[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
చతుర్థాశ్వాసము – రెండవ భాగము
చం.॥
అలలవి గావవీ ధరణి ఆకొని మ్రింగెడి దుష్ట భూతమై
అలలవి గావవీ దినము యాకృతిదాల్చిన భ్రష్ట రూపమై
ఇలకును జేరవచ్చినది ఏ; విపరీతమొ గాంచజాలామే
సలిలము చక్రవాకమున చంచలరీతి చెలంగెనీ ధరన్. (307)
కం.॥
మెరుపులు మెరసెను సంద్రము
నురుములు నురిమెను జలధిని; యుక్కిరి నొందన్
మరియును గదలెను లాహిరి
దరియును దోచదె జలనిధి దండిగ చెలగన్. (308)
కం.॥
చిటపటయని చినుకులు ధర
తటపటయని భువి జేరగ తాండవమాడెన్
ఇట జగమున జల బిందువు
తటికిని జేరగ పరుగిడె తత్తర పడుచున్. (309)
కం.॥
జడివానలు ముదరంగను
సడి జేయుచు చెలగెనపుడు సాక్షము లాగన్
పడుచుండెను పదనిసయని
కడు వేగమె తడిసె మిగుల కారణమిదియే. (310)
కం.॥
పెళపెళమని పిడుగులు పడ
విలయము వలె దోచెనపుడు విస్మయమందన్
ప్రళయపు టలలను జూడగ
కళలను మరచిన జగతికి కాళుని రాత్రే. (311)
కం.॥
కదలెను గాలియు వానయు
సదమలముగ సాగరమున సాగుచునపుడున్
మెదలక యుండెడి వార్ధియు
కదలుచు గాలికి వానకు కడలిని యపుడున్. (312)
ఉ.॥
అంతట వారలున్ దరియు దాపును గానక సంద్రమందునన్
ఎంతయు తండు దెప్పులను ఎంతగు రీతిని లాగుచున్నయున్
సుంతగు దూరమున్ కదల చోద్యము గల్గగ తోయుచుండగన్
ఎంతకు ముందుకేగ నది యేమిటి మార్గ మటంచు లంగరున్. (313)
ఉ.॥
ముంచె జలంబులన్ నదియు మున్గి ననంతర యట్టి తెప్పయున్
కొంచెము గాలివాన బడకుండగ పడ్వను నిల్పి యుండగన్
మించియు నిట్టి బాధలను మేలుగ బాపుమటంచు దల్చుచున్
అంచున వడ్కగన్ పడవ; యందరు నప్పుడు కూరుచుండగన్. (314)
ఉ.॥
ఇంకను భీకరంబుగ మహీతల వార్ధియు భేదమెంచకన్
బింక మటన్నదే కనక భీతిని దోచెడి రీతి వర్షమున్
మంకును గూడి వాయువులు మాటును వేసి ధరాతలంబునన్
యింకను యావరించె పెను చీకటి రాత్రము వార్ధి నంతటిన్. (315)
ఉ.॥
దీనికి తోడు భీకరపు దెయ్యపు నవ్వుల లాగు శబ్దముల్
పూని జలంబులన్ మెరిసె భోరున కేకలు వేయునట్టు; నా
మేనులు పల్లవంబువలె మిక్కిలి రీతిగ కంపమొందగన్
ప్రాణము లైదునా భయము పైకిని పోవగ నట్టి కాలమున్. (316)
కం.॥
ధడమని పిడుగులు పడగను
ఎడతెగ కనుపడె జలధిని యెట్టుల చేయన్
కడలిని గానక నప్పుడు
విడువని బంధము తడయక వీడుట సరియా. (317)
సీ॥
ఒకవైపు తూర్పొడి ఒక వైపు సోలాపు
వడి జేర సంద్రంబు వరస దప్పె
పడవ నుండెడి వారు పరుగెత్తి నటు నిటు
ఏది తెరంగని ఎంచి వేడె
అటు నూగె ఇటు నూగె కటకటా ఇది యేమి?
