[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
పంచమాశ్వాసము – మూడవ భాగము
ఉ.॥
నా పతి కోర్కె మేరకును నా సుతు బెద్దగ జేసి వానినీ
భూపతులందరున్ బొగడ భూరి సుకీర్తి బొందునట్లుగా
నా పతి కోరినట్లుగనె నౌకరు గాదొక జేష్ఠ వ్యక్తిగా
నిల్పెద చూడుడీ ధరణి నిక్కము నిక్కము నీతివంతమౌ. (400)
చం.॥
సతతము తోడ దెల్పెదను సాక్షిగ బెట్టెద సూర్యచంద్రులన్
పతనము లేక వాని యెడ పాలన జేసి యొనర్తు బాధ్యతన్
హితవును దెల్పెదన్ మహిని హీనగునంబుల బారద్రోలి; మా
వెతలను బాపి నియ్యెడల వీరుడగా చెలరేగ జేసెదన్. (401)
ఉ.॥
నా పతి జీవమున్న తరుణంబున జెప్పిన యన్ని మాటలన్
యోపిక తోడ వింటినిక యోర్పు వహించెదనన్ని బాధలన్
నా పతి పల్కులన్ దలచి నా సుతునెక్కుడు విద్యలందునన్
ఏపును మీరగన్ మదిని ఎట్టుల నైనను యోర్పు నిల్పనే. (402)
మత్తకోకిల॥
ఎన్నియో యిడుమంబు లైనను ఎన్ని జయమందెదా
నన్ను యిట్టుల కష్ట శోకము నందు వేసితె దైవమా
సన్నుతామర నిన్ను వేడితి సర్వ లోకుల నాయకా
నన్ను యీ నడి సంద్రమందున నాయకా దయ జూడవే. (403)
మత్తకోకిల॥
నా విభుండును తెల్పులాగున నా మనంబున దల్చితిన్
నే విధంబుననైన నేనిల నెగ్గ గోరితి దైవమా
కేవలంబును జీవనంబున కేలు మ్రొక్కితి జూడవే
కావవే కరుణాల వాలరొ కన్న తండ్రిగ నెంచితిన్. (404)
తే.గీ.॥
అనిన కుసుమాంబ పల్కుల నాలకించి
నోట మాటను రానట్టి ఓటి జనులు
ఎంత బాధైన పడుటకు యింతి మనసు
నిశ్చయంబయ్యె చిన్నారి నీతి గమన. (405)
తే.గీ.॥
మరలిపోయిరి వారలు మానకపుడు
అంత కుసుమాంబ భవితను కనుల గాంచి
తనదు పుత్రుని బెంచను తడయ కపుడు
ఎట్టి బాధైన పడుటకు నిశ్చయించె. (406)
తరలం॥
కుసుమ కష్టము లెన్ని కల్గిన కుంగిపోవుట లేదికన్
కసిని పెంచుక ముందు సాగుచు కాలమున్ గెలిచేనుగా
విషయ వాంఛల యందు కోరిక వీసమైనను నెంచకా
పసితనంబున తత్సుతుంగని ప్రాకులాడెను వానికై. (407)
తే.గీ.॥
అటుల వలదని వారలు పటుతరంబు
బ్రతిమిలాడిన యా భామ భ్రమను వీడ
తరము గాకను యా జాణ తరలిపొండి
యనుచు తలిదండ్రి గోరగ యపుడు వారు. (408)
వచనం॥
అటుల తన కుమారుని పెంచి పెద్దచేసి ఉన్నతంగా తీర్చిదిద్దాలని దృఢ నిశ్చయం చేసుకున్న బిదప నిద్రాహారాలు మాని వానిని పెద్ద చేయడం యారంభించింది కుసుమ. తనకిప్పుడు పదిహేనేండ్లు. (409)
సోమరాజుకు హితబోధ చేయుట
చం.॥
వినుము కుమార దెల్పెదను వీనుల నాదగు మాట నిల్పుమా
వినదగు పల్కులన్ వినియు వేదన జెందిన నాదు ఆశలన్
మనమున నిల్పి జేయుమిక మానక సల్పుము యన్ని కార్యముల్
కనుమిక యెల్ల బాధలను కావగ యున్నత విద్య నేర్వుమా. (410)
