[dropcap]1[/dropcap]957వ సంవత్సరం – అది నాంపల్లి. రైల్వేస్టేషన్ పట్టాల మీద రైలు ఆగింది. దూరం నుండి ఓ అబ్బాయి లగేజీతో పరిగెత్తి వస్తున్నాడు. ఇంతలో రైలు నెమ్మదిగా కదులుతుంది. అతి కష్టం మీద ఆ కదిలే రైలును అందుకున్నాడు. రిక్షా అతను రాలేక పోయాడు. అతనికి ఇవ్వ వలసిన కిరాయి అర్ధ బేడ అనగా దస్సాన (ఆరు పైసలు) ఇవ్వలేక పోయాడు. తన వల్ల రిక్షావాడికి అన్యాయం జరిగిందని బాధ పడ్డాడు. ఈ సంఘటన జరిగి 60 ఏళ్లు గడిచినా, ఆ వ్యక్తికి 80 ఏళ్లు దాటినా ఆ విషయం అతని మనసును తొలుస్తునే వుంది. ఇప్పుడు ఆ రిక్షా కార్మికుడు ఉన్నాడో లేదో కూడాతెలియదు. కానీ ఏదోరకంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటే తన హృదయ భారం కొంతైనా తగ్గుతుందని భావించాడు. ఆనాటి బాలుడు ఈనాటి ప్రఖ్యాత రచయిత. తాను రచించిన దొందూ.. దొందే!! అనే పుస్తకాన్ని రిక్షా కార్మికుడికి అంకితమిచ్చారు. ఇది ఆ మహోన్నత వ్యక్తిత్వానికి ఓ మచ్చుతునక. వారే ఆచార్య విఠలాచార్య గారు.
నల్లగొండ జిల్లా (నేడు యాదాద్రి) యందలి రామన్న పేట మండలం వెల్లంకి గ్రామంలో కూరెళ్ళ లక్ష్మమ్మ, వెంకట రాజయ్య పుణ్య దంపతులకు 9-7-1938 నాడు జన్మించారు. కూరెళ్ళ వారు ఐదు నెలల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. (నాటికి లక్ష్మమ్మ గారికి 15 సంవత్సరాల వయసు) తల్లి తండ్రి తానై తనయుడిని ఉన్నతంగా తీర్చిదిద్దారు.
ఉపాధ్యాయవృత్తి చేపట్టిన నాటి నుండే బాలల వికాసం కోసం పాఠశాల స్థాయిలోనే అనేక సాహిత్య, సాంస్కృతిక సంస్థలు స్థాపించారు. విద్య, సామాజిక రంగాల్లోనూ విశేష కృషి చేశారు. అనేక సాహిత్య పత్రికలు నడిపారు.
చిన్నప్పుడు చదవడానికి పుస్తకాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. తన లాగ మర్వెరు కష్టపడ కూడదని ఉరూరా గ్రంథాలయోద్యమం నిర్వహించారు.
దాతల నుంచి పుస్తకాలు సేకరించి పల్లెల్లో గ్రంథాలయాల్నినెలకొల్పారు. విశాలమైన తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి నల్లగొండ జిల్లానాటి కలెక్టర్ చిరంజీవులు గారి చేత ప్రారంభం చేసి జాతికి అంకితం చేశారు. తన పెన్షన్ డబ్బులతో లైబ్రరీయన్‌ను పెట్టి నిర్వహిస్తున్నారు. వెల్లంకి అనే మారుమూల గ్రామంలో (100000) లక్ష పుస్తకాలతో కొలువు తీరిన ఈ గ్రంథాలయం తెలంగాణలోనే పెద్ద గ్రంథాలయం (ఇప్పుడు అక్కడ నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు).
పల్లె ప్రగతే – దేశ పురోగతి అన్న వాక్కులను త్రికరణ శుద్ధిగా నమ్మిన మన కాలపు మహాత్ముడు.
ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ చదువులో ప్రథమ స్థానమే. ప్రభుత్వం నుండి మెరిట్ మరియు పేద విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ వచ్చాయి. మెరిట్ స్కాలర్షిప్ తీసుకొని పేద విద్యార్థుల కిచ్ఛే ఉపకార వేతనం మరో పేద విద్యార్థికి ఇవ్వమని ప్రధానాచార్యులుకు లిఖిత పూర్వకంగా రాసిఇచ్చారు ఏడవ తరగతిలోనే-హృదయం పవిత్రమైతే తోవ విశాలంగా కనిపిస్తుందంటారు పెద్దలు.
