Site icon Sanchika

పద్దెనిమిదవ శతాబ్దపు అమెరికన్ మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించే ‘లిటిల్ వుమెన్’

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]L[/dropcap]ITTLE WOMEN ప్రముఖ అమెరికన్ క్లాసిక్ నవల. దీని రచయిత్రి లూసియా మే అల్కాట్. ఈ నవల 1868 లో పబ్లిష్ అయ్యింది. ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ద నవలల లిస్టులో దీన్ని ప్రస్తావిస్తారు సాహిత్య ప్రియులు. ఒక మధ్యతరగతి కుటుంబంలోని నలుగురు అమ్మాయిల జీవితంలోని కొన్ని సంవత్సరాలను చెప్పే ప్రయత్నం చేస్తారు రచయిత్రి. ఒక రకంగా ఇది రచయిత్రి కుటుంబం కథే అని, అమె చిన్నతనంలోని విషయాలను నవలలో ఆమె రికార్డు చేసారని. ఆమె అక్క చెల్లెళ్లతో గడిపిన బాల్యపు రోజులని చిత్రించినందువలన ఇది ఒక రకంగా వారి అత్మకథ అని కూడా సాహిత్య చరిత్రకారులు అంటారు. బాల్యం నుండి యవ్వనం వైపుకు నలుగురు అక్కా చెల్లెళ్ళ ప్రయాణం, వారి జీవితంలోని సంఘటనలు వారి వ్యక్తిత్వాలలో మార్పు, ప్రపంచాన్ని తమ దృష్టితో చూసి అర్థం చేసుకోవాలనే వారి ప్రయత్నం ఈ నవలలో కనిపిస్తుంది. కమింగ్ ఆఫ్ ఏజ్ అంటూ ప్రస్తుతం మానసిక విశ్లేషకులు స్టడి చేసే మానవ మనస్తత్వపు మార్పులను, మనవ జీవితంలో అతి ముఖ్యమయిన కౌమార్యపు వయసులోని మానసిక సంఘర్షణను, ఆ సమయంలో ప్రతి ఒక్కరిలోని రెబెల్ మనస్థత్వాన్ని, సమాజపు నియమాలను స్వీకరించడానికి తమను తాము సిద్ధం చేసుకోవలసిన స్థితిని ప్రతి ఒక్కరు తమ పద్దతిలో ఎదుర్కునే విధానాన్ని ఈ నవల చర్చిస్తుంది. కౌమార్యపు మానసిక సంఘర్షణను పురుష కోణంలో చూపించిన నవలలు అప్పటికే కొన్ని ఉన్నాయి. కాని స్త్రీలు ఆ వయసులో అనుభవించే ఉద్వేగాలను, భావాల సంఘర్షణను చూపించిన మొదటి నవలగా దీన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తారు.

మెగ్, జో, బెథ్, ఆమీ అనే నలుగురు అక్కాచెల్లెళ్ళ కథ ఇది. ఇంటి పెద్ద అయిన మిస్టర్ మార్చ్ యుద్దంలో తన దేశానికి సేవ చేస్తూ కుటుంబానికి దూరంగా ఉంటాడు. నలుగురు చెల్లెలు తల్లి సంరక్షణలో ఉండిపోతారు. మానవ విలువలను, ఉదాత్తమైన జీవితాన్ని నమ్మే ఆదర్శభావాలున్న తల్లి వద్ద జీవితాన్ని అర్థం చేసుకునే తమదైన ప్రయత్నంలో ఉంటారు ఆ నలుగురు. ఆ నలుగురికి జీవితం పట్ల భిన్నమైన అభిప్రాయాలు, కలలు, ఆశయాలు ఉంటాయి. డబ్బు, సౌకర్యాలను ప్రేమిస్తారు, అలాంటి జీవితాన్నే కోరుకుంటారు. కావలసినంత ధనం మాత్రమే ఉండటం సంతోషం కాదని, ఖర్చుపెట్టడానికి వెనుకాడనంత ధనం ఉండాలని అదే జీవితమని, ఆనందమని ఆ వయసులోని పిల్లల లాగానే కొన్ని అమాయకమైన అభిప్రాయాలతో పెరుగుతుంటారు వాళ్ళు. ఒకప్పుడు వారిది చాలా పెద్ద ధనిక కుటుంబం. కాని వ్యాపారంలో తండ్రి చాలా ఆస్తి పోగొట్టుకోవడం వలన ప్రస్తుతం మధ్యతరగతి జీవితాన్ని జీవించవలసి వస్తుంది.

