కృష్ణలీలాతరఙ్గాల ఆనంద సాగరం – భక్తకవి నారాయణతీర్థులు

6
3

[శ్రీ నారాయణతీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణి కావ్యాన్ని పరిచయం చేస్తున్నారు శ్రీమతి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి.]

[dropcap]శ్రీ [/dropcap]కృష్ణలీలాతరఙ్గిణి సంగీతమయమైన భక్తి ప్రధాన మధురకావ్యము. శ్రీకృష్ణలీలల తరఙ్గాలు నిండిన ఆనంద సాగరము వంటి ఈ కావ్యమును భక్త కవి నారాయణ తీర్థులు సంస్కృతంలో రచించారు. ఈ కావ్యమును చదివే, పాడే, వినే ప్రతి హృదయమూ రసానంద జగత్తులోకి ప్రవేశించగలదు.

మొదటగా ఒక మధురమైన కీర్తనతో ఈ కావ్యపరిచయాన్ని కొనసాగిస్తాను.

గోకులంలోని శ్రీకృష్ణుని లీలలను దేవాఙ్గనలు గగన సఞ్చారం చేస్తుండగా చూసి పరస్పరం ఇలా సంభాషించుకుంటారు.

~

ఆలోకయే శ్రీబాలకృష్ణం సఖీ ఆనంద సున్దర తాణ్డవ కృష్ణం

నవనీత ఖణ్డ దధిచోర కృష్ణం భక్త భవపాశబన్దమోచన కృష్ణం

నీలమేఘశ్యామసున్దర కృష్ణం నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం

చరణ నిక్వణిత నూపుర కృష్ణం కరసఙ్గతకనక కఙ్కణ కృష్ణం

కిఙ్కిణీజాల ఘణఘణిత కృష్ణం లోకశఙ్కితతారావలీ మౌక్తిక కృష్ణం

సున్దరనాసామౌక్తికశోభిత కృష్ణం నన్దనన్దనమఖణ్డవిభూతి కృష్ణం

కణ్ఠోపకణ్ఠశోభి కౌస్తుభ కృష్ణం కలికల్మషతిమిరభాస్కరకృష్ణం

వంశనాదవినోదసున్దరకృష్ణం పరమహంసకులశంసితచరితకృష్ణం

గోవత్సబృన్దపాలక కృష్ణం కృతగోపికాజాల ఖేలన కృష్ణం

నన్దసునన్దాదివన్దిత కృష్ణం శ్రీకృష్ణ నారాయణతీర్థవరద కృష్ణం

ప్రతి కీర్తనలో చివరన కవి నారాయణతీర్థుల పేరు వస్తుంది. ఈ కీర్తన హుసేనిరాగం మరియు ఆదితాళంలో పాడదగును.

ఈ కీర్తన భావమిది.

ఓ సఖీ! ఆనందమే సౌందర్యమై తాండవమాడే ఆ కృష్ణుడిని చూడు.

నిత్యనిర్మలానందబోధలక్షణుడైన ఆ నీలమేఘశ్యామసుందరుని చూడు.

చరణాలకున్న మంజీరాల నిక్వణనాలు, చేతులకున్న కనక కంకణధ్వనుల కృష్ణుని చూడు.

 భక్తులకు సంసారబంధనాల నుండి ముక్తి కలిగించే నారాయణుడు, నవనీతచోరుడైనాడు. సచ్చిదానందుడైన సుందరమైన ముత్యమును ముక్కున ధరించిన నందనందనుని చూడు

కంఠమందు శోభించే కౌస్తుభాన్ని చూడు. కలి కల్మషతిమిరాన్ని హరించే రవి వంటి కృష్ణుని చూడు.

వేణుగానలోలుని, పరమహంసలు స్తుతించే కృష్ణుని చూడు.

గోపాలకుని, గోపీలోలుని చూడు. నందసునంద వందితుడైన, నారాయణతీర్థునికి వరమిచ్చే కృష్ణుని చూడు.

భక్త జయదేవుని గీత గోవిందకావ్యము, ప్రధానంగా రాధాకృష్ణుల ప్రణయగాథావర్ణనతో నిండిన శృంగారరసప్రధాన కావ్యమైతే, నారాయణతీర్థుల కృష్ణలీలాతరఙ్గిణి భక్తిరస ప్రధాన కావ్యము. ఇందులో ఆద్యంతమూ శ్రీకృష్ణుని పరబ్రహ్మస్వరూపావిష్కారం జరుగుతుంది. ఎక్కడా కాముక శృంగారానికి స్థానము లేదు. అయినప్పటికీ ఈ కావ్యము ఎంత మధురమనోహర కీర్తనలు ఇందులో ఉంటాయంటే మనము పారవశ్యంతో తల్లీనులమైపోతాము.

కవి పరిచయము:

17 వశతాబ్దికి చెందిన భక్త కవి శ్రీనారాయణతీర్థులు భారతదేశంలో అగ్రశ్రేణి కృష్ణభక్తులలో ఒకరు. వీరు ఈ కావ్యమును గీత, సంగీత మరియు నృత్యప్రదర్శనకు అనుకూలంగా వ్రాశారు.

