[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సత్యజిత్ రే బెంగాలీ సినిమా ‘నాయక్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘నాయక్’ (బెంగాలీ)
ఓ సినిమా చూస్తున్నప్పుడు ఓ ఎడతెగని అనుభూతేదో ప్రధానమై బలంగా పెనవేసుకుంటుంది. ఆ అనుభూతి సాంకేతికంగా జనించింది కావొచ్చు, కథాపరంగా ప్రాణం పోసుకున్నది కావొచ్చు. సినిమా అంటే శబ్దమని ఏనాడో సాంకేతికంగా అర్థం మార్చుకున్నాక, మూకీలు అదృశ్యమైపోయాయి. అయినా సినిమా అంటే నిశ్శబ్దమేనన్న మౌలిక నిర్వచనాన్ని పునఃస్థాపించే ప్రయత్నం చేస్తే, అదొక ఆధునిక మూకీ అయి విస్మయ పరుస్తుంది కమర్షియల్ టాకీల కాలంలో. సినిమాలకి శబ్ద ప్రసార కేంద్రాలు మూడుంటాయి: సంభాషణలు, నేపథ్య సంగీతం, శబ్ద ఫలితాలు అనేవి. శంకరాభరణం, ముత్యాలముగ్గు, మేఘ సందేశం, సితారలలో సంభాషణల్ని సంక్షిప్తం చేయడం వల్ల ముప్పాతిక శాతం శబ్ద ప్రకంపనలు ఆ సినిమాల్లో తగ్గిపోయాయి. అయినా అవి పెద్ద హిట్టయ్యాయి. అదుపులో లేని శబ్దకాలుష్యంతో బయట ట్రాఫిక్ ఎంత హిట్టవుతుందో, ఇది మోటారు పరిశ్రమకి ఎంత వీనుల విందుగా వుంటుందో, నియంత్రించిన శబ్దంతో సినిమాలూ అంతే హిట్టయి, సినిమా పరిశ్రమ అంతే పరవశిస్తుందని పై నాల్గు క్లాసిక్స్ నిరూపించాయి. ఇది సంభాషణల పరంగా శబ్ద నియంత్రణ. ఇదే నేపథ్య సంగీత పరంగా, శబ్ద ఫలితాల పరంగా చేస్తే? అదింకో అనుభూతి అవుతుంది. వెండి తెరమీద అపూర్వ అనుభూతి. రెండు గంటల సేపు ఇదలా కూర్చో బెట్టేస్తుందంతే. మేకింగ్ సాంకేతికాలు భారీ పెట్టుబడులతో కమర్షియల్ సినిమాల్లో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. ఇంతకంటే గొప్పపేరు స్వల్ప పెట్టుబడితో సమాంతర సినిమాలూ సాధిస్తాయి – సత్యజిత్ రే వంటి కాలాని కతీతుడైన దార్శనికుడుంటే.
సింగీతం శ్రీనివాసరావు వంటి సీనియర్ దర్శకుడైతే, కమల్ హాసన్‌ని ‘పుష్పక విమానం’ లాంటి పూర్తి స్థాయి కమర్షియల్ మూకీకి క్రియేటివ్ జీనియస్‌గా ఒప్పించుకోగలరు. ఇలా కమర్షియల్ సంగతులు తెలిసిన క్రియేటివ్ జీనియస్సులు కాకుండా, కమర్షియల్ మాస్ మసాలాలే తెలిసిన గజచర్మాలకి శబ్ద సౌందర్యాలే మర్థమవుతాయి.
‘నాయక్’ శబ్ద సౌందర్యమంతా రైలు ప్రయాణంతోనే వుంది. రైలు ప్రయాణంలో అలాటి పాత్రలుండడం వల్ల శబ్ద సౌందర్యమలా కుదిరింది. 1960లలోనైనా ఇప్పుడైనా, సంపన్న సమాజం రణగొణ ధ్వనులకి దూరంగా, ఏసీ గదుల్లో నిశ్శబ్ద వాతావరణంలో, నింపాదిగా జీవనం సాగించుకుంటుంది. ఏసీ రైల్లో కూడా అంతేకదా? సంపన్నులు ఏసీ ట్రైన్లో ప్రయాణిస్తూ, వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వుంటే అంతటా సైలెన్సే కదా? దీన్నర్ధం జేసుకుంటేనే కదా దర్శకుడు రిచ్ క్లాస్ సొసైటీ కథని దాని తాలూకు నేపధ్యంలో, ప్యూరిటీతో మనకి అందించి మైమరపించగలడు?
