Site icon Sanchika

లోకల్ క్లాసిక్స్ – 29: కుందేలు- తాబేలు- అమ్మాయి!

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సాయి పరంజపే దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కథ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘కథ’ (హిందీ)

[dropcap]1[/dropcap]980 లలో చెప్పుకో దగ్గ సంఖ్యలో దర్శకురాళ్లే లేని కాలంలో ‘స్పర్శ్’తో సాయి పరంజపే రాక కొత్త ఆసక్తిని రేకెత్తించింది. నసీరుద్దీన్ షా – షబానా అజ్మీలతో ‘స్పర్శ్’ అంధులైన ప్రేమికుల బలమైన చిత్రణగా వార్తల కెక్కింది. ఒక్క పెట్టున ఆమెకి జాతీయంగా, అంతర్జాతీయంగా అపార గుర్తింపుని సంపాదించి పెట్టింది. మూడు జాతీయ అవార్డుల్ని అందించిన ఘనత సాధించింది. బాల సాహిత్యంతో ప్రారంభమైన ఆమె రచనా జీవితం, నాటక రంగానికీ, టీవీ మాధ్యమానికీ సాగి, సినిమాల్లో స్థిరపడింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పట్ట భద్రురాలైన ఆమె, నాల్గు బాలల చిత్రాలు నిర్మించిన అనుభవంతో 1980లో ‘స్పర్శ్’తో సమాంతర సినిమా దర్శకురాలిగా పరిచయమయ్యారు. నాటి నుంచీ 2009 వరకూ ఏడు సినిమాలు మాత్రమే అందించినా, అవన్నీ ఒక్కో ఆణిముత్యాలయ్యాయి. ముగ్గురు విద్యార్థుల రొమాంటిక్ కామెడీ ‘చష్మె బద్దూర్’, వలస కార్మికుల ‘దిశ’, సగటు జీవుల ‘కథ’ వంటివి…

1982లో దర్శకత్వం వహించిన ‘కథ’ నసీరుద్దీన్ షా, దీప్తీ నావల్, ఫరూఖ్ షేక్ లతో ఒక క్లాసిక్ కామెడీగా స్థిరపడిపోయింది. జాతీయ ఉత్తమ కథా చలన చిత్రంగానూ అవార్డు పొందింది. దీని కథా కమామిషేమిటో ఒకసారి చూద్దాం…

కథ

ముంబాయిలో అదొక నాల్గంతస్తుల చావిడి. అందులో దిగువ మధ్య తరగతికి చెందిన కుటుంబాలు. కలిసి మెలసి వుండే కుటుంబాలు. ఎవరితో ఎవరికీ పేచీల్లేవు, తగాదాల్లేవు, చాడీల్లేవు, చెడు మాటల్లేవు. ఉన్న సౌకర్యాలని ఉమ్మడిగా పంచుకోవడానికి ఎలాటి ఇబ్బందులూ లేవు. పరస్పరం సహకరించు కోవడానికీ, సహాయాలు చేసుకోవడానికీ వెనుకా ముందు ఆలోచనల్లేవు. అత్యవసరంగా పాలు కావాల్సి వస్తే కూడా ఒక ఇంట్లో లేకపోయినా ఇంకో ఇంట్లో తప్పక దొరుకుతుంది. అనుకోకుండా పక్కింటి మనిషి వస్తే ఏదో ఫలహారం పెట్టిగానీ పంపరు. ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా – వాళ్ళా ఆయన చేసే ముద్దూ ముచ్చట విన్నారా’ బాపతు పెంకి పెళ్ళాల్లేరు. పక్కింటి పెళ్ళాం కొత్త చీర కొన్నదని తనకూ అంతకి మించింది కావాలనే కడుపు మంట ఇల్లాళ్ళు లేరు. ‘మొన్న షోరూంలో హాంకాంగ్ చీర ఒకటి చూశాను, అది తెచ్చి పెట్టరూ?’ అని కోరే సింప్లిసిటీ గల అంగనలే వున్నారు. ఇంటింటి రామాయణాల్లేవు. ఎవరితో ఎవరికీ పోటాపోటీ జీవితాల్లేవు. అయితే ఒకనాడు ఇలాటి చల్లటి జీవితాల చావిట్లోకి ఒక చలాకీ కేడీ వచ్చి పోటీ మొదలెట్టాడు.

ఈ కేడీ వచ్చే ముందు అక్కడొక రాజారాం పురుషోత్తం జోషీ (నసీరుద్దీన్ షా) అనే బారెడు పేరుగల పొట్టి జీతం సగటు జీవి వున్నాడు. అతడి ఉద్యోగం పర్మనెంట్ అయిన సందర్భాన్ని ప్రకటించుకుని, హెడ్ క్లర్క్ అవడం తన జీవితాశయమని అభిభాషించాడు. చిన్నిచిన్ని ఆశ, చిగురంత ఆశ. పర్మనెంట్ ఉద్యోగిగా నేమ్ ప్లేట్ పెట్టుకున్నాడు. ఆ నేమ్ ప్లేట్ అమర్చేందుకు బియ్యే చదివిన ‘లిబరేటెడ్’ సంధ్యా సబ్నిస్ (దీప్తీ నావల్) తోడ్పడింది. ఇద్దరూ కలిసి కొత్త కాపురం పెడుతున్నట్టే ఇంటికి నేమ్ ప్లేట్ అలంకరించారు.

అయితే అతడి సమస్యేమిటంటే, ప్రేమిస్తున్నాననే మాట చెప్పే అవకాశం ఆమె ఇవ్వడం లేదు. చెప్పబోతే ‘రాజారాంజీ’ అని సగౌరవంగా సంబోధిస్తుంది. దాంతో నీరుగారిపోతాడు. అతడి హృదయ బాధని ఆమె ఆలకించడం లేదు. సమోసాలు చేసి పెడితే వహ్వా అంటూ తింటుంది. చాయ్ చేసిస్తే మస్తుగా తాగుతుంది. వాటిలో దట్టించిన తన ప్రేమని మాత్రం అస్సలు తెలుసుకు చావదు.

