[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘భూమిక’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘భూమిక’ (హిందీ/ఆర్ట్)
ఊళ్లోనే జగన్నాథ్ భండార్కర్ అనే అతను వుండేవాడు. హంసా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేవాడు. పదేళ్ళు పెద్దవాడైన అతను బాల్యంనుంచీ హంసాతో సన్నిహితంగా మెలగడం తల్లి కిష్టముండేది కాదు. కులం తక్కువని కూతుర్ని దూరంగా వుంచేది. హంసా సినిమాల్లో చేరుతూ కుటుంబం ముంబాయికి మారేక, అతనూ అనుసరించాడు. అసలు హంసాని సినిమాల్లో చేర్పించాలని బలవంత పెట్టింది అతనే. హంసా తల్లికి సినిమా వృత్తి పరువు తక్కువని, అప్పటికే తమ కళావంతుల, దేవదాసీల నేపధ్యాన్ని లోకులు హీనంగా చూస్తున్నారనీ మనస్తాపంతో వుండేది.
ఇదంతా జీవిత చరిత్రగా ఆమె అరుణ్ సాధు అనే జర్నలిస్టుకి చెప్తే, గ్రంథస్థం చేశాడతను. దీన్నే శ్యాం బెనెగళ్ తెరకెక్కించారు.
రిలేషన్ షిప్ డ్రామా
చిన్నప్పుడామె ప్రాణ సమానంగా ఒక కోడిని పెంచుకుంటుంది. అతిథులోస్తే ఆ కోడిని తీసుకుని పారిపోతుంది. ఆమె తల్లి వెంటపడి లాక్కుని ఆ కోడిని కోసి కూరొండేసి అతిథులకి పెట్టేస్తుంది. కోడిని పోగొట్టుకున్న ఆమె తర్వాత బంగారు గుడ్లు పెట్టే బాతు అయిపోతుంది…
వేధించే భర్తని వదిలేసి హీరో రాజన్ (అనంత్ నాగ్) దగ్గరి కెళ్ళి పోతుంది. అతనిప్పుడు అంత ఇష్టంగా వుండడు. పెళ్లి చేసుకోమంటుంది. ముందు విడాకులు తీసుకొమ్మంటాడు. ఆమెని హోటల్ గదిలో వుంచుతాడు. హోటల్లో వుంటూ తిరిగి షూటింగులతో బిజీ అవుతుంది. ఒకరోజు భర్త పిలుస్తున్నాడు వెళ్ళమంటాడు రాజన్. వెళ్ళకపోతే భర్త నుంచి ఉత్తర మొస్తుంది. అది చదవదు. ఆ రాత్రి ఎదుటి రూమ్ లోంచి తన కిష్టమైన పాట వస్తూంటే వెళ్లి తలుపు తడుతుంది. ఆ గదిలో ధనికుడు వినాయక్ కాలే (అమ్రిష్ పురి) ఇంకో వ్యక్తితో వుంటాడు. ఆ వ్యక్తి ఆమెని హీరోయిన్‌గా గుర్తు పట్టి వినాయక్‌కి చెప్తాడు. వినాయక్ పట్టించుకోడు. చీప్‌గా చూస్తాడు. పాట వినాలని వెళ్లి గ్రాంఫోన్ రికార్డు దగ్గర కూర్చుంటుంది. చాలా చులకనై పోతుంది అతడి దృష్టిలో. ఆ గదిలోంచి వచ్చేస్తే బయట భర్త వుంటాడు. ఆమెని అదోలా చూసి, ఇంకో సినిమా ఆఫర్ తెచ్చానంటాడు,
ఆ సినిమా దర్శకుడు సునీల్ వర్మ (నసీరుద్దీన్ షా). వెంటనే అతడికి క్లోజ్ అయిపోతుంది. అతను కవితాత్మకంగా మాట్లాడే బూటకపు అస్తిత్వవాది. జీవితం, పునర్జన్మ లాటి వాటిలో నమ్మకం లేదంటాడు. పురుగులెలా పుట్టి చస్తాయో మనుషులూ అంతేనంటాడు. జీవితానికి అర్థం లేదంటాడు. అందుకే జీవితాలకో అర్థాన్నివ్వడం కోసం మనుషులు ప్రాణాలైనా ఇస్తారంటాడు. అయితే తను మామూలుగా చావనంటాడు. ఆత్మహత్య చేసుకుని చస్తానంటాడు. అది కూడా దుర్భర పరిస్థితులకి కాదంటాడు. హాయైన సమయ సందర్భాలు చూసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటాడు.
ఆమెని దగ్గరికి తీసుకుంటూంటే భయంగా వుందంటుంది కూతురి గురించి. అది కూతురి గురించి భయం కాదంటాడు. ‘నీ లోపల నువ్వు చూస్తున్న అద్దం ముక్కలవుతుందన్న భయమది. పాపం నీకు కావాల్సిన వాళ్ళందరూ నీ దృషిలో కేవలం అద్దాలే. నువ్వా అద్దాల్లో బందీవైన మూర్తివి. కొత్త అనుభావాలొచ్చి ఆ అద్దాలెక్కడ ముక్కలై నీ ఇష్టమైన ఖైదు చెదిరిపోతోందో నన్న భయం నీది. చెప్పు, కొత్త అనుభవాల్నుంచీ నిన్ను నీవు కాపాడుకుంటూ నీడల మాటున ఇలాగే జీవితం గడిపేద్దామనుకుంటున్నావా?’ ఇలా అనేసరికి ఆలోచనలో పడుతుంది.