శ్రీ నారాయణతీర్థులు 1675 నుంచి 1775 మధ్యకాలంలో జీవించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో జన్మించి, షట్ఛాస్త్రాలలో ప్రవీణులయ్యారు. గంగాతీరమందు కాశీలో అనేక సంవత్సరాలు బ్రహ్మవిద్యను సాధన చేశారు. వీరు శాండిల్య భక్తి సూత్రములు మరియు పూర్వమీమాంస శాస్త్రములకు వ్యాఖ్యానములు వ్రాశారు. కావేరీ తీరమందు సిద్ధి పొందారు.

కావ్య పరిచయము:

భాగవత పురాణంలో ఉన్నట్టుగానే కృష్ణలీలాతరఙ్గిణిలో పన్నెండు స్కంధాలున్నాయి. వీటి పేర్లు..

౧. కృష్ణప్రాదుర్భావము.

౨. బాలలీలలు

౩. గోవత్సపాలన

౪. కృష్ణగోపాల వర్ణన

౫. గోవర్ధనోద్ధరణము

౬. కృష్ణగోపీ సంగమము

౭ & ౮. రాసక్రీడ

౯. మధురాప్రవేశము

౧౦. కంసనిర్హణము

౧౧. ద్వారకా ప్రవేశము

౧౨. రుక్మిణీకృష్ణుల వివాహ మహోత్సవము.

ఇప్పుడు ఇంకొక మధురగీతాన్ని ఆస్వాదిద్దాం.

ముఖారి రాగము మరియు ఆదితాళము.

పల్లవి – కృష్ణం కలయ సఖీ సుందరం!

బాల కృష్ణం కలయ సఖీ సుందరం

అనుపల్లవి – కృష్ణం గత విషయ తృష్ణం – జగత్ప్రభ

విష్ణుం సురారి గణ జిష్ణుం సదా – బాల ॥కృష్ణం॥

చరణం – ధీరం భవజలధి సారం సకల వేద

సారం సమస్త యోగి తారం సదా – బాల ॥కృష్ణం॥

ప్రతి కీర్తనలో ఇలాంటివి నాలుగు నుంచి పది చరణాల వరకు ఉంటాయి. ఇక్కడ పూర్తి కీర్తన మరియు అర్థం ఇవ్వడానికి చోటు చాలదు. ఎంత అద్భుత చిత్రణ! ఏమి దర్శనమది భక్తకవి శ్రీ నారాయణతీర్థులది!

ఈ అన్ని కీర్తనలలో అత్యంతమధురమైన తీరులో చేసిన కృష్ణవర్ణన సాగుతుంది. ప్రతి కీర్తననూ సంగీత, నృత్యవిధులతో అనుసంధానిస్తూ అనేక కృతులను రచించారు. ఇవి అన్నీ కూడా చాలా శ్రవణసుభగంగా ఉండి, అప్రయత్నంగా శ్రోతను ఒక అలౌకిక ఆనందంలోకి తీసుకుపోయేవీ అనడంలో సందేహం లెదు.

అసలు హరికీర్తన ఎప్పుడైనా భక్తజనులను ఆనందమగ్నులను చేస్తుంది. పైగా రాగబద్ధంగా కూర్చబడిన ఈ తరంగాలు ప్రతి శ్రోత మనస్సును అవలీలగా దోచుకుంటాయి.

కృష్ణలీలల వర్ణనలో కవి ఎంతగా లీనమై పాడినాడో, ఈ కీర్తనలను వినేవాళ్ళకు ప్రత్యక్ష కథనంగా అనిపించక మానదు. అంటే కవి స్వయంగా బాల కృష్ణుని ఎదుట ఉండి ఆ యా చేష్టలన్నీ చూస్తూ స్వయంగా ఆనందామృతం గ్రోలుతూ మనకు అందిస్తున్న అనుభూతి కలుగుతుంది. తరంగాలలోని భక్తిభావన వల్ల శ్రవణమాత్రంతోనే మనసు ఆనందడోలికలలో ఊగుతుంది.

శరణంభవ కరుణాం మయి కురు దీనదయాళో

కరుణారసవరుణాలయ కరి రాజ కృపాళో

అధునా ఖలు విధినా మయి సుధియా సురభరితం

మధుసూదన మధుసూదన హర మామక దురితం

ఈ కీర్తన సౌరాష్ట్ర రాగంలో ఆదితాళములో పాడదగును. ఇందులో మొత్తం పన్నెండు పాదాలున్నాయి.

అన్ని కీర్తనలూ సంగీత, సాహిత్యాలంకృతాలైన అభినయ ప్రధాన రచనలే.

