Site icon Sanchika

కుసుమ వేదన-13

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

తృతీయాశ్వాసము – ఏడవ భాగము

ఉ.॥
రేయటు గ్రామసింహములు రెప్పల సైతము వాల్చకుండ; యా
రేయిని వీధులన్ దిరిగి లెక్కకు మిక్కిలి మొర్గుచుండి; బల్
కాయుచు నుండె వీధులను గస్తిగ దొంగలపాలు గాకయున్
మాయము గాక యా జనుల మధ్యను యుండియు నాస్తిపాస్తులన్. (234)

ఉ.॥
హోయని గాలి వీచగను ఊయల లూగిన చందముండె; యా
రేయిపవళ్ళు సైతమును యీ విధరీతుల పాలు జేయగన్
కోయిల కూజితంబు యది కూర్చిన హాయి యటంచుదల్చ; యీ
మాయ దురోదరంబునిట మాయెడ యెందుకు దైవమా యనన్. (235)

ఉ.॥
రేలు భుజించు పిమ్మటను రెప్పలు మూయను గాలి లేక; యే
పాలును పోక యందరును పాటల నాటల నాడి తీరుగన్
కాలము వెళ్ళబుచ్చి మది కాస్తను నెమ్మది నొంది యంతటన్
చాలగ నిద్ర జెందిరి విచారము లేమియు లేక హాయిగా. (236)

సీ॥
ఏ యింటి ద్వారంబు లెంతకున్ మూయదే
బార్లగా దెరిచెను భయము లేక
ఆ యిళ్ళ లోనికిన్ యావురావుమనుచు
వేడి పవనము దూర్వెచ్చగాను
ఏ జాణయెదపైన యే వస్త్రమును లేదె
ఉక్కపోత వలన ప్రక్క దొలిగె
పాలిండ్లు యబ్బురంబై దోచె జూడగా
యిది యేమి చోద్యంబొ ఏమి వింత!

తే.గీ.॥
కంటి మీదికి కునుకుయు కడకు రాదె
యనుచు వ్యథ జెందె మహిళలు అవనిలోన
దేహమంతయు స్వేదంబు దిరుగుచుండ
ఎటులొ నిలిచిరి యా వేళ నిక్కి నీల్గి. (237)

ఉ.॥
గాలటు ఎంత వీచినను కౌతుక మొప్పగ నిద్రయందు; పో
జాలక మానవాళి నడి ఝాముల సైతము కున్కుతీయ; పో
తాలము జేసి యందరిని తమ్ముల తోడిగ నిద్రలేమికిన్
గాలము వేసి నీ ధరణి గందరగోళపు రీతి జేయగన్. (238)

ఉ.॥
ఘోరములైన వాయువులు; కూరిన కట్టెల పొయ్యి నయ్యెడన్
చేరిటు రార్పివేయ; మరి చేడెలు చేయునదేమిలేక; నా
చారము మీరకుండునటు చక్కగ నూదుచు నూది యూది; గా
చారము కాక పోవునని చైత్రము బోలు వసంత భామినుల్. (239)

ఉ.॥
అంతటి గాసి జెంది మరి యన్నము వండిన; రాత్రి వేళలన్
యెంతకు గాని యారదది యేమిటి చిత్రము వింతయంచు; యా
చెంతనె గూరుచుండి తన చేతుల తోడను చీరచెంగుతో
వింతగ నూపుచుండ్రు మగవీరులు యన్నము నారగించగన్. (240)

తే.గీ.॥
ఉడికి యుడకని యన్నంబు నురిమి దినుచు
నంత జేరిరి వీధుల యందు మగలు
యుక్కపోతను మీరెడి యూసులాడి
నిదుర జారుదు రా వేళ నిశ్చయముగ. (241)

