కృష్ణ వ్యూహం

0
2

[dropcap]ఆ[/dropcap] రోజు ఆదివారం. కృష్ణ కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేసి ల్యాప్‍టాప్‌ను ఓపెన్ చేసాడు. అతను వుండేది కలకత్తాలో.. స్టేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‍గా పనిచేస్తున్నాడు. ఎం.యస్సీ., ఎం.బి.ఏ., చదివాడు. చాకు లాంటి కుర్రాడు. మంచి అందగాడు. ఆస్తికుడు. దేనికీ టెన్షన్ కాడు. బాగా ఆలోచిస్తాడు. సమయస్ఫూర్తిగా వర్తిస్తాడు.

ఇన్‌వర్డ్ మెయిల్స్ చూడసాగాడు కృష్ణ. తను కలకత్తాకు వచ్చి ఆరు నెలలు అయింది. తన మేనత్త కూతురు.. మరదలు.. ప్రీతి పంపిన మెయిల్ చూచాడు. సుదీర్ఘమైన ఆ మెసేజ్‌ని చూచి ఆశ్చర్యపోయాడు. ప్రీతి ఎం.కాం. చదువుతూ వుంది. ఫైనల్ ఇయర్. ఇంగ్లీష్‌లో వున్న ఆ లేఖను చదవడం ప్రారంభించాడు.

“డియర్ బావా!.. గుడ్ మార్నింగ్. ఈ నా మెయిల్‍ను చూచి నీవు ఆశ్చర్యపోతావని నాకు తెలుసు. అమ్మానాన్నలు నాకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. మంచి సంబంధమట. వారిది ఏలూరు. అబ్బాయి గారు బి.ఈ. చేసి అమెరికాలో ఏడాదిగా పనిచేస్తున్నాడట. లక్షలు సంపాదిస్తున్నాడట. బాగా మంచి స్థితిగతులు వున్న కుటుంబం. అతనికి ఒకే చెల్లెలు. తండ్రిగారు కాంట్రాక్ట్ కంపెనీ నడుపుతున్నారుట. ఇంట్లో అందరూ చాలా మంచి సంబంధం అని సంబరపడుతున్నారు. కానీ నా నిర్ణయం ఏమిటో వారికి అనవసరంగా వుంది.

బావా! నేను ప్రస్తుతంలో వివాహం చేసుకోదలచుకోలేదు. కారణం.. నేను ఎం.కాం., ముగించి, ఎం.బి.ఎ., చేసి మీలాగే నేనూ బ్యాంక్ ఎంప్లాయీ కావాలనేది నా ఆశయం. ముఖ్యంగా.. అమ్మను నాన్నను తనవాళ్ళందరినీ.. మన దేశాన్ని వదలి.. సముద్రాలను దాటి ఉన్నదానితో తృప్తి చెందకుండా కేవలం డబ్బుకోసం పరాయి దేశాల్లో పనిచేసే వ్యక్తితో నేను జీవితాన్ని పంచుకోలేను.

మొన్న ఇక్కడ ఒక సంఘటన జరిగింది. పోయిన సంవత్సరం నా సీనియర్ హేమలత అమెరికాలో పనిచేసే ఓ అబ్బాయిని పెండ్లి చేసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో అమెరికా వెళ్ళిపోయింది. ఆయన.. ఐదేళ్ళలో ఇండియాకు తిరిగివచ్చి సెటిల్ అవుతానని హేమలత తల్లిదండ్రులకు చెప్పాడట. ఐదేళ్లే కదా అని వారు ఆ సంబంధానికి సమ్మతించారు.

మూడు నెలల క్రిందట హేమలత తల్లి మరణించింది. అల్లుడు గారికి మామగారు మేసేజ్ పంపారు. వారు సమయానికి రాలేదు. జరగవలసిన కర్మకాండలన్నీ ముగిసి పోయాయి. పదిహేను రోజుల తర్వాత.. హేమలత తమ్ముడు శీను.. అమెరికాకు ఫోన్ చేసాడు. దైవాధీనంగా శీను కాల్‌ను హేమలత ఎత్తిన కారణంగా, వాడు ఆమెతో మాట్లాడ గలిగాడు.

