కుసుమ వేదన-17
[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
చతుర్థాశ్వాసము – మూడవ భాగము
సీ॥
యానదీ నాథుండు యంతకంతకు బెర్గి
బడబానలంబును బారవైచె
మౌక్తికచ్చాయకున్ మారైన ధవళమౌ
నురగ సాగరమంత పరగ నిలిచె
పెన్జీక టావేళ పెనవేయ కడలంత
నలుపు వర్ణంబున అమరిపోయె
ఒకరి మొకంబు వేరొకరు జూడగలేరు
కాళరాత్రంబును కనుల నిలుప
తే.గీ.॥
మునుపు యెన్నడు జూడని ఉపద్రవంబు
నేడు కన్నుల కాన్పించె నీరవమున
జగతి మాతకు జెడురోజు జరుగుబట్టె
యింక బాహ్య ప్రపంచము మృషయు గాదె. (329)
సీ॥
ఒక తాడి యెత్తంత నొక తరంగము లేచె
యికనేమి గతియంచు ఎటులబోదు
యావేళ పడవంత యాక్రందనలు రేగ
అతలాకుతలమయ్యె నాడు మిగుల
కర్ణకఠోరమౌ కాలుని దున్న ఘీం
కారపు రోదనల్ మేర మీరె
అందు భీకర గతి మంద్రమంద్రంబుగా
స్తోత్ర పాఠంబుగా సుడులు దిరిగె
తే.గీ.॥
కడలి ఒడలున నొక రాచకార్యమనగ
దేహమంతయు ప్రాకెనె దీని జూడ
శివుని తాండవ నాట్యంబు శిరము దాల్చి
రేగె నా వేళ కడలియు రెచ్చిపోయి. (330)
ఆ.వె.॥
పడవ యట్లు బోయె పాటును దప్పుచున్
ఇంకనింటి కెటుల నీ దినంబు
జేరగలమొ లేదో చెల్లెనే బతుకులు
ఆశ జెంది దైవ మండ గోరె. (331)
ఉ.॥
దైవమ మమ్ము గావగదె దండము నిత్తును నీయపాయమున్
బ్రోవను నీకు సాటినిక భూమిని యెవ్వరు లేరటంచు; ఓ
దేవర నిన్ను వేడితిని దీన జనంబుల బ్రోవుమానికన్
నీవె జగంబులందునను నిల్చి జనంబుల గావవే ప్రభూ. (332)
తే.గీ.॥
పగలు ఏవురు కలవరపాటు బడుచు
ఏమి చేయుదు దైవమా ఎటుల బోదు
అనుచు గుందుచు నేడ్చుచు మనసు నందు
దైవ ప్రార్థన జేసిరి దడయకపుడు. (333)
సీ॥
నీలాంబుద శ్యామ నిఖిల దైవలలామ
గాపాడ రాగదే కరుణ దలచి
క్షీర కూపారంబు సారెకున్ బవళించు
శ్రీహరీ నాదైన చింతబాపు
దిక్కేదియును లేదు దక్కించు బ్రాణంబు
ఇందిరావరశ్యామా వినతు లిదియె
బ్రతి యుగంబున నీవు బ్రకటింతువందురు
యీ క్షణంబున మమ్ము ఇచట గావు
తే.గీ.॥
పరగ రాగదె మము గాన పరుగులిడుచు
అభయ మీగదె శరణంబు నార్త రక్ష
గాచి రక్షించు యాపదల్ గడుపు మయ్య
దీన మందార గోవింద దిక్కు నీవె. (334)
కం.॥
ఇప్పుడు మా బతుకులు సడి
చప్పుడు చేయక జలముల సన్నిధి కరుగన్
గొప్పగ బతుకగ నైతిమి
ఎప్పటిలా దరి కడకును వేగమె చేర్చన్. (335)
సీ॥
అంబ మమ్ముల గావు మాదిశక్తివి గదా
అంచు మనసు దాల్చి మరువకుండ
రయము బ్రోవవె తల్లి రవ్వంత దయ జూపి
శిష్ట వినుతవు గదా, శివుని రాణి
కష్టకాలంబున నిష్ఠ తోడుత మేము
నిలచి నిన్ను దలంచి బిలచి నాము
వేగ గావగ రావె వేసారి వెతలందు
గుంది వేడితి మాకు గుణములిమ్మ
తే.గీ.॥
ఈ క్షణంబున మా యండ నిలిచి నీవు (నీవు నిలచి)
మాదు గోసల నాలించి మహిని మిగుల
ఘోర కలిబాపి గాపాడు గొప్పగాను
నిలిచి ప్రార్థించు మేమంత నిక్కముగను. (336)
తే.గీ.॥
వరుస బ్రార్థింప నే రీతి వారి పడవ
రక్ష జేయగ మేదైన లక్షణమును
రాకపోయెను వారింక రాలిపోవు
తరుణ మాసన్నమాయెను తమకు నంచు. (337)
శా.॥
భీతిన్ గొల్పెడి సంద్రమందునన్ బెంబేలెత్తుచున్ వారలున్
ఏ తీరున్ దరి దెన్ను దోచకను హాయేదీ మదిన్ దిక్కననన్
ఖ్యాతిన్ బొందిన మత్స్యకారులము యిక్కట్లన్ బడన్ గావుమా
