Site icon Sanchika

లోకల్ క్లాసిక్స్ – 23: డిజైనర్ ఆర్ట్ అట్టహాసం

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా జగ్ ముంద్రా దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘బవందర్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘బవందర్’ (హిందీ, ఇంగ్లీషు, రాజస్థానీ)

[dropcap]2[/dropcap]012 నిర్భయ అత్యాచార కేసులో న్యాయం కోసం ఆమె తల్లి ఆశాదేవి ఏడేళ్ళూ పోరాడి చివరికి 2020 దోషుల ఉరితీతతో విజయం సాధించింది. 1992 భావరీ దేవి అత్యాచార కేసులో భావరీ దేవియే అలుపెరగని పోరాటం చేస్తూ నేటికీ న్యాయం కోసం ఎదురు చూస్తోంది. నిర్భయ కేసుతో ‘నిర్భయ చట్టం’ రూపొందింది. భావరీ కేసుతో లైంగిక వేధింపుల్లో తీసుకోవాల్సిన చర్యలకి సంబంధించిన ‘విశాఖ మార్గదర్శకాలు’ ఏర్పడ్డాయి. రచయితా, నిర్మాత, దర్శకుడూ అయిన జగ్ ముంద్రా (జగ్మోహన్ ముంద్రా) భావరీ కేసు మీద దృష్టి పెట్టారు. ఆ సమయానికి ఏది సంచలనంగా వుంటే దాని మీద సినిమా తీసే ‘ఎక్స్‌ప్లాయిటేషన్ మూవీస్’ అనే జానర్‌ వివిధ ప్రయోగాలు చేస్తూ వచ్చిన ముంద్రా, భావరీ దేవి కేసుని 2000లో ‘బవందర్’ (ఇసుక తూఫాను) అని హిందీ, ఇంగ్లీషు, రాజస్థానీ భాషల్లో తీసి తానొక సంచలనం సృష్టించుకున్నారు.

1982 – 2011 మధ్య జగ్ ముంద్రా అమెరికా నుంచీ, ఆ తర్వాత బ్రిటన్ నుంచీ 29 లో-బడ్జెట్ ఎక్స్‌ప్లాయిటేషన్ జానర్ ఆంగ్ల సినిమాలు తీశారు. ‘జిగ్సా మర్డర్స్’, ‘ది అదర్ విమెన్’ లాంటి హార్రర్, ఎరోటిక్ థ్రిల్లర్స్ తీశారు. 1982లో తొలి సినిమాగా ‘సురాగ్’ అనే ఎన్నారై హిందీ థ్రిల్లర్ తీశారు. ఇందులో సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్నా, హేమమాలిని, షబానా అజ్మీ నటించారు. ‘విష కన్య’, ‘కమల’ అనే మరో రెండు హిందీలు కూడా తీశారు.

ముంద్రా శైలి విదేశీ శైలియే. కథా కథనాలు, చిత్రీకరణ, నిర్మాణ విలువలు విదేశీ హంగుల్లో వుండేవే. ఇండియన్ ఆర్ట్ సినిమాగా తీసిన ‘బవందర్’ సైతం ఈ బ్రాకెట్లోకి వచ్చేసింది. 2000 నుంచీ బాలీవుడ్ సినిమాలు కళా దర్శకత్వంలో డిజైనర్ లుక్‌ని ప్రయత్నిస్తున్నాయి. ఇలా చారిత్రక సినిమాలూ, జీవిత చరిత్రలూ సైతం డిజైనర్ చరిత్రలుగా, డిజైనర్ బయోపిక్‌లుగా వచ్చేస్తున్నాయి. ముంద్రా వచ్చేసి ఆర్ట్ సినిమాని కూడా డిజైనర్ ఆర్ట్‌గా తీస్తూ కొత్త ప్రయోగం చేశారు. ఆర్ట్ సినిమాలంటే బీద సినిమాలనే పేరు చెడగొడుతూ, యువతరాన్ని ఆకర్షించేందుకు డిజైనర్ ఆర్ట్‌గా తీసినట్టున్నారు. 2000లో ఈ సినిమా విడుదలైనప్పుడు మనం థియేటర్లో చూశాం. ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తూంటే ఇప్పుడు తీసినంత తాజాగా వుంది. కథతో, చిత్రీకరణతో కళ్ళు తిప్పుకోనివ్వకుండా. 2019 డిసెంబర్ నుంచి యూట్యూబ్లో లక్షా 70 వేల వ్యూస్ తో, యువ ప్రేక్షకుల మెచ్చికోలు కామెంట్స్‌తో ట్రెండింగ్ అవుతోంది.

