[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
తృతీయాశ్వాసము – మొదటి భాగము
(బాలరాజు, కుసుమల వివాహం)
ప్రారంభం
కం.॥
ఘన అన్నమాఖ్యు బ్రోచిన
ఘనుడవు మాపాలి దేవ ఘణ చారిత్రా
మునిజన వందిత శ్రీహరి
వినుతి చెద్ద నీ మహిమల వీనుల విందై.
ఉ.॥
గట్టిగ బాలరాజు పదఘట్టన చేతను భూమి నద్దరిన్
పట్టున కంపమందెగద పాటెరుంగను నుల్కిపాటు; ని
ప్పట్టున వణ్కిపోగ ధర భళ్ళున భళ్ళుమటంచునిద్దరన్
ఎట్టులొ సంభళించుకొని ఇట్టుల బైటికి చెప్పగుండగన్. (83)
సీ॥
నూనుగు మీసాల నూరేగు వేళయు
బాలరాజు కపుడు ప్రాయమొప్పె
యౌవన ప్రాయంబు యావేళ రాగను
యాతండు మిక్కిలి యందముగను
కదులుచుండెను గదా కనులారజూసిన
ప్రత్యేక రూపాన ప్రభవమందె
ప్రోడిమీరగనంత ప్రోత్సహించె సఖులు
బెండ్లికిన్ దొందర బెట్టసాగె
ఆ.వె.॥
అతని బాధ గన్న యా తల్లితండ్రులున్
బెండ్లి జేయనపుడు బేర్మిమీర
గూర్మి బెందమతని గూర్చమ యంతట
వేగ యువతి గాంచ యేగెనంత. (84)
తే.గీ.॥
అటుల బహుగ్రామ దర్శన మందివారు
కనుగొనంగను లేకను కదలుచుండి
కన్యగాంచను బహు గాను కష్టతరమె
అనుచు దలపోసి వారట నన్వెషించె. (85)
తే.గీ.॥
బంధుమిత్రులు చెప్పిరి బాగుగాను
పరిచయస్థులు జెప్పిరి ప్రాకటముగ
అందరును గూడి వెదకిన మందగమన
ఎందు జూసిన గానలే దెందుకొరకో. (86)
తే.గీ.॥
అలసిపోయిరి వారలు అమితముగను
వడలిపోయిరి వారలు వాస్తవముగ
ఎంత కదిపిన కదలదె ఏమి వింతో
విసిగి పోయిరి యావేళ యిది నిజంబు. (87)
చం.॥
చివరికి వారలున్ తిరిగి చిక్కును దీర్చెడి దైవమైన; యా
భవునికి ప్రీతిపాత్రమగు భామిని కామపు యక్షియుండు; యీ
యవనిని రామతీర్థమున యాకృతి దాల్చిన పట్టపాలెమున్
నవమి తిథందు బుట్టినది నాతిని గాంచగ బైలుదేరగన్. (88)
ఉ.॥
అంతటా బాలరాజు తగు యాలిని, జూడగ తల్లిదండ్రులున్
సుంతగు రీతిగన్ తమకు సూక్ష్మపథమ్మున జుట్టముండగన్
చెంతకు చేర; వారలును చేకొని వారి గృహంబునేగగన్
జెంత జెలంగి యంతటను శీఘ్రమె కార్యము దెల్పిరంతటన్. (89)
తే.గీ.॥
జెలగు నా యువతి మిగుల జెలిమి గలది
తోటి వారల యందున తొణకదయ్యె
బంధుమిత్రుల యందున భవ్యమలర
బెద్దవారల తోడ బెద్దగుండు. (90)
కం.॥
ఎన్నగ చక్కని కుప్పగు
సున్నితమై యుండు భువిని చోద్యముగాగన్
పన్నుగ యంతటి బడతియు
నెన్నగ నీ ధరణిలోన నెచ్చట గలదే. (91)
చం.॥
సలలిత యౌవనంబునను సూక్ష్మగతిందలపోయ శక్యమే
కలలను తీర్చుకన్ జగతి కాముని భాగమ నీదు పుత్రునిన్
కళకళలాడే నీ గృహము కన్నుల వెల్గున్; కాపురంబిలన్
సలలితమైన రీతిగను సాగును నీదగు పుత్రు జీవితం. (92)
తే.గీ.॥
అనిన వారలు మిగుల యాశ చేత
అట్టి కన్యక మాకును గట్టిగాను
అవసరంబయ్యె జగతిలో అమితముగను
వేగ బోవుదమంచును ఏగిరపుడు. (93)
తే.గీ.॥
అనగ బంధుగులను గూడి యాత్రముగను
కదలె యా జాణ గృహమున సదలముగ
నట్టి వేళను బడతియు గట్టి గాను
చేద తోడను నూతిలో జేదుచుండె. (94)
తే.గీ.॥
యువతి బావిని వంగిన యుత్తరమున
నడుము వద్దను కాన్పించె నాణ్యముగను
మడత గాంచిన వారలు మరచిపోక
మరల మరలను జూచిరి మనినపుడు. (95)
తే.గీ.॥
లలన వంగిన వేళల లక్షణముగ
ధనువు వలె దోచె యా సతి ధన్యజీవి
బడతి చేదను జేకొని పైకి లేవ
యచ్చ రనుబోలె లలితాంగి యచ్చెరవుగ. (96)
ఉ.॥
ఆ దరహాస చంద్రికను అంతట గాంచిన వారలా క్షణం
బాదరమందుదునన్ యువతి బంధము చేయగ నిశ్చయంబునన్
