లేఖాప్రబంధం

0
2

[dropcap]మ[/dropcap]నుష్యుడనే జీవి తాలూకు మనస్సొక బ్రహ్మపదార్థం. ఆ జీవి ప్రేమికుడు/ప్రేమిక అయితే అది బ్రహ్మపదార్థంలోని బ్రహ్మం. అంటే ఘృతకోశాతకంలోని ఘృతం. అదేనండి,  నేతిబీరకాయలో నేయి; లేదా మైసూరుపాకంలో మైసూరు లాగా అన్నమాట. ప్రేమలో పడిన మనసు పాట్లే వేరు. ప్రేమలో పడిన ప్రేమికు(రాలి)డి మనసు కొరోనా వైరస్ భయంతో కొంప బయటకు అడుగుపెట్టని మనిషి వంటిది. బయటకూ రాలేదు. లోనా ఉండలేదు. ఏదో చెప్పాలనుకుంటుంది. ఏమి చెప్పాలో తెలియదు. పోనీ చెప్పక ఊరుకోవటమా! అంటే అదీ కుదరదు.

అదో తీయని బాధ. అది ఇడ్లీలో కారప్పొడి. అదో ఉప్పని ఉసిరికాయ.

అయితే మహా మహా ఉపనిషత్తులు బ్రహ్మాన్ని వివరించినట్టుగానూ, ఆ ఉపనిషత్ వ్యాఖ్యాతలు ఆ బ్రహ్మాన్ని వ్యాఖ్యానించినట్టుగానూ కాకపోయినా ప్రేమికుల మనస్సు తాలూకు తీయని బాధ ఉండబట్టలేక అప్పుడప్పుడూనూ వెలికి వచ్చి అక్షరరూపం సంతరించుకోవటం కద్దు. ఆ తీయని బాధను ఇముడ్చుకున్న పత్రాన్ని ప్రేమలేఖలు అనవచ్చు. యువతీయువకుల ప్రేమల గురించి మనకు బండెడు సాహిత్యం ఉంది. బండెడు సాహిత్యం భవిష్యత్తులో వస్తుంది కూడా. ప్రేమికుల విరహాన్ని, ప్రేమాలాపాలను విసువు పుట్టించేంతగా కవులు వర్ణించింది నిజం. ఇంత జరిగినా ఇప్పటికీ ఈ సబ్జెక్టుకు ఢోకా లేదు. తెలుగు పద్యకవిత్వంలో ఈ సబ్జెక్టు గురించిన కొన్ని ముచ్చట్లు ఈ వ్యాసంలో చెప్పుకుందాం.

***

లేఖ అనగానే సాహిత్యం కాస్తో కూస్తో చదువుకున్న తెలుగు వారికి మొదటగా గురుతుకు వచ్చేది శ్రీనాథుడేనేమో. ఆయన తన ప్రియురాలికి లేఖా రూపంలో వ్రాసిన తెనుగు పద్యం ఓ చక్కని ముచ్చట.

శ్రీమ దసత్య మధ్యకునుఁ జిన్ని వయారికి ముద్దులాడికిన్
సామజయానకున్ మిగులఁ జక్కని ఇంతికి మేలు గావలెన్
మేమిట క్షేమ మీవరకు, మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ!
నా మది నీదు మోహమును క్షణంబునుఁ దీరదు స్నేహబాంధవీ!

సన్నని నడుము గలదానికి, చిన్ని వయ్యారికి, ముద్దులాడికి, ఏనుగు నడకలా అందమైన నడక గల వనితకు, చక్కని అమ్మాయికి – శుభం కలుగుగాక! మేమిక్కడ ఈ లేఖ వ్రాస్తున్నప్పటి వరకు క్షేమం. మీ శుభవార్తలు వ్రాసి పంపేది. నా మనస్సు నీ మోహాన్ని క్షణం కూడా వీడదు స్నేహబాంధవీ!

