Site icon Sanchika

లోకల్ క్లాసిక్స్ – 18: ఘర్ వాపసీ ఉద్యమం

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా ప్రదీప్ కుర్బా దర్శకత్వం వహించిన ఖాసీ సినిమా ‘రీ – హోంలాండ్ ఆఫ్ అన్ సర్టెన్టీ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘రీ – హోంలాండ్ ఆఫ్ అన్ సర్టెన్టీ’ (ఖాసీ)

మేఘాలయాలో ఖాసీ భాషలో ప్రాంతీయ సినిమా 1981లో ‘30 మంది రాజుల కూటమి’ అనే వర్ణ చిత్రంతో అవతరించింది. తిరిగి 1984లో ‘మాణిక్ రైటాంగ్’తో రెండో సినిమాగా ముందడుగేసింది. మేఘాలయాలో థియేటర్లు వుండేవి కావు. నిర్మాతలు ప్రొజెక్టర్లు పట్టుకుని వూరూరా తిరిగి ప్రదర్శించుకోవాల్సిందే. పైగా అప్పట్లో తీవ్రవాద ఉద్యమం ఒకటి. దాంతో సినిమాలు తీసే పరిస్థితి కూడా లేదు. 2000 తర్వాత నుంచే ఒకటీ అరా నిర్మించసాగారు. అయినా షిల్లాంగ్‌లో ఏర్పాటైన రెండు మల్టీప్లెక్స్ హాళ్ళలోనూ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలే ఆడేవి. అక్కడ ప్రవేశం పొందడానికి యాక్షన్ సినిమాలు తీయడం మొదలెట్టారు. ఆ కాల్పనిక యాక్షన్ సినిమాలతో బాటు ప్రేమ సినిమాలు ఒకెత్తయితే, 2013లో యాక్షన్‌కి తీవ్రవాద సమస్య జోడించి తీసిన ‘రీ – హోంలాండ్ ఆఫ్ అన్ సర్టెన్టీ’ ఒకెత్తు. వ్యాపారానికి వ్యాపారం, తొలిసారిగా ఖాసీ సినిమాకి జాతీయ అవార్డూ సంపాదించి పెట్టిన మాస్టర్ పీస్‌గా ఇది నిల్చిపోయింది. దీని దర్శకుడు హైస్కూల్ వరకే చదివిన ప్రదీప్ కుర్బా.

ఈశాన్య రాష్ట్రం మేఘాలయాని 1972లో అస్సాంని విభజించి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముప్పై లక్షల జనాభా. వీళ్ళు మాట్లాడే ఖాసీ భాష ఆగ్నేయాసిలో ఆస్ట్రోయాసియాటిక్ భాషల కుటుంబానికి చెందినది. అస్సాం, బంగ్లాదేశ్ లలో కూడా ఈ భాష కొన్ని ప్రాంతాల్లో మాట్లాడతారు. గరోస్ హిల్స్, ఖాసీ – జైంతియా అనే ఆదివాసీ తెగల పరిరక్షణార్ధమే అస్సాం నుంచి విడదీసి మేఘాలయా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిరక్షణ పెట్టుబడిదారుల భక్షణకి పర్యాయ పదంగా మారేసరికి, తుపాకులు పట్టుకుని తీవ్రవాదులు తయారయ్యారు. ఈ తీవ్రవాద కథనే తెరకెక్కించాడు దర్శకుడు ప్రదీప్ కుర్బా.

కుర్బా డిగ్రీ లేకపోవడంతో ఫిలిం ఇనిస్టిట్యూట్స్‌లో చేరలేక, 1992 -2002 మధ్య కాలంలో పదేళ్ళు బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ సినిమాలకి పని చేసి సినిమాలు తీయడం నేర్చుకున్నాడు. అతను నేర్చుకున్నది స్వరాష్ట్రంలో సొంత భాషలో సినిమాలు తీయాలనే తప్ప, బాలీవుడ్‌లో హిందీ సినిమా దర్శకుడుగా మారాలని కాదు. అలా తన మొదటి ఖాసీ సినిమా ‘రీ – హోం లాండ్ ఆఫ్ అన్ సర్టెన్టీ’ ని తీవ్రవాదం మీద తీశాక, 2016లో రేప్ బాధితురాలి కథగా ‘ఒనాటా: ఆఫ్ ది ఎర్త్’ (భూమి పుత్రిక) తీశాడు. దీనికీ జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత 2019లో ‘ల్యూడూ’ (మార్కెట్) తీశాడు. దీనికి దక్షిణ కొరియాలో ప్రతిష్టాత్మక బుసాన్ అంతర్జాతీయ అవార్డు లభించింది. ‘రీ – హోంలాండ్ ఆఫ్ అన్ సర్టెన్టీ’ స్క్రిప్టు 2003లోనే పూర్తి చేశాడు కుర్బా. ఐతే తీవ్రవాద సినిమా కావడంతో పదేళ్ళూ నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. చివరికి రిబియంగ్ తిలంగ్, హిత్మూ పాహ్వా, సజేకీ పస్సా పభృతులు నిర్మాతలుగా కుదిరారు. ఇందులో తీవ్రవాద భావజాలానికీ, అంతరాత్మకూ మధ్య నలిగే యువకుడి కథ చిత్రించాడు.

