[dropcap]లే[/dropcap]ఖ, ఉత్తరం, జాబు అనేవి పర్యాయపదాలు. ప్రస్తుతం ఆధునికంగా అవన్నీ మరచిపోయి ‘లెటర్’ అనే ఆంగ్ల పదంలో స్థిరపడిపోయాం. రాయబారాలు, సందేశాలు వంటివి కూడా ‘లేఖలు’ గానే పిలవబడతాయి. ప్రపంచంలో మొట్టమొదటి లేఖ క్రీస్తు పూర్వం మెసపటోమియాలో సెమిటిక్ లిపిలో రాయబడిరదని పరిశోధకుల అభిప్రాయం. లేఖా సాహిత్య విభాగంలో వివేకానందుడు, శరత్, నెహ్రూ లేఖలు ఎంతో ప్రాచుర్యం పొందినవి. లేఖ రాయడం ఒక కళ. ఆత్మీయతకు చిహ్నంగా, అనురాగానికి కానుకగా, అవసరానికి బంధువుగా, ఆవేశాలకు ఆయుధాలుగా, లేఖలు మనకు అనేక విధాలుగా కనిపిస్తూనే ఉన్నాయి.
తెలుగులో లేఖల ప్రాధాన్యం గుర్తించి, వందల వేల లేఖల్ని సేకరించిన మొదటివారుగా సిపి బ్రౌన్‌ను పేర్కొనాలి. బ్రౌన్ సేకరించిన లేఖల్లో కొన్నింటిని బంగోరె ప్రచురించారు. రెండు వందల సంవత్సరాల క్రితం నాటి తెలుగు భాషా స్వరూపాన్ని, సాంఫీుక విషయాల్ని అంచనా వేయడానికి బ్రౌన్ సేకరించిన లేఖలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంద్రగంటి, శ్రీశ్రీ లేఖల్లో అమూల్యమైన సాహిత్యపు విలువ ఉంటుంది. చలం లేఖల్లో నిజాయితీ కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అందుకేనేమో మలయశ్రీ గారు “చలం లేఖలు వివిధ భావాల, రాగాల స్వరపేటికలు” అన్నారు. దాదాపు సమకాలీనులైన కవులు, రచయితలు అందరు లేఖా సాహిత్యంలో తమదైన ముద్ర వేసినవారే. 1939లో విశాఖ నుంచి శ్రీశ్రీ జరుక్ శాస్త్రికి రచించిన ఈ లేఖ ‘తెలుగులో లేఖా సాహిత్యం’ పుస్తకంలో ఈ విషయం ఉంది. అనుభవానందస్వామి, లక్ష్మీ యతీంద్రుల వంటి వారి లేఖలు మరో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. ఆధ్యాత్మికతని విశ్లేషిస్తూ భక్తి తత్వాన్ని వెల్లడిస్తాయి వీరి లేఖలు. కనపర్తి వరలక్ష్మమ్మ గృహలక్ష్మిలో రాసిన ‘శారద లేఖలు’ ఒకప్పుడు 1930-34 కాలంలో ఎంతో సంచలనం కలిగించాయి. లేఖా రచన చెయ్యడం, కుటుంబీకుల, బంధువులు, మిత్రుల, వ్యాపారస్తుల లేఖలు మరో కోణంలో సాగుతాయి. అదీకాకుండా సంస్కార సౌజన్యాలకి, జీవితాంశాల వివేచనకి, స్నేహశీలతకి, ప్రేమ తత్వానికి, భాషా వైవిధ్యానికి లేఖా సాహిత్య పరిశీలన ఎంతో ఉపకరిస్తుంది.
రాను రాను లేఖా సాహిత్యం తక్కువ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒకచోట ఒక లేఖ కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఏదైనా ఒక అంశంపై కవితలు రాయాలని అడగటం, కథల్ని సేకరించడం తరచుగా జరుగుతున్న నేపధ్యంలో లేఖల మాటేమిటి అనే ఆలోచన వచ్చిందేమో, మన కవయిత్రి జ్వలిత గారు ఇటీవల జరుగుతున్న అమానవీయ సంఘటలనల పట్ల కదిలిపోయి ఒక కొత్త ప్రక్రియలో కనుమరుగవుతున్న లేఖాసాహిత్యానికి ప్రాణం పోసి, ఈ ఖండన సమాజానికి తెలిపితే బావుండుననుకున్నారేమో. ఆమె తమ సంపాదకత్వంలో పదికాలాలు నిలిచిపోయే లేఖల అవలోకనాన్ని ‘లేఖవలోకనం’ అనే నామధేయంతో గ్రంథాన్ని వెలువరించడం విశేషం. కాకుంటే పురుషులు కూడా ఈ అకృత్యాలకు నిరసించేవారు లేకపోలేదు అనే మాట నిజం. రాక్షసులున్న రాజ్యంలో దేవతలు కూడా ఉన్నట్లు, మానవ మృగాలున్న ఈ రాజ్యంలో కొందరు మహానుభావులు ఉన్నారంటూ కొందరి పురుషుల లేఖల్ని ఆహ్వానించారు. ఆహ్వానిస్తే మరికొన్ని లేఖలు వచ్చేవేమో.. అయితే నాకు తెలిసినంతవరకు ఇలాంటి గ్రంథం తెలుగు సాహిత్యంలో ఇదే మొదటిసారి అనుకుంటాను. ఈ గ్రంథంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనేకమంది కవయిత్రుల, రచయిత్రుల లేఖలతో పాటుగా సావిత్రి భాయి పూలే లేఖ, ముక్తభాయి లేఖ (తొలి దళిత బాలిక), ఔరంగజేబు తన గురువుకు రాసిన లేఖ, అబ్రహం లింకన్ తన కొడుకు టీచర్ రాసిన లేఖ, బోయ భీమన్న లేఖ వీటిలో ప్రచురించడం ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది. వీటితో కలిసి 70 లేఖలు ఉన్నాయి.