వీణా, మృదంగం, తబలా మొదలైన వాద్యసహకారాలతో రంగస్థలం మీద ప్రదర్శనకు యోగ్యమైనవే. ప్రతి కీర్తన ప్రారంభంలో ఒక శ్లోకం, దరువు ఇచ్చి తర్వాత రసానుగుణంగా, సమయానుగుణంగా రాగ తాళాలను సూచించడం అనే ఒక విశిష్టమైన పద్ధతిని అనుసరించారు. శ్రీకృష్ణ జననం నుంచి ఆయన వివాహ శుభకార్యం వరకూ మధుర గాథలతో కూడిన ఈ కావ్యము ఒక అనుభూతి కావ్యము. ఆద్యంతమూ శ్రీకృష్ణుని పరబ్రహ్మ రూపంలోనే చిత్రించారు.

కవి ప్రథమ తరంగంలో స్వయంగా చెప్పినదేమిటంటే

శ్లోకం

వాసుదేవే భగవతి భక్తి ప్రవణయా ధియా

వ్యజ్యతే భక్తి సారాఢ్యా కృష్ణలీలా తరఙ్గిణీ॥

ఈ శ్లోకం కృష్ణలీలా తరఙ్గిణి యొక్క భక్తి సారాన్ని సూచిస్తుంది.

ఈ కావ్యంలోని పన్నెండు తరఙ్గాలలో దాదాపు 150 కి పైగా కీర్తనలున్నాయి. ప్రతి కీర్తనతో పాటు రెండు శ్లోకాలు మరియు కొన్ని గద్యములు కూడా ఉన్నవి. ఈ కావ్యము కర్ణాటక సంగీతాంగమైన యక్షగానవిధిలో ఉంటుంది.

ఇందులో సౌరాష్ట్ర, ముఖారి, నాట, నాదనామ క్రియ, మధ్యమావతి, శంకరాభరణం, కళ్యాణి, కేదార గౌళ, సావేరి, ఆహిరి(కాంభోది), భైరవి, ద్విజావంతి, మోహన్(నవరోజ్), కాపీ, కాంభోజి, పున్నాగవరాళి, ధన్యాసి, తోడి, మలహరి మొదలైన రాగాల్లో మరియు ఆది, ఆట, చాపు, జంపే, విలంబ, ధృవ, త్రిపుట మొదలైన తాళములలో కీర్తనలు రచింపబడినాయి.

అడుగడుగునా పదపదమునా చెవికింపైన శబ్దాలంకారములు, కమనీయమైన అర్థాలంకారములతో చదువరులను ఆకట్టుకునే కావ్యమిది.

శ్రీకృష్ణ జననం నుంచి బాల్యలీలలు, మధురాగమనము, అక్రూర ఉద్ధవుల ప్రస్తావన, అష్టమహిషులతో శ్రీకృష్ణ వివాహం వరకూ సాగుతుంది. అందువల్ల కృష్ణగాథ మొత్తం ఇందులో సమాహితమై ఉందని చెప్పవచ్చు.

కావ్యము దైవ ప్రార్థనతో మొదలై, మంగళాచరణముతో ముగుస్తుంది.

ప్రతి కీర్తన, దరువుకు రసానుకూలమైన రాగతాళాదుల సూచన ఇవ్వబడింది. శ్రీకృష్ణుని కైవల్యదాత అయిన పరబ్రహ్మ రూపంలో కవి దర్శించాడు, చదువరులకు దర్శింపజేశాడు. భాగవతము యొక్క దశమస్కంధమును మధురమైన రసమయ కావ్యంగా మలిచాడు.

శ్రీకృష్ణలీలా తరఙ్గిణి లోని కవితావేశము మరియు లలితపదబంధసరళి సహృదయునిలో నవరసాలొలుకుతుంది. ఇందులో శ్లోకము, గద్యము, దరువు, కీర్తనల భాష ఎంత సరళంగా ఉంటుందంటే గీర్వాణభాషాధురీణులు కాకపోయినప్పటికీ భావార్థము సహజంగా అందుతుంది.

అన్ని కీర్తనలూ కృష్ణలీలల తన్మయత్వంలో ముంచి వేయడం అత్యంత స్వాభావికంగా జరుగుతుంది. కాబట్టి శీర్షిక సార్థకమైంది.

భక్తకవి నారాయణతీర్థులు కావేరీ తీరమందు దాదాపు డెబ్భై ఏళ్ళ వయసులో సిద్ధిపొందారు.

ఉపసంహారము:

ఈ కావ్యములోని అనేక కీర్తనలు సంగీతనాట్యక్షేత్రాలలో బహు ప్రసిద్ధినిపొందాయి. గానకళాకోవిదులు మంగళంపల్లి బారమురళీకృష్ణ వంటి ప్రముఖ సంగీతకారులు, నాట్యకళాకోవిదులు శోభానాయుడు వంటి ప్రసిద్ధ నర్తకీమణులు ఈ కీర్తనలను ప్రదర్శించారు. వీటన్నిటినీ యూట్యూబ్ ద్వారా ఇంటర్ నెట్ సహాయంతో వినవచ్చు.

ఈ విధంగా భక్త్యానంద సాగరంలో మునక వేయించి భవసాగరాన్ని తరింపజేసేవిధంగా కృష్ణలీలాతరఙ్గిణి ఉత్కృష్టమైనదని భావించడంలో ఏ మాత్రమూ సందేహము అక్కరలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here