[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా గౌతం ఘోష్ దర్శకత్వం వహించిన బెంగాలీ సినిమా ‘పద్మా నదిర్ మాఝీ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘పద్మా నదిర్ మాఝీ’ (బెంగాలీ)
నదీమ తల్లి ఎంత ఇస్తుందో అంతా తీసేసుకుంటుందని చెప్పే ఈ కథ జాలరుల కథ. ఒకానొక రాత్రి నది ప్రకోపించి కూడూ గూడూ కబళించేస్తే ఎక్కడికెళ్ళాలి? ఒడ్డున పడ్డ చేపలా ఏది దారి? పునరావాసం ఏ పాలకులు చూస్తారు? బ్రిటిష్ ఏలుబడిలో వున్న కాలంలో? ఇంకా స్వాతంత్ర్యం, సొంత దేశం లాంటి కలలు తీరేలోగా ఓ మరో ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోలేరా? అదెక్కడుంది? అక్కడేముంది? ఎలాటి జీవితముంది? 1993లో గౌతం ఘోష్ దృక్కోణంలో ఈ ‘పద్మా నదిర్ మాఝీ’ – పద్మా నదిలో పడవ నడిపే వాడి వ్యధ, ఈ కింద చెప్పుకుంటున్న విధంగా వెండితెర కెక్కింది.
కథ
1936లో అది పద్మా నది వొడ్డున కేతుపూర్ అనే గ్రామం. ఆ గ్రామంలో తెల్లవారే అజాన్‌తో బాటు శంఖ నాదం ఒకేసారి విన్పిస్తాయి. జాలరులుండే గ్రామం. రాత్రంతా చేపల వేట, పగలంతా నిలువు దోపిడీ. చేపలు పట్టి తెస్తూంటేనే గ్రామస్థులు లాక్కుని పైసా ఇవ్వకుండా వొండుకు తినేస్తారు. మిగిలినవి సంతకి తీసుకుపోతే వ్యాపారులు అన్యాయంగా ధర కట్టిస్తారు. మోతుబరికి చెప్పుకుంటే ఇంకా నిలువు దోపిడీ అయిపోతుంది. దిక్కు తోచని పరిస్థితుల్లో వుంటారు జాలర్లు. పద్మా నది ఈ దైన్యాన్ని మౌనంగా చూస్తూ గంభీర ముద్ర దాల్చి వుంటుందెప్పుడూ. నది ఈ ఒడ్డున ఇటు నించుని చూస్తే అటు ఒడ్డు కన్పించనంత మహా సముద్రంలా వుంటుంది.
అలాంటి జాలర్లలో కుబేర్ (రైసుల్ ఇస్లాం అసద్) ఒకడు. పేరుకు కుబేరే గానీ కూడబెట్టేదేమీ లేదు. పైగా గంపెడు సంసారం. కాలు పనిచెయ్యని భార్య మాల (చంపా), పెళ్లి కెదిగిన కూతురు, ఆలస్యంగా పుట్టిన ఇంకో చిన్న కూతురు, మొగుడు వదిలేసిన భార్య చెల్లెలు కపిల (రూపా గంగూలీ), ఆమె పిల్లలు. అక్క సంసారానికి పనికరాదన్న సాకు దొరికి బావని వల్లో వేసుకునే ప్రయత్నాలు కపిలవి. కడుపుకే లేదంటే ఈ కొవ్వెక్కిన సరసాలు.
ఇలాంటప్పుడు పెద్ద పడవేసుకుని ఓ గడ్డం సాయిబు గ్రామంలోకి వస్తాడు. పేరు హుస్సేన్ మియా (ఉత్పల్ దత్). వచ్చి వూరడిస్తాడు. ఇక్కడేముంది, తన వెంట వస్తే మరో ప్రపంచం చూపిస్తాడు. అటు దూరంగా లంకలో మోయినా దీప్ అనే స్వర్గం నిర్మిస్తున్నాడు తను. అక్కడ హిందూ లేదు, ముస్లిం లేదు, ఎవరైనా వచ్చి వుండొచ్చు. ఈ వరదలూ తూఫాన్లూ సామాజిక వివక్షా ఏవీ లేకుండా సెటిలర్లుగా తను నిర్మిస్తున్న సెటిల్మెంట్‌లో కొత్త జీవితాలు ప్రారంభించి సురక్షితంగా వుండొచ్చు. తనకి వ్యాపారంలో కలిసి వచ్చి పెద్ద పడవ కొన్నాడు. నది మీద చేసుకునే వ్యాపారాలు చాలా వున్నాయి. తన వ్యాపారాల గురించి కొందరికి చాలా అనుమానాలున్నాయి. ఒకసారి మోయినా దీప్ కొస్తే అనుమానాలన్నీ తీరిపోతాయి…
ఇదేదో బావుందనుకుని వెళ్లి చూసి రావడానికి సిద్ధపడతాడు కుబేర్. అప్పటికే అక్కడ వుండలేక వచ్చేసిన రాసు (సునీల్ ముఖర్జీ), అమీనుద్దీన్ (రవీ ఘోష్) అనే ఇద్దరు మోయినా దీప్ గురించి నిరాశాజనకంగా చెప్తారు. అక్కడ పులులు సింహాలూ విచ్చల విడిగా తిరుగుతున్నాయంటారు. వాటికంటే ఇక్కడున్న మానవ పులులూ సింహాలే నయమంటారు. ఇది విని కుబేర్ గడ్డం సాయిబుకి రానని చెప్పేస్తాడు. అప్పుడు అర్ధరాత్రి వర్షం, తూఫాను, వరదలూ అన్నీ ఒకేసారి ముంచెత్తి బీభత్సం సృష్టిస్తాయి. తెల్లారేసరికి పూచిక పుల్ల మిగలదు. పద్మా నది మొత్తం తుడిచి పెట్టేసింది. ఎంత ఇచ్చిందో అంతకంటే ఎక్కువే తీసికెళ్ళి సముద్రంలో పడేసింది… ఇప్పుడేం చేశాడు కుబేర్?