ఉ.॥
నీ తలిదండ్రులున్ మరియు నిక్కము తాతలు బంధుమిత్రులున్
జేతలు గూడ నీ దరిని జీవన మీదుచు నుండె నీ ధరన్
మాతగు గంగ నమ్ముకొని మా తరమంతయు సాగిపోయెడిన్
నీ తరమంత గూడనిల నీ సగు నీళ్ళను మ్రగ్గజేతువా. (411)
ఉ.॥
వేకువ ఝామునే కదలి వెళ్ళి సముద్రపు నీసు నీళ్ళలో
కాకలు దీరు వారలును కామితమౌ జలపుష్ప సంపదల్
ఈ కలికాలమందు మరి ఈవును నుప్పగు నీటి యందునన్
పోకను జాలురే యువత పూనిక విద్యల నభ్యసించదే. (412)
ఉ.॥
మున్ను సముద్రమందుననె మోదము గూర్పగ బత్కులీడ్చి; యీ
సున్నితమైన వారు యిట సూక్ష్మము తోడను చేప పట్టగన్
ఎన్ని వసంతకాలములు నేకబిగిన్ దొరలంగ జూస్తినే
మన్నన గూర్చు వారలును మత్కులమందున లేకపోయిరే. (413)
ఉ.॥
నా దురదృష్టమే మిగుల నన్ను దహించెను జూచుచుండగా
నీదగు భావి జీవితము నిప్పుల పాల్పడకుండ జేయగన్
యీ దినమందు గోరితిని యీ తరమంతయు నీళ్ళలో బడన్
యీదుచునొడ్డు జేర్చుమిక; యింపుగ విద్యల నభ్యసించగన్. (414)
ఉ.॥
చేపలు పట్టువారినిల చెల్లగ జేయు సమాజ రంగమం
దేపును మీరగా బ్రజల దీనపు బాధల బారదోలి గన్
కాపును గాయగా మిగుల కంటక దారుల నంటకుండ; నీ
వీపున కష్టముల్ నిలిపి విజ్ఞత చేనిల జీవమందగన్. (415)
ఉ.॥
కావున నాదు మాటలిని గావుము జీకటి మ్రగ్గిపోవు; యీ
భావి తరాల నెల్లరను బాధల నొందక రక్ష జేయు; నీ
తావున రక్ష గల్గునని తప్పక వచ్చెడి మీన వర్గముల్
నీవును మాట తప్పకను నిక్కము గావుము సంతసించెదన్. (416)
తే.గీ.॥
ఇట్టి బాధల నొందగా ఎట్టులైన
మన సమూహపు గుంపులో మనిషి వోలె
నిలిచి లాగుము వారల ఎట్టులైన
యూబి నుండియు పైకిని యుబుకు విధము. (417)
ఉ.॥
ఆకలి దప్పులన్ మరచి యంగను లార్చెడి సొంతవారల
న్జీకటి మున్గె వారలను నీ కులమందున నిక్కమౌ సుమీ
రూకను కోరకుండ సరి రోజుల నింపుము మారి సేవలన్
నాకది చాలురా తనయ నమ్మి చెలంగుము జీవితాంతమున్. (418)
సీ॥
బలము లేక బ్రతుకు బహు జనంబులు వారు
తల యెత్తి జూడని తాలుగింజ
కూడు గూడును లేక గుడిసెలో నున్నను
చే జాచి యడుగని చెన్నజాతి
ఎన్నికలందునన్ ఎవరొచ్చి యడిగినన్
వోట్ల జాతరలందు వొట్టి జాతి
సరిలేరు వారికిన్ సంస్కారమందునన్
నీతి నియమమందు ఖ్యాతి మీర
తే.గీ.॥
అట్టి మన జాతి నిప్పుడు యాదుకొనుడు
ఎట్టి బాధలు బడకుండ ఎట్టులైన
కాచి గావుము నీకిది కష్టతరము
గాకబోవునె యున్నత ఘనత బొంద. (419)
తే.గీ.॥
యిటుల ఎన్నియొ విధముల ఈ దినంబు
జెప్పి జూసిన మీదట తప్పకుండ
నీదు మాటలు నిలబెట్టు నిక్కముగను
జేరి జదివెద యెదిగెద చెన్న మీర. (420)
(సశేషం)