లక్ష్యం

12
1

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి యద్ధనపూడి సులోచనారాణి స్మృతిలో లేఖిని సంస్థ నిర్వహించిన కథల పోటీలలో ద్వితీయ బహుమతి ₹ 8,000/- గెలుచుకున్న కథ ఇది. రచన సి. యమున. [/box]

[dropcap]ఆ[/dropcap]కాశం ముసురు పట్టి సన్నని జల్లు ఆరంభమయ్యింది. చిన్నప్పటినుండీ నాకు వాన అంటే ఎంతో ఇష్టం. బాల్యంలో, వాన వచ్చే ముందు అప్పటిదాకా శూన్యంగా ఉన్న ఆకాశంలో హఠాత్తుగా గుంపులు గుంపులు తూనీగలు వచ్చి ఎగరటం చూసి అబ్బురంగా అనిపించేది, ఎండాకాలం వలన చెట్లు వాడిపోయి, ఇంటి చుట్టూతా మట్టి రంగులో ఉన్న కొండలు, వర్షాలు పడగానే పచ్చటి దుప్పటి కప్పుకున్నట్లుగా మొక్కలతో నిండిపోయేవి. తడిసిన మట్టి వాసన, వీధి చివరి అమ్మవారి గుడిలో పూలు, ధూపం కలసిపోయి వచ్చే సువాసన లాగా గమ్మత్తుగా ఉండేది. పిల్లలందరం చిన్న చిన్న గిన్నెలు వర్షంలో పెట్టి , ఎవరికి ఎక్కువ నీళ్ళు పడ్డాయని తగవులాడుకునే వాళ్ళము. అవన్నీ చిరకాలం గుర్తు ఉండే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు.

పెళ్లి అయ్యి, నా కంటూ ఏర్పడిన ఇంట్లో కూడా వర్షం వస్తే యెంతో హడావిడి. బజ్జీలని ఒకరు, మొక్కజొన్న పొత్తులు కాల్చి ఇవ్వమని మరొకరు… సరదా కబుర్లు, పాటలు… సందడితో నిండిపోయేది. అదంతా గడిచిపోయిన చరిత్ర.

పై చదువులకోసం అబ్బాయి, పెళ్లి చేసుకుని అమ్మాయి పరాయి దేశాలకు వెళ్ళిపోయారు. ఏడాది క్రితం అత్తగారు ఆ తరువాత మూడు నెలలు తిరగక ముందే మామగారు స్వర్గస్తులయ్యారు. నా ఇల్లు ఇప్పుడు పెళ్ళి సందడి ముగిసిపోయి కళ తప్పిన కళ్యాణమండపం లాగా ఉంది.

ఇంట్లోనే కాదు నాలో కూడా మార్పు వస్తోంది. చురుకుదనం తగ్గుతోంది. చేతనకు ప్రతిరూపంగా ఉండే నేను స్తబ్ధతకు చిరునామాగా మారిపోతున్నాను. నేను దీని నుండి బయటపడాలి. ఎలాగో అర్ధం కావటం లేదు. ఎవరన్నా చెపితే బాగుండును.

స్కైప్ లో పిల్లలు ఇంచుమించు రోజు పలకరిస్తారు. ఎఫ్‌బి, వాటస్‌లలో, ఫ్రెండ్స్‌తో ఛాటింగులతో కాలక్షేపం బానే అయిపోతోంది. వారాంతరాల్లో శ్రీవారు, నేను సినిమాకో, షికారుకో పెడతాము. అయినా ఏదో తోచనితనం.

నేను ఊహించలేదు, పరిగెత్తుతున్న జీవితంలో ఇలాంటి శూన్యత ఏర్పడుతుందని. పెళ్లవ్వగానే పిల్లలు, వారి పెంపకం, చదువులు. ఇన్నాళ్ళు వారి జీవితమే నాదని జీవించానా? నాకు ప్రత్యేకంగా ఓ జీవితం, దానికో లక్ష్యం అనేది లేదా! చిత్రంగా గోల్ ఇంకొకరిది, పరుగు నాదా? నా జీవితం వృథా అయిపోయిందా ?

