Site icon Sanchika

కుందేలు చొక్కా

[dropcap]అ[/dropcap]దొక చిన్న అడవి. చెట్లు కూడా కాస్త దగ్గర దగ్గరగా వున్నయి. ఆ అడవి ఏర్పడినప్పటి నుంచీ అందులో చిన్న చిన్న జంతువులనేకం వుండసాగినయి. వాటిలో ఒక కుందేలు కూడా తన కుటుంబంతో వుంటున్నది. అక్కడున్న చెట్ల మీద పక్షులు గూళ్లు కట్టుకుని కిలకిలారావాలు చేస్తున్నవి. పక్షులు రోజూ ఉదయాన్నే ఆహారం వెదుక్కోవటానికి వెళ్లేటప్పడు మరలా తిరిగి వచ్చేటప్పుడు కుందేలు కుటుంబం దగ్గర ఆగేవి. పక్షులూ, కుందేళ్లు బోలెడు కబుర్లు చెప్పకునేవి. ఆ రోజున విశేషాలు ఏమన్నా చూసి వస్తే పక్షులు తప్పకుండా వాటిని కుందేళ్లకు చెప్పేవి. కుందేళ్లు చాలా ఆసక్తిగా వినేవి.

చెట్లకు నిండుగా పూలు పూసేవి. పూలు ఆకర్షణీయంగా వుండటమే కాకుండా, వాటి కమ్మని సువాసన ఆడవంతా వ్యాపించేది. ఆ పూలలోని తేన తాగటానికి ఎక్కడక్కడి నుండో సీతాకోకచిలుకలు వచ్చి వాలేవి. అందులోనూ రంగు రంగుల సీతాకోక చిలుకలు. గుంపులు గుంపులుగా వచ్చేవి. పూల అందం ఎక్కవగా వున్నదా వాటిపై వాలిన సీతాకోకచిలుకల అందం ఎక్కువగా వున్నదా తేల్చి చెప్పటం కష్టంగా వుండేది. అవి అలా వచ్చివాలటం పక్షులకూ, కుందేళ్లకూ చాలా ఇష్టంగా వుండేది. అవి కూడా పూల మీద వాలి, కిందకు దిగి పక్షులతోనూ, కుందేళ్లతోనూ బోలెడు కబుర్లు చెప్పేవి. కుందేలు పిల్లల చెవుల మీదా, ఒంటి మీదా వాలి కిత కితలు పెట్టేవి. అవి పక పకా నవ్వేవి. ఇటుగా ఏ నక్కకాని, వేటకుక్కగాని అటుగా వస్తుంటే చూచి పక్షులు, చూసి పెద్దగా అరిచి చెట్లక్కాలి. కుందేళ్లు పొదల్లో దూరి కనపడకుండా దాక్కునేవి. సీతాకోకచిలకలు ఎగిరిపోయేవి.

కుందేళ్లు వున్న పొదలకు దగ్గర్లో ఒక ఖర్జూరపు చెట్టు వున్నది. అది చూడటానికి అచ్చు ఈత చెట్టు లాగానే వుంటుంది. అలాగే మట్టలు వేసి మట్టలకు అటూ ఇటూ ఆకులు పెరుగుతాయి. దాని మీదకు ఒక గిజిగాడు పిట్ట వచ్చి చేరింది. దాంతో పాటు దాని జంట పక్షి వచ్చింది. అక్కడున్న తాటి చెట్లనూ, ఈత చెట్లనూ పరీక్షించి చూసుకొని చివరకు ఈ ఖర్చూరపు చెట్టు మీదే మకాం పెట్టాయి. మగ గిజిగాడు ఖర్జూరపు ఆకుల్ని తన ముక్కుతో సన్నగా చీల్చిసాగింది. ఎంత సన్నగా అంటే మన తల వెంట్రుకలంత సన్నగా అన్న మాట. ఆడ పక్షి చీల్చిన ఆకుల్ని చీల్చిట్లు, పట్టాలాగా గుండ్రంగా అల్లసాగింది. చూస్తూ వుండగానే కోలగా, చక్కని గూడు తయారయింది. పక్షులు రావటానికీ, పోవటానికీ వీలుగా వాకిలి పెట్టుకున్నాయి. ఖర్చూరపు మట్టకు వేలాడుతూ ఆ గూడును ఎంత అందంగా అల్లాయి. కుందేళ్లలు, లకుముకి పిట్టలూ, మైనా పిట్టలూ సీతాకోక చిలుకలూ అన్నీ మెచ్చుకున్నాయి. గిజగాడు పిట్టలు గూటిలోపల మెత్తని పీచు పరిచి వొత్తుగా, తయారు చేశాయి. ఆ తర్వాత ఆడ పక్షి దాని మీద గుడ్లు పొదగుతుంది. గిజిగాడు పిట్టలు గూడుకట్టకునే పనిలో వుండి ఆహారం తెచ్చుకోవటానికి పోలేదు. అది చూచిన సీతాకోకచిలుకలు తాము తెచ్చుకున్న తేనెనూ, పుప్పొడినీ కొద్దిగా ఆ పక్షులకు తినమని ఇచ్చాయి. అలాగే కుందేళ్లు కూడా తాము నేలలో తవ్వి తెచ్చుకున్న చిన్న చిన్న దుంపల్నీ, లేత మొక్కల ఆకుల్నీ కూడా తినమని ఆ పక్షులకు పెట్టాయి. ‘ఇవిగో మేమూ తెచ్చాం గింజల్ని’ అంటూ లకుముకి పిట్టలూ, మైనా పక్షులు తాము తెచ్చిన గింజల్ని అక్కడ పోసాయి. అలా తెచ్చుకున్న ఆహారాన్ని అన్నీ పంచుకుని తిన్నాయి. ఈసారి మేమూ ఏమైనా గింజలు తెచ్చి మీకందరకూ పెడతాం అంటూ గిజిగాడు పక్షులు చెప్పాయి.

