Site icon Sanchika

లోకల్ క్లాసిక్స్ – 2: మనకోసం ‘రే’ ఎక్స్‌రే దృష్టి!

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సత్యజిత్ రే బెంగాలీ సినిమా ‘నాయక్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘నాయక్’ – కథ

[dropcap]బెం[/dropcap]గాలీ సినిమా స్టార్ అరిందం ముఖర్జీ (ఉత్తమ్ కుమార్) ఉత్తమ నటుడి జాతీయ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ ప్రయాణమవుతాడు. విమానంలో టికెట్లు దొరక్కపోవడంతో హౌరా – ఢిల్లీ ఏసీ డీలక్స్ ట్రైన్లో బుక్ చేసుకుంటాడు. ఇదే ట్రైన్లో ‘ఆధునిక’ అనే స్త్రీల మాసపత్రిక సంపాదకురాలు అదితీ సేన్ గుప్తా (షర్మిలా టాగూర్) వుంటుంది. ఇంకో హరేన్ బోస్ (రంజిత్ సేన్) అనే బిజినెస్‌మాన్, అతడి భార్య మనోరమ (భారతి), జ్వరంతో వున్న కూతురు బుల్ బుల్ (లాలీ చౌదరి), మరింకో బిజినెస్ మాన్ ప్రీతీష్ సర్కార్ (కామూ ముఖర్జీ), ఇతడి భార్య మోలీ (సుస్మితా ముఖర్జీ) వుంటారు. ఇంకో ‘డబ్ల్యీవ్ డబ్ల్యీవ్ డబ్ల్యీవ్  డబ్ల్యీవ్’ అనే ఆర్గనైజేషన్ హెడ్ స్వామీ (సత్యేన్ బెనర్జీ) అనే అతనూ వుంటాడు.

అరిందం బుక్ చేసుకున్న కూపేలో చటర్జీ అనే సినిమాల్ని చీల్చి చెండాడే ఎనభై ఏళ్ల చాదస్తపు మనిషి వుంటాడు. సినిమాల్ని తిడుతూ  ‘స్టేట్స్‌మన్’ పత్రిక్కి ఉత్తరాలు గుప్పించడమే పని. అలాటిది సాక్షాత్తూ సినిమా స్టార్ అయిన అరిందమే వచ్చేసి ఇతడికి బుక్కై పోతాడు. నానా క్లాసులు పీకిన తర్వాత, మీ స్టార్లు తాగుతారు, ఆ వాసనంటే నాకు పడదు – వెళ్ళిపొమ్మంటే ఇంకో కూపేలోకి వెళ్ళిపోతాడు అరిందం. ఆ కూపేలో బోస్ కుటుంబం వుంటుంది.

బోస్‌తో సర్కార్‌కి పనుంటుంది. అతనెక్కడ వీలుగా దొరుకుతాడా అని వెన్నాడుతూ ఈ ట్రైన్ లోకే వచ్చేసి ప్రయాణిస్తున్నాడు. బోస్‌తో ఒక బిజినెస్ డీల్ కుదుర్చుకునే పనుంది. ఇతడి భార్య మోలీ ఎప్పుడూ మూతి ముడుచుకుని అలిగి వుంటుంది. భర్తతో ఈ జీవితం బందీకానాలా ఫీలవుతూంటుంది. ‘ఈ డీల్ కుదిరితే ఐదు లక్ష లొస్తాయి, నీకు నెక్లేస్ కొని పెడతా’ అని బుజ్జగిస్తూంటాడు. బోస్ అటు డైనింగ్ కార్లోకి వెళ్లడాన్ని గమనించి, నెమ్మదిగా వెళ్లి అతడి ముందు సుఖాసీనుడై పరిచయ పురాణం మొదలెడతాడు.

ఇదే డైనింగ్ కార్లో ఇంకో కుటుంబంతో కూర్చుని వుంటుంది అదితి. వాళ్లకి పది రూపాయలకి తన స్త్రీల పత్రిక ‘ఆధునిక’ అమ్ముతుంది. అటు దూరంగా కూర్చుని వున్న అరిందంని చూసి, వెళ్లి పరిచయం చేసుకుని ఆటో గ్రాఫ్ అడుగుతుంది. అలా ఈ పరిచయం అతడి ఇంటర్వ్యూ తీసుకోవడానికి దారి తీస్తుంది. ఇక్కడ్నించీ కథాక్రమం అరిందం జీవితం గురించి. స్టార్‌గా ఎదిగిన వివిధ దశల గురించి. అనుభవాల గురించి. ఒంటరి తనపు బాధ గురించి. మర్నాడుదయం ట్రైను ఢిల్లీ చేరుకునే లోగా ఆ ఇంటర్వ్యూ రాసుకున్న కాగితాలని ఆమె చించెయ్యడం గురించీ…