“నువ్వు ఈ కుటుంబానికి పిల్లర్ లాంటిదానివి” అని పాపం శ్రీవారు ఇప్పటికీ అంటూనే ఉంటారు. ‘నీ సపోర్ట్ వలనే అమ్మా, మేము ఇంత బాగా సెటిల్ అయ్యాము’ అని సందర్భం వచ్చినప్పుడల్లా పిల్లలు ఇద్దరూ చెపుతూనే ఉంటారు. కాని తృప్తి లేదు.

మరల నా దృష్టి వర్షం మీదకు మళ్ళింది.

ఎందుకో ఎప్పుడూ యెంతో అందంగా, అద్భుతంగా కనపడే వర్షం ఇప్పుడు అర్ధరహితంగా, నా మనసులోని దిగులును పెంచటానికి ఆకాశం కురిపించే కన్నీళ్ళలాగా అనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా ఊపిరాడని కుటుంబ బాధ్యతలతో ఓ గంట ఏకాంతం దొరికితే బాగుండును అనిపించేది. కాని ఇప్పుడో, కాలం కరగదే, జరగదే అనిపిస్తోంది. అదే ఏకాంతానికి, ఒంటరితనానికి ఉన్న తేడా. అవును, ఏకాంతం మధురమైనది. ఏకాంతం… ఆ పదం మనసును పట్టి కుదిపేసింది. నన్ను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పటి రోజుల్లోకి నెట్టేసింది…

వెంటనే పెరటి గుమ్మంలో కూర్చుని వర్షం చూస్తున్న దానినల్లా చిటుక్కున లేచి హాలులోకి వెళ్లాను. నాలుగు పదులు నిండి ఆరేళ్ళు దాటిన నా నడకలో యవ్వనపు వేగం హఠాత్తుగా ప్రవేశించింది.

హాలు లోకి వెళ్లి దివాన్ మీద పరుపు, దిళ్ళు తీసి ప్రక్కన పడేసి , దానిమీద చెక్క ప్లాంక్ పైకి ఎత్తాను. ఆ అర ఎన్నో తీపి గుర్తుల గని. పిల్లలకి మొదటిగా వేసిన డ్రెస్, షూస్, వాళ్ళు మొట్టమొదటసారి స్కూల్‌కి వెళ్ళినపుడు తీసుకు వెళ్ళిన స్కూల్ బ్యాగ్, వాళ్ళు పలికిన చిట్టి చిట్టి చిలక పలుకులను రికార్డ్ చేసిన క్యాసెట్స్… ఎన్నో, ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఓ ప్రక్కగా గులాబీ రంగు గుడ్డ సంచీ ఒదిగొదిగి చూస్తోంది. అదే నాకు కావలసినది. దానిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాను.

***

ఆ సంచీని గుండెలకు హత్తుకుని భద్రంగా తీసుకు వెళ్లి బెడ్ మీద గుమ్మరించాను. మూట కట్టిన మధురస్మృతులు ఒకదాని వెనుక ఒకటి ఉరికాయి. అవి నా డైరీలు. కొన్నేళ్ళ నా అనుభవాలని, భావాలని నిక్షిప్తం చేసుకున్న అక్షర భాండాగారాలు.

నేను డిగ్రీ చదివిన సంవత్సరాన్ని కాస్త కష్టపడి గుర్తుచేసుకుని గబా గబా నాకు కావాల్సిన ఆ సంవత్సరపు డైరీ కోసం వెతికాను. తొందరగానే దొరికింది. పేజీలు తిరగేస్తూ ఓ చోట టక్కున ఆగిపోయాను. మేఘం బొమ్మ, దాని మధ్యలో ‘ఏకాంతం’ అనీ ఆకుపచ్చ రంగులో రాసిన అందమైన అక్షరాలు. ఆ మేఘం నుండి జాలువారుతున్నట్లు బ్లూ కలర్ ఇంక్‌తో చిన్న చిన్న వాన చినుకులు వేసి ఉన్నాయి. డైరీలో అప్పుడప్పుడు బొమ్మలు వేసి రాయటం అప్పట్లో నాకో సరదా దానివలనే నేను అప్పటి పేజీని ఇంత తొందరగా ఇప్పుడు పట్టుకోగలిగాను. చక చకా అక్షరాల వెంట నా కళ్ళు పరుగులు ఆరంభించాయి…

“ఈ రోజు ప్రొద్దున్నుండీ వాన ఆగకుండా కురుస్తోంది. స్నేహితులందరమూ కాలేజీ నుండి ఇంటికి తడుసుకుంటూ వచ్చాము. తడవటం యెంత బాగుందో! ఇంట్లో వాళ్లకి ‘బస్సు రాలేదని, రిక్షా దొరకలేదని’ అబద్దం చెప్పాము.