కథ

తీవ్రవాద దళ సభ్యుడు మన్భా (మెర్ల్విన్ ముఖీం) బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కామ్రేడ్స్‌తో సమావేశమవుతాడు. బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందిన ఈ తీవ్రవాద దళం, ఇండియాలో తమ ఖాసీ ప్రత్యేక దేశ ఏర్పాటు కోసం కార్యకలాపాలు సాగిస్తూంటుంది. మన్భా అధ్వర్యంలో ఇప్పుడు దళం మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లో ఆపరేషన్ నిమిత్తం సన్నాహాలు చేస్తోంది. ఢాకాలోని ఒక ముస్లిం ఆయుధ వ్యాపారి నుంచి ఆయుధాలు సేకరించారు. ఈ షిల్లాంగ్ ఆపరేషన్‌లో భాగంగా రానున్న ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహిష్కరించాలని తీర్మానిస్తారు.

మన్భా ఈ తీవ్రవాద దళంలో ఎన్నో ఆశలతో చేరాడు. మూడు ప్రధాన ఆదివాసీ తెగల కోసం అస్సాంని విభజించి ఏర్పాటు చేసిన మేఘాలయా రాష్ట్రంలో, ఆదివాసీలని దోచుకోవడం యధేచ్ఛగా జరిగిపోతోంది, నిరుద్యోగం ప్రబలింది. అశాంతి చెలరేగింది. పెట్టుబడిదార్లు సహా రాజకీయ నాయకులూ పోలీసులూ కుమ్మక్కై బొగ్గు గనుల నుంచీ అన్ని వనరులూ దోచుకుపోతున్నారు. ప్రభుత్వం చూస్తూ కూర్చుంది. ఈ పరిస్థితుల్లో ఆదివాసీల అస్తిత్వం కోసం, హక్కుల కోసం పుట్టింది తీవ్రవాద దళం. ఇక ప్రత్యేక ఖాసీ దేశ మొక్కటే పరిష్కార మార్గంగా తీవ్ర సాయుధ పోరాటం చేస్తోంది. రాజ్యంతో తలపడి ఎందరో కామ్రేడ్స్‌ని కోల్పోతోంది కూడా.

ఇలాటి విషమ పరిస్థితుల్లో కూడా కలలు నిజమవుతాయని మన్భా నమ్మిక. ఇక ఇండియాలో భాగంగా వుండే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ. ఇదంతా మొన్నటి వరకు. ఉద్యమం ప్రకటిత మార్గంలో వున్నంతవరకూ. మరిప్పుడు? ఇప్పుడు ఉద్యమం దారితప్పి మాఫియా ముఠాగా మారిపోయారు… ఉన్నోడ్ని కొట్టు, ఉన్నంత గుంజు. అడ్డొస్తే చంపు. ఎవడేం దోచుకుపోతే మనకెందుకు, వాణ్ణి మనం దోచుకోవాలి… మనం ఎంజాయ్ చేయాలి. ఆదివాసీ లేదు, ఖాసీ దేశం లేదు.

   ఇలా రాటుదేలిన మాఫియాగా తన కామ్రేడ్స్‌తో షిల్లాంగ్ మాఫియా ఆపరేషన్ కొచ్చి ప్రమాదంలో పడతాడు మన్భా. పోలీసులు కుక్కల్లా కాల్చి పారేస్తూ వెంటాడుతొంటే – ఆ పోలీసు అధికారి ఎస్పీ కిండియా (ఇండియా?) ధాటికి తట్టుకోలేక ఒక ఇంట్లో జొరబడతాడు మన్భా. ఆ ఇంట్లో ఒక అనుమానాస్పద లేడీ (ఎల్జివా లాలూ) వుంటుంది.

