Site icon Sanchika

కుసుమ వేదన-4

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

ద్వితీయాశ్వాసము – మొదటి భాగము

కుసుమ జననం:

కం.॥
నీ పద పద్మంబుల గొని
యోపికతో శిరము నిడితి యో ఘన చరిత్రా
వీపున కెక్కగ వదలుచు
నాపద చేసెడివాటి నణచుము దేవా. (41)

చం.॥
అరయగ నాంధ్ర దేశమున యన్నిట మిన్నగ వెల్గు ప్రాంతమున్
వరియను ధాన్యమున్ ధరణి వాసిగ లెక్కకు మిక్కిలిన్ మహిన్
సరగున పండెనా భువిని; చక్కగ తూరుపు సంద్ర తీరమున్
విరివిగ మత్స్యముల్ దొరకు; విజ్ఞత చేకొను మత్స్యకారులున్. (42)

ఉ.॥
విక్రమసింహుడేలగను వీధుల యందున గీర్తిచంద్రికల్
సక్రమతీతిగన్ భువిని చాటగ పార్థివులంత గొల్వ; మే
వక్రగతుల్ మనంబున కవాతును చేయక మాన్యవంతులై
అక్రమ మార్గమెంచకను ఖ్యాతిని మించి సుపాలనంబిడెన్. (43)

కం.॥
విక్రమసింహుని బేరున
సక్రమముగ కీర్తి గలుగు సారపు ధరణిన్
అక్రమ గీర్తిని గాంచని
సక్రమ గీర్తి వరించుచు శోభిలు పుడమిన్. (44)

సీ.॥
మనుమసిద్ది నృపుడు మరి పాలనము చేయ
మహిని ఖ్యాతిని గన్న మాన్య చరిత
విక్రమసింహచే విఖ్యాతి గాంచిన
విభ్రాజమానమౌ విమల చరిత
తమిళంబు లోపలన్ తడయక నెల్లించు
పలుక నెల్లూరయ్యె పాడిగాను
ఆంధ్ర భారతమును యాంధ్రీకరించిన
కవిబ్రహ్మ తిక్కన కార్యక్షేత్ర

తే.గీ.॥
మైన నెల్లూరు పురముకు మానితంబై
వసుధ నీశాన్య దిక్కున వాసిగాంచి
కడలి యంచున వరలెను కామితార్థ
మొసగ కామాక్షి నెలకొను యూరునదియె. (45)

సీ.॥
తీరాంధ్ర భూమికిన్ తీరైన మకుటమై
తెలుగు భారతికిని తేజమొప్ప
దక్షిణాంధ్రకు సరినక్షయపు తూణీర
సమమైన విధముగా సాటినిల్చె
వ్యవసాయ రంగాన యశమొంది వెలుగగా
ధరణిలో పేరొందు ధాన్యకటక
వసుధ సోమశిలయు వరకండలేరుతో
సస్యశ్యామలమైన క్షేత్రమిదియె

ఆ.వె.॥
పాటిగాను గండి పాలెంబు నందున
సహజ నీటి రాశి సౌఖ్యమొప్ప
వసుధ లోన మంచి వరిధ్యాన్య సంపద
మీదు మిక్కిలిగను మోదమలరె. (46)

ఆ.వె.॥
ఇట్టి నీటి సిరులు యిలలోన వెలుగగా
ఖ్యాతి నొందె ధరణి భీతి లేక
ధరణి సింహపురము దడయక నీ రీతి
భూమి లోన వెలిగె పూనియపు. (47)

పినాకిని నది:

సీ.॥
శివుని హస్తములోన స్థిరమైన బాణమై
ధర వెలుంగెడి లాగు ధరణిలోన
యా పినాకిని బేర యాశ్చర్యకరముగా
జన్మమెత్తి భువిని జాగులేక
రెండు రాష్ట్రంబుల మెండుగా సాగుచున్
ఎనలేని సిరులను వేడ్కనిచ్చి
ఊటుకూరుకు కూత వేటు దూరంబులో
కడలి రాయని మేన కలిసిపోయి