అందరూ పడుకున్న ఈ అర్ధరాత్రి, ముందు గదిలోని వెడల్పాటి కిటికీలో ఏకాంతంగా కూర్చుని జరిగిన విషయాలు డైరీలో ఇలా పొందుపరచటం చెప్పలేని అనుభూతిగా ఉంది. ఈ కిటికీలో కూర్చునే సాయంత్రం నుండి ఇప్పటిదాకా ‘లక్ష్యం’ నవల చదివాను. నేను నవల పట్టుకుంటే ఆపకుండా ఏకబిగిన చదువుతానని ఇంట్లో అందరికీ తెలుసు. అందుకే ఎవ్వరూ నన్ను పలకరించలేదు. మురిపెంగా నవ్వుకుంటూ, అమ్మ వేడి వేడి ఉప్మా పళ్లాన్ని కిటికీ దగ్గరకే తీసుకొచ్చి అందించింది. అమ్మల మనసంతా పిల్లల మీద ప్రేమతో కుట్టేసాడేమో ఆ దేవుడు”

చేతిలో డైరీ అలాగే పట్టుకుని ఆనాడు చదివిన ‘లక్ష్యం’ నవల గుర్తుచేసుకున్నాను. సరియైన సౌకర్యాలు లేని ఓ ఆదిమజాతి అమ్మాయి పట్టుదలగా చదివి, టీచర్ ఎలా అయ్యిందనేదే ఆ నవల. అది చదివి, ఎం.ఎస్సీ, చేసి లెక్చరర్ అవ్వాలని అప్పట్లో నేను కూడా కల కన్నాను.

కాని డిగ్రీ అయిపోగానే, మంచి సంబంధం వచ్చింది. ‘వాళ్ళ వెంటపడి అడుగుతున్నారు మీ అమ్మాయిని చేసుకుంటామని. తలుపు తట్టిన అదృష్టాన్ని కాలు అడ్డం పెట్టకూడదు’ అని పెద్దలు గట్టిగా చెప్పి ఒప్పించటంతో కలలో కూడా ఊహించని రాకుమారుడితో పెళ్లి అయిపోయింది. జీవితం అనుకోని మలుపు తిరిగింది. తరువాత సంసారం, భాద్యతలు, పిల్లలు…. ఆనాటి లెక్చరర్ అవ్వాలనే కల ఇన్నేళ్లల్లో కనీసం మళ్ళా కల్లోకి కూడా రాలేదు.

డైరీలో ఇంకొన్ని పేజీలు తిప్పాను. ఓ పేజీలో నీళ్ళపైన పడవ దానిలో వేణువు బొమ్మ. ఆ బొమ్మ క్రింద రాసినది చేతితో తడుముతూ ఆప్యాయంగా చదవటం మొదలెట్టాను….

“ఈ రోజు బామ్మ, ‘ఓడను జరిపే ముచ్చట గనరే….’ త్యాగరాయ కృతి పాడమంది. పాట అవ్వగానే చెమ్మగిల్లిన కళ్ళతో నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ‘కాళిందీ, ఎప్పటికీ సంగీతానికి నువ్వు దూరమవ్వకు’ అని చెప్పింది”

అప్పట్లో రాసుకున్న ఆ వాఖ్యాలు చదవగానే ఎప్పుడో దూరమయి పోయిన బామ్మ నా కళ్ళ ముందు ఇప్పుడు కదలాడింది. మా పెళ్లి లో నా చేత ఎన్ని కీర్తనలు, కృతులు పాడించిందో! అప్పుడు పాడిన ఆ కృతిని గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించాను. కొద్ది కొద్దిగా తుంపులుగా గుర్తుకొస్తోంది. గతాన్ని గుర్తుచేసుకుంటూ తోచినట్లు పాడుకున్నాను.

అలా డైరీలను అటూ ఇటూ తిరగేశాను. బాల్యం, యవ్వనం, కాలేజీ రోజులు, పెళ్లి… మాతృమూర్తిని అవ్వటం, పిల్లల ముద్దు మురిపాలు… అవన్నీ చదివి మనసు ఏదో అలవికాని అనుభూతితో నిండిపోయింది. రెండో బాబు బుడి బుడి అడుగులు దాకా వచ్చి ఆ పైన ముందుకు అడుగులు వెయ్యలేదు నా డైరీలో రాత. చివరగా డైరీలో అక్షరాలు రాసి రెండు దశాబ్దాల పైనే అయ్యింది.