వారి సంభాషణ సారాంశం.. ఆ హీరో.. మన హీరోయిన్ తల్లి చనిపోయిన విషయాన్ని ఆమెకు చెప్పలేదు. భర్త ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత.. నిలదీసి అడిగింది హేమలత.

‘నాకు సెలవు లేనందున.. ఇండియాకు పోలేనందున నీతో ఆ విషయం చెప్పలేద’ని భర్త శ్యామ్ సుందర్ విసుక్కొన్నాడుట. ఇరువురి మధ్యనా వాగ్వాదం జరిగింది. పురుషాధిక్య భావనలో శ్యామ్ హేమలతపై చేయి చేసుకొన్నాడు ఆవేశంతో.

‘ఇక మనం కలసి ఉండలేము.. విడాకులు తీసుకోవాల్సిందే’ అని చెప్పి .. వేగంగా ఇంట్లోనుంచి వెళ్లి పోయాడుట శ్యామ్. ఫోనుకు జవాబు లేదు. మూడు రోజులైనా ఇంటికి రాలేదు. ఏమైనాడో అని హేమలత సతమతమై పోయింది. ఆఫీస్‌కు వెళ్లి విచారించింది. లీవు పెట్టి ఇండియాకు వెళ్లిపోయాడని తెలిసింది.

మన ప్రాంతపు తెలిసినవారి వద్ద డబ్బు తీసుకొని హేమలత ఇండియాకు వచ్చింది. శ్యామ్‍ సుందర్ హేమలత సంసారానికి యోగ్యం కాదని విడాకులకు అప్లై చేసాడు. మరో పెళ్ళికి సిద్ధం అయినాడు.

ఈ కథ మూలంగా నేను గ్రహించింది ఏమిటంటే.. ‘ధనదాహం వున్నవారి మనస్సులో తన.. మన.. జాతి.. రీతి..నీతి.. ధర్మాధర్మాలు ఉండవ’ని.

బావా! నాకు మన హైందవ జాతి, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు.. సంప్రదాయాలు అంటే ఎంతో గౌరవం, అభిమానం, నా ఈ అబిరుచులకు తగిన వానినే, నా లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఏరి కోరి వివాహం చేసుకొంటాను. నీవు నన్ను ఎంతగా అభిమానిస్తావో నాకు తెలుసు. ఆ కారణంగానే నేను నా ప్రస్తుత సమస్యను నీకు తెలియజేస్తున్నాను.

నాయందు దయ ఉంచి నీవు అమ్మ నాన్నాలతో మాట్లాడి ఆ అమెరికా సంబంధాన్ని క్యాన్సిల్ అయేలా చేయాలి. ముఖ్యంగా.. నాకు ఇప్పుడు వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదన్న విషయాన్ని వారికి తెలియజేయాలి. నీ మాట అంటే అమ్మానాన్నలకు ఎంతో గౌరవం. ఈ పనిని నీవు ఒక్కడవే చేయగలవు. నీ సహాయాన్ని అర్ధిస్తున్నా!..

ఇట్లు.. ప్రీతి .. కాదు నీ కోతి..”

ఉదయాన్నే ఎంతో ప్రశాంతంగా వున్నా కృష్ణ మనస్సు.. ప్రీతి లేఖను చదివిన తర్వాత వికలమయింది.

ప్రీతి.. తనకన్నా పదేళ్ళు చిన్న.. చిన్నతనంలో ఇరువురూ కలసి ఆడుకోనేవాళ్ళు. ఇరువురి ఇళ్ళు ప్రక్కప్రక్కనే.. తను ప్రీతికి చదువు చెప్పేవాడు. చాలా శ్రద్ధగా విని అర్థం చేసుకొనేది. అర్థంకాకపోతే.. ‘బావా మరోసారి చెప్పు..’ ముద్దుగా అడిగేది.

