Site icon Sanchika

కృతజ్ఞతాశ్రమం

[dropcap]ఆ[/dropcap]దివారం ఉదయాన్నే పేపర్ చదువుతున్నాడు రాంప్రసాద్. సెల్ఫోన్ శబ్దం చేస్తుంటే తీసి చూశాడు. కొత్త నెంబర్ నుండి వాట్సాప్ వీడియో కాల్ వస్తుంటే ఆన్ చేశాడు. ఎవరో అపరిచిత వ్యక్తి.. మొహానికి మాస్క్ వేసుకోవడం వల్ల అర్ధం కాలేదు. పేపర్ పక్కన పెట్టి..

“హలో! ఎవరండీ?” అన్నాడు.

“నమస్కారం.. రాజమండ్రి రాంప్రసాద్ గారేనా?”

“అవును.. మీరూ…!? “

అవతలి వ్యక్తి మొహానికి ఉన్న మాస్క్ తొలగించి, “మాదీ రాజమండ్రే… నా పేరు సత్య మూర్తి” అన్నాడు.

రాంప్రసాద్ అతన్ని పరిశీలనగా చూశాడు. ఏభై ఏళ్ళు పైబడిన వయసుని దాచేందుకు ప్రయత్నాలు చెయ్యనట్టున్నాడు.. ఫలితకేశాలు తలని, గడ్డాన్ని ఆక్రమించేశాయి. నుదిటిపై విభూది రేఖలు, నొసట కుంకుమ బొట్టు, మెడలో ఉత్తరీయం… ఏదో గుర్తొచ్చినట్లు

“మీ..రు…, ను..వ్వు… సత్యానివి కదూ… ఎన్నేళ్ళు అయింది నిన్ను చూసి.. చాలా మారిపోయావు” అన్నాడు ఉద్వేగంగా.

“అవును… సత్యాన్నే… వయసుతో బాటు శరీరంలో మార్పులు వచ్చాయే తప్ప, మనసు అప్పట్లాగే ఉంది. కానీ నీలో పెద్ద మార్పేమీ కనబడటంలేదు”

“ఆఁ.. ఏముంది నలుపుని తెలుపు చేస్తున్నానంతే.. .ఊఁ.. ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు?” అన్నాడు రాంప్రసాద్.

“హైదరాబాద్ లోనే ఉంటున్నాను. కొత్తగా చెయ్యడానికి ఏముంది?… నాకు తెల్సిన పౌరోహిత్యమే.. ఇద్దరు పిల్లలు.. పెళ్ళిళ్ళయ్యాయి.. అమ్మాయి అమెరికాలో, అబ్బాయి పూణేలో ఉంటున్నారు.”

చాలా సంవత్సరాల తర్వాత సత్యమూర్తితో మాట్లాడుతుంటే ఆనందంగా అన్పించింది రాంప్రసాద్‌కి.

 “ఊఁ.. నీ సంగతులు చెప్పు” అన్నాడు సత్యమూర్తి.

“రైల్వేలో సీనియర్ గ్రేడ్ ఆఫీసర్ ఉద్యోగం. మా ఆవిడ ఎల్‍ఐసిలో పనిచేస్తుంది. ఇద్దరు అబ్బాయిలు.. పెద్దవాడు నోయిడాలో… చిన్నవాడు ఈ మధ్యనే ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఈ మధ్యనే గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొన్నాం”

“ముఫ్ఫై ఏళ్ల క్రితం కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చిన నాకు వారం రోజుల పాటు ఆశ్రయం, ఆతిథ్యం నువ్విచ్చుండకపోతే.. నా జీవితం ఇవ్వాళ ఇలా ఉండేది కాదు”

“నాల్గు రోజులు గదిలో ఉంచుకున్నంత మాత్రాన్నే నీ జీవితం మారిపోతుందా?!. నీ కృషి, పట్టుదల, మంచితనం, అన్నింటినీ మించి వృత్తిపై నీకున్న గౌరవాలే నీ కష్టానికి తగిన ఫలితం ఇచ్చాయి.”

“ఇన్నేళ్ల తర్వాత నిన్ను మంచి హోదాలో చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవలే నేనూ కొంపల్లి సమీపంలో ఓ ఇల్లు కట్టుకున్నాను. వచ్చే ఆదివారం గృహప్రవేశం. మీ దంపతులిద్దరూ తప్పకుండా రావాలి. చాలా తక్కువ మందినే పిలుస్తున్నాను.” అన్నాడు సత్యమూర్తి.