మీద పడ్డ వాన జల్లుకు గబుక్కున తలెత్తి కిటీకీలో నుండి చూసాను. వర్షంలో గుడ్డలు తడిసి పోతున్నాయి. నా ఆలోచనలలో కూరుకుపోయి అది గమనించనే లేదు. చేతిలో డైరీలు ప్రక్కన పెట్టి గబుక్కున లేచి పెరట్లోకి నడిచాను. బట్టలు తీసేలోపే తడిసి ముద్దయ్యాను. చిన్నతనంలో, కాలేజీలో వర్షంలో సరదాగా తడిసి ఆనందపడ్డ రోజులు గుర్తుకొచ్చాయి. “ఇప్పుడు మటుకు ఎవరొద్దన్నారు ఆ ఆనందాలను? అవి నీ చేతిలో ఉన్నవే” అని మనసు అంటున్న మాటలకు ఉత్సాహం చెలరేగి చేతిలోని బట్టలను ఇంట్లో పడేసి హాయిగా వర్షంలో తడిసాను. ఏదో తెలియని సంతోషం. చిన్న చిన్న ఆనందాలకు వయసు అడ్డం కాదు కదా! నాలోని స్తబ్దత పోయి తెలియని చైతన్యం నిండింది. బట్టలు మార్చుకుని భోంచేసి, అలా ఒరిగి గాఢ నిద్రలోకి జారిపోయాను.

***

డోర్ బెల్ కి నిద్దట్లోంచి ఉలిక్కిపడి లేచి వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా పద్మ. వెనుక ఆమె కొడుకు.

“ఏంటి, కొడుకును కూడా పట్టుకొచ్చావా?” అన్నాను వాడి వైపు చిరునవ్వుతో చూస్తూ.

“నాలుగో క్లాస్‌కి వచ్చాడని కొత్తగా వాడికి ట్యూషన్ పెట్టాను కదమ్మా! ట్యూషన్‌లో దింపి ఇటు పనికి వద్దామని బయలుదేరాను. ‘నేను పెళ్లికి వెళ్ళాలి, ట్యూషన్ లేదు’ అంది టీచరమ్మ. ఆ టీచరమ్మ ఏంటో ఊరికూరికే ఏదో సాకు చెప్పి ట్యూషన్ లేదని చెప్పేస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్లి వీడిని దింపి వచ్చే ఓపిక లేక నాతో తీసుకొచ్చాను. రేపు వాడికి పరీక్ష కూడాను. నెలకు 500 రూపాయలు కడుతున్నానమ్మా” అంది దిగులుగా.

ఆ బాబును కూర్చోమని చెప్పి, టి.వి.లో కార్టూన్ ప్రోగ్రాం పెట్టాను. పిల్లవాడు నవ్వుకుంటూ పరమానందంగా టి.వి. చూస్తున్నాడు. బిస్కట్స్ తెచ్చి ఇచ్చాను. వాడిని అలా చూస్తుంటే నాకు నా పిల్లల చిన్నతనమే గుర్తుకొచ్చింది.

“నీకు రేపు ఏం ఎగ్జాం” అన్నాను మాట కలుపుతూ.

“రేపు మాథ్స్ ఎగ్జాం. నాకు చాల ఇష్టం మాథ్స్ అంటే” తింటున్న బిస్కట్‍ను, చూస్తున్న టి.వి.ని పట్టించుకోకుండా ఆపేసి ఉత్సాహంగా అన్నాడు. పిల్లవాడి ఆ ఒక్క చర్యతో తనకి చదువు మీద ఉన్న మక్కువ అర్థమైపోయింది.

బుక్స్ తీయించి టీచింగ్ మొదలెట్టాను అనే కన్నా టీచింగ్‌లో మునిగి పోయాను అనొచ్చు. పద్మ మమ్మల్ని డిస్టర్స్ చెయ్యకుండా పని ముగించుకుని, ప్రక్కింట్లో, వీధి చివర ఇంట్లో పని చేసుకోవటానికి వెళ్ళిపోయింది. తిరిగి తను వచ్చేసరికి ఆ పిల్లవాడిని రేపు పరీక్షకు సంబంధించి ప్రిపేర్ చెయ్యటం అయిపోయింది. చురుకైన వాడే. నా పిల్లలకి నేను టీచింగ్ చేసుకున్న రోజులే గుర్తుకొచ్చాయి.