ఎలావుంది కథ

1960 లలో సినిమా స్టార్ జీవితమెలా వుందో పరిచయం చేశారు సత్యజిత్ రే. సినిమా స్టార్ జీవితంలో ఎదుర్కొనే వృత్తి – ప్రేమ – సామాజిక బాధ్యత అనే మూడు కోణాల్ని కథకి నేపథ్యంగా తీసుకున్నారు. ఈ మూడిటితో అతనెలా ప్రవర్తించాడనేది కథనానికి తీసుకున్నారు. దీనికి ఏడు ఫ్లాష్ బ్యాకుల్ని, రెండు డ్రీమ్ సీక్వెన్సుల్ని ఉపయోగించారు. ఈ మొత్తం అరిందం కథకి సమాంతరంగా బోస్- సర్కార్ లతో, సర్కార్ – మోలీ లతో రెండు ఉపకథల్ని కూర్చారు. ముగింపుకి ప్రారంభాన్ని కథాప్రారంభంలోనే ఏర్పాటు చేశారు. స్టేషన్ కి బయల్దేరే ముందు అరిందంకి హీరోయిన్ నుంచి కాల్ రావడం, అదే హీరోయిన్ ప్రయాణం చివర్లో గుర్తొచ్చి- కథ క్లయిమాక్స్‌కి దారితీయడంగా సమగ్ర రచన చేసి చిత్రీకరించారు. అరిందం జీవితంలో చూపిన ప్రేమా వృత్తీ సామాజిక బాధ్యతా అనే పార్శ్వాలు ఇప్పటి కాలానికీ సరితూగేలా ఆలోచనాత్మకంగా వున్నాయి – సినిమారంగం స్వరూప స్వభావాల గురించిన వ్యాఖ్యలు సహా.

    

ఎలా నటించారు

సినిమా స్టార్ అరిందం ముఖర్జీ పాత్రలో ఉత్తమ్ కుమార్ ఉత్తమంగానే నటించాడు- ఎందుకంటే ఉత్తమ నటుడి జాతీయ అవార్డు స్వీకరించడానికి ఢిల్లీ వెళ్తున్నాడు. సత్యజిత్ కనుసన్నల్లో ఓవరాక్షన్‌కి వీలుండదు. ఓవరాక్షన్ చేస్తే కెమెరా పదిరెట్లు చేసి చూపిస్తుందని సంపాదకురాలు అదితితో అంటాడు. సుందర రూపం అతడి పెట్టని ఆభరణం. సూటు వేసినా, టక్ చేసి  కన్పించినా, సాధారణ దుస్తుల్లో వున్నా, సినిమా స్టార్ పాత్ర హవా తగ్గకుండా పరివ్యాప్తం చేస్తాడు. భావోద్వేగాల ప్రదర్శన సున్నితం. ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా చలించి పోవడంకన్నాఆలోచనా ముద్రతోనే వుంటాడు. స్మోకింగ్ చేసినా, డ్రింక్ చేసినా క్యాజువల్‌గా చేస్తాడు. ఆరోజుల్లో రైళ్లల్లో ఈ రెండూ అనుమతించారు. రైళ్ళల్లోనే కాదు, ఇంకెక్కడైనా స్మోకింగ్‌తో ఇబ్బంది వుండేది కాదు లేడీస్ వున్న ఇండోర్స్‌లో సైతం. ఇలా ఉత్తమ్ కుమార్ ‘నాయక్’ని తన నటనతో చిరస్మరణీయం చేశాడు.

సంపాదకురాలు అదితి పాత్రలో షర్మిలా టాగూర్ ఉల్లాసంగా కన్పిస్తుంది. ఇంటర్వ్యూ తీసుకునే పాత్ర కాబట్టి పెద్దగా భావోద్వేగాలుండవు. అతడితో ప్రొఫెషనల్‌గా వుంటుంది. అలాగని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టదు. ఇంటర్వూ కూడా అడగదు. తన జీవితం గురించి చెప్పుకునే అగత్యం అతడికే వుంటుంది. అయితే తమవి రెండు భిన్న ప్రపంచాలని ఆమె గుర్తించాక కాస్త ఎడంగా వుంటుంది. చివరికతను తన భగ్న ప్రేమ గురించి కూడా చెప్పుకోబోతే ఆపేసి, ఇంటర్వూ కాగితాలని చించేసి సున్నితంగా సెలవు తీసుకుంటుంది. ఏ మాత్రం అతడితో రిలేషన్ షిప్ గురించి చివరి అవకాశంగా ఆలోచించాలనుకున్నా, అతడి భగ్న ప్రేమ ప్రస్తావన దాన్ని నిర్వీర్యం చేసేశాక ఇకామెకి వేరే దారి లేదు. ఈ పాత్ర షర్మిల గ్రేస్‌ఫుల్‌గా  నటించింది.