ఈ లేఖలన్నీ ఒకే అంశంపై అంటే పసిపిల్లలపై లైంగిక హింసను ఖండిస్తూ సాగాయి. ఈ లేఖలు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పలకరింపు, క్షేమ సమాచారాలు, జరుగుతున్న సంఘటనలు లాంటివి సాధారణంగా లేఖలకు మూలసూత్రాలు. కాకుంటే ప్రపంచం ఎంతగా అత్యాధునికం లోకి ప్రయాణిస్తున్నా, ఇంకా ఇంకా స్త్రీల పట్ల నిత్యం జరుగుతున్న అమానుషాలు, అకృత్యాలు, మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడితో ఆగకుండా నీచులు నికృష్టులు కొందరు పసిపిల్లలను కూడా వదిలిపెట్టకుండా చెరపెడతున్నారంటే వీరిని ఉరి వెయ్యాలా? లేక ఖండ ఖండాలుగా నరికి వీధుల్లోకి విసిరివెయ్యాలా కూడా అర్థం కాని స్థితి. జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటుంటే ఆడబిడ్డను కనడమే తప్పు చేస్తున్నామా? అనే సందిగ్ధంలోకి మహిళాలోకం జారిపోతోంది. వీటికి కారకులు ఎవరు? అని గానీ, ఇంతటి నీచానికి ఎందుకు ఒడికడుతున్నారు అని గానీ, అసలు వీరు ఇలా కావడానికి కారణాలు ఏమిటి అని గానీ విచారించడం అనేది ప్రభుత్వం, సంబంధిత అధికారులు దాదాపుగా మరచిపోయారు. కాస్సేపు ప్రెస్‌మీట్ పేరిట వచ్చీరానీ భాషను మాట్లాడే ఒక వ్యక్తిని నియమించడం, వారి వెనకాల ముసుగు వీరుల్ని కొందర్ని నిలబెట్టడం ఆ తర్వాత జనం తిరగబడితే వారిని చంపేయడం, లేకుంటే జైళ్ళలో పెట్టి పోషించడం జరుగుతోంది. అసలు ఆ నేరం చేసింది వారేనా? దొరికిన వారిని చెరబెట్టి చేతులు దులుపుకుంటున్నారా? అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సంఘటలనల వెనుక ఎవరున్నారు అనే విషయం కనుమరుగైపోయి కొన్ని విగత దేహాలు సమాధానంగా మిగిలిపోతున్నాయి. వీటి ఆంతర్యం కనుమరుగైపోతోంది. మళ్ళీ కొన్నాళ్ళకు మొదలు. మళ్లీ ఇదే పరిస్థితి. ఇలా అయితే ఎలా? మహిళల సంఖ్య తగ్గటం గురించి కూడా అందరికీ అవగాహనకు వస్తోంది. అయినా ఎవరి ఆలోచనల్లోనూ మార్పు రావడం లేదు.
ఇలాంటి సంఘటనలపై ఎన్ని కలాలు తమ సిరాను ఝుళిపింయాయో, ఎన్ని గొంతులు రోడ్డుపై ఘోషించాయో, ఎన్ని గుండెలు రగిలిపోయాయో ఏ భాషలో చెబితే ఇలాంటి మృగాలకు అర్థమవుతుంది? నా తల్లి మాత్రమే తల్లి, నా చెల్లి మాత్రమే చెల్లి, నా కూతురు మాత్రమే కూతురు. నా మనవరాలు మాత్రమే మనవరాలు మిగతావారంతా నేను వాడుకుని ఆడుకుని పారేసే అవయవాలు మాత్రమే అనుకునే నీచ నికృష్ట పురుష సమాజాల మెదడుల్ని ఏ సర్ఫ్‌తో ఉతకాలి? మంచి ఆలోచనలు రావడానికి ఏ సబ్బును వాడి బండపై మోదాలి? అర్థం కావడం లేదు. ఇలాంటి సంక్షోభంలో కలిగే ఆవేదనే ఇలా ఈ లేఖల రూపంలో ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి.