శ్రీమత్ అసత్య మధ్య – ఈ శబ్దం శ్రీనాథకవికి ఓ చిహ్నంలా స్థిరపడిపోయిందన్న మాట నిజం. ఈ శబ్దం స్వారస్యం ఎంత వివరించనినా తక్కువే. నిజానికి ఇది వివరించే అంశం కాదు, కొంతమేరకు అర్థాన్ని తెలుసుకుని ఆపైన ఎవరికి వారు ఊహించుకునే అంశం. అసత్య మధ్య – మధ్య అంటే నడుము. అసత్య మధ్య అంటే – లేనటువంటి నడుము గలదానా!. ఆ నడుము ఉంది, కానీ లేదు. అంటే ఉందా లేదా అనిపించేట్టుగా ఉంది. అది అసత్యం. కానీ ఆ అసత్యానికి “శ్రీమత్” అని మంగళకరమైన విశేషణం ఒకటి. ఏ విషయమైనా అసత్యం అవాలంటే ’ఫలానా విషయం అసత్యం’ అని చెప్పితీరాలి కదా. ఫలానా విషయం ’అసత్యం’ అని “చెప్పిన” వెంటనే అది అసత్యమైనా, అదంటూ ఒకటి ఉందని ఒప్పుకోవలసి వస్తుంది.

పద్యం మూడవ పాదంలో “ఈ క్షణం వరకూ క్షేమం” అంటున్నాడు కవి. – అంటే ఇప్పటి దాకా బానే ఉన్నాను. ఇప్పుడు నీకు లేఖ మొదలెట్టాను గనుక నీ తలపులతో ఇక నాకు విరహపు వేడి తగులుకున్నది. ఆ విరహ వేదనతోటి ఇకపై ఎలా ఉంటానో తెలియదు – అని ధ్వని.

శ్రీకారంతో మంగళకరంగా మొదలెట్టిన, పద్య రూపంలోని అందమైన లేఖ ఇది. కానీ తరచి చూస్తే, దీన్ని ప్రేమలేఖ అనడం కన్నా క్షేమలేఖ అనడమే ఒప్పు. ఇది క్షణం వీడి ఉండలేని భార్యాభర్తలు/ప్రేయసీప్రియుల మధ్య వర్తమానంలా అగుపిస్తోంది.

అలా ఉంటే పదకవితాపితామహుడు అన్నమయ్య – ఓ అద్భుతమైన కీర్తనలో భామిని చేత విభునికి చాలా అందమైన పత్రిక వ్రాయించాడు.

ఏమొకొ చివురుటధరమున యెడనెడ కస్తురి నిండెనో
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా!”

పద్మావతి దేవి శ్రీనివాసుని నుదుటన కాబోలు ముద్దిడుకొన్నది. స్వామి లలాట ఫలకాన కస్తూరి తిలకం కాస్తా ఆమె చివురుటధరాన బాగా అంటింది. ఈ కస్తూరి – విభునికి ఆవిడ వ్రాసిన పత్రికలా ఉందట. ఏదైనా మంగళకరమైన పత్రిక కొసలకు పసుపు కుంకుమ ఒకింత పూయడం ఒక ఆచారం. ప్రాచీన కాలంలో కస్తూరి పూసే వారేమో!

కస్తూరికాపత్రలేఖ అంటే సంస్కృత కావ్యజ్ఞులకు స్త్రీల చెక్కిళ్ళ తాలూకు అలంకారాలు కూడా గుర్తుకు రావచ్చు. భారతదేశంలో ఎంతో ప్రాచీనకాలం నుండి స్త్రీలు తమ చెక్కిళ్ళపై కస్తూరితోటి మకరం, మీనం వంటి ఆకారాలకు అందంగా చిత్రించుకునే వారట. ఈ మకరికాపత్రరేఖల గురించి సంస్కృత సాహిత్యంలో బండెడు చోట్ల వర్ణనలు ఉన్నాయి.

మొత్తానికి పద్మావతి వారి పత్రిక – భామిని విభునకు వ్రాసింది.

ఇంకొక చిన్న లేఖ గుర్తొస్తూంది. ఎనభైల దశకంలో ఎనిమిది/తొమ్మిది/పది ఈ తరగతుల్లో ఎక్కడో తెలుగువాచకం చదువుకున్నవారికి తెలియరావచ్చేమో ఆ రోజుల్లో తెలుగువాచకంలో చంద్రహాసుని పాఠం ఉండేది.