పద్మ వెడుతున్నప్పుడు ఆగమని “మీ పిల్లవాడికి రేపటి నుండి నేనే ట్యూషన్ చెపుతాను. వాడికి నచ్చితేనే సుమా! ఫీజు వద్దు” అన్నాను నవ్వుతూ.

తన కళ్ళల్లో ఆనందం. ఇంకా ఎవరన్నా ఇరుగూ , పొరుగూ పిల్లలు ఉంటే కూడా తీసుకు రమ్మని చెప్పాను. “అలాగే అమ్మా” అంటూ బాబుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది.

***

ఈ మధ్య, రోజులు ఉత్సాహంగా గడుస్తున్నాయి. దానికి ముఖ్య కారణం సాయంత్రాలు పద్మ కొడుకుతో పాటు కలిసి వస్తున్న అరడజను మంది పిల్లలకి ట్యూషన్ చెప్పటం. వారికి చెప్పటానికి నేను ముందుగా ప్రిపేర్ అవ్వటం కూడా ఓ ఎక్సర్‌సైజ్‌గా అయ్యి ఉషారు నింపుతోంది. శ్రీవారిని ఆఫీసుకు పంపించి, కాసేపు రిలాక్స్ అవ్వటానికి టి.వి. పెట్టుకు కూర్చున్నాను.

“శ్రీమతి కల్పన గారు రచించిన ‘లక్ష్యం’ అనే నవలకు ఈ రోజుకి పాతిక సంవత్సరాలు నిండాయి. ఈ అద్బుతమైన నవల పద్నాలుగు భాషల్లో అనువదించబడింది. ఆరు భాషల్లో సినిమాగా తీయబడి ఘన విజయాన్ని సాధించింది. తెలుగులో నంది అవార్డు కూడా దక్కించుకుంది. మన స్టూడియోకి వచ్చిన శ్రీమతి కల్పన గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చేయబోతున్నాను…” యాంకర్ చెప్పుకు పోతోంది. అది వింటుంటే కాలేజీలో ఉన్నప్పుడు చదివిన ‘లక్ష్యం’ నవలే కాక లైబ్రరీలో చదివిన అనేక ఇతర పుస్తకాలు కూడా కళ్ళ ముందు కదిలాయి. ఎందుకో ఏదన్నా లైబ్రరీకి పెడితే బాగుండుననిపించింది. రెండు వీధుల అవతల ఉన్న లైబ్రరీ మనసులో మెదిలింది.

వెంటనే బయలుదేరి మొట్టమొదటిసారి ఆ లైబ్రరీలో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న వేల పుస్తకాలు చూస్తే నాలో పాత నేస్తాలను కలిసిన భావన. కాసేపు అక్కడే కూర్చుని కొన్ని మాగజైన్స్ తిరగేశాను. తరువాత మెంబర్‌షిప్ తీసుకోవటానికి అవసరమైన ఫారమ్స్ తీసుకుని ఇంటికి బయలుదేరాను.

***

లైబ్రరీ నుండి మంచి సాహిత్య విలువలు కలిగిన పుస్తకాలు తెచ్చుకుని చదవటంతో తెలియని అనుభూతితో మనసు సేద తీరుతోంది. సాయంత్రాలు పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పటంలో నాకు తోచిన సహాయం ఇతరులకు చేస్తున్నాననే తృప్తి లభిస్తోంది.

లైబ్రరీకి వెళ్లి వస్తున్న నేను మా ఇంటి సందు తిరగబోతూ మలుపులో ఉన్న ఇంటికి కొత్తగా తగిలించిన బోర్డ్ చూసి ఆగిపోయాను. ఒక్క క్షణం అక్కడ నిలబడి ఆలోచించి, వెళ్లి బెల్ కొట్టాను. తెరచిన తలుపుల మధ్య ఎదురుగా నవ్వుతూ అరవై ఏళ్ళు పై పడ్డ ఆమె నిలుచునుంది. ఆ బోర్డ్ గురించి అడిగాను.