ఇలా అన్నీ కలసి మెలిసి వుంటన్నాయి. అలసట తెలియకుండా మైనా పిట్ట పాటలు పాడింది. సీతాకోకచిలకలు సంతోషంగా గిరికీలు కొడతూ ఎగురుతూ, గుండ్రంగా తిరగుతూ వున్నాయి. తమ రంగురంగుల చుక్కలున్న రెక్కల్ని విప్పి వాటిని ఆడిస్తూ అలిసిపోయి ఆ తర్వాత వచ్చి చెట్టు మీదవాలాయి. కుందేలు పిల్ల కూడా సంబంరంతో పిల్లిగెంతులు వేసింది. ఇలా రోజులు సంతోషంగా గడుపుతున్నాయి.

ఒక రోజు మొక్కల సేకరణకని కొంతమంది వచ్చారు. వాళ్లలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా వున్నారు. ఆ పిల్లలు సిమెంటు రంగు గళ్ల చొక్కాలు ముదురు నీలం రంగు నిక్కర్లు వేసుకుని వున్నారు. కాళ్లకు బూట్లు, సాక్కూ వేసుకుని మెళ్లో చిన్న టై కూడా కట్టుకుని వున్నారు. వాళ్లంతా కొన్ని మొక్కల్నీ, ఆకుల్నీ, తీసుకుని వెళ్లారు. ఆ చిన్న అడివి దాటగానే ఒక చిన్న కొండ వున్నది. దాని మీద ఒక నక్షత్రశాల కట్టారు. ఆ నక్షత్రశాలను చూడటానికి తరుచూ జనాలు వెడుతూవుంటారు. ఆ నక్షత్రశాలకు వెళ్లటానికి రోడ్డు మార్గం కూడా వున్నది. కాని మొక్కల కోసం వచ్చి ఈ దారి గుండా వాళ్లు వెళ్లారు. ఇక్కడ క్రూరమృగాలేవీ లేవు. భయపడాల్సింది ఏమీ లేదని ఉల్లాసంగా వాళ్లందారూ నడుచుకుంటూ వెళ్లారు.

ఆ చిన్న పిల్లలు వేసుకున్న గళ్ల గళ్ల సిమెంటు రంగు చొక్కా, ముదురు నీలంరంగు నిక్కరూ, ఆ బూట్లూ, సాక్సు, అన్నీ ఎంత బాగున్నాయని కుందేలు పిల్ల తెగ సంబరపడింది. నాకూ అలాంటివి కావాలని తెగ మారం చేయసాగింది.