ఇందులో ఆర్ట్ సినిమాల మూడో తరం నాయిక నందితా దాస్, భావరీదేవి పాత్ర పోషింది. ఆమె భర్తగా రఘువీర్ యాదవ్ నటిస్తే, దీప్తీ నావల్ సామాజిక కార్యకర్తగా, గుల్షన్ గ్రోవర్ అడ్వొకేట్‌గా నటించారు. ఇతర పాత్రల్లో రాహుల్ ఖన్నా, గోవింద్ నామ్ దేవ్, యశ్పాల్ శర్మ, ఇష్రత్ అలీ, లిల్లెట్ దుబే నటించారు. ముందుగా కథేమిటో చూద్దాం…

కథ

రాజస్థాన్ లోని ధబ్రీ అనే పల్లెలో సావరీ దేవి (నందితా దాస్) కుమ్మరి (కుమ్హర్) పని చేస్తూంటుంది. భర్త సోహాన్ (రఘువీర్ యాదవ్) రిక్షా తొక్కుతూంటాడు. కూతురు, కొడుకు, అత్తామామలుంటారు. ఆ చుట్టుపక్కల సామూహిక బాల్య వివాహాలు జోరుగా జరుగుతూంటాయి. తొమ్మిది నెలల పసికందులకి కూడా పెళ్లిళ్ళు చేసేస్తూంటారు. పెద్ద కులం గుజ్జర్లు వీటిలో ఆరితేరి వుంటారు. చట్టం అడ్డుకోబోతే – చట్టం ఇప్పుడొచ్చింది, ఆచారం ఎప్పట్నించో వుందని దబాయిస్తారు. చట్టం లంచం పుచ్చుకుని వెళ్ళిపోతుంది. పసి పిల్లలు మొగుడూ పెళ్ళాలుగా రెడీ అయిపోతారు. సావరీది కూడా బాల్య వివాహమే. ఆమె జీవితం కుదురుగా వుంది. ఇలాటి వేళ ప్రభుత్వ సామాజిక కార్యకర్త శోభా దేవి (దీప్తీ నావల్) ఆ పల్లెలో కార్యకర్తల నమోదు కోసం వస్తుంది. సాథిన్ అనే ప్రభుత్వ మహిళాభి వృద్ధి పథకం కింద స్త్రీ విద్య, బాల్యవివాహాలు, స్త్రీల అణిచివేత మొదలైన సమస్యల పట్ల అవగాహన కల్గించడానికి ఆమె ఒక జట్టు నేర్పాటు చేస్తుంది. చురుగ్గా వుండే సావరీని ఈ జట్టుకి నాయకురాలిగా నియమిస్తుంది. జట్టులోని వాళ్ళందర్నీ సాథిన్ లని పిలుస్తారు.