ఎలావుంది కథ
మనం నవల చదవలేం గానీ, సినిమా చూస్తూంటే పద్మా నది, జాలర్ల జీవితం నవల చదవక్కర్లేదన్నంత విజువల్ లాంగ్వేజీతో తీశాడు గౌతం ఘోష్. కథ ప్రధానంగా పీడితులకి ఒక ప్రత్యామ్నాయ ప్రపంచ ఏర్పాటు గురించి. 1970లో తెలుగులో ఆదుర్తి సుబ్బారావు కళాత్మక కోణం కూడా ఇలాంటిదే. అక్కినేని, సావిత్రి, జమున, గుమ్మడిలతో ‘మరోప్రపంచం’ అనే వ్యాపార సినిమా కాని సమాంతర సినిమా ప్రయోగాత్మకంగా తీసి భవిష్య వాణి విన్పించారు. ‘ప్రళయం ఎప్పుడొస్తుంది నాయనా?’ అని తిండికి లేని ముసలవ్వ పాత్రలో జమున చేత అన్పించి గొప్ప సోషల్ సెటైర్ వేశారు. ఈ కథ సమాజంలో అనాథలైన, అన్యాయాలకి బలైన పిల్లల్ని ఈ ధూర్త ప్రపంచం నుంచి దూరంగా తీసికెళ్ళి మరో బంగారు ప్రపంచం నిర్మించే సామాజిక స్పృహతో వుంటుంది. ఇలాటి మరో ప్రపంచంగా ‘మోయినా దీప్’ గౌతం ఘోష్ సినిమాలో ప్రత్యామ్నాయ జగత్తుగా కన్పిస్తుంది.
‘ప్రళయం ఎప్పుడొస్తుంది నాయనా?’ అంది జమున. జాలరి కుబేర్‌కి కూడా ప్రళయం వస్తే తప్ప కాలు కదలలేదు మోయినా దీప్‌కి. అదికూడా వెంటనే కాదు. పోలీసులు వెంటబడితే తప్ప గడ్డం సాయిబు మాట విని మోయినా దీప్‌కి జంప్ కాలేదు. పోలీసులు ఎందుకు వెంటబడ్డారు? అదో పెద్ద కథ. ‘జియో సినిమా’లో చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఈ మరో ప్రపంచమైనా నమ్మకమైదేనా? చెప్పలేం. ఎందుకంటే పెనం మీంచి పొయ్యిలో పడే చక్రభ్రమణాలే కదా పీడితుల జీవితాలు. లేకపోతే వాళ్ళకి కొత్త జీవితాల్నిస్తూ వాళ్ల చేత కాగితాల మీద సంతకాలెందుకు పెట్టించుకుంటాడు గడ్డం సాయిబు?
దృశ్యాత్మక ఔన్నత్యం
నటీనటులందరూ జాలర్లే అన్నట్టుగా నటించారు. ముఖ్యంగా హిందీ సినిమాల్లో కూడా ఓ ప్రత్యేక ధోరణిలో నటించి ఒకతరం ప్రేక్షకుల్ని అలరించిన ఉత్పల్ దత్, గడ్డం సాయిబు పాత్రలో ఎక్కువ మాట్లాడని, నిదానంగా వ్యవహరించే పాత్రలో గుర్తుండి పోతాడు.
గౌతం ఘోష్ రచన కూడా చేసిన ఈ సినిమాకి సంగీతం గౌతం ఘోష్ – అల్లావుద్దీన్ అలీ, ఛాయాగ్రహణం గౌతం ఘోష్, కూర్పు మలోయ్ బెనర్జీ. ఇండో-బంగ్లాదేశ్ సంస్థల సంయుక్త నిర్మాణం. ఉత్తమ బెంగాలీ చలన చిత్రం కింద జాతీయ అవార్డు, ద్వితీయ ఉత్తమ చలన చిత్రం కింద మరో జాతీయ అవార్డు, ఉత్తమ దర్శకుడుగా గౌతం ఘోష్‌కి జాతీయ అవార్డు లభించాయి.