సోదరులైన బంధుగుల సూక్ష్మము దెల్పగ గోరెనంతటన్
ఆదరబాదరంబున సుమాంజలి కోడలి చేయగనెంచగన్. (97)
సీ॥
ఈ మధుర లతాంగి ఈ కాంచనపు కొమ్మ
సౌగంధముల జల్లు సుగుణవతియు
ఏ పారిజాతంపు చెట్టునందెద జల్లి
మంద్ర మంద్రమ్ముగా మరులు గొలుపు
ఏ స్వర్గధామంబునేలెడి లలితాంగి
గుణకీర్తి గుణశీల గుర్తులెరిగి
ఈ సుశీల సుజాత ఈ సుకీర్తి సుమతి
లోకబులందున లోతులెరిగి
తే.గీ.॥
తేజరిల్లెడి మోముతో తేజమంద
చంద్రబింబంపు వదనయా చారుశీల
సుధలు గురిపించు కుసుమతి శోభమించి
వెలిగె శశిబింబ వదనమై వెలిగిపోతు. (98)
సీ॥
పాలసంద్రము నుండి ప్రభవించు లక్ష్మిలా
వెలది యా క్షణాన వెలగిపోయె
శివుని కరము బట్ట శీఘ్రమే తపమొంది
వెలుగు తేజము తోడ వెలయు గిరిజ
అంబుజ వేష్టిత యా శారదాసతి
వలెను దోచెనపుడు వనజ ముఖియు
కౌశికుని తపంబు కరముతో ధ్వంసింప
మేదినందు తరలు మేనక సతి
తే.గీ.॥
వలెను దోచెను వారికి వనిత యపుడు
ఏమియా రూపు జగతిని వెలిగిపోగ
వారలాశ్చర్య చకితలై వాస్తవముగ
యిట్టి కన్యక తమ యొక్క యింటి యందు. (99)
తే.గీ.॥
కదలు చుండిన మనసుకు ఖచ్చితముగ
శాంతి సౌఖ్యంబు గల్గును శంక లేదు
యెట్టి విధముగ నీ జాణ నెట్టులైన
బాలరాజుకు జేయుట భావ్యమౌను. (100)
తే.గీ.॥
సకల సద్గుణ రాశి యౌ చంద్రవదన
పెద్దవారల యందున బేర్మి మీర
గౌరవంబును జూపెడి కమలనయన
బాలరాజుకు సరితోడు భవ్యమలర. (101)
వచనం॥
అట్లు కుసుమను గాంచిన బాలరాజు తల్లిదండృలు నిజ గృహంబునకు జని యొక శుభదినంబున యా బడతిని గాంచి రమ్మని తన కొమరునికి మరియొక మిత్రుని తోడు గూర్చి బంపె. అట్టి తరి బాలరాజును రామతీర్థము జేరి గుసుమను గాంచి యామె సౌందర్య రూపు రేఖా విలాసంబుల గని తన మనంబున నిట్లు దలపోసె. (102)
చం.॥
కులుకు మిఠారి చూపులను గూర్చిన బ్రహ్మకు జేతలిడ్డు; యా
పలుకు యైన చెన్కులకు ప్రాణము లేచెను హాయిగొల్ప; నీ
వలపుల రాణి జీవితపు వాంఛలు దీర్చెడి రాజయంచ; మే
నొలపులు దీర్చ దక్కెనని ఊహల నూయల నూగుచుండగన్. (103)
సీ॥
మదన మనోహరమైన రూపము తోడ
రంజిల్లు యా జాణ రయముతోడ
కలయంచ జలములో కలయ తిరిగినట్లు
జిగిబిగి తో నుండు జిలుగు రమణి
వెన్నెల సోనలన్ వెదజల్లు చంద్రుని
వదనంబు గన్పట్టె వనిత ముఖము
నడచి వచ్చిన చాలు ఆమని వలె దోచు
అరవింద మోహన యంబుజాక్షి
తే.గీ.॥
సదమలంబగు రీతిని సఖియ మెరిసె
భీతి లేకను జలజాక్షి బిడియమరసి
తిరుగసాగెను యచ్చోట తిరుగాను
బాలరాజుకు మనసులో చాల నచ్చె. (104)
ఉ.॥
ఆ మదనాంగి వర్షమనివార్యత తోడుత మున్గిపోయి; న
త్తమను బొందియును వడకు దీరుట కౌ దరి దోచకుండగన్
భామిని యంగ సౌష్టవము భంగిమ నెన్నగ శక్యమీ ధరన్
కామిత వాంఛదీర్చ సురకాంతలు సైతము సాటి వత్తురే. (105)
ఉ.॥
ఈ సరి నాదు జీవితము నేవిధమైనను లోటు గల్గకన్
ఈప్సిత భాగ్యరేఖలను యీ మదనాంగితో తీరునంచు; నా
కోసము జీవితాశలను కోరి త్యజించెడి కోమలాంగి యౌ
బాసలు జేయు భాగ్యమును భక్తిని నిల్పెడి జాణగా ధరన్. (106)
తే.గీ.॥
ఇటుల బాలరాజు మనసు నిండుగాను
తృప్తి జెందిన వాడౌచు తిరముగాను
గృహము జేరియు తలిదండ్రి కిటుల దెలిపె
నచ్చె లలితాంగి మనసున నాకు చాల. (107)
తే.గీ.॥
అంత నా తలిదండ్రి సంతసమున
నిశ్చయంబును చేదల్చి నిలిచిరంత
బంధు గణముల బిల్వను బంపెనంత
వారు జేరిరి యొకనాడు వనరుగాను. (108)
(సశేషం)