సాథిన్‌గా కుమ్మరి సావరీ బాల్య వివాహాలకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచార కార్యక్రమాలు గుజ్జర్ సోదరులు ఐదుగురికీ కంటగింపుగా వుంటాయి. ఈ సోదరుల్లో పెద్దవాడు సర్పంచ్ పునియా గుజ్జర్ (ఇష్రత్ అలీ). అందరికంటే చిన్న వాడు సర్జు (యశ్పాల్ శర్మ). వీళ్ళందరూ కలిసి సావరీ కుటుంబాన్ని వెలివేస్తారు. పాలు, సరుకులు, మంచినీళ్ళు ఏవీ కూడా అందకుండా చేస్తారు. సావరీ తన కార్యక్రమాలు ఆపకుండా భర్త ప్రోత్సాహంతో చేస్తూనే వుంటుంది. ఒక రోజు భారీ ఎత్తున గుజ్జర్ కుటుంబం తలపెట్టిన బాల్య వివాహాల గురించి పోలీసులకి సమాచారం అందిస్తుంది. దీంతో కక్షగట్టిన గుజ్జర్ సోదరులు సమయం కోసం వేచిచూస్తారు. పొరపాటున వాళ్ళ భూమిలో మూత్రం పోస్తున్న సావరీ భర్త మీద ఇదే అదనుగా దాడి చేసి కొట్టడం మొదలెడతారు, అడ్డుకున్న సావరీని సామూహికంగా అత్యాచారం చేస్తారు…

ఈ వూహించని సంఘటనకి దిగ్భ్రమకి గురైన సావరీ, భర్త సోహాన్ ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో పడతారు. ‘ఛేడ్ లడాయీ న్యాయ్ కీ… నీంద్ ఛోడ్ ఉఠ్ జాగ్ రే…’ అంటూ అంతరాత్మ తట్టిలేపితే, పోలీస్ స్టేషన్‌కి పద మంటుంది భర్తతో.

పోలీస్ స్టేషన్ దగ్గర్నుంచీ, సీబీఐ దగ్గర్నుంచీ, వైద్యుల దగ్గర్నుంచీ, చివరికి న్యాయమూర్తుల వరకూ సావరీకి న్యాయం జరిగిందా? జాతీయ, అంతర్జాతీయ వార్తల కెక్కినా న్యాయం జరగలేదా? ఎందుకు జరగలేదు? ఇదీ మిగతా కథ…

ఎలావుంది కథ

నిజ కథని కొన్ని మార్పులతో తెరకెక్కించారు. ఈ కథతో తనని సంప్రదించలేదని భావరీ దేవి ఆరోపించింది. జగ్ ముంద్రా రీసెర్చిలో ముఖ్యమైన ఈ పని ఎందుకు చేయలేదో తెలీదు. ఈ సినిమా తీసేనాటికి ఆమె కేవలం అత్యాచార బధితురాలిగా లేదు, అత్యాచార బాధితురాళ్ళకి బాసటగా ఒక పోరాట కార్యకర్తగా వుంది భావరీ. ఈ కథ అత్యాచార బాధితురాళ్ళ పట్ల వ్యవస్థ కుళ్ళుని బయటపెడుతుంది. సెక్సిజం, క్యాస్టిజం పొటమరించిన అత్యాచార నిందితులకి ఎలా రక్షణ వలయం కడుతుందో తెలుపుతుంది. ఆమె ప్రభుత్వ కార్యకర్తగానే ప్రభుత్వం అప్పగించిన బాధ్యతని నిర్వర్తించింది. బాల్య వివాహాల తంతుని పట్టిచ్చింది. అలాంటప్పుడు ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒకటై ఆమెకి అన్యాయం తలపెట్టిన దుర్మార్గుల్ని శిక్షించాల్సింది పోయి, వాళ్లనే రక్షించడం ప్రభుత్వానికే సిగ్గు చేటు, పాలకులకే సిగ్గు చేటు, పథకాలకే వెన్నుపోటు.

