Site icon Sanchika

తడి ఆరని కథలు – లచ్చుంబాయి

[dropcap]డా. [/dropcap]రూప్ కుమార్ డబ్బీకార్ రచించిన 11 కథల సంపుటి ‘లచ్చుంబాయి’. ఇందులో – జానిమాజ్, తెలియండ, గుంటెల్లిగాడు, మర్కపిల్ల – దాగ్, వేపచెట్లు, లచ్చుంబాయి; అతడు, నేను – రెండు తీరాల నడుమ; బతుకమ్మ, ఎదురు ప్రవాహాలు, తల్లు – అనే కథలు ఉన్నాయి.

***

“జీవన సంఘర్షణల్ని ప్రాణవంతంగా చిత్రించి అంతరంగంలోని తడుల్ని, ఒత్తిడుల్ని మంచి కథలుగా తీర్చిదిద్దిన రచయిత డా. రూప్ కుమార్ డబ్బీకార్. రూప్ కుమార్ రచించిన పదకొండు కథల సంపుటి ‘లచ్చుంబాయి’. ఇది రచయిత తొలి కథల సంపుటి. అయినప్పటికీ రచయిత జీవనానుభవసారస్థుడు.

~

రూప కుమార్ కథల్లోని పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు, సంఘర్షణలు జీవితంలో తడిసి వచ్చినందువల్ల తడితడిగా తగులుతాయి. తెలంగాణ స్వచ్చత, మానవీయత కథల్లో ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రధానంగా నల్గొండ పట్టణ పరిసరాలు, అడపాదడపా గ్రామీణ పరిమళాలు, తరచుగా చుట్టూరా కనబడే మనుషులు, లోపల దాచుకున్నా ఒలుకుతున్నదుఃఖాలు, సర్దుకుపోతూనే బయటపడే సంఘర్షణలు, తెగిపోతున్న బంధాల నడుమ సుడివడుతున్న ప్రేమలు, మారుతున్న విలువలు, తిరిగి విలువల కోసం పాకులాడుతున్న మనస్తత్వాలు, సాగనివ్వని కాలం సాగక తప్పని బతుకులు, బరువు బరువుగా సాగే సన్నివేశాలు రూప్ కుమార్ మన కళ్ళ ముందుంచాడు.

~

రూపుమార్ రచనాశైలి విశేషమైంది. హృదయంగమంగా సాగుతుంది. జీవితాన్ని, వివరాల్ని చిత్రించినంత బలంగా లోపలి అనుభవ సాంద్రతను తాత్విక కోణాల్ని చిత్రించటం మరో నైపుణ్యం. కథను ప్రతీకాత్మకంగా నడిపే పద్ధతి రచయిత సాధించిన ప్రత్యేక శిల్పం.

~

రూప్ కుమార్ తెలంగాణకు కలిసివచ్చిన మంచి కథా రచయిత. మనలో మగతలో జోగుతున్న మానవీయ పార్శ్వాల్ని మేల్కొల్పుకోవటం కోసం రూప్ కుమార్ కథలు చదువుకుందాం. బాధ్యతెరిగిన రచయితలు ఎదుటివాళ్ల బాధ్యతను ప్రేరేపించటానికి రచనలు చేస్తారు. అభిరుచులు కోల్పోతున్న తరానికి, స్పందనలు కొరవడుతున్న సమాజానికి రూప్ కుమార్ రచనలెంతో అవసరం. మనుషుల్లో సంస్కారాన్ని, సంఘంలో చైతన్యాన్ని పెంపొందిచటానికి రూపుమార్ మరిన్ని మంచి కథలు రాయాలని, రాస్తారని కోరుకుంటున్నాను.” అని వ్యాఖ్యానించారు శ్రీ నందిని సిధారెడ్డి తన ముందుమాట ‘కసరు కడిగిన కన్నీటి కథలు’లో.

***

“కవిగా ప్రారంభమైన నా సాహితీ ప్రయాణంలో మజిలీలు వేసిన చోట కొత్త అనుభవాలను పోగు చేసుకునే నేపథ్యంలో భాగంగా సమీక్షకుడిగా, విమర్శకుడిగా మారడం జరిగింది. ఏ రచనయైనా ఇష్టంగా చదువుతాను. అలా చదువుతున్న సందర్భంలో కలిగే ఒకటి, రెండు స్పందనలను అక్షరీకరించి సమీక్ష చేయడమో, వివేచనాత్మకంగా పరిశీలించడమో జరిగేది. ఈ ప్రయత్నంలో ఆ రచన ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలనే తాపత్రయమే ఎక్కువ. ఇందుకు ఇతరుల రచనలతో పాటు పత్రికా సంపాదకులు, సాహితీ మిత్రుల సహకారాలు నాకు పునాది రాళ్ళవంటివి. ఏ ప్రయాణమైనా మిగిల్చేది అనుభవాలు, జ్ఞాపకాలే. సమాజాన్ని గమనిస్తున్నప్పుడు అనేక సంఘటనలు, అనుభవాలు, సంవేదనలు ఎదురవుతాయి. వాటిని సాధారణంగా కవితల్లో ఒడిసిపడతాను, కొన్నిసార్లు అవి కవితల్లో ఒదగనప్పుడు కథలుగా రూపాంతరం చెందుతాయి. అలా అందిన అనుభవాల సమాహారమే ఈ కొన్ని కథలు.” అన్నారు రచయిత తన ముందుమాట ‘కాలాన్ని తవ్వుకుంటూ….’లో.

***

రూప్ కుమార్ డబ్బీకార్ గారి రచనా శైలి, కథా శిల్పం అద్భుతంగా, వైవిధ్యంగా వుండి పాత్రల భావోద్వేగాలు, సంవేదనలతో పాఠకుడిని అలజడికి గురి చేయడమేగాక, కథల్లోని సారం కథకుడి జీవితంలోని వైవిధ్యమైన అనుభవపు పొరల్లోంచి దూసుకువచ్చి మనసుపై, మస్తిష్కంపై తిష్ట వేసి అనేక చిత్రాలకు దృశ్యం కడతాయి. కథలు చదివినంత మేర, పాఠకుడు అనేక జీవితాల అనుభవాలను స్పర్శించి ఒక అవ్యక్తమైన అనుభూతిని మనసులోకి వంపుకుంటాడు. వంతెన లాంటి మనసుగల రచయిత తన కథలతో కథాసాహిత్యంపై చేసిన మరో సంతకం ‘లచ్చుంబాయి’ ” అని పేర్కొన్నారు శ్రీ అహోబిలం ప్రభాకర్ వెనుక అట్టపై.

***

లచ్చుంబాయి (కథలు)
రచయిత: డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌
పేజీలు: 111, వెల: ₹ 100
ప్రతులకు: రచయిత, ఫోన్‌ 99088 40186.
పాలపిట్ట బుక్స్‌, ఫోన్‌: 98487 87284

Exit mobile version