కుసుమ వేదన-19

0
2

కుసుమ వేదన-19

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

పంచమాశ్వాసము – రెండవ భాగము

సీ॥
అప్పుడా కుసుమతి యాదరిన్ జూడగా
నంగనాచిగ నేమి నరయనటుల
దొంగమోమును దాల్చి బంగాళాఖాతమౌ
కడలి ఎంతటి వగల్ కానుపించె
పడవలిన్నియు సాగు ప్రాంతంబు నందున
ప్రళయ భీకరమైన అలల తోటి
మౌన గంభీరంబు మనసు నందున దాల్చి
యీ రీతి మమ్ముల ఈసుగొల్పె

తే.గీ.॥
పాలకేడ్చెడి పసివాని పండబెట్టి
సంద్రతీరంబు నందున సాగిలపడ
ఏమి కర్మమొ పాపమొ ఏమి రోత
మమ్ము గాంచుము వినతులు గుమ్మరింతు. (375)

తే.గీ.॥
అంత నొకనాటి నుదయంబు నాకసమున
మబ్బు తెర లేవ వేటకు మాని జనులు
ఊరి నుండగ నొక్కండు వారిదముకు
వెడలి పోవగ నొక చోట వేడ్క మీర. (376)

తే.గీ.॥
కడలి యంచున క్రుళ్ళిన కాయమొకటి
నీటి యంచున నిలచెను నిక్కముగను
బాలరాజేమొ యని యెంచి చాల వేగ
రాగ గుర్తును పట్టక వేగపురికి. (377)

ఆ.వె.॥
పరుగు బెట్టెయతడు ప్రాణంబు బిగబట్టి
గ్రామమునకు వచ్చి గతిని దెల్ప
పారెనంత జనులు పరిపరి విధముల
కడలి యంచు చేర కదిలి రపుడు. (378)

కం.॥
కదలిరి ఏవురు నప్పుడు
పదపదమని పరుగులిడుచు పాకల విడువన్
అదరెడి గుండెల నదుముచు
సదమల రీతిని సాగిరి సాగర తటికిన్. (379)

కం.॥
గుమిగూడిరి జనులందరు
అమితంబుగ వెతలు జెంది యా తొలి సంధ్యన్
శ్రమ గాదని పరుగెత్తిరి
భ్రమలెల్లను తొలగిపోయె బావురుమంచున్. (380)

తే.గీ.॥
గుర్తుబట్టని రీతిని క్రుళ్ళియుండె
ఛిద్రమైనట్టి విధముగా చెదరియుండె
చెడ్డ దుర్గంధ మచ్చోట చేరు జనుల
ముక్కు రంధ్రంబు పగిలేట్టు కక్కు నొచ్చె. (381)

తే.గీ.॥
ఏమి చేయను దోచక ఏవురపుడు
దూరమున నుండి జూసిరి దారుణంబె
అంత నా యింటి వారలు యప్పుడొచ్చె
దాపు కేగుచు చూడగ ధైర్యమొచ్చె. (382)

సీ॥
ఇది బాలరాజుండు మృత్యువొందక మున్ను
ధరియించు వస్త్రంబె దడయకుండ
వేటకేగునపుడు వెడలెనీ వస్త్రాన
తడయకుండ రండు తండ్రి బిలచె
ఈ కర్మ ఏమిటో ఎందు జూడగలేము
నీటి పాలయ్యెనే సాటి జనుడు
యనుచు దుర్గంధంబు హడలు గొట్టుచునున్న
ఓర్పుతో ముందుకున్ ఊరు వచ్చె

ఆ.వె.॥
తాటియాకు చాప తడయక తెప్పించి
చుట్టి తీసుకెళ్ళె చోద్యము గను
అంత యూరి వారు ఆహూతులగుచుండె
అలల మాది రచట ఆగమించె. (383)