తే.గీ.॥
అట్టి సంగమ భూమికిన్ గట్టిగాను
ఐదుమైళ్ళకు లోపునే అవనిలోన
నిలచె యా రామతీర్థంబు నిశ్చలముగ
కీర్తి నొందిన శైవంపు క్షేత్రమిదియె. (48)

ఉ.॥
పల్లవ రాజ శేఖరుల పాలన యందున పర్వశించి; త
ద్దుల్లము నందు కామితము నూగిసలాడగ సంతసించి; మే
నెల్లయు నూగిపోగ సరి యీ ధరమందున రామతీర్థ; మా
పల్లెను గన్ను దెర్సినది పాపగ, కన్యగ, బెండ్లి కూతురై. (49)

ఉ.॥
ఎల్లలు లేని ఖ్యాతి గడియించిన దేవర కామనేత్ర; యా
పల్లవ రాజులున్ గుడికి ప్రాణప్రతిష్ఠను సల్పిరంతటన్
అల్లదె రామలింగ సదనంబున నిల్చెను కామితాక్షి; ఏ
ప్రల్లద మాడెరుంగరు కృపావలురై నతదీయ పౌరులున్. (50)

కం.॥
సుందరమైనదియును; అను
బంధము పెనవేయు జనని; భారతి వెలుగన్
అందరి పాలిట దైవము
అందును యిందును యనకును యంతటి వెలుగన్. (51)

సీ.॥
ఆ రామతీర్థంబు కైపైన మైజేరు
దారియంతయు సస్యధరణి వెలసె
ఆషాఢ మాసంబునల కామితాక్షి కిన్
అంగరంగంబు నలంకరించి
యపుడు జూడవలెను యా దేవి భోగంబు
కనులార గాంచిన కలుగు జయము
మహిలోన భక్తుల మరి పుణ్యజనులకు
వసుధలో కామిత వాంఛ దీరు

ఆ.వె.॥
ఇట్టి బేరుగన్న యీ రామతీర్థంబు
చుట్టు ప్రక్కలూరి సుజను హెచ్చె
తల్లి వెలసెనంచు తరలి వచ్చె ప్రజలు
పూజ చేయనెంచి పుణ్యజనులు. (52)

ఉ.॥
ఆ పురమందు నిల్చిమరి చక్కగ రాములు మంగమాంబతో
కాపురముండెగా వసుధ కమ్మని జంటని ప్రస్తుతించగన్
ఏపును మీరగ మిగుల చేపలు బట్టెడి వంశమౌటచే
ప్రాపు వహించె దైవమిటు పాలన చేసెను వారినద్దరిన్. (53)

సీ.॥
అన్యోన్య దంపతులన్న వారేనని
లోకంబు లంతయూ ఊసులాడ
జగతిలోనుండెడి జంట పదాలుగా
అంటిపెట్టుకునుండె అతివ మగని
చూడచక్కని జంట చూపుల బడినంత
ఆశ్చర్యచకితులై అలరె జనులు
భార్య విడిచి భర్త భర్త విడిచి భార్య
క్షణమైన నిలువరే క్షణికమైన

తే.గీ.॥
సుఖము లనుభివించుచు వారు సుఖితులైరి
గువ్వ గోరింక చందంబు గురుతులనుచు
చూసి ఆనంద మందిరి చోద్యముగను
యేమి వీరల భాగ్యంబు లెంత సుఖము. (54)

తే.గీ.॥
అట్టి జంటకు నొకనాడు అద్భుతముగ
కడుపు పండెను తీరెను కాంక్షలపుడు
తాను గర్భంబు దాల్చితి యనుచు మగని
తోడ దెల్పెను మంగాంబ తూలకుండ. (55)

(సశేషం)

Exit mobile version