లోన్ కావాలా సార్!

0
2

[చెన్నూరు హరి నారాయణ రావ్🌿 గారు రాసిన ‘లోన్ కావాలా సార్!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ట్రిం[/dropcap]గ్ ట్రింగ్..”

సీరియస్‌గా రాసుకుంటున్న నాకు చాలా విసుగనిపించింది. ఒక్కసారిగా కోపం చివ్వెత్తున లేచింది. అటూ ఇటూ చూసాను ఏవరన్నా కాల్ అటెండ్ ఐతే బాగుంటుందని. ఎవరైనా అంటే ఇంకెవరు, తనే! తనొచ్చి ఫోన్ తీస్తుందేమోనని పక్కకి చూసాను. అబ్బే, అలికిడి లేదు. మనలో మాట, గతంలో మా అన్నయ్యో, గన్నయ్యో ఫోన్ చేసిన ఒకానొక సందర్భంలో తనని, అదే ఈమెని, చురుగ్గా చూసిన దుస్సందర్భాలు లేకపోలేదు. నంబర్ చూస్తే చంటిగాడు లోకల్. అదే, వినయంగా తలొంచుకున్న తొమ్మిదితో మొదలైన నంబర్. తప్పదని ఫోన్ తీసాను,

“హలో?”

“నమస్తే సార్. మేము ఫలానా ఫైనాన్స్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నాం. మీకు బోలెడు లోను శాంక్షన్ అయ్యిందండి. తీసుకుంటారా?”

“వద్దండీ, సారీ.”

“తీసుకోండి సార్. వడ్డీరేటు కూడా చాలా తక్కువ.”

బాంకులో పనిచేసి రిటైర్ అయిన నాకు ప్రైవేట్ రంగ ఫైనాన్స్ కంపెనీల్లో వడ్డీరేట్ల మాయాజాలం కొత్త కాదు. మరి, ఈ విషయం అవతలి వారికి తెలియదు కదా! ఐనా, అపరిచితులతో అర్థం లేని వాగ్వివాదాలు మానుకుని చాలా కాలం అయ్యింది. విక్రమాదిత్యుడు ఎంతో వినమ్రంగా ఓపిగ్గా చెప్పినట్టు మళ్ళీ అదే సమాధానం, “వద్దండీ.”

ఒక వయసొచ్చాక అపరిచితులు చిరపరిచితులు అనే తరతమ భేదభావం లేకుండా అందరితోను ఒకే విధంగా విభేదించడం అనేది పుర్రెకో బుద్ధేమో! మళ్ళీ కంప్యూటరులో తల దూర్చాను. ఏ సందర్భంలో ఉన్నానో గుర్తు లేదు. ఏ కారెక్టర్ ఏ సంభాషణో. రెండు లైన్లు వెనక్కెళ్ళి చదవాల్సొచ్చింది. కోపం రాలేదు కానీ బాగా కన్ఫ్యూజ్ అయ్యాను.

మర్నాడు. అంటే, అర్ధరాత్రి ఫోనులో ఠంఛనుగా తారీఖు మారినట్టు వెంఠనే అని కాదు. ఓ.. రెండు రోజుల తర్వాత అన్నమాట.

Netflix లో ‘టామ్ హాంక్స్’ సినిమా ‘ఎ మాన్ కాల్డ్ ఓట్టో.’ బాగా లీనమైపోయాను. నిజమేనేమో, వయసు పెరిగాక ఎవరిమీదనో అకారణంగా కోపం వస్తుందేమో. నేనేమీ ప్రత్యేకం కాదు, మ్యూజియంలో పెట్టవలసిన వింత మనిషిని కాదు అనిపించి కొంత ఊరట పొందాను. నేను ఒంటరివాణ్ణి కాదన్నమాట. నా ఆలోచనలు, ప్రవర్తన తప్పు కావన్నమాట. మీడియా పుణ్యమా అని అర్థంలేని వాస్తవం కాని బంధుత్వం కలుపుకున్నాక కొంచెం ఉపశమనం అనిపించినా మళ్ళీ ఆ కధానాయకుణ్ణి చూసేకొద్దీ నా కళ్ళకింద ఏదో బరువుగా గూడు కట్టుకోసాగింది. ఎన్నాళ్ళో అయిందన్నట్టు ఒక్కసారిగా భారంగా గుండెల నిండా ఊపిరి తీసుకుని వదిలాను.