అనగనగా ఓ మహారాజు. ఆతడి కొడుకు చంద్రహాసుడు. రాజు ఓ సందర్భాన దుర్జయుడనే మరొక రాజుకు చంద్రహాసుని ద్వారా ఓ లేఖ పంపాడు. అయితే విద్రోహులు ఆ లేఖను ఇలా మార్చారు. “ఇతఁడ హితుఁడు. విషము నిమ్ము“. ఈ లేఖ మోసుకొస్తున్నవాడు అహితుడు (శత్రువు). ఇతడికి విషమిచ్చి చంపండి అని భావం.

చంద్రహాసుడు పాపం ఆ లేఖ చదవకుండానే దుర్జయుడి రాజ్యానికి చేరాడు. నగరాన ఓ ఉద్యానవనంలో అలసిపోయి నిద్రకు జారుకున్నాడు. అంతలో ఆ ఉద్యానవనానికి ఓ అమ్మాయి వచ్చింది. ఆమె దుర్జయుడి కూతురు. ఆవిడ ఈ యువకుని చూడగానే ప్రేమలో పడింది. చంద్రహాసుని అంగీ లో ఓ లేఖను ఆమె చూచింది., చదివింది. ఆ లేఖనావిడ తన కాటుకతోటి ఇలా మార్చింది. “ఇతఁడు హితుఁడు. విషయ నిమ్ము“.

రాజు దుర్జయుడు అన్నంతపనీ చేశేసాడు.

విషయ నిమ్ము – అమ్మాయి పేరు విషయ. ఆమెను అతడికి యిచ్చి వివాహం చెయ్యమని భావం.

అదీ విషయం.

కాటుకతో ఆ అమ్మాయి తన జీవితాన్ని దిద్దుకున్నది. ఇది ప్రత్యక్ష ప్రేమ లేఖ కాకపోయినా, పరోక్షమైన ప్రేమ లేఖనే అనుకోవాలి.

***

శ్రీనాథుని క్షేమలేఖ, భామిని విభునికి వ్రాసిన పత్రిక, విషయ చంద్రహాసుని లేఖకు చేసిన సవరణ – ఇవి బానే ఉన్నై కానీ,  ప్రేమలో పడి, ఆ ప్రేమను వ్యక్తం చేసే విధానంలో రచించిన ప్రేమలేఖ తెనుగు సాహిత్యాన ఉందా? – ఇది కదా నిజానికి ప్రేమలేఖ పరమోద్దేశ్యం!

సమాధానం – ఉంది. ఆ ప్రేమలేఖ వ్రాసిన కవి పింగళి సూరన. ఆ ప్రబంధం ప్రభావతీప్రద్యుమ్నము.

ప్రబంధకవులు అందరున్నూ ఒక కవికి మించి మరొకరు. ఏ ఒక్కరినీ ఏ మాత్రం పక్కన పెట్టటానికి వీల్లేదు. ఎవరి ప్రతిభ వారిదే. ఒక కొలతలో ఒకాయన గొప్పగా కనిపిస్తే, మరొక కొలతలో మరొకాయనను పట్టలేం. ఈ పింగళి సూరన కవి కూడా అంతే. ఈయన రచించిన కావ్యాలలో కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం, రాఘవపాండవీయం కావ్యాలు నేడు మనకు దొరుకుతున్నాయి. కథ చెప్పడంలోనూ, కథనాన్ని తీర్చిదిద్దటంలోనూ పింగళి సూరన గారిది ప్రత్యేకమైన బాణీ. అలానే ఈయన నాటికాలానికి ఎంతో ముందున్న కవి. ఈ కవి బహుశా తన పిదప వయసులో రచించిన కావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నము.

ఆ కథ కొంచెం చెప్పుకుని ఆ కవి లేఖ జోలికి వెళదాం.

