[సంచిక పాఠకుల కోసం ‘కృష్ణమ్మ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
[dropcap]ఈ[/dropcap] మధ్య నేను చూసిన సినిమాల్లో నన్ను కదలకుండా కూర్చోబెట్టిన సినిమా ‘కృష్ణమ్మ’. ఇది నేను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూశాను. విడుదలైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన రావటంతో చూశాను. కథ కొత్తదేం కాదు. కానీ కథనం బావుంది. మన వ్యవస్థలు ఎంత కుళ్ళిపోయాయో మరోసారి చూపించిన చిత్రమిది. సత్యదేవ్ ఎంత మంచి నటుడో మరోసారి నిరూపించింది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (2020) తో అతనికి మంచి పేరొచ్చింది. తర్వాత ‘తిమ్మరుసు’ (2021) లో మరో మంచి పాత్ర పోషించాడు. ‘గాడ్ ఫాదర్’ (2022) లో చిరంజీవి ఎదురుగా ప్రతినాయక పాత్ర వేసి తన సత్తా చాటాడు. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది అనటానికి పెద్ద సినిమాల కంటే ఇలాంటి చిన్న సినిమాలే సాక్ష్యమని నాకనిపిస్తోంది. ఈ చిత్రానికి వి. వి. గోపాలకృష్ణ దర్శకుడు. కథ, మాటలు కూడా అతనే సమకూర్చాడు. అతను ఇంతకు ముందు కూడా సినిమాలకి దర్శకత్వం వహించాడని ఎక్కడో చదివినట్టు గుర్తు. కానీ, ఆ వివరాలేమీ నాకు దొరకలేదు. దర్శకత్వంలో పరిణతి ఉంది. ఇలాంటి దర్శకులని ప్రోత్సహిస్తే మంచి సినిమాలు వస్తాయి.
విజయవాడలో కృష్ణమ్మ ఒడ్డున భద్ర కూర్చుని తన గతం తలచుకుంటాడు. ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. భద్ర, కోటి, శివ స్నేహితులు. ముగ్గురూ అనాథలు. 28-29 ఏళ్ళ వాళ్ళు. మంచి స్నేహితులు. కలిసి ఉంటారు. భద్రకి, శివకి గొడవ వస్తే నవ్వించి తేల్చేసేది కోటి. శివకి ఓ ప్రింటింగ్ దుకాణం ఉంటుంది. అతనికి ఓ కుటుంబం ఏర్పరుచుకోవాలని కోరిక. భద్ర, కోటి శివకి తెలియకుండా గంజాయి తరలించే పని చేస్తుంటారు. ప్రతిసారి ‘ఇదే ఆఖరిసారి’ అంటుంటారు. వీళ్ళకి గ్యాంగ్ లీడర్ దాసు. సీఐ సుబుద్ధి దాసు గ్యాంగ్ మీద నిఘా వేస్తాడు. ఒకప్పుడు శివ కూడ గంజాయి తరలించే పని చేసేవాడు. భద్ర, కోటిలని తప్పించాలని జైలుకి కూడా వెళ్ళాడు. బైటికొచ్చాక నిజాయితీగా బతుకుతున్నాడు. అతనికి మీనా (అతిరా రాజ్) అనే అమ్మాయి పరిచయమౌతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. మీనా ఒక హాస్టల్లో ఉండి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. భద్రకి పద్మ పరిచయమవుతుంది. ఆమె అదే పేటలో తండ్రితో ఉంటుంది. ఆమె అక్క కూతురు వారితోనే ఉంటుంది. అక్కకి ప్రేమ పెళ్ళి చేస్తే భర్త వల్ల చివరికి ఆమె చనిపోయింది (ఆత్మహత్య కావచ్చు). భద్ర, పద్మ మౌనంగానే ప్రేమించుకుంటారు. ఇది గమనించి పద్మ తండ్రి భద్రని పిలిచి అతని వివరాలు అడుగుతాడు. భద్ర కోపంగా తాను అనాథని చెబుతాడు. పద్మ తండ్రి ఉద్దేశం భద్ర తన కూతుర్ని వదిలేయాలని. పెద్ద అల్లుడి వల్ల ఆయన ఇల్లు కోల్పోయి ఈ పేటలో ఉంటున్నాడు. భద్ర “ఇలాంటి చోట ఉంటే గాంధీ నెహ్రూలు రారు, నా లాంటి అమ్మా బాబులు లేని వాడే వస్తాడు” అంటాడు కోపంగా. చివరికి పద్మ కుటుంబం ఆ పేట వదిలి వెళ్ళిపోతుంది.
విజయవాడలో వించిపేట ప్రాంతాన్ని ఈ చిత్రానికి నేపధ్యంగా చూపించారు. పోలీసులు వాళ్ళ కేసులు తేలకపోతే ఆ పేటకు వచ్చి దాసుని ఎవరో ఒకరు నేరం ఒప్పుకుంటే డబ్బులిస్తామని అడగటం చూస్తే మనసు చివుక్కుమంటుంది. అలా డబ్బుల కోసం చేయని నేరాలు ఒప్పుకుని ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారో! పోలీసు వ్యవస్థ ఎలా కుళ్ళిపోయిందో చెప్పటానికి ఇది చాలా చిన్న ఉదాహరణ. తర్వాత జరిగే దారుణమైన సంఘటనలకి ఇది ఫోర్ షాడోయింగ్ (ముందస్తు సూచన) మాత్రమే. రాజకీయ నాయకుల వారసులు ఇష్టారాజ్యంగా దుర్మార్గాలు చేయటం, లాయర్లు స్వార్థంతో కేసులని నిర్వీర్యం చేయటం కూడా మామూలు విషయం అయిపోయింది. అదే ఈ చిత్రంలో చూపించారు.