HSC అయి పోగానే వారి కుటుంబానికి సన్నిహితులైన దాసోజు విశ్వనాథాచారి వద్ధ 20 రూపాయలకు కాపీ రైటర్‌గా ఉద్యోగ బాధ్యతల్లో తొలిసారిగా అడుగు పెట్టారు. చాలా రకాల ఉద్యోగ బాధ్యతలే నిర్వహించారు. అవినీతితో రాజీపడలేక వరుస రాజీనామాలు చేశారు. ఆ తర్వాత 1993లో రెండో అల్లుడు మరణించి నప్పుడు 5 సంవత్సరాల సర్వీస్ ఉండగానే పరిస్థితులతో రాజీపడి మరోసారి (చివరిసారిగా) రాజీనామా చేశారు (ఆ ఉద్యోగం వారి ద్వితీయ పుత్రికకు ఇప్పించారు). బ్రతుకంతా త్యాగాల బాటలోనే నడుస్తుంది.
కూరెళ్ళ వారి వ్యక్తిత్వానికి దర్పణం -వారి కవిత్వం. ఏది చెప్పితే అది చేయాలి. సాధ్యం కాదనుకుంటే చెప్పడం మానేయాలి. ఇది వారి నిబద్ధతకు నిదర్శనం.
పల్లె మట్టి పరిమళాన్ని ప్రపంచానికి పంచుతున్న సాహితీ వనమాలి. వారి రచనల్లో విఠలేశ్వర శతకం మకుటాయ మానమైనది.
అందలి ప్రతి పద్యము ఓ ఆణిముత్యం. ఏ పద్యం చదివినా యెద కదిలిపోతుంది. అది నిత్యపారాయణ గ్రంథం అంటారు వచన కవి కనపర్తి రామచంద్రాచార్యులు.
నాకు శ్రమించెడి వాడే ఇష్టుడున్
నాకు నరుణ్డి దైవమని
నమ్మెడి వాడె మహాను భావుడున్
నాకు మనస్వియే ప్రభువు
నాకు దయాళుడె విష్ణురూపుడున్
నాకనురాగమే మతము
నన్నిలా బ్రోవుము విఠలేశ్వరా!
వీరి పద్యాలు అందరికి అర్థమయ్యే రీతిలో సులభ శైలిలో ఉంటాయి. ఆచార్యుల వారికి కవిత్వమే జీవితం. వారి సాహితీ సరస్వతి 70 వసంతాలు పూర్తి చేసుకున్నది.
వారి జీవితానికి దర్పణం- కూరెళ్ళవారి కవిత్వం. దయగలవాడే దైవం అంటారు. అలాగే భేదాలు సృష్టిస్తే వేదాలనైనా తిరస్కరిద్దామన్న సాంప్రదాయ విప్లవ కవి ఆచార్య కూరెళ్ళ వారు. కష్టే ఫలి అన్న వాక్కును త్రికరణ శుద్ధిగా నమ్ముతారు.
కవి గారి స్వగ్రామంలో 6 ఎకరాల పంట భూమిని పేదల ఇండ్ల కోసం ప్రభుత్వానికి (నామ మాత్రపు ధరకే) ఇచ్చిన వదాన్యులు. అందుకు కృతజ్ఞతగా లక్ష్మీ నగర్ అని కవిగారి మాతృ మూర్తి పేరు పెట్టారు ఆ కాలనీకి వెల్లంకి గ్రామ ప్రజలు.
పల్లెలో పుట్టి పెరిగి పట్టణానికి పోయిన వారే దాదాపు అందరు.–కాని విఠలాచార్య గారి జీవితాన్ని పల్లె నుంచి వేరు చేసి చూడలేము.
“నేనంటే నా పల్లె “అంటారు. వారు రచించిన నానీ నేత్రాలలో- “నా దేహం/ నేను పుట్టిన/ పల్లె మట్టి లోనే /కలిసి పోవాలి” – అన్న పల్లె ప్రేమికుడు కూరెళ్ళ వారు.
పల్లియలోనె పుట్టితిని
పల్లియయే ననుపెంచె, పల్లియే
ఇల్లును వాకిలిన్ కలిమి
నిచ్చె బ్రతుక్కు మెరుంగు పెట్టె, ఆ
పల్లియె, ‘అమ్మ..’ ‘ఆవ’నుచు
పాలకులు పల్కగ నేరిపించె నా
పల్లియె నాకు దైవతము
ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వరా!
ప్రపంచంలో అన్ని ఆస్తుల కన్న విలువ అయ్యింది వ్యక్తిత్వం. ఏ చిన్న పొరపాటు చేసినా అది వ్యక్తిత్వానికే ఓ మచ్చ. ప్రతిభ కన్నా వ్యక్తిత్వం పైనే అమిత విశ్వాసం కూరెళ్ళ వారికి. మనిషికి కొలమానం వ్యక్తిత్వమే అని ప్రగాఢంగా నమ్ముతారు.