సీ॥
ఒక కాకి చచ్చిన ఒనరుగా వందలు
లోకాన గగ్గోలు లొల్లి చేయు
ఆ మాదిరీ వేళ ఆక్రందనలు చేసె
యా వూరి జనులంత ఆర్తి తోడ
యూరి వారందరి యుత్సాహమౌ రీతి
తన పర భేదంబు తనరకుండ
మంచి చెడ్డల యందు మహిలోన దాపుండి
తల నాల్క వలె నెప్డు తప్పకుండ

తే.గీ.॥
అట్టి మనిషిట్టి వేళల వొట్టిపోయి
గుర్తు కానని రీతిని కుదిరియుండ
ఎట్లు నోర్తురు మనుజులు ఏలనిట్టి
గడ్డు రోజులు నేర్పర్చె జిడ్డు బ్రహ్మ. (384)

కం.॥
యప్పుడు గుసుమతి గాంచను
ఎప్పుడు మనమీ విధాన ఎరుగము ధరలో
గొప్పగ బెండిలి తదుపరి
ఇప్పుర మందున వెలిగెను యింతియు వసుధన్. (385)

ఉ.॥
నావుడు యూరి నున్న ఘన నాయకులందరు గుంపు జేరి; యా
జీవుడు బాలరాజు మృతి చిత్రము గాదె గణించనీ ధరన్
ఏవురు లందరున్ కడలి ఇట్లుగ ప్రాణము గోలుపోవగన్
బావురుమంచు నేడ్చె పసి బాలుర మాదిరి యెల్లవారలున్. (386)

ఉ.॥
వచ్చెను బంధుమిత్రులును వైనముగా రవి గ్రుంకు ముందగన్
హెచ్చెను వారి శోకమును; యెంత యొదార్చిన లాభముండదే
చచ్చినవాడు నందరికి సాంత్వన, ధైర్యము నిచ్చువాడు; బల్
మెచ్చె జనంబులున్ యపుడు మేలుగ యాతని సంస్తుతించరే. (387)

సీ॥
కాకి శోకము గాదె కనులార గాంచినన్
దివి భువి ఏకమా దివసమందు
కండ్ల నీరంబులున్ కాల్వలై పారంగ
వారి శోకము మాన్పు వారు లేరె
దివి సీమలందునన్ దైవంబు లున్నచో
విని దిగి వచ్చియు వినెడి వారె
అంతైన శోకంబు ఎంతైన శోకించె
ఘోరంబు గాదింక ఘొల్లుమనగ

తే.గీ.॥
యట్టి శోకంబు వెదజల్లె గట్టిగాను
పట్టు విడువక నేడ్చిన ఫలితమేమి
యంచు పెద్దలు మొదలెట్టె యంత్యక్రియల
చేయ నుద్యుక్తు లౌచుండె చెంత జేరి. (388)

సీ॥
యా వూరి జనులంత యచ్చోటికిన్ జేరి
ఏ లీల జరిగెనో ఈ విధంచు
మిన్ను మన్నును గూడ కన్నీరుతో నిండె
మానవాళి మనసు మరగిపోయె
ఎంత ఏడ్చిన గాని ఏమైననూ గాని
పోయిన ప్రాణముల్ పొరలి రాదె
అందు చేతిప్పుడున్ అంత్యక్రియల తంతు
వెంటనే జరిపింతు వేడు కలర

తే.గీ.॥
అటుల దలపోసి దాయలు అట్టివేళ
గూడి పార్థివ దేహమున్ కొదువ లేక
చివరి కర్మల జరిపింప చెంత జేరి
కదల నుద్యుక్తు లౌచును కాటి వైపు. (389)

సీ॥
దాయాదులందరున్ ధైర్యంబు మది నిల్పి
పాడెను గట్టిరి పటు తరముగ
పచ్చి చెట్టును గొట్టి పరుపుగా తా చేర్చి
అటుపైన గొబ్బరి యాకు నిల్పి
చాప చే చుట్టిన శవము దానిని నిల్పి
దాయాదులందరున్ దారి పట్టె
ఒక్కసారిగ నేడ్పు పిక్కటిల్లు విధాన
కలిగెనే యా వేళ కలకలము

