కృషితోనే సాధించాలి

0
17

[dropcap]ప్ర[/dropcap]జాపతి రాజుగారి కుమారుడు ‘విహారి’ని విద్యలు నేర్చుకోవడానికి చంద్రహాసుని గురుకులంలో చేర్చారు.

చంద్రహాసుడు అనేక విద్యల్లో దిట్ట. ఆయన దగ్గర శిష్యరికం చేసిన విద్యార్థులు అనేక విద్యల్లో రాణిస్తారని ఆ గురుకులానికి మంచి పేరు ఉంది. అందుకే ప్రజాపతి విహారిని ఆ గురుకులంలో చేర్పించాడు. చంద్రహాసుడు శ్రద్ధగా విహారికి విద్యలు నేర్పించసాగాడు. ఎందుకంటే విహారి భవిష్యత్తులో రాజై సుపరిపాలన చెయ్యవలసిన వాడు కదా!

కొన్ని నెలల తరువాత ప్రజాపతి తన మంత్రితో కలసి చంద్రహాసుని గురుకులానికి వచ్చి విహారిని కొన్ని ప్రశ్నలు అడిగి అతను ఏం నేర్చుకున్నాడో పరీక్షించాడు. ఆ ప్రశ్నలకు విహారి సరియైన జవాబులు చెప్పలేక పోయాడు!

విహారి చదువు పట్ల రాజు ప్రజాపతి కొంత అసహనం ప్రదర్శించి “గురువర్యా విహారి చదువులో నేననుకుంత నేర్చుకోలేదేమిటి?” అడిగాడు.

చంద్రహాసుడు కళ్ళు మూసుకుని కొంత ఆలోచించి ప్రజాపతితో ఈ విధంగా చెప్పాడు.

“మహారాజా మీ ఆవేదన నాకు అర్థం అయింది. విహారి మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది.. ముందు నేనొక మొక్కను మీకు ఇస్తాను. దానిని మీ కోటలోని తోటలో పాతి ఎర్రని పూలు పూయించండి” చిరునవ్వుతో చెప్పాడు చంద్రహాసుడు.

చంద్రహాసుని వైపు చిత్రంగా చూసాడు ప్రజాపతి. ఆయనను గమనించిన మంత్రి, “మహారాజా గురువుగారు చెప్పినది చేద్దాం.. ఎందుకంటే అందులో ఏదో సూక్ష్మం ఉంటుంది” చెప్పాడు.

మంత్రి మాట మీద నమ్మకం ఉంచి ప్రజాపతి ఆ మొక్కను తీసుకుని చంద్రహాసుని వద్ద శెలవు తీసుకుని కోటకు వెళ్ళిపోయాడు.

కోటలో ఆ మొక్కను పాతి శ్రద్ధగా పెంచసాగాడు. కొద్ది రోజుల్లోనే అది మొగ్గలు తొడిగి పసుపు పచ్చని పూలను పూసింది! అవి ఎంతో అందంగా ఉన్నాయి. మరి చంద్రహాసుడు కోరినట్లు ఎర్రని పూలు పూయలేదు!

ఆ మొక్కను ఓ కుండీలో పెట్టుకుని చంద్రహాసుని గురుకులానికి మంత్రితో వెళ్ళాడు.

“మహారాజా ఎర్రని పూలను పూయలేదా?” అడిగాడు చంద్రహాసుడు.

“అది పసుపు పూలను పూచే చెట్టు మాత్రమే. ఎర్రని పూలను ఎలా పూస్తుంది?” చెప్పాడు రాజు.

“మహారాజా మనిషికి మనం ఎంత నేర్పినా, ఆ దేవుడు బుర్రలో నిక్షిప్తం చేసిన తెలివి మాత్రమే వికసిస్తుంది, చెట్టుకి మనం ఎన్ని ఎరువులు వేసినా అది కొంత బలిష్టంగా తయారయి, పూసే పూలను మరింత శోభాయమానంగా తనలో నిక్షిప్తమయిన రంగుల్నే అది తన పూలలో చూపుతుంది, అదే విధంగా మనిషి మెదడులో తెలివితేటలు పుట్టుకతోనే నిక్షిప్తమయి ఉంటాయి! వాటిని మనం నిరంతర విద్యాబోధన ద్వారా అభివృద్ధి చేసి ఒక శాస్త్రంలో లేక శాస్త్రాల్లో నిష్ణాతులను చెయ్యవచ్చు. ఇప్పుడు విహారిని గురించి ఆలోచించండి. అతనికి కొంత తెలివి ఉంది. అందుకే అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్య బోధిస్తున్నాను. కొంతమందికి కొద్ధి కాలంలోనే విద్య కానీ, కళ కానీ నేర్చుకునే తత్వం ఉంటుంది. కొద్ది మంది ఏదైనా నేర్చుకోవాలంటే కొంత ఎక్కువకాలం తీసుకుని, స్వయంకృషి వలన నిష్ణాతులు అవుతారు.” వివరించాడు చంద్రహాసుడు.

“అర్థమయింది గురువర్యా, ఏదైనా సాధించాలంటే నిరంతర కృషి చెయ్యాలి. మీ శిష్యరికంలో విహారి విద్యల్లో ఆరితేరుతాడని నాకు పూర్తి నమ్మకం కలిగింది, మీకు నమస్కృతులు” అని చెప్పి మంత్రితో కోటకు బయలుదేరాడు.

“చూసారా రాజా, గురువుగారు మనకు అర్థం అయ్యేట్టు చిన్న మొక్క సాయంతో వివరించారు. అందుకే సమర్థుడైన గురువు మీద మనం భరోసా ఉంచాలి” చెప్పాడు మంత్రి.

“లెస్సగా చెప్పారు మంత్రివర్యా” అని ఇద్దరూ కోటవైపు బయలుదేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here