Site icon Sanchika

చక్కటి హారర్ చిత్రం – లిఫ్ట్

లిఫ్ట్ 2021(తమిళ హారర్ చిత్రం, 2 గంటల 17 నిమిషాలు)

చాలా రోజుల తర్వాత ఒక పూర్తి నిడివి తమిళ్ సినిమా చూశాను. ఇది హాట్‍స్టార్‌లో లభిస్తోంది.

థ్రిల్లర్స్, హారర్ చిత్రాలు చూసే ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రం. చక్కటి హారర్ చిత్రం. ఒక సారి అందరు హాయిగా గుడ్లప్పగించి, కుర్చీ అంచున కూర్చుని, ఊపిరి బిగబట్టి చూసేయవచ్చు.

కొత్త దర్శకుడు వినీత్ వరప్రసాద్ తీసిన ఈ చిత్రం బాగుంది. ఈ సినిమాని కేవలం 20 రోజుల వ్యవధిలో తీయటం ఒక విశేషం. బెన్ కింగ్‍స్లే పాడిన పాట ఒకటి ఉంది ఈ సినిమాలో. అది కూడా ఒక విశేషం.

మిమ్మల్ని భయపెట్టే సన్నివేశాలు ఖచ్చితంగా బోలెడు ఉన్నాయి. బోర్ కొట్టే దృశ్యాలు చాలా తక్కువ. భయం కలిగించే దృశ్యాలు ఎక్కువ.

కథ ఏమిటి?

గురుప్రసాద్ (కవిన్) అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ టీం లీడర్‍గా ప్రమోషన్ మీద బెంగళూరు నుండి చెన్నై బ్రాంచికి వస్తాడు. ఇంకో అమ్మాయి హరిణీ (అమృతా అయ్యర్) హెచ్చార్ ఎక్జిక్యూటివ్‍గా ప్రమోషన్ మీద అదే బ్రాంచికి ముంబాయి నుంచి వస్తుంది. వీరిద్దరికీ ఇది వరకే గిల్లికజ్జాలతో కూడిన పరిచయం ఉంటుంది.  తిరిగి ఇక్కడ కలుసుకుంటారు.

అతను డ్యూటీలో చేరిన ఆ రోజు ఆఫీస్‌లో జరిగిన చిత్రవిచిత్ర అనుభవాల సమాహారమే ఈ సినిమా కథ యావత్తు.

రాత్రి పదిన్నర తరువాత లిఫ్ట్ ద్వారా దిగి కార్ పార్కింగ్‍కి వెళ్తాడు. కానీ కారు బయటకి వెళ్ళలేదు. ఎంత తిరిగినా గుడు గుడుగుంజం లాగా సెల్లార్ మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఈ చిత్రాన్ని మిత్రులకు చెబుదామని ఫోన్ చేద్దామని చూస్తే. ఫోన్ ఆఫీస్ లోనే మర్చిపోయి వచ్చానని అర్థం చేసుకుంటాడు. తిరిగి లిఫ్ట్ ఎక్కి తొమ్మిదో అంతస్తుకి వెళతాడు. ఈ సందర్భంగా ఒళ్ళు గగుర్పొడిచే అనుభవాలు ఎదుర్కుంటాడు.

అతను ఆ సాయంత్రం మిత్రులతో గడుపుదామని కాస్త త్వరగా వెళదామనుకున్నా కూడా బాస్ అప్పజెప్పిన అధిక పని ఒత్తిడి వల్ల రాత్రి పదిన్నర వరకు ఆఫీస్‍లోనే ఉండిపోతాడు. తొమ్మిది అంతస్తుల ఆ భవంతిలో అతను ఒక్కడూ మిగిలిపోతాడు. అతనితో బాటుగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తారసపడతారు అప్పుడప్పుడు. వీరు కాక పొరపాటున రికార్డ్ రూంలో ఇరుక్కుపోయిన హీరోయిన్ కూడా అతనితో జత కలుస్తుంది ఓ ముఫ్ఫై నిముషాల భయంకరమైన అనుభవాల తర్వాత.

ఆ తరువాత ఇద్దరూ ఎలా బయటపడ్డారు అన్నదే ప్రధాన కథ.

ఈ భవంతిని ఎందుకు ఇలా మానవాతీత శక్తులు పీడిస్తుంటాయి, అవి ఏమి సాధించాలి అనుకుంటాయి. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

భయం గొలిపే దృశ్యాలు:

ఎక్కడా రక్తం ఓడే శరీరాలు, జుగుప్స కలిగించే దృశ్యాలు, ఇబ్బంది కలిగించే సీన్లు లేవు. కానీ సినిమా మొదలైన అరగంట నుంచి వెన్నులో చలి పుడుతుంది.

మనకు భయంతో వణుకు పుడుతుంది.

ఇలా ఒకటి కాదు అనేక భయం కలిగించే దృశ్యాలు సినిమా ఆద్యంతమూ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. నేను పేర్కొనలేదు. మొత్తానికి చాలా రోజుల తర్వాత నిజంగా భయం కలిగించింది ఈ చిత్రం.

యాదృచ్ఛికంగా ఈ చిత్రాన్ని చూసి ముగింపు వద్దకు వచ్చేటప్పటికి రాత్రి పన్నెండున్నర అయింది. ఈ లోగా ఒక దశలో ఏదో డొక్కు ఆటో రోడ్డు మీద శబ్దం చేస్తూ వెళితే మా ఆవిడ భయంతో నా వంక గుడ్లప్పగించి చూసింది. ఒక్క క్షణం నాకు కూడా వెన్నులో చలిపుట్టింది ఆ సందర్భంగా.