“తప్పకుండా వస్తాం. అవునూ… ఇన్నేళ్ల తర్వాత నా అడ్రస్, ఫోన్ నంబరు ఎవరిచ్చారు?”

“ఆ మధ్య అమలాపురం భూషయ్య అగ్రహారానికి వెళ్ళాను. అక్కడ మనతో కలిసి చదువుకున్న శ్రీపతి శర్మ కలిశాడు. మాటలు మధ్య నీ సంభాషణ వచ్చింది. వాళ్ళబ్బాయీ రైల్వేలోనే ఉద్యోగం చేస్తున్నాడనీ, అదీ నీ ఆఫీసులోనే అని చెప్పి, నీ అడ్రస్సూ, ఫోన్ నంబరూ ఇచ్చాడు”

“అయినా నీకు నేను ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా? “

“అసలు మర్చిపోతే కదా! కొత్తగా గుర్తు చేసుకోవడానికి.. ఆ రోజు నీ దగ్గర్నుంచి వెళ్ళి, కాస్త కుదుట పడ్డాక, నీ గది దగ్గరకి వచ్చాను. కానీ అప్పటికే నువ్వు గది ఖాళీ చేశావనీ, నీకు చెన్నైలో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయావని చెప్పారు. ఆ తర్వాత పిల్లలు, చదువులు, బాధ్యతలు. ఆ సమయంలోనే సంవత్సరం తేడాలో మా అమ్మా, నాన్నా కాలం చేశారు. ఇక్కడ పన్ల వత్తిడి వల్ల రాజమండ్రితోనూ అనుబంధం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎపుడైనా దాయాదుల ఇళ్ళలో శుభాశుభాలకు వెళ్ళి రావడమే.” అన్నాడు సత్యమూర్తి.

రాంప్రసాద్ భార్య సరళని పిలిచి ఫోన్లోనే సత్యమూర్తికి పరిచయం చేశాడు.

“శుభం.. నీకు వాట్సాప్‌లో ఆహ్వానం పంపాను. కరోనా కాలం గదా! అని సాకు చెప్పకుండా మీ దంపతులిద్దరూ తప్పక రావాలి. కరోనా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం”

“అలాగే.. నవ్వింత అభిమానంతో పిలిచాకా రాకుండా ఉంటానా..! ఏదైనా సహాయం కావాలంటే ఫోన్ చెయ్యి.” అన్నాడు రాంప్రసాద్.

“తప్పకుండా… ఉంటాను.” అని ఫోన్ ఆఫ్ చేశాడు సత్యమూర్తి.

***

రాంప్రసాద్ తో మాట్లాడిన తర్వాత సత్యమూర్తి మనసు ముఫ్ఫై ఏళ్ల వెనక్కి వెళ్లింది.

***

పక్క ఊరికి బ్రాహ్మణార్ధానికి వెళ్ళి సాయంత్రం అలసిపోయి వచ్చిన సత్యమూర్తికి మంచినీళ్ళు, కాఫీతో బాటు ఓ పోస్టుకార్డు తెచ్చి ఇచ్చింది భార్య పార్వతి. కాఫీ తాగి, కార్డు చదివి..

“హైదరాబాద్ నుండి అవధాని గారు రాశారు. అక్కడ పురోహితపు పనులు ఎక్కువగా ఉన్నాయట. ఆయన దగ్గర పని చెయ్యడం ఇష్టం అయితే వచ్చెయ్యమని రాశారు. “

“అంటే…. ఒక్కరే వెళ్తారా? ” అంది పార్వతి.

“ముందు నేవెళ్లి అక్కడ పరిస్థితులేంటో చూసుకుని, మనకు అనుకూలంగా ఉంటే తర్వాత నిన్నూ, పాపని తీసుకెళ్తాను.”

“ఇక్కడ నెలకో, మూణ్ణెల్లకో అడపాదడపా వచ్చే పన్ల కంటే.. అక్కడ నిరంతరం ఏదో ఒక పనీ, శుక్రవారం పూజలూ ఉంటాయని మొన్న అవధాని గారు వచ్చినపుడు చెప్పారన్నారుగా… వెళ్ళండి.. ఇక్కడ అయిన వాళ్ళముందు దరిద్రం అనుభవించే కంటే… దూరంగా మనమెవరో తెలియని వాళ్ళ ముందు గంజినీళ్ళు తాగినా గౌరవంగా బ్రతకొచ్చు” అంది.