ఆమె నెమ్మదిగా అతణ్ణి మార్చే ప్రయత్నాలు మొదలెడుతుంది. భావజాల థెరఫీ చేపడుతుంది. ఇదంతా ఎందుకు, కాపిటలిజాన్ని ఒప్పుకో. దేశ భక్తిని అలవర్చుకో. అభివృద్దికి ఈ రెండే మార్గాలు : కాపిటలిజం, దేశభక్తి. అభివృద్దికి పాటుబడితేనే దేశభక్తికి శక్తి. వ్యాపారాలు, మైనింగ్ ఇవే అభివృద్ధికి దోహదం చేస్తాయి. కాపిటలిజం – దేవుడు ఇవే శాంతిని నెలకొల్పుతాయి. దేవుణ్ణి నమ్ము. అంతరాత్మలోకి తొంగి చూడు. నీ అంతరాత్మ ఒప్పుకుంటోందా నువ్వు చేస్తున్నది?…

ఇలా కొన్ని తడవలు భోదించి భోదించి అతణ్ణి మార్చేస్తుంది. అంతరాత్మలోకి తొంగి చూసుకుంటున్న అతడికి దేవుడే కన్పిస్తాడు. వెళ్లి చర్చి ఫాదర్ ఎదుట పాప పశ్చాత్తాప ప్రకటన (కన్ఫెషన్) చేసి పోలీసులకి లొంగి పోతాడు. చర్చి బయట బలగంతో, మన్భా ప్రేయసితో ఎదురుచూస్తున్న ఎస్పీ కిండియా సాదరంగా ఆహ్వానిస్తాడు. ఇక లొంగిపోయిన దళం, పోలీసు దళం కలిసి బృందగానాలతో ఆడి పాడతాయి.

ఎలావుంది కథ

కథ చూస్తే నవ్వురావచ్చు. దీనికి జాతీయ అవార్డు వచ్చింది. ఉద్యమాన్ని ఇలా ఘర్ వాపసీగా ముగిస్తేనే అవార్డు రావచ్చేమో. కానీ ఇది వాస్తవం. 2013లో తీవ్రవాద దళం లొంగుబాటు ప్రతిపాదన చేస్తూ, చర్చి ఫాదర్లని తమ ప్రతినిధులుగా పేర్కొన్న వాస్తవముంది. దర్శకుడు పదేళ్ళూ ఈ కథనే పట్టుకుని నిర్మాతల కోసం చేసిన ప్రయత్నాల్లో, కథ కూడా మారిపోతూ వచ్చిందన్నాడు. 2013లో ఈ కథ తీశాడు. చర్చి జోక్యం అనే వాస్తవ మలుపుని ఆధారంగా జేసుకుని తీవ్రవాద దళం చరిత్ర ముగించాడు. 2019 కల్లా మేఘాలయాలో కల్లోలం సృష్టిస్తూ వచ్చిన తీవ్రవాద సంస్థ హెచ్‌ఎన్‌ఎల్‌సి కూడా, అస్త్రసన్యాసం చేసి ఇంటికెళ్ళి పోవడం గమనార్హం.

టైటిల్ ‘రీ – హోం లాండ్ ఆఫ్ అన్ సర్టెన్టీ’ లో ‘రీ’ అంటే ఖాసీ భాషలో నా భూమి, లేదా నా దేశం. హెచ్‌ఎన్‌ఎల్‌సి ఆదివాసీల కోసం ఏర్పడ్డ తొలి తీవ్రవాద సంస్థ కాదు. ఒరిజినల్‌గా ఏర్పడ్డ హెచ్‌ఏఎల్‌సి (హినై టెరెప్ అచిక్ లిబరేషన్ కౌన్సిల్) నుంచీ 1993లో ఏర్పడిన చీలిక దళం. ఇంకా చాలా గ్రూపులేర్పడ్డాయి. హెచ్‌ఎన్‌ఎల్‌సి ఒక్కటే ప్రధానంగా వుంటూ ఒరిజినల్ దళం కనుమరుగైంది. హెచ్‌ఎన్‌ఎల్‌సి అంటే హినై టెరెప్ (Hynniewtrep) నేషనల్ లిబరేషన్ కౌన్సిల్. హినై టెరెప్ అంటే ఏడు పాకల నేల అని అర్ధం. ఖాసీలో దీనికో జానపద కథ వుంది. దర్శకుడు పేరు వాడకుండా ఈ గ్రూపునే కథలో చిత్రించాడు. హత్యలు, కిడ్నాపులు, దోపిడీలు, బలవంతపు వసూళ్లు, పశువుల అక్రమ రవాణా, పాకిస్తాన్ నుంచి నకిలీ నోట్లు – ఒకటేమిటి – అన్ని రంగాల్లో విస్తరించిన కార్పొరేట్ కంపెనీలాగా హల్చల్ చేయడాన్ని చూపించాడు. ‘మెరుగైన ఖాసీ సమాజం కోసం పాటుబడే మాఫియాలు’ గా చిత్రించాడు.