తను ప్రీతిని ఆట పట్టించేదానికి అపుడపుడూ ‘ప్రీతీ.. నా కోతీ..’ అని పిలిచేవాడు. తనను ప్రీతి.. ఎంతో రోషంగా చూచేది. తను బ్రతిమాలుకొనేవాడు.. వెంటనే ఏ కల్మషం లేకుండా ఆనందంగా నవ్వేది.

అలాంటి ప్రీతి ఈనాడు ఇంగ్లీష్‌లో.. ఇంత పెద్ద ఉత్తరాన్ని.. ఎంతో ఇష్టంగా గ్రామర్ తప్పులు లేకుండా ఎంతో చక్కగా వ్రాసింది.

చివరన వ్రాసిన ‘ప్రీతి కాదు.. నీ కోతి’ అన్న పదాన్ని చూచి.. కృష్ణ ఎంతో ఆనందంగా నవ్వుకొన్నాడు. తన బాల్య స్మృతులు గుర్తుకు వచ్చాయి.

ప్రీతి మనోభావాలు చాలా మంచివి. ఈ విషయంలో తను ప్రీతికి తప్పక సాయం చేయాలి.

ఆమె వివాహం.. ఆమె కోరిన రీతిలోనే జరగాలి. ఈ విషయంలో తను ప్రీతికి అండగా నిలబడాలి. ఈ నిర్ణయానికి వచ్చిన కృష్ణ ప్రీతికి మెయిల్ పంపడం ప్రారంభించాడు.

***

“మై డియర్ ప్రీతీ!.. కోతీ!.. నీ లేఖ నీవు ఎంతగా ఎదిగావో స్పష్టంగా తెలియజేస్తూ వుంది. నాకు మన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. పాత జ్ఞాపకాలు.. మనస్సుకు ఎంతో ఆనందం. ప్రీతీ!.. నీవు దేనికీ బాధపడకు. నేను మీ నాన్న అదే నా మామయ్యతో మాట్లాడుతాను. నీవు.. నీ యిష్ట ప్రకారం బాగా చదువుకో. నేను నీకు అండగా వుంటాను. నీవు దేనికీ భయపడవలసిన అవసరం లేదు. నీ వెనక నీ నీడలా నేనున్నాను.

ఇట్లు

నీ

బావ

కృష్ణ.”

మెయిల్‌ను పంపించేసాడు కృష్ణ. తన మామయ్య నారాయణమూర్తికి ఫోన్ చేసాడు. అత్త సంయుక్త ఫోన్ ఎత్తింది.

“ఏరా అల్లుడూ!.. ఎలావున్నావ్?..”

“నేను చాలా బాగున్నాను. నీవు మామయ్యా ఎలా వున్నారు అత్తయ్యా..”

“మేమంతా బాగున్నాము. ముఖ్యమైన విషయం. మన ప్రీతికి మంచి సంబంధం కుదిరింది. అబ్బాయి కంప్యూటర్ ఇంజనీర్. అమెరికాలో ఉన్నాడు. త్వరలో ముహూర్తాలు పెట్టుకొంటాం. పది రోజులు శలవు పెట్టి వచ్చి.. నీవు ప్రీతి వివాహాన్ని నీ చేతుల మీదుగా బాగా జరిపించాలి”.. ఎంతో ఆనందంగా ఒక్క గుక్కలో తాను చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పింది సంయుక్త.

“అలాగా అత్తయ్యా !.. తప్పకుండా వస్తాను. సరే.. అబ్బాయి నాన్నగారిది ఏ వూరు?..”

“ఏలూరు..”

“వారి ఫోన్ నెంబర్ ఉందా?”

“వుంది”

“చెప్పు..”