***

మరుసటి రోజు రాజమండ్రి నుండి సికింద్రాబాద్ బస్సులో వచ్చాడు సత్యమూర్తి. ఆరోజు జంటనగరాల్లో సాయంత్రం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అని చెప్పారు. ఏంచెయ్యాలో అర్థం గాక, సాయంత్రం వరకు బస్టాండు వద్దే గడిపి, అడ్రస్ ప్రకారం చిక్కడపల్లి అవధాని గారింటికి చేరుకున్నాడు. అవధాని గారు తల్లికి సుస్తీగా ఉందని క్రితం రోజే వైజాగ్ వెళ్ళారని, రావడానికి వారం రోజులు పడుతుందని చెప్పారు.. ఎక్కడికెళ్ళాలో అర్ధంగాక ఆలోచిస్తుంటే రాంప్రసాద్ గుర్తుకొచ్చాడు. వెంటనే జేబులోంచి పాకెట్ డైరీ తీసి, అందులో రాసుకున్న రాంప్రసాద్ అడ్రస్ చూసి, దాని ప్రకారం అమీర్‌పేట చేరుకునే సరికి రాత్రి పదయింది.

డిగ్రీ వరకూ రాజమండ్రి లోనే చదువుకుని, హైదరాబాదులో తెల్సిన వాళ్ళ కంపెనీలో అక్కౌంట్స్ చూస్తూ, మరోప్రక్క బ్యాంకు పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ, అమీర్ పేటలో అద్దెగదిలో ఉంటున్నాడు రాంప్రసాద్.

తనని వెతుక్కుంటూ వచ్చిన సత్యమూర్తిని చూసి “సత్యా!? ఏంటిలా?…. ఈ వేళ్టపుడు?” ఆశ్చర్యంగా అన్నాడు రాంప్రసాద్.

సత్యమూర్తి చెప్పిన విషయం విని, వెంటనే మెస్సుకి తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు. అవధాని గారు వచ్చే వరకూ తన గదిలోనే ఉంచుకున్నాడు.

వారం తర్వాత అవధాని గారు వచ్చిన విషయం తెలుసుకున్న సత్యమూర్తి వెళ్ళి ఆయన్ని కలిసి వచ్చాడు.

మరుసటి రోజు రాంప్రసాద్‌కి కృతజ్ఞతలు చెప్పి, అవధాని గారు ఏర్పాటు చేసిన గదికి చిక్కడపల్లి వెళ్ళిపోయాడు. ఆ వారంలోనే రాంప్రసాద్‌కి రైల్వేలో ఉద్యోగం రావడంతో గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరికీ కాంటాక్ట్స్ లేవు.

ఫోన్ మోగుతుంటే.. గతం నుండి బయటకు వచ్చి… “హలో!” అన్నాడు.

“హలో.. నేను రాంప్రసాద్ ని… ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూడటం నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది” అన్నాడు.

“నాక్కూడా.. “

“సత్యా.. ఆ తర్వాత ఎలా సాగింది నీ జీవితం? ఎలా సెటిలయ్యావు?” అడిగాడు రాంప్రసాద్.

“అవధాని గారి దగ్గర పురోహితపు పనులు చేసేవాడిని. ఆర్నెల్ల కాలంలో నాకూ పరిచయాలు ఏర్పడ్డాయి. చిక్కడపల్లికి కుటుంబాన్ని తీసుకొచ్చాను. ఓ సంవత్సరం తర్వాత అర్ధరాత్రి గుండె పోటుతో అవధాని గారు కాలం చేశారు. ఆయన కొడుకు అమెరికాలో డాక్టర్. అతనొచ్చి తండ్రి కర్మకాండలు చేసి, తల్లిని తనతో తీసుకెళుతూ,.. వాళ్ళింట్లోనే నన్నో పోర్షన్లో ఉండమనీ, ఇల్లు చూసుకుంటూ,… ఆయన పౌరోహిత్యం కూడా నన్నే చేసుకోమనీ అప్పజెప్పారు. ఆ ఆసరా మా జీవితాలకి భరోసా అయ్యింది. అమ్మాయి డిగ్రీ చదివింది…, అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు.

ఈ మధ్యనే అవధానిగారి మనుమడొచ్చి..

