Site icon Sanchika

లేఖిని కథా కార్యశాల 2023 – నివేదిక

[dropcap]తె[/dropcap]లంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ‘లేఖిని’ రచయిత్రుల వేదిక మరియు ‘సరసిజ థియేటర్ ఫర్ విమెన్’ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి, 16వ తేదీన రవీంద్ర భారతి, సమావేశ మందిరంలో కథా కార్యశాల జరిగింది. ఉదయం 10.30కి జరిగిన ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా డాక్టర్ మామిడి హరికృష్ణ, సంచాలకులు, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, విశిష్ట అతిథిగా డాక్టర్ అమృతలత, రచయిత్రి, విద్యావేత్త, డాక్టర్ ముక్తేవి భారతి, ప్రముఖ సాహితీవేత్త, పాల్గొన్నారు. ‘లేఖిని’ రచయిత్రుల వేదిక అధ్యక్షులు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షులు డాక్టర్ మంథా భానుమతి, ప్రధాన కార్యదర్శి అత్తలూరి విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు శ్రీమతి గంటి భానుమతి పాల్గొన్నారు.

డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ కథలు చెప్పటంలో స్త్రీని మించిన వారు లేరని, ‘చిన్ననాట అమ్మ చెప్పిన కథలు తనకు గుర్తు వస్తాయని, మాత్రుమూర్తులు అయిన లేఖిని రచయిత్రులు గొప్ప కథకుల’ని అన్నారు.

అనంతరం, కుటుంబం, సామాజిక స్పృహ, బంధాలు అంశంపై జరిగిన మొదటి సమావేశంలో డాక్టర్ మంథా భానుమతి సభకు అధ్యక్షత వహించారు, వక్తలుగా గంటి భానుమతి, వారణాసి నాగలక్ష్మి, జి.ఎస్. లక్ష్మి పాల్గొన్నారు.

కథలపై జరిగిన రెండవ సమావేశంలో ప్రముఖ రచయిత బుద్ధవరపు కామేశ్వర రావు అధ్యక్షత వహించగా వక్తలుగా శ్రీ గండ్రకోట సూర్యనారాయణ, శ్రీమతి వడ్లమాని మణి పాల్గొన్నారు.

భోజన విరామానంతరం జరిగిన మూడవ సదస్సులో హాస్య కథలు అంశం పై శ్రీమతి నెల్లుట్ల రమాదేవి అధ్యక్షత వహించగా, వక్తలుగా శ్రీమతి హైమా భార్గవ్, శ్రీమతి అల్లూరి గౌరిలక్ష్మి పాల్గొన్నారు. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి తన హాస్య ధోరణిలో అందరినీ నవ్వించారు.

నాల్గవ సమావేశంలో కంప్యూటర్‌లో కథలు వ్రాయడం ఎలా? అనే అంశం పై జరిగిన సదస్సులో శ్రీమతి నండూరి నాగమణి అధ్యక్షత వహించగా, వక్తలుగా కుసుమ ఉప్పలపాటి, జ్యోతి వలబోజు పాల్గొన్నారు.

ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి, విశిష్ట అతిథులుగా ప్రముఖ రచయితలు శ్రీ సింహప్రసాద్, శ్రీ కస్తూరి మురళీకృష్ణ పాల్గొన్నారు. అతిథులు ముగ్గురూ మంచి కథలు రాయడం ఎలా? కథా కార్యశాల ప్రయోజనం గురించి విపులంగా మాట్లాడారు. శ్రీ కస్తూరి మురళీ కృష్ణ మాట్లాడుతూ, ఎంత మంచి కథలు రాసినా ఒక వర్గం రచయితలు, రచయిత్రులకే అవార్డులు, గుర్తింపులు వస్తాయని అన్నారు.

‘లేఖిని’ కార్యవర్గం, సభ్యులు అయిన ప్రముఖ రచయిత్రులు ఎందరో ఈ కథా కార్యశాలలో పాల్గొని సభని విజయవంతం చేసారు.

శ్రీమతి లక్ష్మి పెండ్యాల ఆద్యంతం సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, తన చక్కని గాత్రంతో అలరించారు.

Exit mobile version