నీతిన్ న్యాయము లేని చందమనిలా ఏ తీరున్ మమున్ బ్రోతువో. (338)
తే.గీ.॥
అనుచు యేవురు కలవరపడుచునపుడు
ఏమి చేతుము దైవమా ఎటుల బోదు
మనుచు గుందుచు నేడ్చుచు మనసు నందు
దైవ ప్రార్థన జేసిరి దడయకపుడు. (339)
తే.గీ.॥
వారలందరు గుమిగూడి వగచి వగచి
మిగుల దుఃఖంబు నొందుచున్ మీనవరులు
ఏమి చేయుదు దైవంబ ఎటుల బోదు
మనుచు యిష్టంపు దైవమున్ మదిని దలచె. (340)
తే.గీ.॥
ఇష్టదైవాల మనసున యిటుల నిలిపి
స్వామి యిక మాదు ప్రాణంబు స్వల్పఘడియ
లందు బోయెడి కాలంబు ఆగమించె
నీవే దిక్కని మనసున నిల్పినాము. (341)
పడవను ముంచిన పెద్ద అల
సీ॥
భూనభోనంతరములు బుగ్గియగు విధాన
లోకంబులెల్లను ఊగి పోగ
కులపర్వతంబులు కూలిపోవు విధాన
కడు భీకరంబైన కలియు జరిగె
దిక్కులన్నియును దీనంబుగా మూల్గి
హోరుమంచును లేచె నొక్క అలయు
దాని ధాటికి నిల్వ ధరణి యందున మేరు
మందర గిరులకే మైకమబ్బు
తే.గీ.॥
ఎగసె నువ్వెత్తు దివి దాక వేగిరంబు
ఉబికె పాతాళ పరిసర నూతి నుండి
కదిలె గండాతిగండల గతియు మిగుల
యేన ప్రాణంబు లొదిలెను మీనవరులు. (342)
ఉ.॥
అంతట నావ మున్గె; మరియంతనె నావికులంత మున్గె; వా
రంతయు జీవముల్ విడిచి రంతయు జీకటి మృత్యు హేళిలో
పంతము బూని ముంచె జల ప్రాణుల సాక్షిగ మృత్యు కేళిలో
చింతగ మారె జాలరుల చేతన లేని యచేతన స్థితిన్. (343)
ఉ.॥
ఎంత విదారకంబడుగు యెక్కడి దైవము లేటి మాటలున్
చింతను దీర్చగా భువిని శ్రీశుడు సైతము యండ లేదికన్
కంతుని గన్నవాడు నిక కాంచను మోమును జూపకుండ; ధీ
మంతులు యిందరుండి యును మార్గమెరుంగక మృత్యువొందిరే. (344)
ఉ.॥
ఏ మహనీయ కార్యమున కీ భువి మీదకు వచ్చినారమో
యా మహనీయ కార్యమును మస్సలు జేయక పైనమైతిమే
ప్రేమను బంచు మాధవుని పెన్నిధిగా మది నెంచి వేగమే
భామను బంధు మిత్ర సుత భాగ్యములన్నియు తృంచి వేయమే. (345)
ఉ.॥
ఎక్కడ పుట్టినారు? మరి యెక్కడ చావుకి సిద్ధమైరి; యే
పెక్కు దెరంగులన్ తగిన మీనుల కోసము సంద్రమందునన్
చిక్కిరి వారలున్ దరికి జేరెడి మార్గము దోచకుండ; మీ
ద్మిక్కిలి రోదనల్ బడుచు దీనముగా కనుమూయ జాలిరే. (346)
ఉ.॥
ఎప్పుడు భోగభాగ్యముల నెన్నడు మానసమందు గోరరే
ఎప్పుడు సంద్రమందుననె ఈ విధ రీతిగ బోవుచుండ్రు; ఎ
ల్లప్పుడు గాలి వానల లాహిరి మించిన వాటి ఢీ కొనన్
యిప్పుడు గూడ భీకరపు ఈదురుగాలులు పాల్పడంగనూ. (347)
చం.॥
గడచిన కాలమంతయును గట్టిగ జీవితమందు కొన్గ; ఈ
గడిచెడి కాలమున్ బతికి గౌరవమందుచు జీవితంబునన్
నడచిటు సాగుదమ్మనుచునట్టి తలంపును బూను వేళ; నీ
పడమటి గాలి చేత తమ బ్రాణములన్ యిలదీయ ధర్మమే. (348)
కం.॥
సంద్రమె వారికి ప్రాణము
సంద్రమె వారికి సకలము సాగిలపడగన్
సంద్రమె వారిని గాయును
సంద్రమె వారలను మ్రింగు సత్యమిదేగా. (349)
ఆశ్వాసాంత గద్యము:
ఇతి శ్రీ మద్వల్లంద్ర రాజవంశ రాకా సుధాకర విరాజిత కీర్తి కాంతాసముపార్జితులౌ, పట్టపు మత్స్యకార్వర్గ, ఆవలాన్వయ సంభూతులౌ, శ్రీ సీతలాంబా ఉపాసిత శ్రీ మస్తానయ్య కుమార రత్నంబగు, సహజ కవీంద్రులై వెలయు, శ్రీ వెంకట రమణ కవీంద్రుని విరచితంబగు కుసుమ వేదనా కావ్యము చతుర్థాశ్వాసము సర్వమూ సమాప్తము.
(సశేషం)