“ట్రింగ్ ట్రింగ్..”

కొత్త నంబర్. ఎవరో ఏవిటో అనుకుంటూ ఫోన్ తీసా.

“సార్, మేం ఫలానా కంపెనీనుండి మాట్లాడుతున్నాం. మీకేదైనా లోన్ కావాలా?” ఎవరిదో ఆడ గొంతు.

“..వద్దమ్మా, ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తారు? అసలు నా నంబర్ మీకెవరిచ్చారు?

“అది కాదదండీ, లోన్ కావాలేమోనని..”

“వద్దండీ.”

ఆమె మళ్ళీ ఏదో చెప్పబోతుండగా మళ్ళీ నేనే,

“ఎనే వే, థాంక్ యూ ఫర్ కాలింగ్” అంటూ కాల్ కట్ చేసాను. రాగము, భావము, ద్వేషము, క్రోధము, వీలైనంతకాలం ఇంకోళ్ళతో అవసరము రాకుండా లేకుండా ‘టచ్ మి నాట్’ అని నాలుగ్గోడల మధ్య బతికేవాడు స్థితప్రజ్ఞుడు.

***

ఇంటికి డైరెక్ట్ బస్సు దొరికేసరికి బాగా లేటయ్యింది భావనకి. ఏడేళ్ళ వంశీ ఏదో చెబుతుంటే ‘ఊ’ కొడుతూ ఫ్రిజ్ లోనుండి చేతికందిన కూరలు తీసి బైట పెట్టి స్నానానికి బాత్రూంలో దూరింది. ఐదు నిమిషాల్లో కానిచ్చి నైటీ సరి చేసుకుంటూ తలుపు తీసిన భావనకి బాత్రూం గుమ్మం బయటే చేతులాడిస్తూ నిల్చున్నాడు వంశీ. వాణ్ణి ఆమాంతం ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి గాట్టిగా నవ్వాలనిపించినా మళ్ళీ ‘ఊ’ కొడుతూ వాడు వెనకే వస్తుంటే దీపారాధన చేసి చేతులు జోడిస్తూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఎందుకో మరి, చెప్పడం ఆపి వంశీ కూడా ఒక్క క్షణం అమ్మ వంక చూసాడు. లిప్తపాటు ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయింది భావన. దేవుడికి మౌనమే తెలుసు, వీడికి మాట్లాడ్డమే తెలుసు.

“పద నాన్నా” అంటూ కిచెన్ లోకి వెళ్ళి ఈ రోజు ఆఫీసులో తాను చేసిన ఫోన్ కాల్స్ గుర్తుకొస్తుంటే గరిటేపాటు తల కూడా అడ్డంగా అసహనంగా తిప్పింది.

ఎప్పుడొచ్చాడో, అలికిడి లేని రాంబాబు స్నానం చేసి ఒక చేత్తో ఫోన్ చూస్తూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. మౌనంగా ఇద్దరికీ వడ్డించి వంశీని ఒళ్ళోకి తీసుకుని తినిపిస్తూ “ఊ, అప్పుడేమైంది?” అంది. ఈరోజు క్లాసులో జరిగింది అమ్మకి చెప్పాలనే ఉత్సాహం వాడిలో కట్టలు తెంచుకుంది.

“నీ అన్నం చల్లారిపోతోంది” ఫోను లోనుండి తలెత్తకుండానే అన్నాడు రాంబాబు. నవ్వి ఊరుకుంది భావన. ఆమెలో అలసట లేదు. విసుగు లేదు. ఉన్నవి లేనివి అన్నీ గుర్తొచ్చి మళ్ళీ నవ్వింది.

***

స్టాఫ్ మీటింగ్.

