Site icon Sanchika

ఉత్కంఠభరితం “కృతి”

[box type=’note’ fontsize=’16’] “ఒక లఘు చిత్రంగా చూస్తే కథకు న్యాయం జరిగింది. కాని ఈ సబ్జెక్ట్ కీ ఇంకా విస్తారంగా చెప్పే వీలు ఉన్నది” అంటూ ‘కృతి’ షార్ట్ ఫిల్మ్‌ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

ఒక పద్దెనిమిది నిముషాలపాటు సాగే ఈ లఘు చిత్రం మీలో చివరిదాకా ఉత్కంఠాన్ని నింపుతుంది. మీ మెదడు తో ఆటలాడుతుంది. మూల కథను పక్కన పెడితే వొక సస్పెన్స్ థ్రిల్లర్ తీయడానికి దర్శకుడు ఎన్నుకున్న కల్పనా పధ్ధతి ఆకట్టుకుంటుంది.

చిత్రం మొదలవడమే వొక సైకియాట్రిస్ట్ ఆఫీసులో మొదలవుతుంది. రాధికా ఆప్టే ఆ సైకియాట్రిస్టు. ఆమె ఎదుట పేషంటుగా కూర్చున్నది సపన్ (మనోజ్ బాజపాయి). వాళ్ళ సంభాషణను బట్టి అర్థమవుతుంది వాళ్ళ మధ్య ఈ సెషన్లు చాన్నాళ్ళనించీ జరుగుతుందని. సపన్ చెప్పడం మొదలుపెడతాడు. తన జీవితంలో వొక స్త్రీ నెల రోజుల క్రితం వచ్చిందనీ, రావడంతోటే ఎంతగా కలిసిపోయిందంటే తనతోనే వుంటోందనీ, అయితే అగొరాఫోబియా (వీళ్ళు బయటకు వెళ్ళడానికి, మనుషులతో కలవడానికి ఇష్టపడరు) తో బాధపడుతుందనీ చెబుతాడు. రాధిక ఆమె గురించి మరిన్ని వివరాలు అడుగుతుంటే కోపగించుకుంటాడు కూడా, నాకంటే నీకు ఆమె మీద ఆసక్తి వుందే అని. రాధిక మాటలవల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆమె అతని సైకియాట్రిస్ట్ మాత్రమే కాదు, చిన్నప్పట్నించీ ఎరిగివున్న స్నేహితురాలనీ, సపన్ కి ఇదివరలో రచన అనే భ్రమపూరిత స్త్రీ కల్పన (స్కిజోఫ్రీనియా?) తో సఫర్ అయ్యాడనీ, ఈ సారికూడా అలాంటిదే కావచ్చు అని కూడా భావిస్తున్నానంటుంది. సపన్ కి చాలా కోపం వచ్చేస్తుంది, తనని నమ్మనందుకు. ఇంటికెళ్ళి స్కైప్ లో ఆమెను చూపించు నమ్ముతానంటుంది. సపన్ ఇంటికి వెళ్ళేసరికి రచయిత్రి అయిన క్రితి (నేహా శర్మ) టైప్ రైటర్ (ఈ కంప్యూటర్ రోజుల్లో టైప్ రైటర్ ఎవరు వాడతారు?) ముందు వేసుకుని ఎదో ఆలోచిస్తూ వుంటుంది. ఆమెను చూపించినా రాధికా తనకు టైప్ రైటర్ మాత్రమే కనిపిస్తుంది అంటుంది. ఇక ఆ ఇల్లు కూడా చిత్ర విచిత్రంగా వుంటుంది. ఇంటినిండా స్త్రీల బొమ్మలు, మన్నెకిన్ లాంటివి. అలాగే చిత్రాలు (పేంటింగులు). ప్రతి దాంట్లోనూ స్త్రీ ముఖం కన్నీరు కారుస్తూనో, రక్త కన్నీరు కారుస్తూనో. ఏది నిజం ఏది కల్పన అనేది పెద్ద ప్రహేళికగా మారుతుంది. అసలు ఆమె నిజంగా వున్నదా, లేక అది కూడా సపన్ భమేనా? ఇవన్నీ సినెమాలో చూడండి.

ఈ చిత్రం దర్శకుడు శిరీష్ కుందర్. దర్శకత్వంతో పాటు నేపథ్య సంగీతం కూడా తనే. రెండూ బాగా చేశాడు. మానుష్ నందన్ కెమెరా, మనోజ్ బాజపాయి-రాధికా ఆప్టేల నటనా బాగున్నాయి. ఈ చిత్రం చూసిన తర్వాత చాన్నాళ్ళ పాటు గుర్తుండి పోతుంది. ఒక లఘు చిత్రంగా చూస్తే కథకు న్యాయం జరిగింది. కాని ఈ సబ్జెక్ట్ కీ ఇంకా విస్తారంగా చెప్పే వీలు ఉన్నది. అదే గనుక జరిగితే పూర్తి నిడివి చిత్రంలో చాలా విషయాలు మరింత లోతుగా చర్చకు పెట్టవచ్చు. ఇంతకంటే ఎక్కువ వ్రాయడం, spoiler కు తావు ఇస్తుంది. కాబట్టి ఇక్కడితో ముగిస్తాను.

Exit mobile version