Site icon Sanchika

కుటుంబం – విలువలు

[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘కుటుంబం – విలువలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయం ఆరు గంటలు. పార్వతి వంటగదిలోకి వచ్చి ఫిల్టర్‌లో కాఫీ పౌడర్ వేసి డికాషన్ కోసం సిద్ధం చేస్తున్నది. వీధి తలుపు బెల్లు మోగింది. ఇంత పొద్దుటే ఎవరు వచ్చారా, అని ఆశ్చర్యపడి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా వేణు! ఒక పెద్ద సూట్‌కేస్, ఒక బ్యాగ్‌తో వచ్చి నిలబడ్డాడు. మనిషి బాగా నీరసంగా ఉన్నాడు. డల్‌గా కూడా కనిపించాడు. పార్వతికి ఏం తోచలేదు.

“రా నాయనా”, అని బ్యాగ్ తీసుకుని లోపలికి అతనితో నడిచింది. సామాన్లు లోపల పెట్టి సోఫాలో కూర్చున్నాడు. అయిదు నిమిషాలలో తేరుకుని,”అమ్మా, నేను బ్రష్ చేసుకుని వస్తాను మంచి కాఫీ ఇవ్వు తలనొప్పిగా ఉంది”అన్నాడు.

“అలాగే వేణూ. ఇప్పటికి డికాషన్ దిగి ఉంటుంది. పాలు పెట్టి వెంటనే కాఫీ కలుపుతాను”అని పార్వతి వంటగదిలోకి వెళ్ళింది. వేణు ఫ్రెష్ అయి వచ్చాడు. పార్వతి కాఫీ తెచ్చింది.

హాయిగా ఆస్వాదిస్తూ “ఎన్నాళ్ళయిందమ్మా ఇంత చక్కని ఫిల్టర్ కాఫీ తాగి”, అన్నాడు. ఆలోచనలో పడ్డాడు వేణు.

ఆరు నెలలు అయింది తనకి పెళ్లి అయ్యి; తాను ఒక ఐటీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో ఉన్నాడు. బెంగళూరులో ఉద్యోగం. వినీత! అతని భార్య. ఆమెదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే. తన కంటే స్థాయి తక్కువ. వేరే కంపెనీ కూడా. వినీత చాలా అందగత్తె. బాగా హుషారుగా నవ్వుతూ, నవ్విస్తూ, నలుగురితోను కలిసిపోతుంది. సదాశివరావు, పార్వతి లకు తెలిసినవారు ఈ సంబంధం చెప్పారు. పెళ్లిచూపులు అయ్యాయి. వేణుకు పిల్ల నచ్చింది. ఆమె కూడా అభ్యంతరం చెప్పలేదు. వివాహం అయి హనీమూన్ ముగించుకుని ఇద్దరూ  బెంగళూరు వెళ్లి సెటిల్ అయ్యారు.

కొన్ని నిజాలు మహా చేదు. ఇది నిజమేనా? అనే చిత్తభ్రమ కలుగుతుంది. మర్నాడు ఉదయం ఎనిమిది దాటింది. వినీత ఇంకా లేవలేదు నిద్ర. వేణు లేపాడు.”హలో, గుడ్ మార్నింగ్. లేచి ఫిల్టర్ వేస్తావా? పాల ప్యాకెట్ వచ్చింది. ఇప్పుడే లోపల పెట్టాను” అన్నాడు.

“అబ్బా! నావల్ల కాదు. అయినా, సాగ తీసుకుంటూ వినీతా అని పిలవాలా! నువ్వు నన్ను ‘విన్నూ’ అను. నేను నిన్ను ‘వెన్నూ’ అంటాను. అర్థమైందా వెన్నూ. మనం జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయాలిరా. ఫిల్టర్ ఏమిటి? నేనెప్పుడూ వినలేదు. నెస్‌కేఫ్ కలుపుకొని తాగేయ్. నిన్న ఆఫీస్ నుంచి వస్తూ పాకెట్ కొని టీపాయ్ మీద పెట్టాను. పౌడర్‌ను ఓ టిన్నులో పోసేయ్. కాసేపట్లో వస్తాలే – సరేనా వెన్నూ?” అంది.

