లోకల్ క్లాసిక్స్ – 12: నిహలానీ నిప్పు కణిక!-2

0
2

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఆక్రోశ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఆక్రోశ్’ (హిందీ/ఆర్ట్)

[dropcap]ల[/dropcap]హణ్య కథ ముగింపు అప్పటి 1980ల నాటి స్త్రీపాత్ర చిత్రణలకి అద్దం పడుతుంది. ఇది మళ్ళీ లహణ్య పాత్ర చిత్రణ పట్ల ప్రశ్నలు రేకెత్తించేలా వుంటుంది. ఖచ్చితంగా లహణ్య ఈ ముగింపుని మనసులో పెట్టుకుని అలా కేసులో నోరు విప్పకుండా ప్రవర్తించి వుండడు. ముందేం జరుగుతుందో అతను వూహించే అవకాశం లేదు. తన తండ్రి మరణిస్తాడనీ, ఆ చితికి తను నిప్పంటిస్తున్నప్పుడు, అక్కడున్న పోలీసులు తన చెల్లెల్ని కామదాహంతో చూస్తారనీ, అప్పుడా చెల్లెల్ని నరికి చంపెయ్యాలనీ, దివ్య దృష్టితో ముందే చూసి, ముందస్తు పథకం వేసుకుని, కేసులో నోరువిప్పని మొండితనంతో వుండి వుండడు. కథకి ఈ ముగింపు నివ్వాలని నోటికి తాళం వేసుకుని వుండడు. ముగింపు అతడికి తెలీదు. తెలిసిందల్లా జెడ్పీ చైర్మన్, అతడి దోస్తులు తన భార్య మీద అత్యాచారం జరిపి చంపారనే. దీంతో ఈ పోలీసు – కోర్టు విచారణ అంతా కాదు, అసలు వాళ్ళని పట్టుకుని చంపెయ్యాలనే కసితోనే, కేసులో తనకేమైనా ఫర్వాలేదని సహకరించడంలేదని స్పష్టమవుతూ వుంటుంది కథనంతో.

అతడి మనసులో వాళ్ళ మీద కసి మాత్రమే వుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా తప్పించుకుని వాళ్ళని చంపేస్తాడని ఒక సహజమైన ముగింపు తోస్తూ వుంటుంది. దీన్ని ఉల్టాపల్టా చేయడం నిహలానీ ఉద్దేశం కావచ్చు. యాంటీ క్లమాక్స్‌తో అనూహ్యంగా ఒక షాకింగ్, డిస్టర్బింగ్ ముగింపు నివ్వాలని సంసిద్ధుడైనట్టు కన్పిస్తుంది. అయితే ఇలా చేయడం ద్వారా లహణ్య పాత్ర చిత్రణ ప్రకారం ఇది అసహజ ముగింపే అయింది. పైగా అధిపత్య భావజాలాన్ని ప్రకటించే ముగింపయింది – ‘పారసైట్’లో లాగా. ఈ సంవత్సరం ఉత్తమ విదేశీ చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు పొందిన కొరియన్ చలన చిత్రం ‘పారసైట్ లో అగ్రరాజ్యాల భావజాలపు ముగింపు వల్లే అవార్డు ఇచ్చారనేది స్పష్టమే. ఇందులో పేదవాడు (పేద దేశాలు) ఎదగకుండా వుండాలంటే నేరాల వైపు, అశాంతి వైపూ మళ్ళించి, పేదరికమనే శ్లేష్మంలో అలాగే పడి వుండేట్టు చేయాలన్న అగ్రనీతిని ప్రకటించిందీ సినిమా.

ఇలాగే ఆదివాసీ లహణ్యతో కూడా అగ్రనీతి. నువ్వు ఎలీట్ క్లబ్ మీద పగదీర్చుకోలేవు, పై పెచ్చు నీ చేతలతో నువ్వే సంయమనం కోల్పోయి బలిపశువుగా వుంటావు, లేదా వుండాలి – అన్న అర్థంలో ముగింపు.

మరాఠీ ‘సైరాట్’ లో పిల్లవాడి రక్తపు పాద ముద్రలతో ముగింపు దృశ్యం (క్లోజింగ్ ఇమేజి) ఎలా డిస్టర్బింగ్‌గా వుంటుందో, అంత డిస్టర్బింగ్ గానూ లహణ్యతోనూ వుంటుంది – అయితే అర్థరహిత ముగింపులా, వేరే అర్థాలొచ్చే చిత్రణగా వుంటుంది.