వెతలంచు గుందిరి వేగిరమున
అలలు విజృంభించి అయ్యెనా కడలంత
భీకరాకృతి తోడ నాకసమున
తే.గీ.॥
వెలుగు మిరమిట్లు గొలుపుచు వెలిగెనపుడు
ప్రళయ భీకరమయ్యెనా పగటి వేళ
కారు జీకటి గ్రమ్మిన కాళరాత్రి
లాగు దోచెను యా వేళ లక్షణమును. (318)
తే.గీ.॥
అటుల చెలరేగి పోతుండ నట్టి దినము
ఏమి దోచక తలపాగ నిటులదీసి
మాటిమాటికి వంటిమీదకి కప్పుచు వారలపుడు
నొక్క చోటికి చేరిరి నుస్సురంచు. (319)
తే.గీ.॥
అటుల వాయువు వర్షంబు పటుతరముగ
ఒక్క గాటున చెలరేగి మిక్కిలిగను
సంద్రమున నుండు జలములు చలన వేగ
మంది కదలెను మీదికి కింది కపుడు. (320)
తే.గీ.॥
అపుడు సాగరమంతయు నావరించె
కటిక చీకటి యావేళ క్రమ్ముకొనగ
మంచుపొగ కంబలి వలె మించి కడలి
భీకరమ్ముగ చెలరేగి భీతి గొల్ప. (321)
తే.గీ.॥
అట్టి సంధుల లంగరున్ పట్టు లేక
నావ నిలువక గాలికి పోవసాగె
అందునున్నటి వారలు యెందుబోదు
మని విచారము నొందుచు నరవసాగె. (322)
ఉ.॥
వెయ్యి విమాన రోదనలు వేయికి మించిన దీప తేజముల్
రయ్యిమటంచు ఘోరముగ రాతిరి వేళకు ముందు సంద్రమున్
గయ్యిమటంచు తీతువులు గంపెడు రీతుల చేసినట్లు
వియ్యము నొందగన్ గదలె వేనకువేలగు పంచభూతముల్. (323)
ఉ.॥
అట్టి యనంత సాగరము యారని చిచ్చొలె రెచ్చిపోవగన్
మట్టిని యున్నవారలకు మైకము సోకెడి రీతి కల్గగన్
ఇట్టి సముద్రమందు బహు యిక్కటు లాగున గాలి వానలున్
పట్టు బిగించి యా కడలి పైనను నక్కసు నెల్ల గ్రక్కెనే. (324)
చం.॥
జలముల నుండు మత్స్యముల జాతికి నేమియు లోటు గల్గ; దా
జలముల పైని వారలకె ఝాముల లోపునె ప్రాణ పంచకం;
విలవిల గొట్టు కొంచుదివి; ఏగును జీవము లట్టి వేళలన్
మలమల మాడి వారలును మైకము గ్రమ్మిన రీతి నుండదే. (325)
ఉ.॥
చుట్టు విశాల సంద్రమిది చేగొని త్రావగ నుప్పు దోచె; ఎ
ట్టెట్టులొ బాధలంబడుచు యెట్లనొ కోర్కెల నాపుకొంచు; అ
ట్టిట్టు విశాల క్షారనిధి యిట్టుల నేడ్చుచు వేచి యుంటి; మి
ప్పటున ధైర్యమున్ విడిన ప్రాణములైదును గోలుపోవమే. (326)
సీ॥
అలలంత ఎత్తుకున్ చెలరేగి పోవగన్
విలవిల లాడెనే వీరి గుండె
ఒకనాడు శాంతంబు వొంటిపై గప్పుకొని
కనుపించు కడలియే కరుణ దప్పి
రుద్రభీకరమైన రూపంబు నుందాల్చి
చిద్రంబు జేసెనే చిచ్చుపెట్టి
బడబానలంబంత బ్రద్దలగు విధాన
చెలరేగె సాగరం చంచలమున
తే.గీ.॥
వేయి సింహాల బలమంత వేడ్క తోడ
సాగరము మీద దండెత్తి సాగు వేళ
గుబులు రేగెను వారల గుండె లందు
ఏది మాకును దారంచు వెతుకసాగె (పోది మీర). (327)
సీ॥
చక్రవాకపు వేళ చంచలంబున గాలి
చిత్రంపు లహరులే చిందులేసె
ఊర్ధమందున నీరు ఉరకలెత్తుచు రాగ
పైనున్న సాగరం పడగలెత్తె
నీటిపైనను యున్న నిలపైన యున్నట్లె
దోచు భావమిపుడు దొలగిపోయె
నీళ్ళ మీదను యున్న నిప్పు కుంపటి వోలె
మండిపోయెను వారి దండి పడవ
తే.గీ.॥
యిటుల గాలియును వానయు పటుతరముగ
పట్టు విడుపును లేకుండ గట్టిగాను
పైన గురియగ నటు నావ పాటు దప్పి
లోతు సాగర వైపుకి; లొంగిపోయె. (328)
(సశేషం)