నెంబరు చెప్పి, “అవును.. ఈ నెంబర్ నీకెందుకు?..” అంది.

“నేను ఆఫీస్ పనిమీద అమెరికా వెళుతున్నా.. వారి నాన్నగారి నుండి ఆ అబ్బాయి నెంబర్ తెలుసుకొని అమెరికాలో అతన్ని కలిసేందుకు..”

“ఓ.. అలాగా!.. చెయ్యి.. ఆ పని తప్పక చెయ్యి. నీవు అక్కడ అతన్ని చూచి మాట్లాడితే మనకు చాలా మంచిది.”

“అందుకే అత్తయ్యా!.. నేను నెంబర్ అడిగింది..”

“మంచిది.. కృష్ణా!..”

“పెట్టేస్తున్న అత్తయ్యా!..”

“ఓ.కె..”

కృష్ణ కాల్ కట్ చేసాడు.

***

తన అత్తయ్య సంయుక్త ఇచ్చిన నెంబర్‍ను సెల్‌లో నొక్కాడు.

“హలో!..”

“హలో!.. లక్కపాటి లక్ష్మి, లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్.. స్పీకింగూ!.. అవతల ఎవరు?..”

‘అబ్బా.. అబ్బో!.. ఎంత అందంగా మాట్లాడుతూ వుంది.. ఈవిడ అబ్బాయి గారి మాతృశ్రీ కాబోలు.’ అనుకొన్నాడు కృష్ణ.

“నా పేరు కృష్ణ.. ప్రీతి బావను.. కలకత్తా నుండి.. మాట్లాడుతున్నాను. బాబాయి గారు ఇంట్లో లేరా పిన్నిగారూ!..”

“ఆ.. ఏమన్నావ్ ? పిన్నిగారా!.. ఆహా.. ఎంత మంచివాడవయ్యా.. నీవు!.. ఏమి కలగలపు.. ఏం మాట తీరు!.. నీ పేరు కృష్ణా అన్నావ్ గదా బాబూ!..” ఎంతో అప్యాయంగా అడిగింది లక్ష్మి.

“అవును పిన్నిగారూ!” ఎంతో వినయం.

“ఆయన కాంట్రాక్టర్ కదూ!.. పనిమీద వైజాగ్ ఎల్లారు.. రాత్రికి వస్తారు.. ఇంతకీ విషయం ఏమిటి బాబూ!..”

“విషయం!..” ఆపాడు కృష్ణ.

“విషయం.. ఏమ్.. ఆగిపోయావ్.. చెప్పు బాబూ..” సందేహంలో పడింది లక్ష్మి.

“నాకు..”

“నీకు!..”

“ప్రీతి అంటే..”

“అంటే..”

“చాలా ఇష్టం.. పిన్నిగారూ!.. తల్లిలాంటి వారు.. మీ ముందు అబద్ధం చెప్పడం నా చేతకాదు. మేమిద్దరం ప్రేమించుకొంటున్నాం.. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.” అనునయంగా మెల్లగా చెప్పాడు కృష్ణ.

“ఏమిటీ?..” ఆశ్చర్య పోయింది లక్ష్మి.

“పిన్నిగారూ!.. ప్రీతి నేను పెండ్లి చేసుకోబోతున్నాము.. కానీ.. మా మామయ్య మా పాలిట విలన్‍గా మారి.. మీ డబ్బును.. మీ ఆస్తిపాస్తులను చూచి.. నన్ను కాదని ప్రీతికి ఇష్టం లేకపోయినా.. మీ సంబంధానికి ఒప్పుకొన్నారు.. పిన్నిగారూ!.. నన్ను ప్రేమిస్తున్న ప్రీతిని..”

“బాబూ!.. కృష్ణా!.. ప్రీతి నీదే.. నేను ఇపుడే మీ మామయ్యగారికి ఫోన్ చేసి..”

“నా పేరు బయటికి రాకూడదు పిన్ని గారూ!..” లక్ష్మి ముగించక ముందే వెంటనే చెప్పాడు కృష్ణ.