ఆవిడ నన్ను సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. “మా అబ్బాయికి ఈ ఊరు ట్రాన్స్‌ఫర్ అయ్యి పది రోజుల క్రితమే ఈ ఇంట్లో అద్దెకి దిగాము. బోర్డ్‌లో రాసినట్లు సంగీతం నేర్పించేది నేనే. గత నలభై సంవత్సరాలుగా నేర్పుతున్నాను” అని మృదువుగా చెప్పింది.

నేను పెళ్ళికి ముందు నేర్చుకుని ఆపేసిన సంగీతాన్ని ఆ క్షణాన తిరిగి ఆరంభించాలనిపించింది. అదే కాస్త బిడియపడుతూ ఆవిడతో చెప్పాను. “సంగీతానికి వయసుతో సంబంధం ఏముంది. తప్పక నేర్పిస్తాను” అంటూ ఆవిడ ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడారు. టైమింగ్స్, ఫీజు అడిగి తెలుసుకుని “మళ్ళా వచ్చి కలుస్తాను” అని చెప్పి వచ్చేసాను.

***

ఆ మధ్య ఎప్పుడో పిల్లలు వెంటబడితే చదివిన ఓ పుస్తకంలోని ‘మార్పును ఆహ్వానించాలి. మార్పును అలవాటు చేసుకోవాలి. మార్పును ఆస్వాదించాలి. ఎప్పటికప్పుడు మారడానికి సంసిద్ధులై ఉండాలి’ అనే అద్భుతమైన నాలుగు ఆణిమ్యుత్యాలు ఈ మధ్య మనసులో పదే పదే మెదలుతున్నాయి. నాలో ఇన్నాళ్ళు జీవితం వృథాగా గడిపానన్నే భావన మెల్లమెల్లగా తొలగిపోతోంది. అప్పట్లో పిల్లల పెంపకం, పెద్దవారి బాధ్యత, ఇంటికి వచ్చివెళ్ళే వారికి అతిథి మర్యాదలు మొదలైన వాటితో ఉక్కిరిబిక్కిరిగా వుందేది. ఆ రోజుల్లో ఆ బాధ్యతలను నిర్వర్తించడమే పెద్ద లక్ష్యం. ఆనాడు అది సమర్థనీయమైనదే! ఇప్పుడు ఏర్పడిన ఈ ఖాళీ సమయన్ని ఎలా గడపాలన్నదే సమస్య. దానిని సరిగా గడపటమే నా ముందున్న లక్ష్యం. చాలా ఏళ్ళ తరువాత ఓ నోట్ బుక్ తీసుకుని దానిలో డేట్ వేసి రాయడం మొదలుపెట్టాను.

ఈ మధ్య ఆరంభించిన సంగీతం పాఠాలు చాల ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. ప్రతి రోజూ సంగీత సాధనకే చాల టైం అయిపోతోంది. కాని ఆనందంగా ఉంది. రెండు వీధులు అవతల ఉన్న లైబ్రరీలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రోజూ పుస్తకాలు తెచ్చుకుని చదవటం, తిరిగి ఇవ్వటం… కాలేజీ రోజులే గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో చదివిన ‘లక్ష్యం’ నవల కూడా మరోసారి ఇప్పుడు చదివాను.

‘మీ ట్యూషన్ వలన మా పిల్లలికి క్వార్టర్‌లీలో మంచి మార్కులు వచ్చాయి’ అని పద్మ, తన ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలకు ఎంతో సంతోషంగా అనిపించింది.

ఒకటి అర్థమయ్యింది, జీవిత ప్రయాణంలో లక్ష్యం మారవచ్చేమో కాని అది మూసుకుపోవటం, అంతమవ్వటం అనేది ఉండదు… ఉండకూడదు. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి…

నా మీద నీడ పడటంతో తలెత్తి చూసాను.

“ఏమోయ్, ఆ మధ్య నీలో కనపడిన స్తబ్ధత పోయి తిరిగి పూర్వపు చైతన్యం వచ్చినట్లుంది. యెంత ఉత్సాహంగా ఉన్నా రాణీ గారికి కాస్త రెస్ట్ కూడా అవసరమేమో. ప్రొద్దుపోయింది…” అని నవ్వుతూ ఎదురుగా శ్రీవారు.

‘అవును కదా’ అని రాస్తున్న డైరీ మూసి, చిరునవ్వుతో తనవెనకే నడిచాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here