తరువాత వయసు వస్తున్న కొలదీ, తమ అనుభవాలను బట్టి జీవితాన్ని అర్థం చేసుకుని మానవ సంబంధాల అవసరం, ధనం కన్నా మానవత్వం గొప్పదనే నిజాన్ని వారందరూ అంగీకరిస్తారు. వారి ఇంటి పక్కన ఒక ధనిక కుటుంబంలో తల్లి తండ్రి లేని లారీ అనే అబ్బాయితో వీరు స్నేహం చేస్తారు. తాత సంరక్షణలో పెరిగే ఈ అబ్బాయితో నలుగురు అక్క చెల్లెల అనుబంధం ఒకో విధంగా ఉంటుంది. లారి వారందరి జీవితంలో ముఖ్య స్థానాన్ని ఆక్రమిస్తాడు.

చిన్నతనంలో తెలియనితనంలో వారేర్పరుచుకున్న అభిప్రాయాలకు కన్న కలలకు విరుద్దంగా వారి యుక్తవయసు జీవితాలు మొదలవుతాయి. మెగ్‌కు డబ్బు అన్నా సౌకర్యవంతమైన జీవితమన్నా చాలా మక్కువ. కాని జాన్ అనే సాధారణ వ్యక్తి ప్రేమలో పడినప్పుడు అతనితో జీవితం ముఖ్యం కాని డబ్బు సౌకర్యాలు వద్దని అందరిని ఆశ్చర్యపరిచి అతన్ని వివాహం చేసుకుంటుంది. జాన్ లారీకి చదువు చెప్పిన టిచర్. పేదవాడు. డబ్బు సంపాదన పట్ల ఆసక్తి లేనివాడు.కాని అతన్ని ఇష్టపడి వివాహం చేసుకుని ఇద్దరి పిల్లల తల్లిగా అనందంగా గృహిణిగా పనిమనుష్యులు కూడా లేని అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఇష్టమైన మనిషితో తృప్తిగా జీవించడంలోని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది మెగ్. ఆమెలోని ఆ మార్పు కుటుంబాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ జీవితానికి అలవాటుపడడానికి కష్టపడ్డా దాన్ని ఆమె ఆస్వాదించే తీరుతో పాఠకుల ప్రేమను సంపాదించుకుంటుంది.

జో ఆ ఇంట్లో రెండో కూతురు. మగ పిల్లవానిగా పెరుగుతుంది. ఆడపిల్లగా అలంకారాలు, బిడియాలు ఆమె వ్యక్తిత్వం కావు. ఒక రచయిత్రిగా ఎదగాలని ఆమె కోరిక. లారీతో చాలా చనువుగా ఉంటుంది. కాని తన కన్నా ఎంతో పెద్దవాడయిన జర్మన్ ప్రొఫెసర్‌ను వివాహం చేసుకుంటుంది. లారీ జోలు జంట అవుతారని అనుకున్నవారినందరినీ ఆమె నిర్ణయం ఆశ్చర్యపరుస్తుంది. ఆ ప్రొఫెసర్‌ని జో బంధువుల ఇంట్లో మొదటిసారి కలుసుకుంటుంది. అతనికి ఆస్తి లేదు కేవలం అతని చదువే అతని సంపద. జో దృష్టిలో స్వేచ్ఛని మించిన ఆనందం మరోటి లేదు. ఫ్రొఫెసర్ ఆమెకు ఇచ్చే వ్యక్తిగత, ఇంటెలెక్చువల్ స్వేచ్ఛ ఆమెకు జీవితంలో అత్యవసరం అనిపిస్తుంది. అందుకే చిన్నప్పటి మితృడు లారీ కన్నా పెద్దవాడైన ఫ్రొఫెసర్‌ను భర్తగా ఎంచుకుంటుంది.