***

అనగనగా వజ్రపురం అన్న పట్టణంలో వజ్రనాభుడని ఓ రక్కసుడు. ఈ వజ్రనాభునికి ఓ అందమైన కుమార్తె. ఆమె పేరు ప్రభావతి. ఆ అమ్మాయి పూజకు మెచ్చి పార్వతీదేవి ఓ మారు ఓ అందమైన చిత్రపటాన్ని ఇచ్చింది. అందులో ఉన్న యువకుడే ఆమెకు కాబోయే భర్త అని చెప్పింది. అయితే ఆ చిత్రపటంలోని యువకుడెవ్వరో ఆమెకు తెలియదు.

బ్రహ్మాసరస్వతుల యొక్క రథానికి సారథి ఓ హంస. ఆ హంస పేరు సారంధరుడు. ఆ హంసకు ఓ కుమార్తె. దాని పేరు శుచిముఖి. ఈ శుచిముఖి ఎంత తెలివైనదంటే – ఓ మారు సరస్వతి పెంపుడు చిలుకకూ, దీనికి మధ్య వాదం జరిగితే, ఆ వాదంలో ఈ హంసి చేసిన వాదానికి మెచ్చి అమ్మవారు శుచిముఖికి ఓ గండపెండేరాన్ని తొడిగింది. ఆ గండపెండెరంపై దయతో ’ఉపమాతిశయోక్తి కామధేను’ అన్న బిరుదాన్ని కూడా చెక్కించి ఇచ్చింది.

అంతటి ఆ  శుచిముఖి వజ్రపురంలో విహరిస్తూ ప్రభావతీదేవి ఇంట చిత్రపటంలో యువకుని బొమ్మను చూసింది. ఆ యువకుడు యదు వంశంలో – శ్రీకృష్ణునికి, రుక్మిణీదేవికి పుట్టిన ప్రద్యుమ్నుడేనని శుచిముఖి ప్రభావతికి చెప్పింది. ఈ ప్రద్యుమ్నుడు భూలోకాన కారణవశాన పుట్టిన మన్మథుడు. ఈతడికి, హంసి శుచిముఖికి లోగడే పరిచయం కూడా ఉంది.

ప్రద్యుమ్నుని వివరాలు విన్న నిండుజవ్వని ప్రభావతి మనస్సు ఉత్కంఠకు లోనయ్యింది. అటు ప్రద్యుమ్నుడు కూడా ప్రభావతి గురించి శుచిముఖి ద్వారా అదివరకే విని ఉన్నాడు. ప్రభావతి వివరాలు తెలిసినది ఒక్క శుచిముఖికి మాత్రమే. అయితే ఆ శుచిముఖి ఇప్పుడెక్కడున్నదో తెలియదు. ప్రభావతిపై తనకు గల ప్రేమ గురించి శుచిముఖికి వివరిస్తూ ఓ లేఖ వ్రాశాడు. ఆ లేఖను శుచిముఖి మిత్రురాలైన ఓ చిలుకకు ఒప్పగించి – ఆ లేఖను శుచిముఖి ద్వారా ప్రభావతికి అందజెయ్యమన్నాడు. ఆ చిలుకకూ వజ్రపురంలో మరొక పని ఉంది. వజ్రనాభుని తమ్ముడు సునాభుడికి ఇద్దరు కుమార్తెలు. వారికి ఈ చిలుక మిత్రురాలు.

వజ్రపురానికి వచ్చిన ఆ చిలుక రెక్కల్లోని పత్త్రాన్ని ప్రభావతి చెలికత్తె రాగవల్లరి చూచింది. ఆ ఉత్తరం తీసి ప్రభావతి యెదురుగానే చదవటం మొదలు పెట్టింది.

శ్రీమత్ సరస్వతీ రామాకృపా సంప్రయుక్తోపమాతిశయోక్తి కామ
ధేను సద్బిరుదాంక దివ్య మంజీర సంశోభిత పాదకు శుచిముఖికిని
ప్రద్యుమ్ను డూర్జిత ప్రణయ పూర్వకముగా ననిపినయట్టి రహస్య లేఖ     
ప్ర ప్ర భా భా వ తిఁ బలు తెఱంగుల నీవు, వచియింప….

