వెక్కిరించాయి.

ఒప్పుకోని వాళ్ళని ఒప్పించాలి.

‘నీ ఆనందమే నా ఆనందమంటే’

అంత క్రితం చాలాసార్లు తల్లి ముందు సిగ్గు పడ్డట్టు సిగ్గుపడ్డాడు.

‘శతమానం భవతి’లో చేర్చాడు.

అక్కడ అమ్మ. వూరి పొలిమేరల్లో.

యిక్కడ భార్య తను కొడుకు.

ఏడాది గడిచింది.

భార్య వ్యాపారం అందుకోలేదు. లాభం సంగతి ఎలా వున్నా, నష్టాలు, అప్పులు ఎలా తీర్చాలి?

కొడుకు అమెరికా అంటున్నాడు.

తన పేరు, పలుకుబడి, అన్ని పెట్టుబడిగా చేయగలిగినన్ని అప్పులు చేశాడు.

తన వల్ల కాదు.

భార్యా, కొడుకు నిలబెట్టారు.

“మీ అమ్మ దగ్గర డబ్బు వుంద్దిగా…” భార్య గుర్తు చేసింది. ఆ డబ్బుని అడగలేడు.

భర్త పోయినప్పుడు ఉత్తర క్రియలకి డబ్బులు లేని దుర్భర స్థితి తనకి రాకుండా, తన తల్లి దాచుకుంది కష్టపడి. పైసా పైసా కూడబెట్టి. దాన్ని ఎలా అడుగుతాడు?

భార్యా, కొడుకు నిలబెట్టారు.

మరో మార్గం కన్పించలేదు.

తల్లిని ఎలా అడగాలో అర్థం కాలేదు. తెలీని తెగువ కోసం తాగాడు.

రాత్రి ఎప్పుడు వచ్చాడో, వచ్చాడు ‘శతమానం భవతి’కి.

తల్లి ఆదరించింది. ఆమెని తిట్టాడో, విసుక్కున్నాడో, అరిచాడో గుర్తులేదు.

పొద్దున్నే యింకా హ్యాంగోవర్.

రాత్రి డబ్బులు అడిగాడా?

అడిగాడు.

ఏమంది? ఏమో?

మత్తులో ఏదో అడిగి వుంటాడు.

ఇంకా ఆమెని అడగటమా?

ఏదీ తనకి గుర్తు లేదు.

తెల్లారింది.

భార్య ఫోన్లు. కట్ చేశాడు.

అప్పుల వాళ్ళ ఫోన్లు. కట్ చేశాడు.

ఫోన్ రింగ్ టోన్‍లు భీకరంగా అన్పించాయి. నరాలు తెగిపోతున్న ఫీలింగ్.

కాసేపు స్విచ్ఛాఫ్.

అప్పుడే కౌసల్య కో ఫోన్ వచ్చింది.

“ఒరేయ్… కోడలు చేస్తోంది… పాపం నీ గురుంచి కంగారు పడ్తోంది… రాత్రి యింటికి రాలేదని…”

‘పాపం..’ యింకా జాలి వుందే అమ్మకి.

రాత్రి డబ్బుతోనే రమ్మని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరించిన విషయం తల్లికి చెప్పగలడా?

కొడుకు యింట్లోంచి బైటకి పోతానని కఠినంగా వార్నింగ్ యిచ్చిన విషయం చెప్పగలడా?

వాళ్ళిద్దరి మీద భయంతో తన యింట్లోంచే  తను పారిపోయినట్టు చెప్పగలడా?

‘పాపం… పుణ్యం… అన్నీ డబ్బే…’ అన్నాడు బైటకి-

మనసులో మాట నిలబడలేదు.

తల్లిని అడగలేదు.

బైటకి వెళ్ళి వేరే ప్రయత్నాలు చేయాలి.

ఎక్కడ చేయాలి?

“వస్తానమ్మా” అన్నాడు.

అప్పటికి కాపీ తాగాడు. హ్యాంగోవర్ తగ్గింది.

బైటకి వెళ్ళబోతుంటే –

“రామూ…” అంది. క్షణం తల్లి వైపు చూశాడు. తెల్ల సంచీ మూట తన చేతికి యిచ్చింది.

ఆ డబ్బు… ఆ డబ్బు… అడగలేదు. రాత్రి తాగినప్పుడు అడిగాడా?

తల్లి ఎలా గ్రహించింది?

“అమ్మా… వద్దు…” అతి కష్టం మీద గొంతు లోంచి మాట బైటకి వచ్చింది.

“నీ బాధ నాకు ఆనందమా?”

ఊహించని ప్రశ్న. సమాధానం రాలేదు. తన దగ్గర లేదు.

ఏ కొడుకు దగ్గరా వుండదేమో!

ఎప్పుడో తల్లి చెప్పిన విషయం గుర్తొచ్చింది.

రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, కౌసల్య కొడుకు క్షేమంగా వుండాలని, పూజలు, వ్రతాలు చేసిందట.

రామాయణ కాలంలోనే కాదు –

ఈ కాలంలోను తల్లులంతే –

ఆ కౌసల్య మనసైనా… ఈ కౌసల్య మనసైనా ఒక్కటే –

“అమ్మా” ఏడుస్తూ పొత్తిళ్ళలో పసిపిల్లాడిలా అయిపోయాడు యాభై ఏళ్ళ శ్రీరాం, తల్లి కౌసల్య దగ్గర!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here