బెథ్ నలుగురు ఆడపిల్లలో అతి సున్నితమైన హృదయమున్న అమ్మాయి. చాలా మానసిక పరిపక్వతను చిన్నప్పుడే ప్రదర్శిస్తుంది. తల్లికి ముద్దుల కూతురు. కాని స్కారెల్ట్ ఫీవర్‌తో చిన్నతనంలోనే మరణిస్తుంది. ఆమె ఆఖరి రోజులు ప్రశాంతంగా గడవడానికి కుటుంబం అంతా ప్రయత్నిస్తుంది. ఆమె లోటు వారిని జీవితాంతం వెంటాడుతుంది.

ఆమీ అందరిలో చిన్నది. ఆమెకూ డబ్బు అంటే విపరీతమైన ఇష్టం. కాని భర్తను ఎన్నుకునేటప్పుడు తనను ఇష్టపడ్డ కోటిశ్వరుడిని కాదని అక్క జో తిరస్కరించిన లారీని వివాహం చేసుకుంటుంది. ఈ నవలలో కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఒకరి పట్ల ఒకరు చూపవలసిన బాధ్యత, కుటుంబం అన్న సిస్టంలోని భద్రత వీటన్నిటినీ చూపించే ప్రయత్నం చేసారు రచయిత్రి. మిసెస్ మార్చ్ తన పిల్లలకు జీవితాన్ని అర్థం చేసుకునే పూర్తి స్వేచ్ఛను తమ భవిష్యత్తుని నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇస్తుంది. జీవితంలో సంతోషాన్ని తమకు నమ్మకమైన మార్గాన్ని వారు ఎన్నుకోవాలనే తాపత్రయపడుతుంది. ప్రేమతో వారి జీవితాలు నిండి ఉండాలని ఆశ పడుతుంది. చివరకు వారి నిర్ణయాలను గౌరవిస్తుంది.

ఈ నవల పూర్తిగా కుటుంబ ప్రధానమైన కథ, మరియు భావజాలంతో నడుస్తుంది. ప్రశాంతమైన జీవితాన్ని తెలివిగా ఎన్నుకోగల విజ్ఞత గల పాత్రలు ఇందులో కనిపిస్తాయి. కలల ప్రపంచం నుండి వాస్తవిక ప్రపంచం వైపు ప్రయాణించిన నలుగురు అమ్మాయిల కథ ఇది. తమను తాము తెలుసుకుంటూ తమ జీవితాలను మలచుకునే అతి బాలెన్స్డ్ వ్యక్తులు వారు. అమాయకమైన చిన్న పిల్లల నుండి పరిపక్వత గల యువతులుగా వారు మారే క్రమం మనకు ఈ నవలలో కనిపిస్తుంది. వ్యక్తిగత శ్రమ, పని పట్ల గౌరవం, ఆత్మగౌరవం, అభిమానంతో కూడిన జీవితాల విలువ, ప్రేమ పట్ల అపారమైన నమ్మకం ఈ నవలలో అన్ని పాత్రలలో ప్రధానంగా కనిపించే లక్షణం. శ్రమను గౌరవించాలనే ఆలోచనను బలపరిచే రచన ఇది. 540 పేజీల ఈ నవల పద్దెనిమిదవ శతాబ్దంలోని అమెరికా మధ్యతరగతి జీవితాన్ని, వారి ఆలోచనలను మన ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఇప్పటికీ ఇంగ్లీషు సాహిత్యంలో ముఖ్యంగా అమెరికన్ సాహిత్యంలో ఈ నవలకు ఎంతో గౌరవ స్థానం ఉంది. చివరకు ఆ ముగ్గురు అమ్మాయిలు తమ తమ జీవితాలలో తమ పిల్లలతో కాలం గడుపుతూ తమ పట్ల తల్లి చూపిన ఆరాటాన్ని తమ పిల్లల పట్ల చూపుతూ తమ తల్లిని పూర్తిగా అర్థం చేసుకునే స్థాయికి ఎదుగుతారు.

Exit mobile version