సీ॥
తమ చీర చెంగులన్ తమ మేని మీదుగా
విసన కర్రల జేసి విసురువారు
నిదుర కంటికి రాక నిశ్చేష్టులైపోయి
అడుగుల ముందుకి పడనివారు
ఆ యింటి వార్తలన్ ఆశ్చర్యచకితులై
ఝాముల కొలదిగా అప్పచెప్ప
ఒడలంత స్వేదంబు జడివాన లాగున
కడువడి కిందకి కారుచుండ

తే.గీ.॥
ఎటుల నిదురను బోదురో ఎవరి కెరుక
పడతులందరు యా వేళ; పాటలందు
కొనగ నుద్యుక్తు లౌచుండ కోపవశము
చేతనన గాలి ధూళియు చెలగిపోయె. (242)

సీ॥
తప్త పవన ధాటి తనువులలుపు జెంద
వాడిపోయెను గదా వనిత మల్లె
సందెవేళల యందు చెందెనే చక్కటి
అందమైనది యరవింద నేత్ర
గాను కన్పడె గదా కన్నుల విందుగన్
మనసున మల్లెలు మధువులొలుక
ఏమి వైచిత్రయో యిట్టి వేదనమును
వీక్షించ ఇది యెంత వింత గొలిపె

తే.గీ.॥
కాల మహిమిది గాకున్న కానగలమె
పగలు వాడుచుపోయంత వగలు తగ్గి
పొలుపు మీరగ మలి సంజ ప్రొద్దునంత
కొత్త పుంతలు ద్రొక్కునే కొత్త మల్లె. (243)

ఉ.॥
యింతటి బాధలున్ బడిన యీ భువి నుండెడి మానవాళికిన్
సుంత మనస్సు దోచెగద శోభితమై చెలువొందు వాన; యీ
యింతని చేరవచ్చె భువి వీధుల యందున వాగు వంకలన్
అంతయు బాగు చేయగను ఆగమమయ్యెను వానకాలమున్. (244)

ఆషాడ మాసమున కుసుమ విరహము

తే.గీ.॥
అంత నాషాడ మాసంబు నాగమించె
కొత్త కోడలు కుసుమను కోరి యపుడు
పుట్టినింటికి గొనిపోవ పూని; యామె
తండ్రి యేతెంచె నా వేళ తడయకుండ. (245)

ఉ.॥
అప్పుడు తండ్రితో కుసుమ అత్తగు యింటిని వీడి రాగ; యే
చప్పుడు జేయకన్ మదిని చయ్యన తాదగు బాలరాజునున్
యెప్పుడు జూతునోయనుచు యెన్ని విధంబుల నాత్రమందుచున్
గొప్పగు రీతిగన్ మగని గోము మొఖంబును జూడగోరదే. (246)

ఉ.॥
పోయెను గాని యా కుసుమ పూనియు కార్యము చేయజాలకన్
బాయక యట్టి వేళలను బంగరు జీవనమందు చుండగన్
ఏ యపచార దోషమని యిట్టుల నిచ్చట దోలుకొచ్చిరే
తీయని గోరికల్ మదిని తీర్చుక జీవితమందు చుండగన్. (247)

చం.॥
అలుకను బూనగా మనసు యందున కోర్కెలు జన్మనొందదే
పలుకును గారవించదుగ పాలన సల్పు సమాజ శక్తులున్
పలచన జేయదే మిగుల ప్రాజ్ఞత నొందిన నారి యంచు; బల్
పలుకుచు గేలి చేతురుగ ప్రల్ల దనంబులు నాడు నీ ధరన్. (248)

తే.గీ.॥
ఏమి యాచార మీ భూమి నెట్లు నిలుచు
భామ మగనిని విడదీయు భాగ్యమేమొ
నిదియు నీ వేళ నీ రీతి నిలిచె నెటుల
ఏమి చేయుదు నీ వ్రాలు నిటుల యుండె. (249)

