Site icon Sanchika

‘కులం కథ’ పుస్తకం – ‘తోలు బొమ్మలు’ – కథా విశ్లేషణ

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న బి. మధుమిత ఈ పుస్తకంలోని ‘తోలు బొమ్మలు’ కథను విశ్లేషిస్తోంది.

***

నేను వ్రాసేది కథ ‘కులం కథ’ పుస్తకంలోని ‘తోలు బొమ్మలు’ అనే కథ గురించి. ఈ కథ మేరెడ్డి యాదగిరి రెడ్డి రచించారు.

తోలు బొమ్మలు కథలో కుల వృత్తుల గురించి రచయిత చెప్పారు. తాత మనవల మధ్య ప్రేమ, అనురాగం గురించి ఎంతో చక్కగా రచయిత వర్ణించారు. అప్పట్లో టివీ, ఫోన్స్ లేని కాలంలో తోలు బొమ్మలాట బాగోతులకు చాలా ఆదరణ ఉండేది. కాని కాలక్రమేణా వాటికి ఉన్న ఆదరణ తగ్గుతూ వచ్చింది. అప్పట్లో వానలు పడకపోయిన, పండుగలు వచ్చిన తోలు బొమ్మలాట బాగోతులు ఆడించేవారు. అవి ఆడిన మొదలు ముగిసే వరకు జోరున వాన కురిసేది. కాని టీవీ, ఫోన్స్ వచ్చిన తరువాత వాటిని చూసేవారు కరువైనారు. అందరు టీవీ, ఫోన్స్ ముందు అతుక్కుపోతున్నారు. వీటి వలన మనిషికి, మనిషికి  మధ్య బంధాలు తగ్గుతున్నాయి.

తోలు బొమ్మల ఆట మొదలవుతుంది అంటే చాలు పనులు అన్ని మాని వచ్చి పిల్ల పాపలతో కలిసి చూసేవారు. పక్క ఊరి నుండి కూడా వచ్చి చూసేవారు. ఎవరికి నచ్చినది వాళ్ళు ఆడినవాళ్ళకిచ్చేవారు. దాంతో వారు జీవనం కొనసాగించేవారు.

అలా అప్పట్లో జరిగేది. అందరు ఆనందంగా హాయిగా జీవించేవారు. కాని టీవీ, ఫోన్స్‌ల ప్రభావం వల్ల ఇవి కనుమరుగైనవి. అదే విధంగా రంగప్ప, రాములు జీవితంలో కూడా జరిగింది. రంగప్ప తోలు బొమ్మలాట ఆడించేవాడు. రాములు రంగప్ప మనమడు. చిన్నప్పటి నుంచి రంగప్ప దగ్గరే ఉండేవాడు. రంగప్ప రాములును చదివించేవాడు. రాములు తల్లిదండ్రులు చిన్నప్పుడే మరిణించారు. అప్పటి నుంచి అమ్మా నాన్న అన్నీ రంగప్పే. రంగప్ప కులవృత్తి  అయిన తోలు బొమ్మలాటకు ఆదరణ తగ్గడంతో వీధీ వీధీ తిరిగి తోచిన పని చేసి రాములుని ఎం.ఎ. చదివించాడు. కాని రంగప్పకు కొన్ని రోజుల నుండి ఆరోగ్యం పాడైపోయింది. దాంతో రాములు అన్ని ఆసుపత్రులకు తీసుకువెళ్ళిన లాభం లేకపోయింది. తాత చికిత్సకు 30 వేల రూపాయలు కావాల్సి వచ్చింది. రాములకు ఏమి చేయాలో తోచలేదు. అప్పుడు పాత పెట్టి తెరిచి అందులోని తోలు బొమ్మలను కత్తిరించి అందమైన చెప్పులు తయారు చేసాడు. అలా  30 జతల చెప్పులు తయారు చేసాడు. వాటిని అమ్మగా 25 వేల రూపాయలు వచ్చాయి. కాని 5 వేల రూపాయలు తక్కవ అయినాయి. అప్పుడు తాతకు ఎంతో ఇష్టమైన రాముడి బొమ్మను కత్తిరించి చెప్పులను తయారు చేసి అమ్మగా మిగతా 5 వేలు వచ్చాయి. అతను తయారు చేసి ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి రామలు తయారైనాడు. తాత దేవునికి  దండం పెట్టడానికి పెట్టి తెరవగా రాముడి బొమ్మ లేదు. అప్పుడు తాత రాములుని ‘ఎంత పని చేశావు’ అని అరిచి తాత కూలపడిపోయాడు. రాములు ‘తాతా’ అని అరిచి తాత మీద పడ్డాడు. రాములు పెట్టిలోని డబ్బులు అన్ని తాతపై పరిచినట్టుగా పడిపోయాయి.

ఇందులో మనం గమనించ వలసిన విషయం ఏమిటి అంటే రాములు ఎంత చదివినా అతని చదువును పక్కన పెట్టి తాత కోసం ఎటువంటి గర్వం లేకుండా చెప్పులు అమ్మి డబ్బు సమకూర్చాడు. తాత తన కులవృత్తిని చివరి వరకు కూడా విడిచి పెట్టలేదు. మన మందరం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే మనం ఎంత అభివృద్ధి చెందినా కులవృత్తులను మరుగున పడిపోకుండా చూసుకోవాలి. వాటి మీద ఆధారపడి జీవించే వారిని మనం ఆదుకోవాలి. వారికి నిరుత్సాహాన్ని మిగల్చకుండా చూసుకోవాలి. ఇది మనందరి బాధ్యత.

బి. మధుమిత,

సీనియర్ ఇంటర్, ఎంపిసి.

Exit mobile version