“శ్రీ సరస్వతీ దేవి ’దయతో ఉపమాతిశయోక్తి కామధేను’ వను బిరుదాక్షరములచే చిహ్నితమైన పెండేరము స్వయముగా తొడిగిన కాలు గల శుచిముఖికి ప్రద్యుమ్నుడు – ప్రభావతిపై గల చిక్కని ప్రేమతో కూడిన ప్రార్థనము ముందుగా చేస్తూ పంపిన ఏకాంతపు జాబు. ఆ ప్రప్రభాభావతి గురించి నీవు ఎన్నో వర్ణనలతో చెప్పావు. అలా చెప్పగానే……”

ఇంతవరకు చదవగానే రాగవల్లరి సంతోషం ఆపుకోలేక ఓ చంక గుద్దుకుని ఎగిరింది. ప్రభావతీ! నీ గురించి నీ ప్రియుడు పంపిన లేఖ ఇది. నీవెంత భాగ్యశాలివి అన్నది. ఆ లేఖను ఎలానో రాగవల్లరి వద్ద నుండి గుంజుకున్న ప్రభావతి ఆపై చదవడం కొనసాగించింది.

ప్ర ప్ర భా భా వ తిఁ బలు తెఱంగుల నీవు, వచియింప నపుడు నిర్వచన వృత్తి
నేనున్కి కల్ల గుట్టింతియె కాని యా యింతి యంగము లెవ్వి యెట్లు చెప్పి
తివి యెల్ల నట్ల నా యాత్మ దద్దయుఁ బడి, యచ్చున నద్ది నట్లమర నంటి
మలచిన గతిని మిక్కిలి ధృఢత్వముఁ జెంది, స్వగుణ సంపద్గౌరమున నేమొ

యూఁది బడలించుచున్నవి యో మరాళి,
యధరసుధఁ దేర్పుమని వేడుమా మృగాక్షి…..”

“ఓ శుచిముఖి! నీవు ప్రభావతిని గురించి పలువిధాలుగా వర్ణించి వివరిస్తున్న సమయాన నేను మాటాడక ఊరుకున్నాను. అది నిజానికి నా కపటపు ధైర్యమే సుమా. అంతే కానీ ఆ సుందరి శరీరలావణ్యాన్ని నీవెట్లు చెప్పితివో, ఆ ముద్ర నా మనోఫలకమున రాతిపై చెక్కిన శిల్పం లాగున ముద్రవడి యున్నది. ఆ ఆయాసమున క్రుంగిన నాకు ఓ హంసీ!  ఆమె అధరమనే అమృతము చేత స్వాంతన కలిగించమని వేడుకొంటున్నాను. ఈ నా వేడికోలును నా తరపున ఆ మృగాక్షికి చెప్పుము”

(గునుగు) సీసపద్యంలో వ్రాసిన ఆ ప్రేమ లేఖ వచనంలో ఎంత ఒద్దికగా ఒదిగిందో ఈ క్రింద చూడండి. (గునుగుసీసం అంటే ఇక్కడ చదువుకోండి)

శ్రీమత్ సరస్వతీ రామాకృపా సంప్రయుక్తోపమాతిశయోక్తి కామధేను సద్బిరుదాంక దివ్య మంజీర సంశోభిత పాదకు, శుచిముఖికిని, ప్రద్యుమ్నుడూర్జిత ప్రణయ పూర్వకముగా ననిపినయట్టి రహస్య లేఖ. ప్ర ప్ర భా భా వ తిఁ బలు తెఱంగుల నీవు, వచియింపనపుడు నిర్వచన వృత్తి నేనున్కి కల్ల గుట్టింతియె కాని యా యింతి యంగము లెవ్వి యెట్లు చెప్పితివి యెల్ల నట్ల నా యాత్మ దద్దయుఁ బడి, యచ్చున నద్ది నట్లమర నంటి మలచిన గతిని మిక్కిలి ధృఢత్వముఁ జెంది, స్వగుణ సంపద్గౌరమున నేమొ యూఁది బడలించుచున్నవి యో మరాళి, యధరసుధఁ దేర్పుమని వేడుమా మృగాక్షి…..”