“వాళ్లు మనుషులు, వాళ్ల రకరకాల దుస్తులు వేసుకుంటారు. మనం కుందేళ్లం. మన వంటి మీదున్న ఈ చర్మం, చర్మానికున్న దూది లాంటి వెంట్రుకలూ ఇవే మనకు దుస్తులు లాంటివి. వేరే దుస్తులు మనం వేసుకోం. ఆ అవసరమూ లేదు” అని పెద్ద కుందేళ్లు ఎంత నచ్చ చెప్పినా చిన్న కుందేలు వినలేదు. తను పట్టిన మంకు పట్టూ వదలలేదు. రోజూలాగా సంతోషంగా గంతులు వేయకుండా మూతి ముడుచుకుని కూర్చుండిపోయింది. అలా వున్న చిన్న కుందేలుని చూసి ఏమైందని గిజిగాడు పిట్టలూ, మైనా పక్షీ,  సీతాకోకచిలుకలూ అన్నీ అడిగాయి. పిల్ల కుందేలు మూతి తిప్పుకుంటూ పెద్ద కుందేలు వంక కోపంగా చూడసాగింది. “తను ఏం చెప్పటం లేదు. నువ్వైనా చెప్పు” అని పెద్ద కుందేలును అడిగాయి. పెద్ద కుందేలు విషయం మంతా చెప్పింది. “ఆ పిల్ల వాడు వేసుకున్న లాంటి బట్టలు మాకెక్కడ దొరుకుతాయి. ఈ మధ్య ఈ పిల్ల కుందేలుకు మరీ, అలకలూ, గారాం బాగా ఎక్కువైపోయాయి” అన్నది విసుగ్గా.

“ఆలోచిద్దాంలే. ఆలోచించి కష్టపడితే సాధ్యం కానిది ఏదీ వుండదు” అన్నాయి పక్షులు.

“అవునవును. ఆలోచిద్దాం” అన్నాయి సీతాకోకచిలుకలు కూడా. అనుకున్న ప్రకారం రెండు రోజులు ఆలోచించాయి. మూడవరోజు మగ గిజిగాడు పిట్ట ‘నేను పత్తి చేను చాశాను. పత్తి బాగా విచ్చకున్నవి దూది బాగా కనపడుతుంది. నేను దానిని తెస్తాన’ని చెప్పింది. అలాగే కొంచం కొంచం ముక్కున గరుచుకుని తెచ్చింది. ఆడ గిజిగాడు పిట్ట ఆ పత్తినంతా దారంగా పేనింది. ఆ తర్వాత ఆ దారాన్ని వస్త్రంగా అల్లింది. మైనా పిట్ట వెళ్లి వడ్రంగి పిట్టను తీసుకొచ్చింది. ఆ రెండూ కలిసి తమ ముక్కుతో పొడుస్తూ ఆ వస్త్రాన్ని చొక్కాలాగా, నిక్కరులాగా తయారు చేసి ఇచ్చాయి. పెద్ద కుందేలు పొదల్లో రాలి పడిన తమ వెంట్రుకల్ని కూడా తెచ్చి ఇచ్చింది. దాంతో చక్కని నాలుగు బుల్లి బుల్లి సాక్సు అల్లాయి. సీతాకోకచిలుకలు వచ్చి చూశాయి. పుప్పొడి తెచ్చి ఆ పుప్పోడిని చొక్కా మీద చారల్లాగా నిలువుగా, అడ్డంగా వూసాయి. నిజంగా గళ్ల చొక్కాలాగానే తయారయింది. తయారయిన చొక్కాను, నిక్కర్నీ చూసి అన్నీ మెచ్చకున్నాయి. చిన్న కుందేలు సంతోషానికయితే అంతే లేదు. ఆ తర్వాత అన్నీ కలిసి చిన్న కుందేలు ముఖం నుండి నడుము భాగం వరకు చొక్కాను, మిగాతా భాగానికి నిక్కరునూ తగలించాయి. నాలుగు కాళ్లకు సాక్సులు తొడిగినాయి. చూడటానికి కుందేలు వింతగా వుందనిపించింది వీటన్నింటికీ. అయినా బాగున్నదని అన్నీ చెప్పట్లు కొట్టాయి. ఆనందం పట్టలేని చిన్న కుందేలు ఎలాగైనా తనను తాను చూసుకోవాలని ఎంతో ఉబలాట పడ్డది. ఆ దగ్గర్లోనే చిన్న నీళ్ల కుంట వున్నది. పరుగు పరుగున ఆ నీటి కుంట దగ్గరకు వెళ్లింది. ఆ కుంట ఒడ్డున నుంచుని నీళ్లల్లో తన నీడను మళ్లీ మళ్లీ చూసుకోసాగింది. ఎంతో మురిసిపోయింది. తాను కూడా ఆ అబ్బాయిలాగానే వున్నాననుకున్నది.

Exit mobile version