తెరపై రంగుల స్లైడ్-షో కదులుతోంది. ఒకే విషయం వేర్వేరు గ్రాఫుల్లో కనబడుతోంది. జీవితాలని నిర్దేశించి శాసించే గీతలు కొన్ని పైకి కొన్ని కిందకి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు లాప్-టాప్ ముందు కూర్చున్న ఏరియా సేల్స్ మేనేజర్ ఉగ్ర నరసింహావతారం లైవ్‌లో చూపిస్తున్నాడు. విచిత్రం ఏవిటంటే ఈఊరి కాపు పక్కూరి వెట్టి అనే విషయం ప్రతీసారీ ఇట్టాంటి మీటింగులు అయ్యాక ఆయనకి అనుభవంలోకి వస్తూంటుంది. ఈ మాత్రం వివేకం లేని మనిషి కాదు ఆ అధికారి. వ్యవహారంలో ‘న క్రోధో న మాత్సర్యం న లోభో న శుభామతిః’ అనేది దేవుడికీ జీవుడికీ ఒకటే.

‘గుసగుసలు ఆపండి’ అన్న సంకేతంగా నెమ్మదిగా దగ్గుతూ లేచి నిల్చున్నాడు ఆ సేల్స్ మేనేజర్.

“ముందుగా, కంగ్రాట్యులేషన్స్ టు గౌతమ్! ఈనెల విన్నర్” అంటూ ఆ అధికారి తన సహ ఉద్యోగికి కరచాలనం చేయడం అందరి కరతాళధ్వనుల మధ్య ఆశ్చర్యానికి గురి చేసింది భావనకి. అతని గ్రాఫ్‌కి తన గ్రాఫ్‌కి మధ్యన కనిపించీ కనిపించని సూక్ష్మ దూరాన్ని గుర్తించడం కష్టమయ్యింది ఆమెకి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత ఉత్సాహంగా బొకే అందుకుంటూ మిగిలిన సహోద్యోగుల వంక నిస్సహాయంగా చూసాడు గౌతమ్.

“జీతాలు తీసుకుంటున్నామనే ఇంగితం, జ్ఞానం ఏమాత్రం లేవు మీకు. గతనెల సేల్స్ నుండి ప్రోగ్రెస్ లేదు. జీతం మాత్రం గత నెల తీసుకున్నారు, ఈ నెలా తీసుకుంటారు” ఫోన్ తీసుకుని “నీకు బుద్ధుందా లేదా, గడ్డి తింటున్నావా” అంటూ ఎవరినో అరిచాడు.

అందరూ తల వంచి వింటున్నారు. కొందరి మొహాలు వడిలి వాలిపోతే ఇంకొందరు అలవాటే అన్నట్టుగా. తనని కాదు అన్నట్లుగా ఏదో ఫైల్‌లో తల దూర్చాడు గౌతమ్.

“మిస్ భావన, ఏం చేసున్నారు మీరు?”

తల వంచుకుని కళ్ళు మూసుకుని పెన్నుతో అచేతనంగా అనాలోచితంగా చక్రాలు తిప్పుతున్న భావన ఉలిక్కి పడింది.

“సర్?” అంటూ నిల్చుంది.

“ఏం చేస్తున్నారు అంటున్నాను. మీ టార్గెట్ ఎంత, మీరు రీచ్ అయ్యింది ఎంత? రోజూ సాయంత్రం ఆరింటికే వెళ్తున్నారట! రాజమండ్రి బ్రాంచిలో ఖాళీ ఉంది వెళ్తారా?” ఉరుములు లేని ఉప్పెన అది.

కాళ్ళకింద భూమి కదిలినట్లైంది భావనకి. తన సమాధానం టార్గెట్‌ని మరపించలేదని తెలుసు ఆమెకి. అంత నిశ్శబ్దంలోనూ ఎవరో కిసుక్కున నవ్వినట్లు వింత భావన. కూర్చో అంటాడని దీనంగా చూసింది. హావభావాలకి అతీతుడు ఉన్నతాధికారి.

“డియర్ కలిగ్స్, మీకిదే లాస్ట్ వార్నింగ్. వచ్చేనెల ఎవరినీ ఉపేక్షించేది లేదు. నవ్ యు కెన్ గొ” అంటూ మళ్ళీ లాప్-టాప్ లోకి దూరాడు. తన పై అధికారులతో సమావేశానికి సిద్ధమౌతున్నాడు. ముచ్చెమటలు పోస్తుంటే తినబోయే తిట్ల విందుకు సిద్ధమౌతున్నాడు. కొందరు ఆయన చుట్టూ చేరి భజన మొదలుపెట్టారు.