ఈ లేఖలో “ప్ర ప్ర భా భా వ తి” అన్న శబ్దం స్వారస్యం గమనార్హం. అమ్మాయి పేరు ప్రభావతి అయితే ఆ పేరు పలికే ప్రయత్నంలో ఆమె సుందరరూపం గుర్తుకు వచ్చి ప్రియుడి గొంతులో తడి ఆరిపోయి, తడబడి “ప్ర ప్ర భా భా వ తి” అంటున్నాడు. ఇదొక అద్భుతమైన ధ్వని!

భాః అంటే సంస్కృతంలో ప్రకాశం అని అర్థం. భాతి ఇతి భానుః – ప్రకాశించెడు వాడు భానుడు (సూర్యుడు). ప్రకృష్టమైన (భా) కాంతి “ప్రభ”. అట్టి గొప్ప మేని కాంతి కలిగినట్టిది “ప్రభావతి”. అలా ఉంటే ప్రప్రభాభావతి – ఈ శబ్దానికి వ్యాఖ్యాత వివరణ ఇది. ప్రప్రభా = ప్రకృష్టమైన కాంతి గలది. లక్షణ చే మెఱుపు. అట్టి మెఱుపు యొక్క ; భావతి = కాంతి వంటి కాంతి గలదానిని..;

మనుచరిత్రలో వరూధిని అల్లసాని పెద్దన “విద్యుల్లతా విగ్రహ” గా వర్ణించాడు.

మ॥
అతడావాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా
న్విత మిచ్చోటని చేరఁబోయి కనియెన్ విద్యుల్లతా విగ్రహన్
శతపత్రేక్షణఁజంకరీకచికురన్ జంద్రాస్యఁ జక్రస్తనిన్
నతనాభిన్ నవలా నొకనొక మరున్నారీ శిరోరత్నమున్.

విద్యుల్లతా విగ్రహ అంటే మెఱపుతీగ.

నేనేం తక్కువ తిన్నానా అని భట్టుమూర్తి గారు వసుచరిత్రలో గిరిక ను “తటిన్నిభ గాత్ర వల్లరి” ని చేశారు. అంటే మెఱపు వంటి మేనికాంతి గలది.

చం॥
తరువుల పొంతఁ బొంచి వసుధావరమిత్రుఁడు గాంచె నచ్చటం
దరుణిఁ దమోవినీలకచఁ దామరసోదరసోదరప్రభం
దరళవిలోచనం దతనితంబఁ దటిన్నిభగాత్రవల్లరిం
దరుణశశాంకఫాల నొకతన్విఁ దరంగవళిం దలోదరిన్.

ఈ పద్యం వివరణ ఇక్కడ.

మనుచరిత్రలో ప్రవరుడు చూచినట్టు కవి చూచి వర్ణించాడు. వసుచరిత్రలో వసుధావరమిత్రుడు (రాజు గారి ఫ్రెండు) చూచినట్టు భట్టుమూర్తి చూచాడు.

మరి ప్రభావతీప్రద్యుమ్నంలో? సూరన – తన నాయకుని చేత ప్రియురాలి పేరును తడబాటుగా పలికిస్తూ, ఆ పలుకుని లేఖ ద్వారా లిఖిస్తూ, ప్రప్రభాభావతి గా మెఱపుతీగను చెప్పించాడు సూరన. ఇదీ పింగళి సూరన బాణీ. తనకంటూ ఓ ప్రత్యేకత చూపక ఈ కవి సాధారణమైన వర్ణనల వైపు కానీ, కథనం వైపు కానీ సాధారణంగా వెళ్ళడు. ప్ర ప్ర భా భా వ తి గురించి ఇంత చెప్పుకోవలసి వచ్చింది. ఇది ఆరంభం మాత్రమే.

ప్రభావతి శరీరలావణ్యాన్ని శుచిముఖి అన్న హంసి వర్ణించి చెబుతుంటే, ప్రద్యుమ్నుడికి మనస్సు – ముందు నీట ఱాయి పడినట్టు కల్లోలమయింది. ఆపై మనసున ఆమె రూపం అచ్చొత్తినట్టు అయినది. అటుపై శిలపై శిల్పి చెక్కినట్టు ఆయమ గుణముల బరువు చేత మనసు నొక్కి పట్టినట్టు బడలిక పుట్టించింది.

ఈ భావం భవభూతి మాలతీమాధవం అన్న నాటకం లోనిది.