వేణుకు మతిపోయింది. ఆహా, ఏం మనిషి, ఆడపిల్లేనా! భర్తని ఇలా ఒరేయ్ ఏరా అంటుంది? ఓ గాడ్. తనెప్పుడూ  వినలేదు. షాక్ లోకి వెళ్ళాడు.

నెమ్మదిగా లేచి వచ్చింది. రాత్రి కట్టుకున్న షార్ట్ లోనే ఉంది. చిన్న బనియను వేసుకుంది. వళ్లంతా కనిపిస్తోంది. వేణు చాలా అనీజీగా  ఫీల్ అయ్యాడు. అక్కడికి వచ్చి వీపు మీద ఒకటి తట్టి “ఏరా వెన్నూ కాఫీ తాగావా? నాకు కూడా కలిపితే నీ సొమ్ము ఏం పోతుంది? పోనీలే ఇప్పుడు వెళ్లి కలిపి పట్టుకురా”, అని సోఫాలో కూర్చుని మొబైల్ ఆన్ చేసుకుని బిజీ అయిపోయింది.

వేణు స్నానం చేసి, పైజామా వేసుకుని కాటన్ టీ షర్ట్ వేసుకున్నాడు. “ఏంట్రా నాయనా, ఇంకా నయం. పంచ కట్టావు కాదు. ఏయ్. బి.సి.ల నాటి పోజులు నా దగ్గర కావు. వెళ్లి బట్టలు మార్చుకొని రా. షార్ట్ వేసుకో. అప్పుడే స్నానం అయ్యిందా. ఇప్పుడే పోతావా ఆఫీస్‌కు” అంది.

“లేదు, ఈ రోజు కొంచెం లేట్. 11 గంటలకు వెళ్తాను. వంట ఏమి వండుతావు? కూరగాయలు ఉన్నాయా? పనిమనిషి వస్తుంది ఇప్పుడు, తెప్పించనా” అన్నాడు వేణు.

“నో, నాన్సెన్స్. అరే, వంట ఎవడు చేస్తాడురా! స్విగ్గీకో, జొమాటోకో, ఆర్డర్ చేసి తెప్పిస్తాను. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా, యుమ్మీ!! ఒకసారి రుచి మరిగేవంటే మరి వదలవు రా నువ్వు వెన్నూ”అంది వినీత.

“నో, వినీతా. నాకు అవి పడవు. అప్పుడప్పుడు ఆఫీసులో లంచ్, డిన్నర్ లకు ఆర్డర్ ఇస్తారు నాకు డైజెస్ట్ కావు” అన్నాడు.

“అయితే నీ తిప్పలు నువ్వు పడు. ఓకేనా, పనమ్మాయితో వండించుకుంటావో, నువ్వే కుక్‌గా అవతారం ఎత్తుతావో, యాజ యు విష్, లంచ్ బాక్స్ పట్టుకుపో”.

“అన్నట్లూ, ఈరోజు నైయ్ మన డిన్నర్ వెల్‌కమ్ హోటల్లో – నా ఫ్రెండ్స్ అంతా కలిసి మనకు పార్టీ ఇస్తున్నారు” అంది వినీత.

వేణుకు మతిపోయింది. ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, తను అనుకున్న దానికి, తమ కుటుంబాలలో ఉన్నదానికి, పొంతన లేదు! ఏం మాట్లాడాలో – తోచని అయోమయం. పనులు ముగించుకొని ఆఫీసుకు బయలుదేరాడు.

ఈ వివాహ జీవితం, ఈ బంధం, ఏమిటి? ఈ భార్య ఏమిటి? పెద్ద వాళ్ళందరూ అరేంజ చేసిన పెళ్లి కదా. వినీత ఇలా వింతగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు వేణూ తల పట్టుకున్నాడు కాసేపు.

సరే – సొసైటీ – మర్యాదలు పాటించాలి కదా. రాత్రి పార్టీకి వెళ్ళాడు. అక్కడ అందరూ వినీతలాగే ఆర్భాటం, ఆరుపులు, గోల, ఎవ్వరూ నెమ్మదిగా ఓ చోట కూర్చుని కబుర్లు చెప్పుకొని నవ్వుకునే అవకాశం లేదు అక్కడ. ‘ఇదా లోకం – కొత్త లోకం! నేనెన్నడూ చూడని లోకం!’ అనుకున్నాడు.