మీటింగ్ పేరుతో టైం గుర్తించని భావనకి ఆఫీసు వాల్-క్లాక్ ఆరున్నర చూపించింది. అధికారి ఉండగా తను వెళ్ళవచ్చో లేదో అనే మీమాంసతో తన కుర్చీలో కూలబడింది. ఏడు దాటితే తనుండే ఏరియాకి బస్సులుండవని తెలుసు ఆమెకి.

***

“ట్రిగ్ ట్రింగ్.”

‘ఆదిత్య హృదయం’ చదువుతూ పక్కనున్న ఫోన్లోకి మెడ సారించాను. ‘పనిపాట లేని మనుషులు’ అనుకుంటూ మళ్ళీ పుస్తకంలోకి మెడ దించాను.

“ట్రింగ్ ట్రింగ్.”

రెండుసార్లు చేశారంటే ఎవరో తెలిసినవాళ్ళే ఎంతో అర్జెంటైతేనే చేసుంటారు. ప్చ్, తప్పేలా లేదు. ‘మన్నించవయ్యా రామచంద్రా’ అని స్వగతంలో అనుకుంటూ ఫోన్ తీసాను,

“హలో, ఎవరండీ?”

“సార్ కారు మీద లోన్ తీసుకుంటారా?” అవతలి స్వరం.

“అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి.”

“కారు మీద లోన్ తీసుకుంటారా అని అడుగుతున్నాను సార్” అట్నుంచి వివరణ.

మూర్ఛపోవడం నా వంతయ్యింది. ఇన్నేళ్ళ నా బాంక్ సర్వీసులోను బైట మార్కెట్లోను ఇళ్ళపై రుణాలు ఇవ్వడం చూసాను. దాన్ని మార్టుగేజ్ లోన్ అంటాము. ఇలా కార్లపై కూడా ఇస్తున్నారా? హతవిధీ, ఎంత గడ్డుకాలం వచ్చింది అని వాపోతూ అడిగాను,

“ని నిజ్జంగానే కారు మీదే ఇస్తారామ్మా లోను?”

“అదే సార్, కారు కొనుక్కోడానికి లోన్ ఇస్తాం అనే చెపుతున్నాను.”

“మరి, ఇందాక కారు మీద లోన్ అన్నావ్?” ఈనాటి కుర్రకారు కంగారు బేజారు తెలుసు కాబట్టే అడిగాను చిరునవ్బుతో.

“పొరపాటుగా అన్నా సార్. తీసుకోండి సార్, ప్లీజ్.”

“వద్దమ్మా, నాకు ఆల్రెడీ ఒక ఖరీదైన కారు కొని మావాడు అమెరికా వెళ్ళాడు. దాన్ని నడిపే ఉత్సుకత మోజు నాకు లేకపోయినా దుమ్ముధూళి పడితే పిచ్చిముండ పాడౌతుందని నేనే రోజూ దాన్ని తుడుస్తూంటాను. లేనిపోని చాకిరీ తలమీదకి తెచ్చుకున్నాను.”

“ఇంకో కారు తీసుకోండి సార్.”

“నీకు తెలుగు అర్ధమైనట్టు లేదే! ఇంకోటి తీసుకుని ఏం చేసుకోమంటావ్? పోనీ ఒక పని చెయ్. లోన్ వద్దు కానీ ఏదన్నా అప్పు ఇస్తావా?” వాతావరణాన్ని ఆహ్లాదపరచాలని చమత్కారాన్ని జోడించా.

“సారీ సార్” అంటూ అట్నుంచి ఫోన్ క్లిక్ మన్న శబ్దం. సేల్స్-మాన్ ఉద్యోగంలోని కష్టాలు గుర్తుకొచ్చి నా మొహంలో చిరునవ్వు, మాటల్లో వ్యంగం మాయమయ్యాయి.

..యుద్ధేషు విజయిష్యషి.

ఏది యుద్ధమో ఎవరు విజేతలో అర్థం కాలేదు నాకు. తెలుసుకునే ప్రయత్నమూ చెయ్యదల్చుకోలేదు. నేను యుద్ధంలో లేనప్పుడు తెలుసుకుని ఏం చేస్తానట!