అప్పటి కలకత్తా ఢిల్లీల మధ్య ప్రయాణించే ఏసీ డీలక్స్ ట్రైన్లో ఈ కథ జరుగుతుంది. తర్వాత ఈ ట్రైను పేరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా మారింది. ఈ ట్రైను నిజమైన ట్రైనే అన్న భ్రమ కల్గిస్తుంది. కానీ ఇది స్టూడియోలో నిర్మించిన ట్రైన్ సెట్ మాత్రమే. బన్సీ చంద్ర గుప్తా అనే కళా దర్శకుడి సృష్టి. ట్రైను లోపలి దృశ్యాలు, ట్రైను ఊగడం వగైరా నిజమైన ట్రైనే అన్పించేలా ఆప్టికల్ ఇల్యూషన్ టెక్నిక్‌తో సాధించారు. అద్దాలు దించిన ఏసీ కూపే ల్లోంచి కదిలిపోయే బయటి దృశ్యాలు సెట్లో వేసినవి కాక రియల్ దృశ్యాలే. ఇదొక మ్యాజిక్.
ఇక రైలు పట్టాలు క్లయిమాక్స్ దాకా కనపడనే కనపడవు. ఆ కన్పించినప్పుడు కూడా కథానుసారం ఒకే పట్టా కన్పిస్తుంది. హీరో బయటికి వంగిపోయి, అవతలి ట్రాకులో వెనక్కి పరిగెడుతున్న ఒక్క పట్టానే చూస్తూంటాడు. ఎందుకంటే తనది జోడు పట్టాల జీవితం కాదు. కథలో ఏం జరుగుతోందో, పాత్రకేం జరురుగుతోందో అది తప్ప, అప్పుడు తప్ప, ఇంకెప్పుడూ ఇంకేం చూపించరాదన్న సినిమా సైన్స్ సత్యజిత్ రే సొంతం.
శబ్దాన్ని ఎగవేయడానికి – మొదట్లో ట్రైన్ ఎక్కడానికి స్టేషన్ లోంచి హీరో వస్తున్న దృశ్యాన్ని కూడా ఏసీ కూపే దించిన అద్దాల్లోంచే చూపించారు. దీంతో సహజంగానే బయటి శబ్దాలు వినపడకుండా అయింది. ట్రైను ప్రయాణం మొదలయ్యేప్పుడు బయటి నుంచి ఇది ఛుక్ ఛుక్ రైలు బండీ అని ప్రేక్షకులకి అర్ధమవ్వాలని, బయటి నుంచి ట్రైను మాస్టర్ షాట్ వేసి పెద్ద బాల శిక్ష చెప్పలేదు. మసాలా డైరెక్టర్ వీరోచితంగా ఇదే పని చేసి చెడగొడతాడు. అసలు కథలోకి మొట్ట మొదట రైలు దృశ్యం వచ్చినప్పుడు, నేరుగా కూపేల్లో రిచ్ ప్రయాణీకుల రాక తో, ఇంటీరియర్స్ లోనే ఓపెనవుతుంది.
ట్రైను నిశ్శబ్దంగా స్మూత్‌గా సాగిపోతూంటే, మనం కూడా కథతో పాటు అంతే స్మూత్‌గా ఆహ్లాదంగా సాగిపోతూంటాం. ట్రైను లోపల ఎవ్వరూ స్వరం పెంచికూడా మాట్లాడరు, అరవరు, కేకేసి కేటరింగ్‌ని పిలవరు. ఇది ట్రైను కాదు, విమానం అన్నట్టు ఎక్స్‌క్లూజివ్‌గా వుంటుంది సంపన్న జీవుల కథ కోసం. ఇక నేపథ్య సంగీతం ఎప్పుడుంటుందో, వున్నప్పుడు విన్పిస్తోందే లేదో అన్నంత పొదుపుగా వుంటుంది. శబ్ద నియంత్రణతో ఈ సాంకేతిక ఔనత్యాన్ని, ఇదిచ్చే అనుభూతినీ ఇక్కడ తెలుసుకోవడం కంటే, చూసి అనుభవించాలి.