లోకల్ క్లాసిక్స్ – 21: లంబాడీ వాస్తవికత

0
2

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా కెఎన్ టి శాస్త్రి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ‘కమ్లి’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘కమ్లి’ (తెలుగు)

తెలుగు లంబాడీలు గిరిజన తెగ, సంచార జాతి. రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతంలో వీరి మూలాలున్నాయి. మహారాష్ట్రలో, ఆంధ్ర – తెలంగాణాల్లో పూర్వ కాలంలో వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళు నివసించేది జనావాసాలకి దూరంగా తండాల్లో. వీళ్ళని బంజారాలని కూడా అంటారు.

సంస్కృతంలో ‘వన్ చర’ వీళ్ళ భాషలో బంజారా అయింది. వన్ చర అంటే వనాల్లో సంచరించే వాళ్ళు. అక్షరాస్యత అతి తక్కువ. వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో కూలి పనుల్లో స్థిరపడ్డా, కొందరు ధనిక రైతులుగానూ ఎదిగారు. రాజకీయాల్లోనూ ప్రజా ప్రతినిధులుగా; కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పదవునలంకరించారు. అయితే వీళ్ళ స్త్రీలలో ఒక మూఢ విశ్వాసముంది. పుట్టిన మొదటి ఆడ శిశువు దురదృష్టం తెస్తుందని. ఈ నమ్మకం ఆడ శిశువుల స్మగ్లర్లకి వ్యాపారంగా మారింది. రెండు వేలకి కొని, రెండు లక్షలకి విదేశీయులకి దత్తత పేర అమ్మేసే క్రీడ మొదలయ్యింది. స్త్రీలు గర్భం దాల్చినప్పుడే బుక్ చేసుకుని, ఆడ శిశువు జన్మిస్తే కొనుక్కునే దందా ఇప్పటికీ కొనసాగుతోంది. శిశువైతే స్మగ్లర్లకి, ఎదిగితే వ్యభిచార గృహలకీ అమ్మేసే దారుణాలు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి పన్నెండేళ్ళ బాలికని గుంటూరు తీసికెళ్ళి అమ్మేసే తండ్రి ప్రయత్నాన్ని సేవాసంస్థ అడ్డుకుని, బాలికని రక్షించింది కూడా.

ఈ దురాచారం మీద దర్శకుడు కెఎన్ టి శాస్త్రి ‘కమ్లి’ తీశారు. నిర్మాత, దర్శకుడు, రచయిత, విమర్శకుడూ అయిన కెఎన్ టి శాస్త్రి సమాంతర సినిమాల అభిలాషిగా కొనసాగారు. 1999 -2016 మధ్య సురభి, తిలదానం, షాను, కమ్లి అనే నాల్గు ఆర్ట్ సినిమాలు రూపొందించారు. ఆరు జాతీయ అవార్డులు, మూడు అంతర్జాతీయ గౌరవాలూ పొందారు. ‘కమ్లి’ని జాతీయ నటి నందితా దాస్, తెలుగు నటుడు షఫీలతో నిర్మించారు. తన సమాంతర సినిమాలకంటూ ప్రత్యేకమైన శైలి అంటూ ఏర్పాటు చేసుకోకపోయినా, కొన్ని సీరియస్ సామాజికాంశాల్ని కథా వస్తువుగా చేసుకుని నిర్మిస్తూ దృష్టి నాకర్షించారు. ‘కమ్లి’ లో ఆడ శిశువుల అమ్మకాల గురించి.

కథ

లంబాడీ కమ్లి (నందితా దాస్) కి కొడుకు, ఒక కూతురు. తాగుబోతైన భర్త రెడ్యా నాయక్ (షఫీ) ఎటెళ్ళి పోయాడో తెలీదు. హైదరాబాద్ నగరంలో కూలి చేసుకుని పిల్లల్ని పోషించుకుంటోంది. మొదట్నుంచీ కూలి పనే వృత్తి. తోటి లంబాడీలతో గుడిసె వేసుకుని వుంటోంది. ఒక రోజు ప్రభుత్వాసుపత్రిని కూల్చే పని దొరుకుతుంది. ఆ ఆస్పత్రిని చూస్తూంటే తన గత జీవితమే గుర్తుకొస్తుంది. ఇక్కడే తను కొడుకుని ప్రసవించింది. పుట్టిన కొడుకుని మాయం చేసి కూతుర్ని అంటగట్టారెవరో. తను ఏడ్చి మొత్తుకుని ఆందోళనకి దిగింది. ఆస్పత్రి సిబ్బంది తిట్టి వెళ్ళగొట్టారు. ఆస్పత్రి మెట్లమీదే ధర్నా కూర్చుంది. ఈ ఆడశిశువు తనది కాదని నమ్మించడానికి విఫల యత్నాలు చేసింది. రాజకీయ నాయకులు వచ్చి చుట్టు ముట్టారు. కమ్లికి న్యాయం జరగాలని గొడవ చేశారు. ఆస్పత్రి సిబ్బందే పుట్టిన పిల్లల్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

చివరికేమైంది? కమ్లి కన్న మగబిడ్డ దొరికాడా? మరి ఇప్పుడున్న ఇద్దరు పిల్లల్లో ఆడపిల్లెవరు? భర్త రెడ్యా నాయక్ ఏమయ్యాడు?… ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