అమ్మ తన ఎదురుగా సోఫాలో కూర్చుని ఉంది. తనను పరిశీలిస్తోంది. వేణు ఈ లోకంలోకి వచ్చాడు ఆలోచనల పరంపర నుండి; “కాసేపు విశ్రాంతి తీసుకో నాయనా” అంది.

ఈలోగా తండ్రి సదాశివరావు గారు వచ్చారు. “అరే, వేణూ ఎంత సర్‌ప్రైజ్! చాలా సంతోషంగా ఉంది. ఒక్కడే వచ్చావా? కోడలు ఏది? అంతా బాగున్నారా, విశేషాలు ఏమిటి? ఏదైనా ట్రాన్స్‌ఫర్ అయిందా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

“లేదు డాఢీ. నేను ఒక్కడినే వచ్చాను”అన్నాడు.

సదాశివరావు వేణును గమనించి, ముఖం నీరసంగా, నిశ్చేష్టగా ఉన్న సంగతి అర్థం చేసుకున్నారు.

“కొంతసేపు రెస్ట్ తీసుకుంటావా. ఓసారి తోటలోకి వెళ్తావా” అన్నది అమ్మ.

“ఆ, కాసేపు తోటలో తిరిగి వస్తాను” అని, స్నానానికి లేచాడు వేణు.

తల్లిదండ్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆందోళన! ఏం జరిగిందో, ఏమిటో, అందుబాటు లేదు. “అబ్బాయి పెద్ద షాక్‌లో ఉన్నాడు”అంది పార్వతి.

“అవును. వాడే చెప్తాడులే. ఓపికతో ఉందాం. పాపం, మనస్సులో ఎంత బాధ మోస్తున్నాడో బిడ్డ” అన్నారు సదాశివరావు.

ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ అయింది. అమ్మానాన్నల దగ్గర కూర్చుని వేణు ఇలా చెప్పుకుని వస్తున్నాడు. “పెళ్లయింది. జీవితం హాయిగా గడుస్తుందని అనుకున్నాను. వివాహం అయ్యేక జీవిత భాగస్వాములు ఇద్దరూ, ఒకరినొకరు అర్థం చేసుకుని, ఓరిమి పెంచుకుని, చిరునవ్వుతో మీ అందరి వలెనే రోజులు గడుపుతారు అనుకున్నాను. కానీ.. నాకా అదృష్టం లేదమ్మా”

కళ్ల నీళ్లు ఒకసారి తుడుచుకుని జరిగిన సంఘటనలు కొన్ని చెప్పాడు. ఆశ్చర్యపడటం అమ్మానాన్నల వంతు అయింది. దుఃఖం, కోపం, ఆవేశం, ఆవేదన, అన్ని పెన వేసుకుని, మాటలు కరువై, అలా రాయిల్లాగా ఉండిపోయారు.

“రాను రాను వినీత తన ఇష్టారాజ్యం కింద ప్రవర్తించేది. ఆదివారాలు ఎప్పుడూ నలుగురు స్నేహితులను ఇంటికి పిలిచేది. అంతా కలిసి అరుపులు, కేకలు, భోజనాలు, స్నాక్స్, రాత్రి దాకా కబుర్లు. నన్నొక పనికిమాలిన వాణ్ణిగా చూసేవారు.

“వెరీ బాడ్ విన్నూ. ఇలాంటి రాతియుగం మనిషి నీకు హబ్బీ ఏంటి? అంటూ గేలి చేసేవారు”.

నేను భరించలేకపోయాను. ఒక రోజు సీరియస్‌గా ఆమెను పిలిచి “వినీతా, నేను చెప్పే విషయాలు శ్రద్ధగా విను. పెళ్లి అయిన తర్వాత జీవితం ఇంత అల్లకల్లోలంగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను నిశ్శబ్దాన్ని, శాంతిని ఇష్టపడతాను. నా వృత్తికి అవి అవసరం. ఏకాగ్రత, ఏకాంతం కావాలి. ఇంత డిస్ట్రర్బ్‌డ్ లైఫ్ నేను తట్టుకోలేకపోతున్నాను. నీవు నీ పద్ధతులు మార్చుకో. మనం హాయిగా ఒకరికొకరు కలిసి ఉందాం” అన్నాను.

