(ఈ)క్షణముక్తేశ్వరుడు:
[dropcap]ఈ[/dropcap]క్షణము అంటే చూపు. చూపు తోనే మోక్ష మిచ్చే శివుడుగ, క్షణముక్తేశ్వరుడు నామధేయునిగ, దర్శనము మాత్రమునే మోక్ష మిచ్చి పాపనాశనం చేసే ఈ స్వయంభువ క్షణ ముక్తేశ్వర శివలింగం దేవాలయము కోనసీమలో ఉంది. ప్రసిద్ధ ఐనవిల్లి వినాయకుడి దేవాలయ సమీప గ్రామముగా ముక్తేశ్వరము గ్రామము పేరుతో గోదావరి ఒడ్డున ఉంది. పానవట్టము మీద పార్వతీదేవి కూడ ఉండడము విశేషముగా భావించడము జరుగుతోంది.
శ్రీ రాముడు కోనసీమ ప్రాంతములో అరణ్యవాసం చేశాడని కోనసీమ వాసులు కూడా భావిస్తున్నారు. ఈ అరణ్యవాస సంచార గోదావరి ప్రాంతము తమదేనని స్ధలపురాణాలు కలిగినవి గ్రామాలు వెలుగులోకి వచ్చాయి. చారిత్రక సత్యశోధన నిరూపణ విశ్వసనీయతకు ప్రయత్నం కన్న ప్రజలు విశ్వాసమును గౌరవించడం బ్రిటీష్ పాలకులు సహితము అంగీకరించారు,. అందుచేతనే హిందూ మతవిశ్వాసముగ అంగీకరించిన 1907 మద్రాసు గెజిట్ ప్రచురించిన పేజీ202, Vol..1లో ఈ ప్రాచుర్య దేవాలయము వెనుక ఆసక్తికర విషయంతోబాటు సీతారాములు ఈ దేవాలయమును సందర్శించడము పేర్కొనడం జరిగింది.
తన కొమ్మను నరికిన గొడ్డలి మొనకి కూడ సుగంధము కలిగించే సుగుణము గంధపు చెట్టుది. చెక్క రూపములో అరగదీయబడినా సుగంధముగా పూజా ద్రవ్యమై ధన్యత గాంచుతుంది. ఆస్తికులు భగవంతుని కృపకు పాత్రులు. కాని నాస్తికులు కూడ కృపకు సమపాత్రులు. రావణుడి వంటి విష్ణు ద్వేషిని సృష్టించిన భగవంతుడు రామావతారము మర్యాదా పురుషోత్తమునిగా నాస్తికులు, అన్యదేవతారాధనా మౌఢ్యముతో వినాశనకారులను కూడా పునీతులను చేసి క్షమిస్తున్నానన్న ఈ విషయాన్ని సందేశముగ అందించాడు. ఏమతము మూలవిరాట్ భగవత్స్వరూపమైనా చందనవృక్షస్వభావమే కలిగి ఉంది. భగవంతుడు ఒక్కడే!ముక్తేశ్వరుడి నిరూపణిది.
సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన శ్రీ రాముడు మానసములో శివుని ధ్యానము చేస్తాడు. ఆ శివుడు మానసములో శ్రీ రామా రాధన చేస్తాడు. ఆ శివునికి భక్తుడిగా రావణఖ్యాతి శ్రీ రామచంద్రప్రభువుకు శత్రువుగా కాదు. మోక్ష కారణమైన భక్తిగ శివకేశవాభేధమవాలి. పరనారీ వ్యామోహి రావణుడు హరనయనాగ్నికి ఆహుతి కావాలి. కాని శివునికి మహాభక్తునిగ అంగీకరించిన అనుగ్రహముగ రావణవధానంతరము రామలింగేశ్వర దేవాలయాలుగ రామప్రతిష్ఠలు దేశమంతటా కనిపిస్తున్నాయి.
శ్రీ రాముడు రావణవధానంతరము లంకనుంచి పుష్పక విమానంలో సీతాదేవి తోకలిసి కోనసీమ మీదుగా అయోధ్య చేరాడని విశ్వసించారు. ఆగినచోట సీతారాములు శివాలయాలు దర్శించుకున్నారు. లేనిచోట రావణఖ్యాతిగ వెలసిన కొన్ని రామలింగేశ్వర శివాలయములోని శివలింగాలను ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. రావణవధ బ్రహ్మ హత్యా సమానమని దోషనివారణకు చేసిన శివలింగ ప్రతిష్ఠలు అని అనేవారున్నారు.