1963-64 వ సంవత్సరం గోకారంలో హెడ్మాస్టర్‌గా ఉన్నప్పుడు జీతాలలో 500 రూపాయలు ఎక్కువ వేస్తే వెంటనే వెళ్లి అప్పగించారు. వారు చాలా ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేశారు.
మరో మూడు నెలల తర్వాత అదే విధంగా ₹500 ట్రెజరీ వాళ్లకు తక్కువ వస్తే హెడ్ మాస్టర్ లందరిని బస్టాండ్ నుండి వెనక్కి పిలిపించి బ్యాగులు చెక్ చేశారట. కూరెళ్ళ మాస్టర్ బ్యాగ్ తీయపోతే “వారి బ్యాగ్ మాత్రం మీరు చూడొద్దు నాకు ఆ డబ్బు దొరక్క పోయిన పర్వాలేదు” అన్నారట ఆ అధికారి.
ఎందుకంటే గతంలో 500 వస్తే తిరిగి ఇచ్చిన అనుభవం ఉంది కనుక. కానీ “అందరితో నేను సమానమే ఇది నా బాధ్యత” అంటూ తీసి చూపించారట మాస్టారు. ఇది వారి వ్యక్తిత్వానికి ఉన్న గౌరవం. (ఆ డబ్బులు మరో చోట దొరికాయి అది వేరే విషయం.)
సత్ప్రవర్తన కంటే మేలైన సంపద ఏమున్నది. మనిషి వ్యక్తిత్వం తెలియాలంటే ఏకాంతం లోనే తెలుస్తుంది. ఏకాంత జీవితమే మనిషి వ్యక్తిత్వానికి కొలమానం అంటారు ఆచార్యులవారు.
కూరెళ్ళ వారు పాఠం చెప్పుతుంటే మంత్ర ముగ్ధులయ్యే వారు విద్యార్థులు.
ఆచార్యుల వద్ద నేర్చుకున్న పాఠాలే నాకు వెలుగు బాటలు అంటారు తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి గారు.
వీరి శిల్పాచార్యులు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. నానీ నేత్రాలు —వీరి అన్ని రచనల్లోను మాతృప్రేమ, గురుభక్తి, దేశభక్తి,దైవ ప్రీతి, సంఘ నీతి, స్నేహభావం, సామాజిక అవగాహన, అవినీతిపై ప్రతిఘటన అన్నింటికిమించి స్పష్టంగా కనిపించేది వీరి మహాన్నత వ్యక్తిత్వం.
“మేరువు వలె నిలిచి నావు మేధావులలో” అంటూ తెలుగు దివ్య గా కొనియాడారు ప్రముఖ కవి డాక్టర్ ఉత్పల సత్యనారాయణాచార్య విఠలాచార్యగారిని.
అభినవ పోతన, మధురకవి, సాహిత్య బ్రహ్మ, తెలంగాణ వేమన, నల్లగొండ కాళోజీ, అక్షర కళా సామ్రాట్, కవితా శ్రీ, కవి భూషణ, సాహిత్య ప్రపూర్ణ, మధుర కవితా కళానిధి లాంటి బిరుదులతో కీర్తించింది సాహితీ జగత్తు ఆచార్యులవారిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019లో దాశరధి పురస్కారంతో సత్కరించింది.
వ్యవసాయం అంటే ప్రాణం. పేద రైతులకు ఉచితంగా వ్యవసాయ పరికరాలు అందజేస్తారు.
విశాలమైన తన ఇంటిని (పాత గ్రంథాలయం) నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం పడగొట్టినప్పుడు పెద్ద పెద్ద దూలాలు తలుపులు, కిటికీలు, ట్రాక్టర్ల కొద్దీ ఊరి ప్రజలకు ఇచ్చారు.
ఆత్మీయులు ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే ఎంత దూరమైనా వెళ్లి ఫలాలు ఇచ్చి పలకరించడమే కాదు కొంత ఆర్థిక సహాయం తప్పక చేస్తారు, ఇది మన సంప్రదాయం అంటారు.
సాయం చేసే చేతులు -శ్రద్ధ, వినయంతోకూడిన వ్యక్తిత్వం- సత్యాన్ని వల్లించే మాటలే – సదా భగవంతునికి ప్రీతిపాత్రం.
భాగ్యనగరంలో ఓ ప్రముఖ కవి పుత్రిక వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు కూరెళ్ళ గారు, కసిరెడ్డిగారు, ఎందరో ప్రముఖులు వచ్చారు. జాతీయ సాహిత్య పరిషత్ జాతీయ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి గారి దగ్గరకు వారి శిష్యులు, సాహిత్యాభిమానులు వచ్చి మాట్లాడు తున్నారు. “నేను మీకు గురువునే కాని నాకు స్ఫూర్తి కూరెళ్ళ వారు” అని ఆచార్యుల వారిని చూపించారు కసిరెడ్డి గారు. వారంతా ఎంతో అభిమానంతో గురువు గారి దగ్గరకు వచ్చిప్రేమ పూర్వక అభినందనలు తెలిపారు.
