Site icon Sanchika

‘క్రీడాకథ’ పుస్తక పరిచయం

[dropcap]సం[/dropcap]చిక-సాహితీ ప్రచురణలు వెలువరించిన రెండవ కథల సంకలనం క్రీడ కేంద్ర బిందువుగా ఉన్న కథలను ఒక చోట చేర్చింది. వికారి నామ సంవత్సరాదికి విడుదలయిన ఈ సంకలనం ‘క్రీడాకథ’లో మొత్తం 23 కథలున్నాయి.

***

“సంచిక వెబ్ పత్రిక తరఫున మేము సంపాదకత్వం వహిస్తున్న రెండవ పుస్తకం. మొదటిది దేశభక్తి కథలు.

క్రీడాకథల సంకలనం తయారుచేయటం ఒక చక్కని అనుభవం. ఈ సంకలనం కోసం కథలను సేకరించి చదివి విశ్లేషిస్తుంటే ఒక విషయం స్పష్టమైంది. వస్తు విస్తృతిలో కానీ, శైలీ వైచిత్రిలో కానీ తెలుగుకథలు ఇతర భాషల్లోని ఏ కథలకూ తీసిపోలేదు. కథకులు పలు విభిన్నమైన అంశాలను అత్యంత విశిష్టమైన రీతిలో ప్రదర్శించారు.

మా ఇతర సంకలనాలలాగే క్రీడా కథల సంకలనంలో కథల ఎంపికకు నిర్దిష్టమైన ప్రామాణికాలను నిర్ణయించుకున్నాం, కేవలం ‘ఆట’ కథలో ఉంటే సరిపోదు. కథ కేంద్రం ‘ఆట’ అయి ఉండాలి. రచయిత దృష్టి ‘ఆట’పైనే ఉండాలి. ‘ఆట’తో ఆరంభించి సామాజిక స్పృహ, అణచివేతలు, అన్యాయాలు, అక్రమాలు వంటి అంశాలవైపు కథ మళ్ళితే అలాంటి కథను క్రీడాకథగా పరిగణించలేదు. అలాగే, ఆట ఆధారంగా జీవితతత్వమో ఆధ్యాత్మికతనో ప్రదర్శించాలని ప్రయత్నించిన కథలను క్రీడా కథలుగా ఎంచలేదు. క్రీడా కథలంటే ‘ఆట’ కేంద్రంగా ఉండాలి. దృష్టి ఆటమీదే ఉండాలి. కథ ఆసక్తికరంగా సాగాలి. క్రీడ కేంద్రంగా ఉన్నా ఆసక్తికరంగా లేకపోతే కష్టం. ఈ రకమైన ప్రామాణికాలు నిశ్చయించుకుని మాకు లభించిన కథలకు అన్వయించి చూస్తే 23 కథలు క్రీడాకథల సంకలనంలోకి ఎంపిక అయ్యాయి.

ఈ సంకలనంలో ప్రచురితమైన కథలను నాంది, ప్రస్తావన, క్రీడాస్ఫూర్తి, క్రీడా మానసికం, క్రీడా వినోదం, క్రీడా ఉన్మాదం, క్రీడ-నేరం అన్న విభాగాలలో వర్గీకరించాం.

నాంది విభాగంలోని ‘భూపాల్’ కథ ఆణిముత్యం లాంటిది. మన సమాజంలో ఆటల పట్ల ఉన్న దృష్టిని అతి సున్నితంగా కానీ మనసుకు హత్తుకునేలాగా అత్యద్భుతమైన రీతిలో ప్రదర్శిస్తుంది. కవికొండల వేంకటరావు కథ చెడుగుడు-చెండాట’ క్రీడా కథలకు ప్రస్తావన లాంటిది. సంకలనంలోని ఇతర విభాగాలలో కథలు చదివేందుకు ఈ కథలు మానసికంగా పాఠకుడిని సిద్ధం చేస్తాయి. రంగాన్ని తయారుచేస్తాయి. ప్రాతిపదికను ఏర్పాటు చేస్తాయి.

‘క్రీడాస్ఫూర్తి’ని ‘Sportsman Spirit’గా అర్థం చేసుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వచ్చినా ఆటమీద ప్రేమ, ఆటవల్ల వ్యక్తిలో కలిగిన పట్టుదల, ఆటపట్ల దీక్షలు ఎలా ఆటగాడిని మామూలు మనుషుల నుండి ప్రత్యేకంగా నిలుపుతాయో ప్రదర్శిస్తాయీ కథలు.

‘క్రీడా మానసికం’ విభాగంలో క్రీడాకారుల మనస్తత్వం, ఆటలను ఆనందంగా మైమరచి తిలకించే ప్రేక్షకుల మనస్తత్వం, ఆరాధనకు గురవుతూ దాన్ని కోల్పోయిన ఆటగాళ్ళ ఆందోళనల కథలు ప్రదర్శిస్తాయి.

‘క్రీడా వినోదం’లోని దామా గోవిందరావు కథ “నా ఒలంపిక్ కల’ అత్యంత వ్యంగ్యాత్మకమైన కథ. చాగంటి తులసి కథ ‘మాంజాదారం’ సాంప్రదాయికమైన పతంగుల పండుగను హృద్యంగా చూపిస్తుంది. వసుంధర కథ ‘అబ్బాయి హాకీ ఆడాడు!? ఎంత వ్యంగ్యంగా హాస్యంగా ఉండి నవ్విస్తుందో అంతే నిక్కచ్చిగా చేదునిజాన్ని ప్రదర్శిస్తుంది.

‘క్రీడోన్మాదం’ విభాగంలోని కథలు ఆటల్లో పడి సర్వం విస్మరించే ఆటగాళ్ళ ఉన్మాదం స్థాయిలోని స్థితిని ప్రదర్శిస్తాయి.

క్రీడాకారుడు కూడా మనిషే. ఆటలో గెలవాలన్న పట్టుదల ఒక హద్దును దాటితే ఆటగాడు నేరస్తుడవుతాడు. అందుకే ఈ విభాగం పేరులో క్రీడకూ నేరానికీ నడుమ ఎడం ఉంచి ప్రదర్శించాం. ఆటలలో నేరానికి స్థానంలేదని చెప్తాయి ఈ విభాగంలోని మూడు కథలు.

ఇవి క్రీడాకథల సంకలనంలోని కథల వివరాలు. అయితే మా పరిమిత పరిధిలో మా దృష్టికి వచ్చిన కథలలోంచి ఎంచుకున్న కథలివి. ఇంకా మా దృష్టికి రాని చక్కని కథలు అనేకం ఉండవచ్చు. కాబట్టి తెలుగులో ఇవే క్రీడాకథలు అన్న అపోహ మాకు ఏమాత్రం లేదు. కానీ మా దృష్టికి వచ్చిన కథలలోంచి నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా కథలను ఎంపిక చేశాం. ఈ సంకలనంలోని కథలు విభిన్నము, విశిష్టము అయినవన్న విషయంలో ఎలాంటి సందేహము లేదు” అన్నారు ఈ సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించిన కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్‌లు తమ ముందుమాట “క్రీడా కథల సంకలనం గురించి”లో.

***

క్రీడాకథ

(కథా సంకలనం)

ప్రచురణ: సంచిక – సాహితీ

పుటలు: 176

వెల: 100/-

ప్రతులకు:

సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643

ఈ పుస్తకం యొక్క ప్రీ-పబ్లికేషన్ ఆఫర్ కొరకు ఈ లింక్ చూడండి.

Exit mobile version