ఆమె వెంటనే రాష్‌గా, సోఫాలోంచి లేచింది. “నో వెన్నూ, నీ పద్ధతి నాకు పరమ రోతగా ఉంది. మన ఇద్దరికీ సరిపడదు. Let us get out of this bond. నేను ఇప్పటికే లాయర్‌ను కన్సల్ట్ చేసేను. డైవోర్స్‌కు అప్లయ్ చేసేను. కొద్ది రోజుల్లో పేపర్లు వస్తాయి. కామ్‍గా విడిపోదాం, ఎవరి దోవ వారిది” అంది.

నాకు మతిపోయింది. నోట మాట రాలేదు. వారం కిందట ఆ పేపర్స్ వచ్చేయి. నా చేతిలో పెట్టింది వినీత” అని ఆ ఫైల్‌ను అక్కడ టీపాయ్ మీద ఉంచాడు వేణు.

ప్రశ్నార్థకంగా చూస్తున్న తండ్రితో “అవును డాడీ, ఇప్పుడు డబ్బుతో కొనలేనిది ఏముంది చెప్పండి? లాయర్లు కూడా స్మార్ట్ అయ్యారు” అన్నాడు.

సరే – ఇప్పుడు కర్తవ్యం ఏమిటి?? మనం ఏం చేయాలి? అన్నారు సదాశివరావు. “నీ మనసులో మాట చెప్పు వేణు” అన్నది పార్వతి అతని పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని.

“అమ్మా, ఆమె తల్లిదండ్రులను పిలిచి మాట్లాడటం వేస్ట్. బహుశా ఈమె జోరు వాళ్లకు తెలియదేమో. అయినా ఇంక సాధించేది ఏముంది కనుక” అన్నాడు వేణు. “అమ్మా, రెండు రోజుల్లో నేను బెంగళూరు వెళ్తాను. వీలైతే జరిగిన నిజాలన్నీ చెప్పి ఎవరైనా అనుకూలంగా ఆలోచించే అమ్మాయి దొరికితే, నా అదృష్టం బాగుండి నన్ను దేవుడు అనుగ్రహిస్తే, మీరు మాట్లాడి, నన్ను పిలవండి. మనం అంతా కూర్చుని విషయాలు ప్రస్తావించుకొని, ఇష్టమైతే అలాంటి అమ్మాయిని చేసుకుంటాను” అన్నాడు.

“సరే వేణూ. మా ప్రయత్నం మేం చేస్తాం” అన్నారు సదాశివరావు.

రెండు నెలల తర్వాత వేణుకు ఇంటి నుండి ఫోన్ వచ్చింది. “గోపాల్ రావు గారు అని, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సాధారణ ఉద్యోగి, సాంప్రదాయమైన కుటుంబము. ఇద్దరు అమ్మాయిలు. ఆఖరున ఆలస్యంగా ఒక కుమారుడు; వారి పెద్ద కూతురు మహాలక్ష్మి. బి.కామ్. చదివి అక్కడే చిన్న కంపెనీలో పని చేస్తోంది”అన్నారు తండ్రి.

సదాశివరావు, పార్వతి వారిని కలిసి, వేణు సంగతి వివరంగా నిజాయితీగా చెప్పారు. ఆమెను వ్యక్తిగతంగా అడిగారట. తనకు సమ్మతమే అన్నదట.

వేణు వచ్చేక అంతా కలుసుకున్నారు. లక్ష్మితో వేణు తన ఆవేదన వివరించాడు. అందరూ ఆమోదించాక సింపుల్‌గా వివాహం జరిగింది.. లక్ష్మిని తనతో తీసుకెళ్లాడు వేణు. ఇద్దరు హాయిగా జీవనయానం సాగిస్తున్నారు.

ఒక్కోరోజు ఎంతో సీరియస్‌గా పనిలో ఉన్న వేణుని చూసి, “నేను ఏమైనా మీకు హెల్ప్ చెయ్యనా, నాకు కంప్యూటర్ పై పని చేయడం తెలుసు” అనేది లక్ష్మి. “వద్దులే లక్ష్మి, నీవు అలా చిరునవ్వుతో ఉండి పలకరిస్తూ, నా చెంత ఉంటే, ఎంతో హాయి” అంటాడు వేణు.