లీనేవ ప్రతిబింబితేవ లిఖితేవోత్కీర్ణ రూపేవ చ
ప్రత్యుప్తేవ చ వజ్రలేపఘటితే వాంతర్నిఖాతేవ చ
సా న శ్చేతసి కీలితేవ విశిఖై శ్చేతో భువా పంచభి
శ్చింతా సంతతి తంతుజాల నిబిడ స్యూతేవ లగ్నా ప్రియా   

ప్రియురాలు మాలతి – ప్రియుని మాధవుని మనసులో (మంచినీట) నీటిచుక్క పడినట్టు లీనమయింది. ఆపై స్ఫటికంలో వస్తువులు ప్రతిబింబించినట్టు ప్రతిబింబించింది. ఆపై ఆమె రూపం మనసులో అచ్చువడింది. ఆపై చిక్కగా పూయబడినట్టు, మనసులో దిగవడినట్టు, మన్మథుని ఐదు బాణాలతో మనస్సులో స్ఫుటంగా నాటినట్లు అయి, చింతకు లోనయ్యింది.

ఏమైతేనేం ప్రేమలేఖ అలా మొదలయ్యింది. ఇక్కడే పింగళి సూరన గారు మరొక ట్విస్టు పెట్టారు. లేఖను అంతవరకు చదువుకున్నది ప్రభావతి. ఆపై ఎలాగోలా వారిద్దరు ఎదురుపడ్డారు. గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఆపై రహస్యంగా కాపురమూ చేశారు. కొంతకాలమయ్యింది. ఓ నాడు ప్రద్యుమ్నుడు ప్రభావతితో కూడి ఉంటూ, పొరబాటున నోరుజారి రతీదేవి పేరు ఉచ్ఛరించాడు. ఇలా ఒక ప్రియురాలితో ఉంటూ మరొక ప్రియురాలి పేరు పలుకటాన్ని గోత్రస్ఖలనం అంటారు. అంతే! అగ్గి రాజుకుంది. ప్రద్యుమ్నుడు ఆమెకు నచ్చజెప్పడానికి నానాతంటాలూ పడ్డాడు. చెలికత్తెలతో చెప్పించాడు. ఏదైతేనేం, ప్రభావతి తిరిగి దారిని పడింది. ఆమె మనసులో ప్రియుణ్ణి అనవసరంగా తిట్టానా అన్న భావం మొదలయ్యింది. రకరకాలుగా వాపోయింది.

సరిగ్గా ఆ సందర్భాన పూర్వం ప్రియుడు ఆమెకు వ్రాసిన ఉత్తరం తిరిగి తెరచింది. ఆ ఉత్తరాన్ని చదువుకొంది.

ఓ హంసి నీచేత నున్నయది నా బ్రతుకు
నా హృదయ మింతి డెందము నేకముగ నదుకు
 
కరుణనిది పదివేలు కమ్మలుగఁ గైకొనుము
పరగ సతితోడ నా పలుకు నిట్లనుము
 
విద్యున్నిభాంగిరో వినుము నీ కృపఁ గన్నఁ
ప్రద్యుమ్నుఁడను పేరు ఫలితమగు నా కెన్నఁ
….
….
(ప్ర.ప్ర 5.152)

ఇలా ఆ ఉత్తరం కొనసాగింది. ద్విరదగతి రగడలో ఉన్న ఆ ఉత్తరాన్ని  ప్రభావతి/ప్రప్రభాభావతి ఆ ఉత్తరం చదువుకొన్నది. తిరిగి ప్రియునితో సఖ్యం కొనసాగించింది. దరిమిలా ప్రేమలేఖ – సఖీవిరహవిరమణకై వ్రాసిన రాయబారలేఖగా కూడా మారింది. పూర్తీ లేఖ కావ్యంలో చదువుకోవచ్చు.

కథ కంచికి, మనం ఇంటికి.

***

ఆధారం : ప్రభావతీప్రద్యుమ్నము, శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారి వ్యాఖ్యాన సహితం. వెంకట్రామా అండ్ కో.
ఛాయాచిత్రం – వికీమీడియా సౌజన్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here