తే.గీ.॥
ఒంటి మేళంబు మ్రోగగ ఒడలు మరిచి
తాగి గంతులు వేసెడి తరము నందు
నడువ శవయాత్ర సాగెను నాటి దినము
మౌన రోదన మందుచున్ మాన్యవరులు. (390)

సీ॥
ఎందుకొస్తిమొ తెలీదెందు కెల్తుంటిమో
తెలియగలుగ దింత తెలివి యున్న
ఎందుకీ జననంబు ఎందుకీ మరణంబు
తేల్చలేక పోయె తెలివి గలిగి
నట్టి సిద్ధులు యోగులు నవనిలోన
విధిని ఎరుగక వారంత వెల్ల కిల్లి
పడెను గాని కనట్టి ప్రారబ్ధ కర్మంబు
తెలియ గలుగు వాడు దిశను లేడె

తే.గీ.॥
అయిన పునరపి జననంబు అవనిలోన
బ్రహ్మ వ్రాతను మార్చను బ్రహ్మ తరమె
బుద్ధి జీవిత మందుము ఒద్దిక గను
పుడమి పునరపి మరణంబు పూనియుండె. (391)

తే.గీ.॥
అటుల యా కార్యమంతయు ఐన వేళ
దశ దినంబుల పిమ్మట ధరణి యందు
మరణ మొందిన వారికి మహిని మిగుల
బెద్ద కర్మను జేతురు శ్రాద్ధ కర్మ. (392)

తే.గీ.॥
సలుప నచ్చోటికిన్ జేరె సదరు జనులు
బంధుమిత్రులు నాత్మీయమందు జనులు
హెచ్చు సంఖ్యను జేరిరి ఇచ్చరీతి
బాలరాజుకు జరుపగ చాల శాంతి. (393)

ఉ.॥
అన్నిట కార్యమంతయును అయ్యిన పిమ్మట తల్లిదండ్రులున్
పన్నుగ వెంట రమ్మనుచు పల్కిరినప్పుడు కూతు తోడ; నా
పన్నులు నెవ్వరున్ దరిని పాలన జేయగ లేరె యంచు; నీ
కన్నిట తోడు నిల్చి భువి కార్యము లన్నియు చక్కబెట్టమే. (394)

ఉ.॥
నీదగు భర్త లేడె నిను నిక్కము గావను యిట్టి చోటునన్
ఈ దినమందునన్ మిగుల ఇచ్చగు కార్యములన్ని దీర్పగన్
నీదగు పుత్రునిన్ మరియు నిన్నును గావను యిప్పుడీ ధరన్
మాదగు గూడు జేరగను మానక గాతుము మీదు మిక్కిలిన్. (395)

ఉ.॥
తల్లిరొ మాదు పల్కులిని తాహతు మించిన కోర్కెలేటికిన్
ఎల్లరు భర్తలున్ విడిచి ఎట్లు వసింతురు పిల్ల పాపలన్
తల్లియె పెంచజాలదిక తప్పక మేమును సాయమందెదమ్
చల్లగ దైవమీ ధరణి చక్కగ పాలన జేయు నందరిన్. (396)

తే.గీ.॥
అనుచు పల్కిన తలిదండ్రి అడ్డువచ్చి
ఇదియె నా భర్త నడుయాడు నట్టి చోటు
విడిచి నే రాను రాలేను విధి వశమ్ము
మరలిపోవుడు నను వీడి మాట లేల. (397)

కం.॥
పతి తోడిదె సతి బతుకును
సతి కెవ్వరు భువిని లేరు సతతము నిజమౌ
పతి తోడనె కుసుమ బతుకు
అతి గాదిది జనని జనకు లనుమతి గొనరె. (398)

ఉ.॥
నాకును ఒక్కడున్ సుతుడు నావుడు వానిని నేను బెంచగన్
సాకెద వానినీ ధరణి సాటి జనంబులు మెచ్చు రీతిగన్
వేకువ ఝామునే నిదుర వేళల మాపుచు విద్య లందగన్
తేకువ తోడుతన్ జగతి తెచ్చెద యింటికి మంచి బేరులన్. (399)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here