అలిగిన భార్య మోలీ పాత్రలో ఉపకథలో సుస్మితా ముఖర్జీది ఒంటరి ప్రపంచం. ఆమెకుండే మేకప్ స్పృహ ఆమె మానసిక ప్రపంచాన్ని తెలుపుతుంది. ఆమెకి ఎప్పుడూ బిజినెస్ అంటూ తిరిగే భర్తనుంచి స్వేచ్ఛ కావాలి. ఈ స్వేచ్ఛ అరిందంని సినిమా వేషాలడిగే దాకా పోతుంది. నీ భర్త అనుమతి తీసుకోమంటాడు. భర్తనడిగి షాకిస్తుంది.

భర్త సర్కార్ పాత్రలో కామూ ముఖర్జీ, బిజినెస్‌మాన్ బోస్‌ని పట్టి డీల్ కొట్టేయాలని చేసే ప్రయత్నాలతో అవససరానికి మించి చలాకీతనం ప్రదర్శిస్తాడు. భార్య మోలీని కూడా పరిచయం చేస్తాడు. రాత్రి బాగా పొద్దు పోయేవరకూ బోస్‌తో డ్రింక్ చేస్తూ, చెస్ ఆడుతూంటే, బోస్ అనే మాట- నీ భార్య అందంగా వుందని. దీంతో బోస్‌ని వదిలేస్తాడు. తెల్లారి ‘డబ్ల్యీవ్ డబ్ల్యీవ్ డబ్ల్యీవ్  డబ్ల్యీవ్’ ఆర్గనైజేషన్ ఆసామీ స్వామీ చెప్పిన ఒక మాయదారి డీల్ కి ఒప్పుకుని, ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంటాడు.

ఫ్లాష్‌బ్యాక్ పాత్రలుగా అరిందం గురువు, నాటక రంగ దర్శకుడు, శంకర్‌గా సోమన్ బోస్, సీనియర్ సినిమా నటుడు ముకుందా లాహిరీగా బీరేశ్వర్ సేన్ కన్పిస్తారు. అరిందం మేనేజర్ జ్యోతిగా నిర్మల్ ఘోష్, అరిందం క్లాస్ మేట్ అయిన కార్మిక నాయకుడుగా ప్రేమాంగ్శూ బోస్ కన్పిస్తారు.

పాత్రలు, నటనలు ఒక శైలిలో కన్పిస్తాయి. ఆ శైలి సంపన్న వర్గపు క్లాస్ శైలి. ఏకాగ్రత చెదిరే శబ్ద కాలుష్యాలు లేకపోవడంతో, నిశ్శబ్ద వాతావరణంలో దృష్టంతా పాత్రల మీదే, నటీ నటుల మీదే వుంటూ, కథా ప్రపంచంలోని ప్రతీ సూక్ష్మ మైన అంశాన్నీ గమనించేట్టు చేస్తుంది. ఈ సూక్ష్మమైన అంశాలు సత్యజిత్ రే ఉద్దేశపూర్వకమైన సింబాలిజాలు. మోలీ లిప్ స్టిక్ దిద్దుకోవడం ఆమె మానసిక స్థితిని పట్టిస్తుంది. అరిందం ట్రైన్లో స్క్రిప్టు చదువుకుంటూ రింగులు రింగులుగా సిగరెట్ పొగూదడం, రాబోయే సంక్షుభిత డ్రీమ్ సీక్వెన్స్ కి హెచ్చరిక. ప్రారంభంలో అరిందం హీరోయిన్ తో ఫోన్లో మాట్లాడుతూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం – ఇంకో వెంటాడే డ్రీమ్ సీక్వెన్స్‌లో ఆమెతో అయిన చేదు అనుభవం తాలూకు గుర్తు. ప్లాట్ డివైస్‌గా వున్న ఆ నల్ల కళ్ళద్దాలు వెంటనే పెట్టుకోవడం, సైకలాజికల్ గా ఫిక్స్ అయిన అతడి అసంకల్పిత ప్రతీకార చర్యకి సంకేతం. ఇలా కథ చెప్పే సూక్ష్మాంశాలెన్నో కన్పిస్తాయి.

(వచ్చే వారం స్క్రీన్ ప్లే సంగతులు)

Exit mobile version