పాజిటివ్ అంశాలు:

ఈ సినిమాలో జీవం ఉంది. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అన్న సామాజిక కోణంలో ఆలోచించి దానికి హారర్ నేపథ్యాన్ని విజయవంతంగా జోడించి ఒక చక్కటి సినిమా తీయగలిగారు.

కెమరా పని తనం బాగుంది. టేకింగ్ రిచ్‌గా ఉంది. కాస్త హాస్యం కూడా ఉంది ప్రారంభంలో.

అనవసరంగా పాటలు పెట్టాలి అనే ప్రయత్నం చేయలేదు.

నెగటివ్ అంశాలు:

సినిమా నిడివి ఎక్కువ అయింది. రెండు గంటలా పదిహేడు నిమిషాలు చాలా ఎక్కువ. ప్రెక్షకులని భయపెట్టటానికి కాబోలు, వాళ్ళు ఆ భవనంలో ఇరుక్కుపోయాక ఆ అంతస్తు, ఈ అంతస్తూ పరిగెడుతూ చూపిన దృశ్యాలు చాలా నిడివి ఎక్కువ ఉన్నాయి. వీటిని చక్కగా కత్తిరించి ఉండవచ్చు. తొంభై నిమిషాల సినిమాగా దీన్ని ట్రిమ్ చేస్తే ఇంకా ప్రభావవంతంగా ఉండేది.

సినిమాలో అసలు కీలకాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు చాలా సమయం తీసుకుంటాడు. భయం గొలిపే దృశ్యాల చిత్రీకరణపై చూపిన శ్రద్ధ, అసలు కీలకాన్ని సామాన్య ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చెప్పటంలో కాస్త తికమక పడ్డాడు. అయినా ఏమీ ఫర్వాలేదు హాయిగా చూడవచ్చు.

ఇతర అంశాలు:

హారర్ సినిమా కాబట్టి, కథ మొదలైన కాసేపటి నుంచి ఎటువంటి  మొహమాటం లేకుండా మనల్ని భయపెడతాడు దర్శకుడు.  మొదటి సీన్‍లో అతను కార్‍లో ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వచ్చి సెల్లార్‌లో కారు పార్క్ చేసి, లిఫ్ట్‌లో ఎక్కి ఆఫీస్ లోకి వెళతాడు. అంతే ఆ తరువాత ప్రేక్షకుడికి కూడా బయటి ప్రపంచం కనిపించదు. ఆ రెండు గంటలా పదిహేడు నిమిషాలు ఆ తొమ్మిది అంతస్తుల భవంతిలో ఇరుక్కుపోతాము మనం కూడా.

కవిన్ నటన చాలా సహజంగా ఉంది. అతను భయపడి పోయి కుర్చీల చాటున నక్కి కూర్చున్నప్పుడు మనకు మొదట నవ్వు వస్తుంది. ఆ తరువాత  జాలితో కూడిన ఆప్యాయత ఏర్పడుతుంది ఆ పాత్ర పట్ల. ‘అయ్యో ఆ పరిస్థితిలో ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తామో కద’ అని మనల్ని మనం నిందించుకుంటాం. ఈ కుర్రాడు సినిమా భారాన్ని మొత్తం తన భుజస్కంధాల మీద తీస్కుని నటించాడు. యావత్తు సినిమా ఇతని పాత్ర మీదనే నడుస్తుంది.

అమృతా అయ్యర్ కూడా తన పాత్ర పరిమితి చేసినంత మేరా చక్కగా నటించింది.

సైడ్‍లైట్స్:

ఈ సినిమా చూశాక ఇకపై మీరు షాపింగ్ మాల్స్ తాలూకు నిర్మానుష్యంగా ఉండే సెల్లార్స్‌లో నడయాడేటప్పుడు ఖచ్చితంగా భీతిల్లుతారు.

లిఫ్ట్‌లో ఒక్కళ్ళే వెళ్ళాలన్నా భయపడతారు. అంత ప్రభావవంతంగా ఉన్నాయి సన్నివేశాలు.

***

ఇటీవల మిత్రుడు విభాతమిత్ర గారు, నాకు “నాకు సినిమా రివ్యూలలో అసలు నచ్చని ఒకే ఒక వాక్యం – ‘ఒకసారి చూడవచ్చు’ అనే వాక్యం” అని సరదాగా చెప్పుకొచ్చారు. ఏది ఏమయినా ఈ సినిమా గూర్చి ఆ వాక్యం వ్రాయక తప్పదు.

ఒక సారి కాస్త ఓపిక చేసుకుని చూడవచ్చు. నిరాశపరచదు.

తక్కువ బడ్జట్ లో హాయిగా సాగిపోయింది ఈ సినిమా.

టీం:

నటీ నటులు: కవిన్, అమృతా అయ్యర్, కిరణ్ కొండా, గాయత్రి రెడ్డి, బాలాజీ వేణుగోపాల్, అబ్డుల్ లీ

కథ -దర్శకత్వం: వినీత్ వరప్రసాద్

నిర్మాత: హెప్జీ

సంగీతం: బ్రిట్టో మైఖేల్

Exit mobile version