చివరికి తీర్పు ఎలా వస్తుందంటే – యవ్వనపు వేడిలో జరపగల లైంగిక కార్యం, వేడి చల్లారిన వయసులో జరిపే అవకాశం లేదని… దేశంలో, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నత జాతుల వారు కింది జాతుల్ని ముట్టుకోవడానికే సంకోచిస్తారు గనుక శారీరక సంబంధం పెట్టుకునే మాట కలలో కూడా వూహించలేమని… ఒకే కుటుంబానికి చెందిన చిన్నా పెద్ద వాళ్ళందరూ కలిసి అత్యాచారానికి పాల్పడతారనేది అప్రాకృత విషయమనీ… ఇంకా అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య కళ్ళెదుటే బలాత్కారానికి గురవుతూంటే, ఆ భర్త కాపాడుకోక చూస్తూ నిలబడడం భారతీయ సంస్కృతికే వ్యతిరేకమనీ…

సీబీఐ కోర్టు ఇచ్చిన నిజ తీర్పయితే ఇంకెలా వుంటుందంటే- గ్రామ సర్పంచ్ రేప్ చేయలేడని… భిన్న కులస్థులు ఒకే రేప్‌లో పాల్గోనలేరని… 60 – 70 ఏళ్ల మగవారు అస్సలు రేప్ చేయలేరనీ.. ఒక మనిషి తన బంధువుల ఎదుట రేప్ చేయలేడనీ …

ఇలా కేసులోంచి విడుదలై పోయిన నిందితులు ఐదుగురికీ దండ లేసి, సన్మాన సభ పెడతాడు స్థానిక ఎమ్మెల్యే. ఇదంతా చూసి ఇక జీవిత కాల పోరాటం చెయ్యక తప్పని పరిస్థితిలో పడుతుంది వ్యవస్థ బాధితురాలుగా కూడా మారిన సావరీ.

నిరాడంబరంగా నందిత

నందితా దాస్ ఈ పాత్రలో పోరాట వనితగా ఏమీ వుండదు. వ్యవస్థ చేతిలో పావుగా వుంటుంది. మహిళా నేతలకీ, రాజకీయ నేతలకీ వాళ్ళ ప్రయోజనాల సాధనంగా మారిపోతుంది. కాబట్టి అణిగి వుండే ఈ పాత్రకి తగ్గట్టే ఆమె నటన వుంటుంది. జరిగిన అన్యాయానికి ఏడుస్తూ కూర్చోకుండా, ప్రపంచం ముందుకొచ్చి చెప్పుకోగల గుండె దిటవు మాత్రం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత జరగాల్సిందంతా వివిధ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కోర్టులో ఇబ్బంది పెట్టే ప్రశ్నలెదురైనప్పుడు మాత్రం ఆడతనంతో తిప్పి కొడుతూ ఉగ్ర రూపం ధరిస్తుంది. ఈ పాత్రకి గాను శాంటా మోనికా చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ నటి అవార్డు నందుకుంది.

 భర్త పాత్రలో రఘువీర్ యాదవ్ సున్నిత మనస్కుడి పాత్రలో వుండిపోతాడు. గుజ్జర్లు పాత్రల్లో అయిదుగురూ కన్నింగ్‌గా వుంటారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు పాత్రలో ఆ పోలికలున్న నటుడు కన్పిస్తాడు. సామాజిక కార్యకర్తగా దీప్తీ నావల్ హుందాగా కన్పిస్తుంది. చివరి దాకా సావరీతో వుంటూ కేసు చూసుకుంటుంది. ఆమె భర్త ఒక సామాజిక శాస్త్రం బోధించే ప్రొఫెసర్. అయితే ఆమె సామాజిక సేవల్ని వెక్కిరిస్తూ మానసికంగా వేధిస్తూంటాడు. సావరీ కేసుని హైజాక్ చేసి పబ్లిసిటీ చేసుకునే గద్దల్లా, ఢిల్లీలో కొందరు ఇంగ్లీష్ స్పీకింగ్ – హైఫై లేడీస్ స్త్రీ హక్కుల నేతల్లా వుంటారు. వీళ్ళకి బాస్‌గా లిల్లెట్ దుబే హల్చల్ చేస్తూంటుంది. కోర్టులో సావరీ కేసు ఇన్ కెమెరా విచారణ కోసం జడ్జీ అందర్నీ బయటకి పంపించేస్తే, ‘ఇప్పుడెట్లా టైం పాస్ చేస్తాం, సినిమాకి పోదామా?’ అనుకుంటారు. ఈ పాత్రలతో ఇలాటి హక్కుల లేడీస్ పరువు తీశాడు దర్శకుడు.