2003లో కెఎన్ టి శాస్త్రి ‘హార్వెస్టింగ్ బేబీ గర్ల్స్’ అనే 30 నిమిషాల డాక్యుమెంటరీ నిర్మించారు. లంబాడీలు ఆడ శిశువుల్ని అమ్ముకునే, ఆడ శిశువులు అక్రమంగా అమెరికాకి దత్తత వెళ్ళే ఉదంతాల పైన ఈ డాక్యుమెంటరీ తీశారు. దీనికి ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫెస్టివల్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు పొందారు. ఈ డాక్యుమెంటరీ లోని సమాచారం ఆధారంగా 2006లో ‘కమ్లి’ నిర్మించారు. కథ చిన్నదే. గంటా 8 నిమిషాలు నిడివి. లంబాడీల కథతో ఇదే మొదటి సినిమా కాదు. 1978లో చలం, రోజారమణి లతో ‘లంబడోళ్ళ రాందాసు’ విడుదలైంది. డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు ఇదే పేరుతో రాసిన నవల ఆధారం. ఇది కమర్షియల్ సినిమా. విజయం సాధించలేదు. ‘కమ్లి’ లంబాడీల దురాచారాన్ని చర్చించే వాస్తవిక సినిమా. దీనికి కథాబలంతో కన్నా, ప్రప్రథమంగా లంబాడీల సమస్యతో కథ అన్న పేరుతోనే ప్రాచుర్యం లభించింది.

లంబాడీ ఆడ శిశువులతో దురాచారం కన్నా దొంగతనాలే చూపించి వదిలేశారు దర్శకుడు శాస్త్రి. దురాచారానికి మూలమైన మూఢ నమ్మకం జోలికి పోకుండా, దాన్ని రూపు మాపే దిశగా ఇతివృత్తం సాగించకుండా, పోయిన మగ బిడ్డ తిరిగి లభించడమన్న ముగింపుతో సుఖాంతం చేశారు. ఈ విధంగా ఉపరితలంలోనే వుండిపోయింది కథ. డాక్యుమెంటరీలో కూడా దురాచారాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్ని సూచించలేదు. ఈ స్థానిక తెలుగు లంబాడీల సమస్య జాతీయ నటి నందితాదాస్ రీచ్ వల్ల ప్రపంచానికి తెలిసింది.

నందితాదాస్ పాత్ర

ప్రధాన పాత్ర పోషించిన ఆర్ట్ సినిమాల నటి నందితా దాస్ బలహీన పాత్రనే పోషించిందని చెప్పాలి. పాత్ర ఎదుర్కొన్న సమస్య – పుట్టిన మగబిడ్డ దొంగతనానికి గురై ఆడ బిడ్డ మీద పడడం, ఈ ఆడబిడ్డ తనది కాదని ఆందోళనకి దిగి, తన మగబిడ్డని తను సాధించుకోవడం. ఇక ఎవరికో పుట్టిన ఆడ బిడ్డని కూడా తనే పెంచుకోవడం. ఇది ఆస్పత్రి కూల్చే కూలిపనికి వెళ్ళినప్పుడు ఆమె గుర్తు చేసుకునే పూర్వ కథ. ఫ్లాష్‌బ్యాకులుగా వస్తుంది. ఈ ఫ్లాష్‌బ్యాకుల్లో పూర్వ కథకి, ఇంకా పూర్వ కథగా రెడ్యా నాయక్‌తో ఆమె పెళ్లి, కాపురం, శృంగారం, కూలి పనులు, లంబాడీ బృంద గానాలు, నృత్యాలు, ఆచార వ్యవహారాలూ ఆమె గుర్తు చేసుకునే మరో ఫ్లాష్‌బ్యాకులుగా వస్తూంటాయి. ఇవన్నీ ప్రధాన కథనుంచి దృష్టి మళ్లిస్తాయి. పైగా ప్రతి మగవాడూ ఆమె మీద కన్నేసి పొందాలని చేసే ప్రయత్నాలు ఈ కథతో సంబంధం లేని వ్యవహారమే. ఈ కథ లంబాడీ స్త్రీల మీద లైంగిక వేధింపుల గురించి కాదేమో?

ఈ పాత్ర నందిత దాస్‌కి నంది అవార్డు సంపాదించి పెట్టింది.

రెడ్యా నాయక్‌గా షఫీ తాగుబోతు పాత్ర. బిడ్డల మార్పిడి జరిగితే జరిగింది, ఈ ఆడబిడ్డని అమ్మేసుకుందామని భార్యతో గొడవపడి, కొట్టి వెళ్ళిపోతాడు. ఎల్బీ శ్రీరాం పోలీసుగా, తనికెళ్ళ భరణి పెద్ద కూలీగా, కోట శంకరరావు కాంట్రాక్టరుగా ఒకటి రెండు సీన్లలో కన్పిస్తారు. పాటలు సుద్దాల అశోక్ తేజ రాశారు-

రాజస్థానం మాది, మేము రసపుత్రులం
పృథ్వీ రాజ్ చౌహానుకు మేం సంబంధీకులం
వూరు బైట పొలం లేక, వూళ్ళే ఇల్లు లేక
ఈ వూరూ మీదంటే చెప్పేందుకు నోరు రాక
దారీ తెన్నూ కానరాక, బంజారులమైనం
అంబలి గతి లేక, తెలుగు లంబాడీలైనం
ఆజాదీ భారత దేశంల
అయ్యా మేమున్నామా లేమా?

ఇలా చివరి పంక్తులతో ఒక బ్యాంగ్ ఇచ్చారు. మాటలు కాశీభట్ల వేణుగోపాల్ రాశారు. లంబాడీ సంభాషణలు కళాచంద్ర రాశారు. సంగీతం ఇసాక్ థామస్, ఛాయాగ్రహణం సన్నీ జోసఫ్. నిర్మాతలు బిసి హరిచరణ్ ప్రసాద్, సుకన్య. ఈ సమిష్టి కృషికి జాతీయ ఉత్తమ చలన చిత్రం అవార్డు లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here