“ఆ.. నీకుందుకా భయం.. నాకు ఆ మాత్రం తెలీదు అనుకొన్నావా కృష్ణా.. నిన్ను ఎవరు ఏమి అడగబోరు” అనునయంగా చెప్పింది లక్ష్మి.

“చాలా చాలా ధన్యవాదాలు పిన్నిగారూ! నేను మీ దగ్గరకు వస్తాను. మిమ్మల్ని చూస్తాను.. మీ పాదాలను తాకి మీ ఆశీర్వాదాలను కోరుకొంటాను. మీరు.. మీరు.. నా పిన్నిగారూ కదూ.. మా అమ్మ.. మీరు మా అమ్మగారు” ఆవేశంతో చెప్పాడు కృష్ణ.

“నాయనా కృష్ణ!.. వాళ్ళు ప్రీతిని నీకు యిచ్చి పెండ్లి చేయకపోతే.. నాకు ఒక్క ఫోన్ కొట్టు.. నేను అక్కడకి వచ్చి దగ్గర నిలబడి నీకు ప్రీతికి వివాహం జరిపిస్తాను. నా మాట నమ్ము. నీవు దేనికీ భయపడకు..” తన దృఢ నిర్ణయాన్ని తెలియచేసింది లక్ష్మి.

“పిన్నిగారూ!.. మీ అభిమానాన్ని నేను ఈ జన్మలో మరచిపోలేను. నేను నా జీవితాంతం మీకు రుణపడి వుంటాను. అమ్మా.. ఫోన్ పెట్టేయనా!..”

“మంచిది బాబూ.. కృష్ణా!.. మంచిది..”

కృష్ణ ఫోన్ కట్ చేసాడు. డ్రస్ చేసుకొని బయటకి పనిమీద వెళ్ళిపోయాడు.

***

మూడవరోజు మెయిల్ చెక్ చేసాడు కృష్ణ. ప్రీతి మెయిల్ వుంది. ఆత్రంగా చూచాడు.

“బావా! ఏ కారణం చేతనో ఆ ఏలూరు వారు.. ‘ప్రస్తుతంలో మా అబ్బాయి వివాహం చేసుకోలేడు. వాడికి ఇష్టం లేదట. మీరు.. మీ అమ్మాయికి మరో సంబంధం చూచుకోగలరు. ఇక మమ్మల్ని సంప్రదించకండి..’ అని నాన్నతో ఫోనులో చెప్పారట బావా!.. ఐ యాం సో హ్యాపీ..

ఇట్లు..

నీ ప్రీతి.”

కృష్ణ సెల్ ఆన్ చేసాడు.

“కోతీ!.. యిపుడే నీ మెయిల్ చూచాను.”

“బావా! యిపుడు నేను చాలా ఆనందంగా వున్నాను.”

“ఎందుకు.. కోతీ!..”

“ఆ ఏలూరు సంబంధం తప్పిపోయినందుకు..”

“ఎలా తప్పిపోయింది?..”

“ఏమో!.. నాకేం తెలుసు?..”

“నే చెప్పనా?..”

“చెప్పు..”

“కృష్ణ వ్యూహం”.. నవ్వాడు కృష్ణ.

“అంటే!” ఆశ్చర్యంతో అడిగింది ప్రీతి.

“పై వారం వూరికి వస్తున్నాను. అపుడు నేరుగా చెపుతాను..” కిల కిలా నవ్వుతూ కృష్ణ సెల్ కట్ చేసాడు.

[ప్రతి ఒక్కరికి జీవితంలో మంచి స్నేహితులు ముఖ్యం. జేబులు ఖాళీ చేసేవారు కాదు. బాధలను, సమస్యలను అర్థం చేసికొని ఉత్తమ సలహాలిచ్చిన వారే నిజమైన నేస్తాలు.. ఆప్త మిత్రులు. – రచయిత]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here