పోలీస్ ఇన్స్‌పెక్టర్ పాత్రలో రవి ఝాంకాల్ ఒక ఫెటిషిస్టు పాత్ర. గోళ్ళకి ఎర్ర రంగేసుకుంటూ పరిచయ మవుతాడు. సావరీ దగ్గర్నుంచీ ఆమె ధరించిన ఘాగ్రాని సాక్ష్యాధారంగా సేకరించిన ఇతను, దాంతో కోర్కె తీర్చుకుని సాక్ష్యాధారాల్ని కలుషితం చేస్తాడు. ఇదే కేసుకి విఘాతంగా మారుతుంది. సావరీ తరపున వాదించే గుజ్జర్ కులానికి చెందిన లాయర్ పాత్రలో గుల్షన్ గ్రోవర్, గుజ్జర్ల వ్యతిరేకతని ఎదుర్కొంటాడు. ఈ పాత్ర డీసెంట్‌గా నటిస్తాడు.

సాంకేతికాలు సమున్నతం

ఈ కథ కొన్ని ఫ్లాష్‌బ్యాకులుగా వుంటుంది. ఈ కథ తెలుసుకోవడానికి అమీ అనే అమెరికన్ పాత్రికేయురాలు (లైలా రువాస్), రవి (రాహుల్ ఖన్నా) అనే దుబాసీని వెంట బెట్టుకొస్తుంది. సావరీ భర్తనీ, శోభానీ, లాయర్నీ, పోలీస్ ఇన్స్‌పెక్టర్నీ కలుసుకుంటూ వాళ్ళనుంచి కేసు పూర్వపరాలన్నీ తెలుసుకుంటుంది. ఈ సందర్భంగా వచ్చేవే వివిధ ఫ్లాష్ బ్యాకులు. వస్తూనే దారిలో సావరీ భర్త రిక్షానే ఎక్కడం, ఆ తర్వాత వూళ్ళో సావరీ మీద అత్యాచారం తలపెట్టిన వాళ్ళ ఒంటె బండెక్కి వాళ్ళనే ఆమె ఇంటి దారి అడగడం – అనే దృశ్యాలు పాత్రల్ని పరిచయం చేస్తూ, అదే సమయంలో కథలోకి తీసికెళ్ళి పోతూంటాయి.

దర్శకుడు ముంద్రా కథతో విశాల దృష్టినీ ప్రదర్శిస్తాడు. దాంతో అక్కడక్కడా ఫోర్ షాడోయింగ్ ఎలిమెంట్స్ ప్లాంట్ చేస్తూ పోతాడు. మానవ మాత్రుడు లేని ఇసుక ఎడారుల్లో అత్యాచార ఘటన జరిగాక, భర్యాభర్తలైన సావరీ, సోహాన్‌లు దేవుడా అనుకుంటూ వెళ్తున్నప్పుడు, కుంగుతున్న సూర్యుడే కన్పిస్తాడు. కర్మ సాక్షిని నేను తప్ప ఈ కేసులో ఇంకో సాక్ష్యం మీకు వుండదని ముందే హెచ్చరిస్తున్నట్టుగా.

ఎడారి ఇసుకలోనే సావరీ కూతురి చేత తన పేరు రాయించుకుంటుంది. అంతలో గాలి దుమారం రేగి అక్షరాలు చెడి పోతాయి – సావరీ జీవితం కూడా చెడిపోబోతోందన్నట్టుగా. కళ్ళ ముందే అత్యాచారం జరిగిన భార్య సావరీతో సోహాన్ వైఖరి ఎలా వుండొచ్చు? వదిలేయవచ్చా? కాదు, గాయాలతో ఏడుస్తూ పరుగెత్తుకొచ్చి, కింద పడున్న ఆమె చెవి జూకా తీసి చెవికి పెడుతూ ఆర్తిగా హత్తుకుంటాడు. ఒక్క క్షణం కూడా అతను వేరే ఆలోచన చేయడు. బేషరతుగా తక్షణం ఆమెని అంగీకరిస్తున్నాడని చెవి జూకాతో అతడి రియాక్షనే సాక్ష్యం. పాత్రల చర్యలే పాత్ర చిత్రణలు చేసుకుపోతాయి.