సదాశివరావు గారి ఇంటి ప్రక్కన ఒక డాబా ఇల్లు ఉంది. భవాని గారు అందులో ఉంటుంది. పార్వతి తన బాధలు ఆమెతో పంచుకుంది. ఆమె పార్వతిని ఓదార్చి, “మంచివాళ్ళకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. భగవంతుని దయ తప్పక ఉంటుంది” అని ధైర్యం చెప్పేది.. జరిగిన శుభకార్యానికి భవాని చాలా సంతోషించింది. “పార్వతమ్మా, చూసేవా, కుటుంబం ఎంత తియ్యని వ్యవస్థ! దానికి పునాది మూలం –  అన్నీ భార్యాభర్తలేనమ్మా. ఈ బంధం పరస్పర అనురాగంతో పెనవేసుకునాలి. ఆడవారికి ఓర్పు అవసరం. అన్ని సమాజాల్లోనూ మొదట్లో పురుషులే ఇంటి బయట ఉపాధికి వెళ్లేవారు. ఇంటిలో పిల్లలు కూడా పది మంది దాకా ఉండేవారు. రోజులు మారేయి. ఆడవారు చదివి, ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కొక్కచోట ఆర్థికంగా వెసులుబాటు పెరిగిన కొద్దీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. తమ పిల్లలను, ఆడ, మగ అనే భేదం వదిలి జాగ్రత్తగా పెంచాలి. విలువలు నేర్పాలి. ఆలుమగలు ఇద్దరూ సంసారమనే బండికి రెండు చక్రాలు అని చెప్పాలి. అనురాగంతో ఒకరినొకరు అర్థం చేసికొన్న దంపతులకు, సంతానం కలిగి, చక్కని వాతావరణంలో పెద్దవారు అవుతారు. అట్టి పిల్లలు మంచి యువతీ యువకులుగా ఎదిగి, కుటుంబానికి, సమాజానికి పుష్టిని పెంచుతారు. సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఈమధ్య నేను మరో సంఘటన విన్నాను  పార్వతమ్మా”. అని ఇలా చెప్పుకుని వచ్చారు.

“మన పక్క వీధిలో, ఆనందరావు గారని మంచి పేరున్న లాయర్ గారు ఉన్నారు. వారి పెద్దబ్బాయి శేఖర్. పెళ్లయింది సుమారు రెండు ఏళ్ల క్రితం. అతనూ లా చదివేడు. కోర్టులో ఆఫీసరు. అమ్మాయి సుమలత అత్తవారింటికి వచ్చింది. ఆ ఇల్లు ఒక కంచుకోట. అక్కడ ఏం జరుగుతున్నదీ ఎవరికీ తెలియదు.

సుమను అత్తగారు, ఆడపడుచు సాధించి, కొట్టి, ఈడ్చి, నరకం చూపించారట. ఒకరోజు ఉదయం ఏడు గంటలకు ఆమె పెట్టె వీధిలో పడవేసి “ఫో, మీ ఇంటికి ఫో” అని తరిమేసేరట.

“అయ్యో, అంత అన్యాయమా” అంది పార్వతి.

“ఆ, భర్త శేఖర్. కొన్ని చూసేడు. కొన్ని అతనికి తెలియదు. పని ఒత్తిడి వల్ల రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరేవాడట. సుమ మౌనంగా అన్నీ సహించింది. భర్తతో ఏమీ చెప్పలేదు.”

“నీ భార్య రాకాసి, ఒక్క పని చేతకాదు. కూర్చుంటుంది. పలకదు. మాకు విసుగేసి, ఇంటి నుంచి పంపేసేము” అని తల్లి చెప్పిందట. చెల్లి కూడా మరిన్ని నేరాలు కల్పించి మోసింది.

సుమలత తల్లిదండ్రులకు భారం కాకుండా చిన్న ఉద్యోగం సంపాదించి బ్రతుకుతోంది.

రెండేళ్ల కాలంలో ఎన్ని మార్పులు! కాల మహిమ! ఆడపడుచుకు పెళ్లయింది. భర్తతో వెళ్లింది. తమ్ముడు సోము కూడా పెళ్లి చేసుకుని భార్యని తీసుకొని ఉద్యోగం కోసం ఊరు వెళ్లిపోయేడు. శేఖర్ అలా మిగిలేడు.