నిర్మాణ విలువలు

కేవలం 22 లక్షల బడ్జెట్‌తో కోట్ల రూపాయల సినిమాలా తీశాడు. కమర్షియల్ సినిమాలు తీసేవారికి ఇదొక డిక్షనరీ అనుకోవచ్చు. ప్రస్తుత దిగాలుపడిన మార్కెట్ వ్యవస్థకి బడ్జెట్స్‌ని కుదించుకుని మేకింగ్స్ చేసుకునేందుకు ఈ విజువల్ మోడల్ రిఫరెన్స్ కావొచ్చు. ప్రాంతీయ సినిమాల్లో కమర్షియల్ సినిమాలకి పనికొచ్చే టెక్నిక్స్ వుంటున్నాయి. ప్రదీప్ డైమరీ ఛాయగ్రహణం దీనికింత క్వాలిటీని సంతరించి పెట్టింది. మేఘాలయా, బంగ్లాదేశ్‌లలో స్టన్నింగ్ లొకేషన్స్ రిచ్‌నెస్‌ని తీసుకొచ్చాయి. ఒక రన్నింగ్ షాట్‌లో నటులు ఫ్రేం నుంచి తప్పిపోయే దృశం అద్భుతమైనది. అలాగే బంగ్లాదేశ్‌లో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఒంటరితనపు ఫీలింగ్‌ని కెమెరాలో పట్టుకున్న విధం కూడా. గన్ ఫైర్ యాక్షన్ సీన్లు కూడా. నల్గురు ఖాసీ వ్యక్తులు పడవలో పోతూండగా చిత్రీకరించిన పాట పవర్ఫుల్‌గా వుంది. బెంగాలీ వ్యతిరేకత పైన, బంగ్లాదేశ్ పైనా సెంటిమెంటల్ పాట.

ప్రధాన పాత్ర మన్భాగా మెర్ల్విన్ ముఖీం ప్రధానాకర్షణ అని చెప్పొచ్చు. కరుడుగట్టిన తీవ్రవాదిగా ఎంత నిర్మొహమాటంగా నటిస్తాడో, తర్వాత ఆత్మ విమర్శలో అంత మెత్తబడి కూడా వుంటాడు. అనుమానాస్పద లేడీతో వాద సంవాదాలు చేస్తాడు. తన వాదం నిలబడకుండా దర్శకుడు చేస్తాడు. పెట్టుబడి- దేశభక్తి – దేవుడు వీటి వైపే వుంటాడు దర్శకుడు – తన వాదానికి అనుమానాస్పద లేడీని ప్రయోగిస్తూ. ఎస్పీ కిండియా పాత్ర ఫార్ములా పాత్ర. అలాగే జర్నలిస్టు పాత్ర. ఈమెని ఎక్స్‌పోజ్ చేయిస్తూ కమర్షియల్‌గా చూపించాడు. పైగా జర్నలిస్టుకంటే ఎస్పీకి ఇన్ఫార్మర్ బుద్ధులతో చూపించాడు.

హింస ద్వారా మార్పుని కోరే భావజాలాన్ని ఖండిస్తూ పోయాడు దర్శకుడు. అదే సమయంలో రాజ్య హింసని ఖండించలేదు. ఫలవంతం కాని ఒక చిన్న ఉదాహరణని తీసుకుని, సమస్య పరిష్కారానికి చర్చి ప్రమేయాన్ని కాంక్షించాడు. ఆర్ధిక అణిచివేతల్లోంచే పోరాటాలు పుడతాయి. దీనికి దేవుడి మీద భారం వేసి, ఆర్థిక అణిచివేతని ఇలాగే కొనసాగనివ్వండన్నట్టు – బ్రెయిన్ వాష్ చేశాడు దర్శకుడు ప్రదీప్ కుర్బా.

Exit mobile version