***

ఫోన్ కట్ చేసి లిస్టులోని మరో నంబరుకి కాల్ చేస్తోంది భావన.

“హలో సార్, కంగ్రాట్యులేషన్స్. మా లక్కీ డ్రాలో మీకు ఐదు లక్షల లోన్ శాంక్షన్ అయ్యిందండీ. ఈరోజే వచ్చి సంతకాలు చేసి పండగ చేసుకోండి సార్.”

“ఏ ఏ లోనండి, ఎక్కడ మీ ఆఫీసు? సాయంత్రం రావచ్చా? కొంచెం ఎడ్రస్ చెప్పండి.”

“అవసరం లేదండీ, ఈ రోజు సాయంత్రం మా ఏజెంట్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు. మీరు పత్రాలతో సిద్ధంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ నంబర్‌కి కాల్ చెయ్యండి. దిస్ ఈజ్ భావన విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.”

టైం ఆరు దాటుతూండగా భుజాన బేగ్ వేసుకుంటూ ఆఫీసు కలయచూసింది భావన. ఉన్నవారిలో కొందరు ఫోన్లలో ఎవరికో భూతలస్వర్గం చూపిస్తుంటే ఇంకొందరు దస్తాడు పేజీలు ముందేసుకుని వచ్చిన కష్టమర్ల చేత ఒక్కో పేజీలో కనీసం రెండు సంతకాలు చేయిస్తున్నారు. వడివడిగా బస్టాండ్ వైపు ఆమె అడుగులేస్తుంటే తూరుపు దిక్కు తన నల్లటి జుత్తుని విరబోసుకుంటోంది, పశ్చిమ దిక్కు తన నల్లటి శిగలో మల్లెలు తురుముతోంది.

***

దేవుడి భృకుటి ముడి పడింది. “ఆ పెద్దాయనకి హృదయం లేదల్లే ఉందే! లోన్ తీసుకొమ్మని ఆ అమ్మాయి అన్నిసార్లు అడుగుతుంటే ఈయనకొచ్చిన కష్టం ఏంటంట? తీర్చగలడు కదా, మరింకేంటి నొప్పి?”

“నారాయణ! అతను వయసులో ఉన్నప్పుడు, సంపాదన బాగున్నప్పుడు, పిల్లల ఫీజులకి ఇంటి కిస్తీలకి ఈ ఫైనాన్స్ కంపెనీల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా ఎవడూ లోను ఇచ్చిన పాపాన పోలేదు. తీర్చే స్తోమత ఉన్నా ఇప్పుడీ వయసులో పెన్షన్ డబ్బులతో కొత్త లోన్లు తీసుకుని మళ్ళీ ఆ జంఝాటం ఎందుకని మానుకున్నాడేమో. శేషజీవితాన్ని కృష్ణా రామా అనుకోక ఈ వయసులో మళ్ళీ కొత్త లోన్లు, కొత్త బంధాలు ఎందుకు, ఖర్చు తగ్గించాలి అనుకున్నాడేమో” సందేహం వెలిబుచ్చాడు పక్కనే ఉన్న నారదుడు.

దేవుడు తల పంకించాడు. “ఐతే మాత్రం, తన గతం మర్చిపోయాడా!”

మళ్ళీ ఇలా అన్నాడు నారదుడు “స్వామీ! వయసులో ఉన్నప్పుడు, అవసరాలు కష్టాలు వచ్చినప్పుడు వరాలివ్వని దేవుళ్ళు, ఫైనాన్స్ కంపెనీలు జీవితపు చరమదశలో కరుణించి వెంటపడినా ఏమి ఫలితం ప్రభూ, నెత్తినేసి కొట్టుకోడానికా!”

ఎక్కడో చివుక్కుమనిపించి నారదుని వంక చురచురా చూశాడు దేవుడు.

“నారాయణ నారాయణ..” మహతి మ్రోగిస్తూ నిష్క్రమించాడు నారదుడు.

లోను ఇవ్వగలడా సత్యాపతి।

చేసి తీర్చగలడా మహీపతి॥

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here