భగవంతునికి బ్రహ్మహత్య భయమేమిటి? దుష్టుడైనా రావణుని అనన్య సామాన్య శివభక్తి మోక్షానికి మార్గముగ అనుగ్రహించాడని నా భావన. రాములవారికి ఇక్కడ వింత అనుభవమైంది. సీతారాములు ముక్తేశ్వరము గోదావరి పాయలో పుణ్యస్నానాలు అయోధ్యకు తిరిగి వెళుతూ ఆచరించారు. వారికి ఆ నదీతీరములో నిత్యగోదావరి స్నానమాచరించి శివధ్యానము చేస్తూ నిర్వేదముతో ఒడ్డునే జీవితాన్ని విరక్తి గా గడుపుతున్న ఒక స్త్రీ కనిపించింది. విశ్వామిత్ర యాగ సంరక్షణపుడు శాపవిమోచనము కలిగించిన అహల్యవంటి వృత్తాంతముగ ఆ స్త్రీ కలిగిఉండడం వేదనతో విని చలించిపోయాడు. ఆమెను పావనచరితను చేసాడు.
కోనసీమ రాముడు సంచరించిన అరణ్యభూమిగ మునినివాసముగ కూడ ఖ్యాతి. మున్యాశ్రమములు వెలిశాయి. ముని దంపతులు కుటుంబాలతో జీవించారని కథలు కనిపిస్తున్నాయి. మహర్షులు తపోనిధులు. వారు కూడ తపోమహిమ అనే మంచి గంధముతో పరిమళాన్ని కలిగిన గంధపు చెట్టు వంటి వారు. కాని అటువంటివారికి హాని లేదా మనసు గాయపడడం వంటివి కలిగించిన వ్యక్తులు గొడ్డలి వంటి వారు. కాదనలేము. కాని భార్య విషయంలో గౌతమ మునివలె అనుభవాన్ని చవిచూసిన ఒక కోనసీమ ముని కూడ భార్యను గెంటివేసి పట్టించుకోలేదు. ఆమెకూడ పతికి చేసిన ద్రోహం ఒప్పుకుని శిక్షగా భగవత్సాన్నిధ్యాన్ని మాత్రమే కోరుతూ రామునికి తనకథ చెప్పుకొచ్చింది.
మునులంటే రామునికి గౌరవము. వారికి అకారణ లేదా సకారణ కోపము కలిగించడం పాపహేతువుగ భావించి శిక్షగా మానుష రూపములో భగవంతుడు అవతార మూర్తియై అనుభవించాడు. కాని స్త్రీలకు పాతవ్రత్య పరీక్ష శావము నివారణకు లోకమాత సీతమ్మతోసహా భగవంతునికి మాత్రమే సాధ్యము. అగ్ని పునీత సీతను ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అడవికి పంపాడు. సీతమ్మ కూడ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తన తల్లి భూమాతవద్దకే వెళ్లింది. స్త్రీ పునీత!
శపించిన వారి వాక్కు లోకోపకారమైనపుడు మాత్రమే మునివాక్కు ఖ్యాతి గడించేలా మార్చగల శక్తి భగవంతునికి ఉంది. అహల్య వంటి శాపగ్రస్త అభాగ్యస్త్రీల రామరాజ్యం ముగింపు పలకలేకపోయినా సానుభూతి సమాజావశ్యకత ఉంది. శ్రీ రాముడు ముని భార్యను ఆశీర్వదించి తన మానసాభీష్ట దైవమైన శివుని ప్రార్థించాడు. శివుడు పార్వతీ సహితుడై ప్రత్యక్ష మయాడు. స్త్రీ కి మోక్ష మిచ్చాడు. దోషమున్నా లేకపోయినా ఆరోపణకు గురయిన వారికి ఈక్షణ మాత్రమే కోరుకున్న శుభములిస్తానని స్వయంభువుగా పానవట్టము మీద పార్వతీదేవితో సహా శివలింగముగ మారాడు. అహల్యశాపవిమోచనము కథ అందరికి తెలిసినదే. పతివ్రతగ గౌతమునిచే ఆమెను స్వికరింపచేసిన శ్రీరాముడు కోనసీమలో అటువంటి సంఘటనకు సర్వకాలామోదయోగ్య అర్చామూర్తి పరివర్తన పరిష్కారమయాడు.
ఈక్షణ మాత్రము అనగా చూడగానే ముక్తి కలిగించే శివాలయము కోనసీమలో గోదావరి ఒడ్డున ముక్తేశ్వరములో ఉంది. దర్శించదగిన ఈ ఆలయంలో కార్తీకమాసంలో పున్నమి నాడు జ్వాలాతోరణం ఉత్సవము జరుగుతుంది. మహాపతివ్రత పార్వతి పరమేశ్వరుడుతో కూడిన ఉత్సవ విగ్రహాలను మూడుసార్లు రెండు స్తంభాల మధ్య వ్రేలాడే గడ్డితోరణము గుండా ముందు వెనకలుగ పల్లకీలో ప్రదక్షిణలు చేయిస్తారు. అమృత మథన సమయంలో వెలువడిన విషాగ్ని గళములో నిలుపుదల చేసిన భర్తకు హానికరం కాకుండా కాపాడిన అగ్నికి సర్వమంగళ మాంగల్య చేసే ప్రదక్షిణది. మూఢనమ్మకంతో కాదు. ఆదర్శ దాంపత్య కోరిక గల దంపతులు అందరూ దర్శించాల్సిన ఆలయమిది.