అశోక్ మిశ్రా, సుధా అరోరాల స్క్రీన్ ప్లేకి ముంద్రా దృశ్యీకరణ అంతర్జాతీయ స్థాయిలో వుంది. హరిరాం ఆచార్య, దీపక్ పురోహిత్‌ల సంభాషణలు అవసరమున్నప్పుడు పచ్చిగానూ వున్నాయి. మాలా డే వస్త్రాలంకరణ, జయంత్ దేశముఖ్ కళా దర్శకత్వం అంతా కళ్ళు చెదిరే డిజైనర్ లుక్కే. తెలుగు సినిమా మద్రాసులో వున్నప్పుడు, ఆంధ్రాలో షూటింగ్ కెళ్తే అక్కడి లొకేషన్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కన్పించే ఇళ్ళకి కొట్టొచ్చే రంగు లేసేవారట. అలావుంది రాజస్థానీ పల్లెలో మట్టి ఇళ్ళ వైభోగం. ప్రతీ ఇల్లూ ఇప్పుడే సున్నాలేసి రంగులేసినట్టు వెలిగిపోతూ వుంటుంది. వీధివీధీ స్వచ్ఛ భారత్‌లా మెరిసి పోతూంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో దూరంగా ఒక చిన్న ఇల్లు కన్పిస్తున్నాదానికీ సున్నాలూ రంగులే. ఆ పల్లెకి అమెరికా అధ్యక్షుడెవరో రాబోతున్నట్టు అట్టహాసం. తెరమీద కన్పిస్తున్నవి ఇళ్లా, చిత్రకారుడేసిన బొమ్మలా అన్నట్టు. అశోక్ కుమార్ కెమెరా వర్క్ టాప్ రేంజి.

సంగీతం విశ్వమోహన్ భట్. ఎక్కువగా ఆలాపనలున్నాయి. ఒక ఆలాపన నందితా దాస్ పాడింది. ఇంకో పాట దీప్తీ నావల్ పాడింది. మిగిలిన తొమ్మిది ఆలాపనలు, గీతాలూ మాహాలక్ష్మీ అయ్యర్, సప్నా అవస్థీ, పరమేశ్వరి, సోనాలీ వాజ్ పాయ్, రీటా గంగూలీ, రాం శంకర్, వికాస్ లు పాడారు. ఈ సంగీత శోభ కథకి గాంభీర్యాన్ని తెచ్చింది.

ఇసుక తూఫాన్లకంటే పొంచి వుండే టక్కరి యంత్రాంగమే తీరని సమస్య. ఇసుక తూఫానులో మానం కొట్టుకు పోవచ్చు- కానీ – ‘నాకు న్యాయం జరిగినప్పుడే నా మానం తిరిగి నాకు దక్కినట్టు’ అని యంత్రాంగంపై సావరీ చేసే వ్యాఖ్య ఇంకెన్నాళ్ళు పోయినా మూగ రోదనగానే వుండొచ్చు.

అమెరికన్ పాత్రికేయురాలితో పల్లె కొస్తూ, గోడమీద రాసివున్న అక్షరాలు చదువుతాడు దుబాసీ. ప్రేమ, మర్యాద, ఆత్మగౌరవం ప్రతీ స్త్రీ హక్కు అని. నేను నమ్మను, ఇక్కడలాంటి దేమీ కన్పించడం లేదంటుందామె. నవ్వి ‘ఇండియా ఈజే లాండ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్’ అంటాడు. ‘బవందర్’ లో లాంటి కాంట్రడిక్షన్ ఇండియానే ప్రసిద్ధి కావొచ్చు.

Exit mobile version