“మేమంతా అమెరికాలో స్థిరపడ్డాం. ఇక్కడ మాకంటూ ఉన్నది ఈ ఇల్లు మాత్రమే. దీనిని అమ్మెయ్యదల్చుకున్నాం. మీరే తీసుకుంటానంటే మార్కెట్ రేటు మీద కొంత తగ్గించి ఇవ్వండి. లేదంటే ఖాళీ చెయ్యండి.” అన్నాడు.

ప్రస్తుతం చిక్కడపల్లిలో ఇల్లు కొనేంత స్థోమత లేక, ఖాళీ చేసి.. అద్దె ఇంట్లో ఉంటున్నాం. అయితే పదేళ్ళ క్రితం కొంపల్లి సమీపంలో నాలుగు వందల గజాల స్థలం కొన్నాను. ఇన్నేళ్ళూ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళ ఖర్చులతో ఇల్లు కట్టుకునేంత వెసులుబాటు కలుగలేదు. ఇప్పుడు నా దగ్గరున్న దానికి నా కొడుకు కొంత సాయం చేయగా .. ఇల్లు కట్టుకున్నాం.” అన్నాడు సత్యమూర్తి.

“అసలీ అవధాని గారెవరు? ఆయనతో నీకు ఎలా పరిచయం?”…

“ఆ రోజుల్లో నేను హైదరాబాద్ రాకముందు అమలాపురంలో ఓ రాజకీయ నాయకుడు అవధాని గారి ఆధ్వర్యంలో చండీయాగం చేశాడు. యాగం జరిగినన్ని రోజులూ అమలాపురం సమీపంలో వేదం చదువుకున్న పురోహితులందరికీ సంభావన ఇచ్చేవారు. ఊరికే డబ్బు తీసుకోవడం ఇష్టం లేక అవధానిగారి అనుమతితో, ఆహుతుల ముందు నమకం, చమకం, మంత్ర పుష్పం చదివి సంభావన పుచ్చుకునే వాణ్ణి. నా వాక్సుద్ధి, ఉచ్చారణ, గొంతు గాంభీర్యత మెచ్చుకుని.. నా వివరాలడిగి … అడ్రస్ ఇచ్చి హైదరాబాద్ వచ్చి కలవనున్నారు అవధాని గారు. ఆ తర్వాత నీకు తెల్సిందే. ఆరోజు ఆయన లేకపోవడం, నువ్వు నీ గదిలో ఆశ్రయం ఇవ్వడం” అన్నాడు.

***

వారం తర్వాత ఉదయం…. రాంప్రసాద్ దంపతులు కొంపల్లికి సత్యమూర్తి ఇంటి గృహప్రవేశానికి వచ్చారు. లోపల పదిహేనుమంది దాకా ఉన్నారు. అందరూ మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఓ వ్యక్తి వచ్చి శానిటైజర్ ఇచ్చాడు. కాంపౌండ్ వాల్ ఆనుకుని పొడవాటి పెద్ద హాలు, దానికి కొంచెం దూరంలో మరోపక్క రెండు గదుల ఇల్లు కన్పించింది. గృహప్రవేశం అందులోనే జరిగినట్టుంది.. రాంప్రసాద్ దంపతులు లోపలికెళ్ళారు. సత్యమూర్తి దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. రాంప్రసాద్ దంపతుల్ని చూసి పలకరించి..

“పది నిమిషాల్లో వ్రతం పూర్తవుతుంది. కూర్చోండి” అన్నాడు సత్యమూర్తి.

పూజ అవగానే తీర్థ, ప్రసాదాలు తీసుకున్న తర్వాత..

“రా..! ప్రసాదూ.. ఇల్లు చూద్దువు” అని రెండు గదుల ఇల్లు చూపించి, బయటకు తీసుకొచ్చాడు. చుట్టూ పెద్దగా ఇళ్ళు లేకపోవడంతో ప్రశాంతంగా ఉంది.

“అవునూ…ఇంత పెద్ద షెడ్డు ఎందుకు? ” అడిగాడు రాంప్రసాద్.

“రా..! చూద్దువు గాని” అని లోపలికి తీసుకొని వెళ్ళాడు.

ఆ హాల్లో పది మంచాలు, ఆరుగురు వృధ్ధ పురుషులు, నలుగురు వృధ్ధ మహిళలు ఉన్నారు. అందరూ మాస్క్ ధరించారు. హాల్లో ఓ చివర శౌచాలయాలు, మరో చివర వంటశాల, చిన్న ఆఫీసు గది ఉన్నాయి.