వాళ్ల అమ్మ అతన్ని చేతగాని వానిగా లోకువ చేసింది. “నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఎవరు భోజనం పెట్టగలరు? అన్నీ టేబుల్ పై ఉంచుతాను పెట్టుకుని తిను” అనేదట. తాను ఒంటరి కదా!! అవును.

శేఖర్‌కు తల తిరిగింది. గతంలోకి తొంగి చూసుకున్నాడు. సుమ ఎంత మంచిది. ఒక్కనాడు ఎవరి గురించీ చెడు చెప్పలేదు.. చేతులారా ఆమెను తను దూరం చేసుకున్నాడు. ‘ఛీ ఎంత తప్పు చేసేను’ అనుకున్నాడు.

ఒకరోజు ధైర్యంగా శేఖర్ సుమలత ఇంటికి వెళ్లి వీధి తలుపు బెల్ కొట్టేడు. సుమ తలుపు తెరిచింది. రెండు మూడు నిమిషాలు ఇద్దరూ స్థాణువుల్లా నిలబడ్డారు. ఆమెను దగ్గరకు తీసుకుందాము అనుకున్నాడు శేఖర్. ధైర్యం సరిపోలేదు. ఆమెతోపాటు ముందు గదిలో నాలుగు అడుగులు వేసి ఒక సోఫాలో కూర్చున్నాడు.

“సుమా, ఐ యామ్ సారీ. నీ పట్ల నేను పశువులా ప్రవర్తించేను. నేనొక అర్హత లేని భర్తను. నా భార్యను అవమానాల నుండి కాపాడలేని నా బ్రతుకు వృథా” అని వలవల ఏడ్చాడు.

సుమ ఆశ్చర్యపడింది. మౌనంగా చూస్తూ ఉన్నది.

“సుమా, నన్ను క్షమించు. నేను ఆ ఇంట్లో ఉండను. నీవు నన్ను భర్తగా అంగీకరించు. వేరే ఇల్లు తీసుకుని మనిద్దరమూ హాయిగా ఉందాము. ప్లీజ్” అంటూ నేల మీద కూర్చుని ఏడ్చేసేడు.

సుమలత ఇంకా మౌనం గానే ఉంది. ఆలోచించింది. ఐదు నిమిషాలకు తేరుకుంది. “నేనేం చెప్పగలను. నాన్న పోయారు, బెంగతో. అమ్మ ఒంటరిది. నాతో ఆమె ఉన్నది. ఇలా బ్రతుకుతున్నాను” అంది.

“అదొక పెద్ద విషయమా? నా బాధ్యత; అత్తయ్య గారు మనతోనే ఉంటారు” అన్నాడు. “ఆలోచించు” అని కాసేపు కూర్చుని వెళ్లేడు.

సాయంత్రం తన మంచి మిత్రుడిని, అతని భార్యను, తన వెంట తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ, సుమలతను, వారి అమ్మ గారిని, కలిసి విషయాలు చెప్పి, “శేఖర్ మంచివాడే, అజ్ఞానంతో బాధపడ్డాడు. తప్పు తెలుసుకున్నాడు, పెద్ద మనసు చేసుకోండి”, అని వారిద్దరితో చెప్పారు. ఆ విధంగా శేఖర్, సుమలు కలిసి ఉంటున్నారు.

కనుక పార్వతీ, నిజానిజాలు తెలుసుకుని, ఈ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఇతర దేశాల వాళ్లు, ఇండియాలోని ఈ కుటుంబ వ్యవస్థను చూసి ఆనందించి, అనుకరించాలని చూస్తున్నారు. మనం వెర్రిగా వాళ్లను అనుకరించాలని తపన పడుతున్నాం. నేటి యువతకు, వేషం, భాష, మారేయి. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు అంటూ అసహనంతో ఆలోచిస్తున్నారు. ‘సహజీవనం’ట. అది మరో చెత్త. అలాంటి పోకడలకు వెళ్లకుండా మన సమాజం ముందుకు వెళ్లాలి. మన విలువలను మనం కాపాడుకోవాలి” అన్నారు భవాని.

Exit mobile version