సీ॥
ఇంట నున్నను గాని మింట నున్న యటుల
కుసుమకున్ దోచెనే కువలయమున
బైటను నిలుచున్న భామకు నా వేళ
నిప్పులన్ పాదంబు నిలిపినటుల
ఎండవానల భేదమే మాత్రమును లేక
బండబారిన యట్లు భామ యుండె
కన్నులందున బాల కమనీయ రూపంబు
కానుపించె సతికి కలకలమున

తే.గీ.॥
మహిని కుసుమాంబ నాషాడ మాసమందు
పుట్టినింటను యున్నను పూనియపుడు
మగనితో గూడి విహరించు మధురమైన
భావ ఘట్టంబె మనసున పరవశించె. (250)

తే.గీ.॥
ప్రతి క్షణంబును మగనికై పరితపించి
క్షణము యుగముగ జూసెను చంచలాక్షి
సైపలేనట్టి భారాన సాగలేక
బలుతెరంగుల యా జాణ పరితపించె. (251)

ఉ.॥
అన్నము సైపలేక సరి గప్పటి రోజుల సంది ఖేదమున్
పన్నుగ బొందుచున్ మదిని ప్రాణవిభున్ కనులందు గాంచగన్
ఎన్ని దినంబులున్ మహిని యిట్టుల వేగను ఏమి ఖర్మమో
నన్నిటు కారగారమున నాడును నేడును నుంచ ధర్మమే. (252)

ఉ.॥
కోయిల పాటలన్ వినగ కూజిత మై మది నెంచలేక; నా
కే; యిల యందు వాయసపు కీచక వాక్కుల లాగు దోచగన్
వేదన నొంద మోహనపు వేణువు నాదము నైన భీకరం
బై యిల నొప్పుచుండె మది బాసిన భర్తను గాంచనందునన్. (253)

చం.॥
పగలును రాత్రులున్ మగని పైననె ధ్యాసను బొందెనంతటన్
వగలును వన్నెలన్ జిలికి వాసిగ మన్ననలందునట్లుగన్
సెగలును గ్రక్కుచున్ రవియు చేకొని యెండల దొర్లుచుండ; బల్
యగణిత భావముల్ మదిని యాగమ మయ్యెను కాంత చిత్తమున్. (254)

బాలరాజు విరహము

తే.గీ.॥
అటుల కుసుమాంబ పుట్టింట నడుగు బెట్ట
యంతనా బాలరాజును అలసటంది
సతిని విడనాది జగతిన సాగలేమె
ఎటుల నోపుదు యా బాల విరహ బాధ. (255)

తే.గీ.॥
హో ప్రియా నిను బాసినే మనగదరమె
నిన్ను విడనాడి నేనిట నిలువగలనె
భూత మాషాడ మీ రీతి భుక్తి గొనెను
తాళ లేనింక గుసుమాంబ తాళజాల! 256)

ఉ.॥
కొన్ని దినంబులున్ బహుగ కోరికె దీర్చెను సన్నుతాంగి; నే
నిన్ని దినంబులన్ విడచి నే విధి సైపుదు చంచలాక్షి; నీ
సున్నితమైన హస్తముల శోభను గాంచక నెట్లు నుందునో
కన్నియ కోమలంబగుడు కాకర ముండదె నాదు గుండెలన్. (257)

సీ॥
రాత్రులందున నిన్ను రమియించకుండిన
ఎటుల వచ్చు నిదుర యిందువదన
శయ్యాగృహంబునన్ శయనిద్దమన్ననూ
తోడు నీవును లేదె తోయజాక్షి
కార్యముల్ నెరవేర్చ కనకాంగి నువు లేక
సతమతంబై ముందు సాగలేదె
కొన్ని మాసంబులే కోమలాంగి రొనన్ను
ఇంత హత్తుకొనగ వింత దోచె

తే.గీ.॥
యింతి నీ పాదముద్రలే యింపు మీర
నన్ను బడవైచె బడతిరో నాతి వినుమ
నీవు లేకున్న నా జన్మ నిష్ఫలంబె
యనుచు దలచెద ముమ్మూరు యంబుజాక్షి. (258)

(సశేషం)

Exit mobile version