తిరిగి షూటింగ్ చేస్తూంటే వాళ్ళిద్దరి సాన్నిహిత్యాన్ని రాజన్ గమనిస్తాడు. ఆమె సంతోషంగా భర్త దగ్గరి కెళ్లిపోయి, నెల తప్పానని చెప్తుంది. షాకై అబార్షన్ చేసుకోమంటాడు. ఇది నీ బిడ్డే అన్నా నమ్మడు. బలవంతంగా అబార్షన్ చేయించేస్తాడు.
ఇకామె తట్టుకోలేక సునీల్ వర్మ దగ్గరి కొచ్చేస్తుంది. రాత్రి అతడితో గడుపుతుంది. ముందే షరతు పెడుతుంది. రాత్రి గడిపాక ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని. రాత్రి ఆమెతో గడిపి తెల్లారి మాయమైపోతాడు ఆత్మహత్య గురించి అంత కవిత్వం చెప్పిన బూటకపు అస్తిత్వవాద కవి.
వినాయక్ ఇంట్లో మంచాన వున్న ‘అక్క’ తనకో మాట అని వుంది, ‘వంట గదులు మారతాయి, పడక గదులూ మారతాయి, మగవాళ్ళ రూపాలూ మారతాయ్…మగవాళ్ళు మారరు’ అని.
ఇక ఈ పరుగు చాలనుకుని హోటల్ గదిలో నీడ చూసుకుంటే, మెల్లిగా రాజన్… ఫోన్ … చేస్తాడు… హలో హలో అంటూంటాడు… ఆమె నిశబ్దం మీద చీకటి కమ్మేస్తుంది…
కాల దోషం లేని సార్వజనీనం
మనసు మెలిదిప్పే ముగింపు. వెంటాడే ముగింపు. ఇంతకి ముందు అప్పట్లో రాజన్ దగ్గరి కొచ్చేసినప్పుడు, భర్త పిలుస్తున్నాడు వెళ్ళమని అతను అన్నప్పుడు, వెళ్లనంటుంది. హోటల్ గదిలో మగ్గిపోతావంటాడు. అప్పుడు, ‘ఇంట్లో మగ్గి చావనా? ఇంటిదానికో విలువ వుండదా? ఇది నీకు వింతగా వుండొచ్చు. నేను ఇంటిదాన్ని అవాలనుకుంటున్నాను’ అని గొప్పగా ప్రకటించుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే రాజన్…
‘అంతులేని కథ’లో జయప్రద పాత్రకి మళ్ళీ అదే ఉద్యోగం… 1976లో బాలచందర్ దర్శకత్వంలో జయప్రద, రజనీకాంత్, కమల్ హసన్‌లతో విడుదలైన సూపర్ హిట్ ‘అంతులేని కథ’లో జయప్రద పాత్ర కథ ఇలాటిదే. అన్ని కోరికలూ చంపుకుని తానొక్కతే సగటు ఉద్యోగం చేస్తూ కుటుంబ భారమంతా మోస్తూ, చివరికి విముక్తురాలై పెళ్లి చేసుకోబోతూంటే, విధి వక్రించి మళ్ళీ అదే కుటుంబ బాధ్యతల్లోకి… అదే సగటు ఉద్యోగంలోకీ…
ఇజాలు లేవు, అలాగనీ మేల్ ఇగోలూ లేవు. బాల చందరైనా, శ్యాం బెనెగళ్ అయినా కొన్ని నిజాలే చెప్పారు. అర్థాలు ప్రేక్షకులకే వదిలేశారు. స్మితా పాటిల్ యీ పాత్రని ఇప్పటికీ నేటి పాత్రే అన్నట్టు సార్వజనీనం చేసింది. ఈ పాత్రలో స్త్రీ హక్కులంటూ పోరాడలేదు. తిరుగుబాటు చేయలేదు. కేవలం స్త్రీ సహజాతమైన కోరిక కోసం తనతో తానే సంఘర్షించింది. ఇంకెన్నాళ్ళు బంగారు గుడ్లు పెట్టే బాతుగా వుంటుంది. రిటరై గృహిణిగా సెటిలయ్యే అవకాశాన్ని మగాళ్లివ్వక పోతే మగాళ్ళేం అవసరం.
శ్యాం బెనెగళ్ చాలా క్వాలిటీతో ఈ ‘మిడిల్ సినిమా’ తీశారు. ఫ్లాష్‌బ్యాక్స్‌తో కథనం చేసిన విధానం ఒక అధ్యయన అంశమైతే, షాట్ కంపోజింగ్స్ ఇంకో సాంకేతిక ఔన్నత్యం. రాబట్టుకున్న నటనలూ మరొక క్రియేటివ్ పార్శ్వం. దర్శకుడు గోవింద్ నిహలానీ ఛాయాగ్రాహకుడవడం మరింకో విశేషం. అలాగే సంగీతంతో వనరాజ్ భాటియా. స్క్రీన్ ప్లే సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్‌ల పేర్లు ముందు ఇచ్చి, కింద శ్యాం బెనెగళ్ తన పేరేసుకున్నారు. సంభాషణలు సత్యదేవ్ దుబే.
పాత్ర చిన్నప్పట్నుంచీ ఫ్లాష్‌బ్యాక్ దృశ్యాలు బ్లాక్ అండ్ వైట్‌లో వుంటాయి. మొత్తం రెండు గంటల 16 నిమిషాల సినిమాలో ఫ్లాష్‌బ్యాక్స్ అరవై నిమిషాలుంటాయి. ఫ్లాష్‌బ్యాక్స్‌లో, ప్రస్తుత కథలో ఇప్పుడేం జరుగుతుందన్న సస్పెన్సే వుంటుంది. దీనికి రెండు జాతీయ అవార్డులతో బాటు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.