అనేక అంశాలు చర్చించుకున్నారు. ఆరోజు అదో సాహితీ గోష్టి లాగా సాగింది ఆ వివాహ వేడుక.
నిజమే! కాలం నీడలో కొందరిని మర్చిపోతాం కొందరి జాడలో కాలాన్నే మరిచిపోతాం కదా. ఆ రెండో కోవకు చెందిన వారే ఈ ఇద్దరు ఆచార్యులు.
కూరెళ్ళ వారి సతీమణి యమునమ్మ. ఆ ఇల్లాలు 16 సంవత్సరాల సుదీర్ఘకాలం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమెను పసి బిడ్డల కంటికి రెప్పలా కాపాడుకున్నారు విఠలాచార్య గారు. అమ్మగారి ఆలనా పాలనా చూడడానికి ఇంట్లో ఆయాను నియమించారు. ఆమెకు అన్ని సదుపాయాలు కల్పించి కన్న కూతురులాగా చూసుకున్నారు (ఆచార్యుల వారికి 20 శాతం దృష్టి మాత్రమే వుంది).
బీరువా తాళం చెవి పెట్టడం గమనించి అందులో ఉన్న ఆభరణాలు, కొంత డబ్బు తీసుకుని తన స్వగ్రామానికి వెళ్ళింది ఆ అమ్మాయి.
వారం రోజుల్లో వస్తానని వెళ్లి 10 రోజులైనా రాకపోవడంతో- ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో అనుమానం వచ్చింది. బీరువా తాళాలు నేను మర్చిపోవడం కాదు ఎవరో తీశారని గమనించి తాళం పగులగొట్టి చూసే సరికి అందులో ఆభరణాలు, డబ్బులు లేవు.
అందరూ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నారు. ఆమె హైదరాబాద్ నుండి ఒక సంస్థ తరఫున వచ్చింది. వారికైనా తెలియజేస్తే పట్టుకుంటారని మరికొందరు చెప్పారు. కానీ ఆచార్యులవారు పిల్లలు కలది- వద్దు అని వారించారు. మరో ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నందలి ఓ మారు మూల పల్లెకు చిరునామా వెతుక్కుంటూ స్వయంగా ఆచార్యులవారే వెళ్లారు. వారిని చూసి కంగారు పడింది.
“నిన్ను ఏమి అనను తల్లీ! నువ్వు తీసిన నగలు మాత్రం ఇవ్వు” అని ప్రేమగా అడిగారు. ఎంతసేపు నేను తీయలేదు అని చెప్పింది.
“అవి కేవలం బంగారు వస్తువులు కాదు. నా పిల్లలకు వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు. నా భార్య నగలు వేసుకుని మహాలక్ష్మిలా నిండుగా నట్టింట నడయాడిన క్షణాలు నా స్మృతిపథంలో ఇంకా పదిలంగానే ఉన్నాయి. వాటిని బంగారంగా చూడడం లేదు అవి మాకు తీయని జ్ఞాపకాలు” అని నచ్చ జెప్పడంతో ఏ పూర్వ జన్మ సంసార పుణ్యమో మనసు కరిగి ఎట్టకేలకు మార్వాడి వద్దకు తీసుకొని పోయింది. అప్పటికే వాటిని కరిగించి ముద్ద చేశారు
ఆ క్షణంలో ఆచార్యులవారి గుండె పిండేసి నట్లయింది. నా బిడ్డలకు (నర్మద, తపతి, సరస్వతి) ఎట్లా ఇవ్వగలను వాళ్ళు అమ్మ మధుర జ్ఞాపకాలను అనుకుని– ఇలాంటి వేదనలు ఈ మనసుకు కొత్తేం కాదు కదా అని క్షణంలో తేరుకొని (ఆరు తులాలు నాలుగుగా మారింది) ఆ బంగారు తీసుకున్నారు. ఆ అమ్మాయికి ‘ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు. నీకు జీవితంలో ఏ అవసరం వచ్చినా తండ్రిలా నేను నీకు సాయం చేస్తాన’ని చెప్పారు ప్రేమగా. ఆమె బిడ్డలకు 500 రూపాయలు ఇచ్చి ఆశీర్వదించారు.
పశ్చాత్తాపంతో ఆచార్యులవారిని క్షమాపణలు కోరింది ఆ అమ్మాయి.
గొప్ప వ్యక్తిత్వానికి ఇంతకన్నా కొలమానం మరే ముంటుంది ఈ ఆధునిక సమాజంలో. ఇలా వారి జీవన గమనంలో అనేక సంఘటనలు. అందరిలో మంచిని చూడడమే వారి మంచి మనసుకు నిదర్శనం.