లేఖ రాయాలన్నా, కథ రాయాలన్నా, కవిత రాయాలన్నా ప్రముఖులు, వర్థమానులు అనే ప్రత్యేక శబ్దం అవసరం లేదని నా అభిప్రాయం. ఏదయినా ఆ సంబంధిత గుండె ఘోష తాలూకు భావాలే కనుక ప్రతి లేఖా ఆర్థ్రత నిండిన కలశమే. అమ్మకో ఉత్తరం రాసిన సూర్యాధనుంజయ్, స్నేహితురాలికి లేఖరాసిన ఓరువాల సరిత నరేష్ , నేటి పరిస్థితుల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్న కట్టా శ్రీనివాస్ బిడ్డకు రాసిన లేఖ, సమాజాన్ని ప్రేమగా పలకరిస్తూ తప్పొప్పులు వివరించే కుప్పిలిపద్మ డియర్‌కు రాసిన లేఖ, కెఏఎల్ సత్యవతి రచించిన అమ్మకు లేఖ, కవితకు లేఖ రాసిన కె.వినోద, వదినగారికి లేఖ రాసిన గోళ్ళమూడి సంధ్య, ఈ బాధ ఎవరికి చెప్పినా వృథా అనుకుని ఏకంగా అలంపూరి జోగులాంబకు అభ్యర్థనా లేఖ రచించిన జోషి పద్మావతి, దేవరకొండ జ్యోత్స్నాదేవి, ఝాన్సీ కె వి కుమారి శత్రువుకు రాసిన లేఖ, చీదెళ్ళ సీతాలక్ష్మి లేఖ, మిత్రునికి లేఖ రాసిన తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, మిత్రమా అంటూ సమాజ చిత్రాన్ని అక్షరీకరించిన తిరునగరి దేవకీ దేవి లేఖ, నన్నపనేని విజయశ్రీ లేఖ, మనుమరాలికి లేఖ రాసిన నర్మదారెడ్డి, ఆడపిల్ల మనసును తెలుసుకుని, సున్నితంగా తమ ఆలోచనల్లో మార్పురావాలని తెలియజేసే తులసి గుగులోత్, జాడలేని నీకు నా లేఖ, అజ్ఞాత మిత్రునికి లేఖ రాస్తూ ఆడపిల్లను సున్నితంగా హెచ్చరించే డా.కె.గీత, ధరణీప్రగడ వెంకటేశ్వర్లు స్నేహితునికి రచించిన లేఖ, నువ్వు లేని వెలితిలోంచి వెలువడ్డ కాంతిరేఖల్ని అక్షరీకరించి లేఖించిన బి.వి.వి.ప్రసాద్, తమ పెద్దమ్మకు లేఖ రాసిన బైరి ఇందిర, కుమార్తెకు జాగ్రత్తలు చెబుతూ రచించిన మర్రి జయశ్రీ లేఖ ఇలా ఒక్కటేమిటి? అనేక లేఖలు, ఇందులోని భావాంశాలు చదువుతుంటే మనసు కన్నీటిలో ముంచిన కాగితంలా ముడుచుకుపోతుంది.
అన్నీ లేఖల్ని వివరించి విశదీకరిస్తే మరో ఒక కావ్యమై నిలుస్తుంది. కాకుంటే కొన్ని మాటలు నన్ను ఎపుడూ తరుముతుంటాయి. వాటిని మీ ముందు ఉంచుతాను. మహిళను మహిళ గౌరవించుకున్నప్పుడు, మహిళను సాటి మహిళ కాపాడుకోవాలనుకునే తపన ఏర్పడినప్పుడు, కూతురుకో న్యాయం, కొడుకుకో న్యాయం అని ఇంకా వ్యత్యాసాన్ని చూపుతున్న అమ్మలు కనుమరుగైనప్పుడు, కూతురైతేనే బాధ పడుతుందని, కోడలైతే ఎంత బాధపడినా పర్వాలేదు అనుకునే అత్తలు పూర్తిగా మారినప్పుడు, కులం ఏదైనా, మతం ఏదయినా, ప్రాంతం ఏదయినా ఆడపిల్ల ఆడపిల్లే అనే ఆలోచన వచ్చిన సమాజం ప్రత్యక్షమైనప్పుడు, ఈ ప్రపంచంలో ఏది అత్యంత సులువైన పని అంటే ఆడపిల్లమీద నింద అనుకునే పురుష సమాజం చూపులో మార్పు వచ్చినప్పుడు, కనిపించిన తిండిపై కలిగిన ఆశకు, పరాయి స్త్రీలపై కలిగే ఆశకు వ్యత్యాసం తెలుసుకోని తుప్పుపట్టిన మృగాళ్ళ మనసులు తెల్లగా మెరిసిపోతున్నప్పుడు మహిళలు కోరుకునే భద్రత కొంచెమయినా దొరుకుతుందేమో.. ఈ లేఖల ఆంతర్యం బోధపడుతుందేమో..
***
పేజీలు : 254, వెల: 250/-,
ప్రతుల కోసం:
జ్వలిత, సాహితీవనం,
15-21-130/2, బాలాజీనగర్,
కూకట్‌పల్లి, హైదరాబాద్- 500072,
మొబైల్ – 9989198943.