“ఏమిటీ.. ఏదైనా ఆసుపత్రికి క్వారంటైన్ సెంటర్ కి అద్దెకి ఇచ్చావా?” అన్నాడు రాంప్రసాద్.

“అలాంటిదేమీ లేదు. చిన్న వృద్ధాశ్రమం నడపాలని కట్టించాం. కరోనా కాలం గదా… వీళ్ళందరికీ కోవిడ్ టెస్టులు చేయించాం. దేవుని దయ వలన అందరికీ నెగెటివ్ రిపోర్టులే వచ్చాయి. వీళ్ళ అనారోగ్య సమస్యలు చూడటానికి డాక్టర్ని ఏర్పాటు చేశాను.” అన్నాడు సత్యమూర్తి.

రాంప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తూ “చాలా ఖర్చవుతుందే” అన్నాడు.

“అన్నింటికీ సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నాం. జీవితంలో నేను ఎదగడానికి ఎంతోమంది చేయూత నిచ్చి సహాయం చేశారు. కృతజ్ఞతగా వాళ్ళందరికీ ఏదైనా చేద్దామంటే,… వాళ్ళంతా నాకంటే పైస్థాయిలో ఉన్న వాళ్ళే. వాళ్ళకి నేను చెయ్యదగ్గదల్లా నాకు తెల్సిన పౌరోహిత్యం, పూజలే. అందుకే నా కృతజ్ఞతను వాళ్ళందరికీ పేరు పేరునా తెల్పుకునేలా.. ఇన్నేళ్ళ నా జీవితంలో నాకు తారసపడ్డ ఈ పదిమంది నిరుపేద వృధ్ధులకి ఆశ్రయం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ‘కృతజ్ఞతాశ్రమం’ ఏర్పాటు చేశాం. ఇప్పుడు నాకు ఆర్థిక వెసులుబాటు, ఈ పదిమందినీ కడతేర్చే ఆరోగ్యమూ ఉన్నాయి. వీళ్ళని పోషించడానికి నేను ఏ దాతల్నుంచీ ఏమీ ఆశించడం లేదు. ఆఖరుకి నా పిల్లల నుంచి కూడా. ఇది నాకు, నా భార్య మానసిక తృప్తి కోసం మమ్మల్నాదరించిన ఎందరో మహానుభావులకు మేం తెల్పుకునే చిన్న కృతజ్ఞత. జీవితపు చరమాంకంలో ఉన్న ఈ పెద్ద చిన్న పిల్లలను కడతేర్చడం కోసమే దీనిని ఏర్పాటు చేశాం.” అని చెప్పి ముగించిన సత్యమూర్తిని చూస్తున్న రాంప్రసాద్‌కి ఆయన ఆకాశమంత ఎత్తులో నిలబడ్డ విష్ణుమూర్తిలా కన్పించాడు.

దేవుని గుళ్ళో చిన్న లైటో, ఫ్యానో ఇచ్చి దానిమీద పేరూ, ఊరూ రాయించుకునే వాళ్ళూ, అన్నదానం చేసి ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకునే వాళ్ళూ, ప్రకృతి విలయాలు సంభవించినపుడు ‘ప్రభుత్వానికి టాక్సులు కడుతున్నాం…. మేమెందుకు సాయం చెయ్యాల’ని బాహాటంగా తిరస్కరించే కోటీశ్వరులు, కరోనా కష్టకాలంలో వలస కార్మికులకి గోరంత సహాయం చేసి, కొండంత రాజకీయ ప్రయోజనాల ప్రచారం కోసం ప్రాకులాడే మనుషులున్న ఈ రోజుల్లో… తన ఎదుగుదలకు కారణమైన వ్యక్తులకి కృతజ్ఞతగా పదిమంది అనాథ వృధ్ధుల్ని స్వయం సంపాదనతో, స్వయంసేవతో కడతేర్చడానికి నడుం బిగించడమే కాకుండా.. దానికి ‘కృతజ్ఞతాశ్రమం’ అని పేరు పెట్టి, కృతజ్ఞతకే కొత్త నిర్వచనాన్ని మాటల్లో కాకుండా, చేతల్లో చేసి చూపాలనుకుంటున్న సత్యమూర్తి విజ్ఞతకి మనసులోనే సాష్టాంగ ప్రణామం చేశాడు రాంప్రసాద్.

Exit mobile version