లోకల్ క్లాసిక్స్ – 24: నది నింపిన ప్రేమ

0
2

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా శతరూప సన్యాల్ దర్శకత్వం వహించిన చక్మా సినిమా ‘తన్యాబీ ఫిర్టీ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘తన్యాబీ ఫిర్టీ’ (చక్మా)

[dropcap]చ[/dropcap]క్ వుడ్ (చక్మా సినిమా) 2005లో ప్రారంభమైంది. చక్మా భాష మాట్లాడే ప్రజలు పది లక్షల మంది వుంటారు. వీరంతా వివిధ ప్రదేశాల్లో విస్తరించి వున్నారు: మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, బంగ్లాదేశ్, మయన్మార్ లలో నివసిస్తారు. వీరు మాట్లాడే చక్మా భాష ఇండో ఆర్యన్ భాష. వీరి మతం బౌద్ధం. వీరి తెగ పెద్దని చక్మా రాజా అంటారు. వీరి కోసం 2005లో తొలి చక్మా సినిమా నిర్మించారు శతరూప సన్యాల్. ఈమె నటి, గాయకురాలు, దర్శకురాలు, నిర్మాత. బెంగాలీలో 6 సినిమాలు రూపొందించారు. 12 డాక్యుమెంటరీలు, 26 టెలీఫిల్ములు కూడా నిర్మించారు. 7 జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకున్నారు. ‘తన్యాబీ ఫిర్టీ’ చక్మా భాషలో ఆమె నిర్మించిన తొలి చక్ వుడ్ సినిమా. ఈ ప్రారంభంతో ఏటా మూడు నుంచీ 10 సినిమాల వరకూ నిర్మిస్తున్నారు ఇతర నిర్మాతలు.

‘తన్యాబీ ఫిర్టీ’ (తన్యాబీ పునరాగమనం) ఓ ప్రేమ కథ. ఓ చక్మా గ్రామంలో తన్యాబీ (రీటా చక్మా), పునంగ్చాన్ (ప్రంజల్ రాయ్) తో ప్రేమలో పడుతుంది. అతను పేద వాడు, వేణువు బాగా వాయిస్తాడు. చెంగీ నదీ తీరాన ఇద్దరూ కలుసుకుంటూ తమ జీవితం గురించి కలల్లో తేలిపోతూంటారు. చెంగీ నదీ ఆశీర్వాదం కూడా పుష్కలంగా లభిస్తూంటుంది. ఈ ప్రేమ విషయం గూడెంలో తెలిసిపోతుంది. తన్యాబీ తల్లిదండ్రులు మందలిస్తారు. అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు. వధువుగా ముస్తాబు చేస్తారు. కానీ వరుడు పునంగ్చాన్ కాదు. డబ్బున్న రెండో పెళ్లి వాడు. నిశ్చేష్టురాలవుతుంది. పెళ్లి జరిగిపోతుంది. దీపాల ముందు ప్రణమిల్లి, ఉంగరాలు మార్చుకుంటారు. ఇద్దర్నీ కలిపి వస్త్రంతో కడతారు. పెళ్ళయిపోతుంది. ఆ రాత్రి భర్తకి దూరంగా వుంటుంది. ఇక దూరంగానే వుంటుంది. మౌనంగా బాధని భరిస్తూంటుంది. రహస్యంగా వెళ్లి పునంగ్చాన్‌ని కలుసుకుంటుంది. ఇలా కలవడం తప్పంటాడు, తనని చేపట్టలేనంటాడు. తన్యాబీకి దిక్కు తోచదు. చెంగీ నది దారి చూపదు. భర్త నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ససేమిరా అంటుంది. ఓ తెల్లారి చెంగీ నదిలో తేలుతూ కన్పిస్తుంది… చెంగీ నది ఎంత కుంగిందంటే, ఆ నీళ్ళని కన్నీళ్లుగా తన్యాబీ కళ్ళల్లో నింపేసింది. ఆ నీళ్ళు తన్యాబీకి ప్రాణం పోశాయి. ఆమె తిరిగి వచ్చి పునంగ్చాన్‌ని కలుసుకుంది. ఇద్దరి ప్రేమా ఫలించి ఒకటయ్యారు…

ఇది చక్మా జానపద కథ ఆధారంగా తీసిన సినిమా. 59 నిమిషాల ఈ సినిమాలో పాటలు ముప్పావు వంతు ఆక్రమిస్తాయి. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ వుండదు. కానీ ప్రకృతి నేపధ్యంలో చిత్రీకరణ ఆసక్తిగా మారుస్తుంది. వెదురు ఇళ్ళు, ఆ ఇళ్ళల్లో ప్రశాంతంగా జీవించే చక్మా తెగ, వాళ్ళ కట్టుబాట్లు, పెళ్లి ఆచారాలూ, నృత్య రీతులూ – వీటిని పరిచయం చేశారు దర్శకురాలు శతరూప సన్యాల్. తనే రచన చేసి, తనే సంగీతం వహించారు. ఛాయాగ్రహణం సుర్మిందర్ మజుందార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here