కోర్టు విచారణ కొనసాగుతూండగానే, లహణ్య తండ్రి మరణిస్తాడు. అంతక్రియలకి పోలీసులు లహణ్యని తీసుకుని పోతారు. అక్కడ పేర్చిన చితి చుట్టూ బిడ్డ నెత్తుకుని ఏడుస్తూ లహణ్య చెల్లెలు, కొందరు గూడెం వాసులు, లాయర్ భాస్కర్ వుంటారు. చితికి నిప్పంటిస్తూ లహణ్య పోలీసుల వైపు చూస్తే, వాళ్ళు గుటకలేస్తూ చెల్లెల్ని చూస్తూ వుంటారు. దాంతో రగిలిపోయిన లహణ్య చెల్లెలి మీద దాడి చేసి చంపేస్తాడు.

భార్యకి పట్టిన గతే చెల్లెలికీ పడుతుందనీ ఇలా చేశాడు. మేల్ ఇగో ప్రాబ్లంతో దర్శకుడే ఇలా చేయించినట్టు ఇంకో అర్థం. తిరుగుబాటు కాకుండా లొంగుబాటునే ఈ ఆర్ట్ సినిమా ద్వారా ప్రకటించాడు. లేకపోతే లహణ్య అణిచి పెట్టుకున్న కసికి పోలీసులూ తోడైనప్పుడు వాళ్ళనీ చంపేసి పారిపోయి, జడ్పీ చైర్మన్‌నీ అతడి ముఠానీ చంపేసేవాడు. అప్పుడు వెళ్లి జైల్లో కూర్చునే వాడు.

మొదటి కేసులో వున్న హత్యారోపణలకి రెండో కేసులో చెల్లెలి హంతకుడుగా ప్రత్యక్షంగా దొరికి పోయాక, మొదటి కేసు అతడి మీద అన్యాయంగా రుజువయ్యేందుకు ఇక అడ్డేమీ లేకుండా పోయింది. లాయర్ భాస్కర్ ఈ రెండో కేసు కూడా పోరాడేందుకు సిద్ధపడతాడు. గురువు దొసానే నిస్సహాయత వ్యక్తం చేస్తాడు. భాస్కర్‌కి యాక్సిడెంట్ జరిగే అవకాశాన్ని హెచ్చరిస్తాడు. అడవిలో కన్పించిన ‘అన్న’ యాక్సిడెంట్ లోనే పోయాడు. ‘అయితే నేను కూడా యాక్సిడెంట్‌లో పోతే నా కేసు కూడా రుజువు చెయ్యరా మీరూ? ఒక ఆదివాసిగా అన్నీ సహిస్తూ వుంటారా?’ అంటాడు భాస్కర్. ‘సహించక తుపాకీ తీసుకోవాలా? పిచ్చిగా మాట్లాడకు! ఆడవాళ్ళతో ఇలా జరుగుతూ వస్తోంది…’ అంటాడు దొసానే. సరేనని కోపం అణుచుకుంటూ వెళ్ళిపోతాడు భాస్కర్.

ఇది తిరుగుబాటు కథ కాదు, లొంగుబాటు కథ. భాస్కర్ అభ్యుదయవాది అయితే దొసానే దాస్య భావజాలం కలవాడు. లాయర్ భాస్కర్ పాత్రలో నసీరుద్దీన్ షా అమాయక నటన ఒక వన్నె తీసుకొస్తుంది సినిమాకి. దొసానేగా రాజీ పడిన జీవితపు పాత్రలో అమ్రిష్‌పురి ఆలోచనాత్మకంగా నటిస్తాడు. ఇక ఆదివాసీ బాధితుడు లహణ్య పాత్రలో ఓంపురి సరేసరి. చిట్ట చివరి క్షణాల్లోనే నోరు విప్పి ఆక్రందించే పాత్ర. నాగిగా స్మితా పాటిల్ సంక్షిప్తంగా రెండు దృశ్యాల్లో కన్పిస్తుంది. ఒక దృశ్యం కొవ్వొత్తి వెల్గిస్తూ, ఇంకో దృశ్యం పడకగదిలో.

గోవింద్ నిహలానీయే ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన వాస్తవిక కథా చిత్రానికి సంగీతం అజిత్ వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here