భద్రలో సమాజం మీద కోపం కనిపిస్తుంది. ఎవరో కనేసి చెత్తకుప్పలో పారేశారు. వారి మీద కసి. పోలీసులు చట్టాన్ని ఒక కీలుబొమ్మని చేసి ఆడిస్తారు. ఈ లోకం ఇంతే, మనం కూడా ఎలాగోలా బతకాలి కానీ న్యాయంగా ఉంటే కుదరదు అనే భావన భద్రలో ఉంటుంది. ‘నన్ను పట్టించుకోని సమాజాన్ని నేనెందుకు పట్టించుకోవాలి?’ అనుకుంటాడు. పద్మ తండ్రి ప్రశ్నిస్తుంటే “నాకు ఎవరూ లేరని మీరు గుర్తుచేయక్కరలేదు. రోజూ ఎవడో ఒకడు గుర్తు చేస్తూనే ఉంటాడు” అంటాడు. అందరి మీదా కోపమే. శివ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాడు. శివ కూడా అనాథే. కానీ అతనిలో కసి లేదు. మహాభారతంలో కుంతి కూడా కర్ణుడిని వదిలేసింది. కర్ణుడు దాని వల్ల సూతపుత్రుడని అవమానాలు పడ్డాడు. కసి పెంచుకున్నాడు. దుర్యోధనుడు చేరదీసేసరికి అంతులేని కృతజ్ఞత కలిగింది. అతని సంతోషం కోసం అతని శత్రువుల భార్య అయిన ద్రౌపదిని కర్ణుడు అనరాని మాటలన్నాడు. తనకి అన్యాయం జరిగిందని తానూ అధర్మంగా వర్తిస్తానంటే తానూ మరొకరికి అన్యాయం చేసినట్టే కదా? ఈ పరంపరకి అంతెక్కడ?
చిత్రంలో సంభాషణలు కృష్ణా జిల్లా మాండలికంలో ఉంటాయి. చాలా రోజుల తర్వాత చక్కని తెలుగు సంభాషణలు వినిపించాయి. ‘నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే’, ‘పిచ్చి గానీ పట్టిందా ఏంటి’, ‘ఇలాంటి యాపారాలు మాకు తెలీదులే’ లాంటి మాటలు కాస్త మొరటుగా ఉన్నా విని చాలా రోజులయింది అనిపిస్తుంది. ఈ వ్యాసంలో పైన ఉదహరించిన భద్ర మాటలు సూటిగా గుండెని తాకుతాయి. సినిమాల్లో ఇంటర్వల్ అదిరిపోయేలా ఉండటానికి రచయితలు ప్రయత్నిస్తారు. ఈ చిత్రంలో కూడా ఇంటర్వల్‌లో ఒక కొత్త కోణం బయటికొస్తుంది. భారీ గ్రాఫిక్స్‌తో ఇంటర్వల్ అదిరిపోనక్కరలేదని, కథనం బావుంటే భావోద్వేగాలు కలిగించి, మంచి సంగీతం జోడించి ప్రేక్షకులని అబ్బురపరచవచ్చని రచయిత, దరకుడు గోపాలకృష్ణ నిరూపించాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే సత్యదేవ్ ఎన్నో రసాలు కల పాత్రని అద్భుతంగా పోషించాడు. కోటి పాత్రలో మీసాల లక్ష్మణ్ తన స్థాయి ఏమిటో నిరూపించుకున్నాడు. ద్వితీయార్థం మధ్యలో వచ్చే ఒక సీన్లో కోటి భద్రని కుదిపేస్తూ “ఇలా ఎలా ఉండగలుగుతున్నావురా?” అని అడిగిన సందర్భం నాకైతే కన్నీళ్ళు తెప్పించింది. సీఐ సుబుద్ధిగా నటించిన నందగోపాల్ చాలాకాలం గుర్తుండిపోయేలా నటించాడు. రాజకీయ నాయకులకి, పోలీసులకి ఉన్న అపవిత్ర బంధానికి (unholy nexus) పరాకాష్ఠలా ఈ పాత్ర ఉంటుంది. దాసుగా నటించిన నటుడు కథకి కీలకమైన పాత్రలో చక్కగా నటించాడు. కృష్ణతేజ, అతిరా రాజ్ తమ పరిధిలో బాగానే నటించారు. కానిస్టేబుల్‌గా నటించిన అల్లూరి హనుమ, పద్మ తండ్రిగా నటించిన నటుడు కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. బాలనటుడు విగ్నేశ్ కూడా చక్కగా నటించాడు.
ఈ చిత్రం చూశాక వ్యవస్థలు ఇలా ఉంటే మరి సామాన్యులు ఏం చేయాలి అనే ప్రశ్న మనసులో మెదిలింది. అధర్మం బాగా పెరిగింది. అందుకని మనం ధర్మాన్ని విడవకూడదు. అలాగని ఎవర్నీ నమ్మకూడదు. ప్రలోభాలకి లోను కాకూడదు. విన్నదే కాదు, చూసినదంతా కూడా నిజమని అనుకోకూడదు. ఒకటికి రెండుసార్లు రూఢి చేసుకోవాలి. పరిస్థితి పోలీసుల దాకా వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అనువు కాని చోట తగ్గి ఉండాలి. కొన్నిసార్లు అభిమానం అడ్డు వస్తుంది కానీ తప్పదు. ఆవేశపడితే మనకే నష్టం.