(04 మే 2023న శ్రీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా నరసింహ స్వామి అవతార ప్రాశస్థ్యం పై చిన్న వ్యాసం అందిస్తున్నారు పాణ్యం దత్తశర్మ)
[dropcap]భ[/dropcap]గవంతుని అన్ని అవతారాలలో విశేషమైనది నృసింహవతారం. “హిరణ్య స్తంభసంభూతి ప్రఖ్యాత పరమాత్మనే” అని ఆ నృసింహస్వామిని మంగళాశాసనంలో ప్రస్తుతిస్తారు. ఆ మహోగ్ర రూపం స్తంభం నుండి, దాన్ని చీల్చికొని బయటకు వచ్చిన దినమే నృసింహ జయంతి. ఈ శ్లోకంలో స్వామి వారి భౌతిక రూపాన్ని, అంతస్తత్త్వన్ని మనోహరంగా వర్ణించారు.
శ్లో.
సత్యజ్ఞానసుఖస్వరూపమమలం
క్షీరాబ్దిమధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనం
భూషాసహస్రోజ్జ్వలమ్
త్ర్యక్షం, చక్రపినాకసాభయకరాన్
బిభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం,
లక్ష్మీనృసింహం భజే.
స్వామివారు సత్యము, జ్ఞానము, సుఖముల స్వరూపము. ఉగ్రరూపం తాత్కాలికమే. అనంతమైన దారుణమైన దుర్మార్గాన్ని తుదముట్టిచడానికి అది అవసరమైంది. తర్వాత పరమ భాగవతోత్తముడైన బాలప్రహ్లాదుని బ్రోచుటకు శాంత నరసింహుడైనాడు. యోగారూఢుడట స్వామి. ప్రసన్నవదనుడు. శ్లోకంలో మిగిలిన దంతా ఆయన భౌతిక వర్ణన. ప్రతి యింట్లో కొలువు తీరే స్వామి రూపం ఇలాగే ఉంటుంది.
అన్నమాచార్యుల వారు, వేంకటేస్వర స్వామి వారి మీద తర్వాత ఎక్కువ కీర్తనలు నరసింహస్వామి వారి మీదనే వ్రాశారు. “వేదములే నీ నివాసమట విమల నారసింహా!” అని ఆయనను ప్రస్తుతించారు. ఆయనను నాద ప్రియుడన్నారు. “సురలు జయవెట్ట, నసురు లెల్ల మొరవెట్ట” నరసింహవిభుడు తన ఔద్ధత్యము చూపినాడని వ్రాశారు.
‘నృసింహ కవచమ్’లో చివరగా వచ్చే శ్లోకంలో స్వామి వారి ఆవిర్బావ ఘట్టం గుండెలదిరేలా వర్ణించబడింది.
శ్లో.
గర్జంతం గర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హఠంతమ్
రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతమ్
క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతమ్
వీక్షంతం ఘూర్ణయంతం శరనికరశతైః దివ్యసింహం నమామి
నరసింహుడు వినాశము నుండి రక్షణ యిస్తాడు. చెడును, భయాన్ని దునుముతాడు. ఆయన యోగమునకు కాలమునకు ప్రభువు. వైఖానస ఆగమములో స్వామివారి గురించి వివరంగా చెప్పబడింది. ఆయనకు అగ్నిలోచనుడని, భైరవాడంబరుడని, కరాళుడని, నఖాస్త్రుడనీ నామాంతరాలున్నాయి. నృసింహ, నరసింహ, నారసింహ ఇవన్నీ పర్యాయపదాలే. ‘ఋణవిమోచన నృసింహస్తోత్రమ’ని ఉంటుంది. ఇది ఆర్థికపరమైన అప్పులు తీర్చుకోవడానికని కాదు, మన జీవితంలోని ఎన్నో బంధాలను తెంచుకొని, పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించే స్తోత్రమిది.
శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యగారు చెప్పినట్లు, విష్ణువు అవతారాలలో శ్రీ నారసింహవతారం గురుతత్త్వాన్ని ప్రత్యక్షంగా వెల్లడి చేస్తుంది. దీనిలో శివలక్షణం కూడా గోచరిస్తుందని, సనాతన ధర్మంలో సూచితమయ్యే సమన్యయ సూక్తమిదని ఆచార్యుల వారంటారు. ప్రహ్లాదునికి స్వామివారు గురువు కూడా!
ఆది శంకరులవారు స్వామినిలా వినుతించారు.
“మాతా నృసింహశ్చ పితా నృసింహః, భ్రాతా నృసింహశ్చ సఖానృసింహః
విద్యా నృసింహో ద్రవిణం నృసింహః, స్వామీ నృసింహః సకలం నృసింహః”
నృసింహ క్షేత్రాలు దేశమంతటా ఉన్నాయి. కాని యాదగిరి గుట్టను కలియుగ వైకుంఠంలా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం. సింహాచల క్షేత్రం కూడా బాగా అభివృద్ధి చెందింది.
మంగళమహశ్రీ: దేవర! యహోబిలపు దివ్యశిఖరంబునను దీప్తి నివసించు సేవలను బొందుచును సింహగిరిపై వెలయు శ్రీరమణ! అప్ప! నరసింహ! శ్రీవరద! యాదగిరి శీర్షమున భక్తులను శీఘ్రముగ బ్రోచు నరసింహ! నీవెకద ధాత్రికిని నిత్య శుభమిచ్చెదవు నీకిదియె మంగళమహశ్రీ!