ఇలాటి పరిస్థితుల్లో ఎక్కడ్నించో  దిగిపోయాడు రాజారాం పాత మిత్రుడు వాసుదేవ్ భట్ అలియాస్ బాషు (ఫరూఖ్ షేక్) అనే చలాకీ కేడీ, బ్లఫ్ మాస్టర్ కమ్ రోమియో. వచ్చి మూడొందలు ఇచ్చుకునే పేయింగ్ గెస్ట్‌గా మకాం వేశాడు. ఇన్నాళ్ళూ ఎక్కడున్నావంటే, లండన్ దగ్గర్నుంచీ సినిమా ఫీల్డు దాకా చేసిన గొప్ప గొప్ప ఉద్యోగాలు చెప్పాడు. ఇంటర్ ఫెయిలైన నీకు ఉద్యోగాలెలా వచ్చాయంటే, చదువు కాదు టాలెంట్‌తో బతకాలన్నాడు. మాటలతో పడేస్తే మూటా ముల్లె మనదే నన్నాడు. నీలాటి వాడే గుమాస్తా జీవితంతో రాజీపడి పోతాడన్నాడు.

రాజారాం పనిచేస్తున్న కంపెనీ తెలుసుకుని, ఆ ‘ఫుట్ ప్రింట్స్’ అనే పాదరక్షల కంపెనీ బాస్ ధిండోరియాని బుట్టలో వేసుకుని మరీ ఉద్యోగం కొట్టేశాడు. రాజారాం కంటే పై స్థాయిలో మార్కెటింగ్ పోస్టులో చేరిపోయాడు. చేరిపోవడమేగాక తన పనులు రాజారాం చేత చేయించుకున్నాడు. పైగా బాస్ భార్య అనూరాధ (మల్లికా సారాభాయ్) ని వల్లో వేసుకున్నాడు. ఇటు రాజారాం ప్రేమిస్తున్న సంధ్యనీ  ప్రేమలోకి దింపేశాడు. రాజారాంని దురాక్రమించేసి అందిందల్లా సొంతం చేసుకోవడం మొదలెట్టాడు…

ఆశ్రయమిచ్చిన రాజారాం అతడి ముందు వెలవెల బోయాడు. సంధ్యని కూడా వాడికి సమర్పించుకుని దీనంగా మిగిలాడు. అయితే కుందేలూ తాబేలు పోటీలో కుందేలు గెలుస్తుందా, తాబేలు గెలుస్తుందా? ఒకవేళ తాబేలే గెలిస్తే అదెలాటి గెలుపై వుంటుంది? షార్ట్ కట్స్ బాషూ కంటే, స్లో టైప్ రాజారాం ఎలా భేష్ అన్పించుకున్నాడు చివరికి? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో లభిస్తాయి.

ఎలావుంది కథ

ఇది సున్నిత హాస్యంతో కూడిన సహజ కథ. హాస్యమే ఈ కథని చైతన్యవంతం చేసింది. దర్శకురాలు సాయి పరంజపేకి పీజీ ఓడ్‌హౌస్ నవలలూ, ఆ తరహా హాస్యమూ నచ్చవు. చదవదు. ఎవరి ప్రభావమూ లేకుండా ఇందులో తనదైన కామెడీ సృష్టించానంది. ఇందులో సఫలమైనట్టు సీన్లే చెప్తాయి. అయితే పీజీ ఓడ్‌హౌస్‌లా పగలబడి నవ్వేంత వుండవు. ఈ కథకి ఆధారం ఎస్.జి.సత్యే రాసిన ‘సస ఆనీ కసవ్’ (కుందేలు- తాబేలు) అన్న మరాఠీ నాటకం. ఆధునిక జీవనానికి అన్వయించిన కుందేలు- తాబేలు కథ. టైటిల్స్‌లో కుందేలు- తాబేలు యానిమేషనే చూపిస్తూ కథేమిటో క్లూ ఇచ్చేసింది. నిదానమే ప్రధానమనేది ఈ కథ చెప్పే తెలిసిన నీతే. శాశ్వత విలువే.

అయితే సంధ్య పాత్రకి ఒక మరక వల్ల ఈ నీతి చెడినట్టుగా కనపడుతుంది. ఈ మరక అంత అవసరంగా కూడా అన్పించదు కథకి. సినిమా ఒక క్లాసిక్ గానే పేరుబడింది. కానీ ఈ మరకని మాత్రం ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. లేక ఇది కూడా ఆధునిక జీవనంలో భాగమే అనుకున్నారేమో. ఇది సినిమా తీసిన 1980ల నాటి సంగతి. ఇప్పుడొచ్చేసి నేటి కాలానికి చూస్తే, కుందేలు- తాబేలు కథకీ, ఇందులోని నీతికీ ఏ విలువా లేదు. ఇతరుల్ని తొక్కేసుకుంటూ పోయే వాడిదే విజయం. అలాటి వాడికే ఆదరణ. నీతీ గీతీ అని కూర్చునే వాడి విలువ ఆలస్యంగానైనా తెలిసిరాదు. వాడు ఓ మూల సర్దుకుంటాడు. నిదానమే ప్రధానమని గాక, పరుగే ప్రధానమని చెప్పుకునే కాలం.

కుందేలు- తాబేలు కథ ప్రకారం బాషుకి గుణపాఠమే వుంటుంది. ఇది నీతికి విజయమే. కానీ నీతికి కట్టుబడ్డ రాజారాంకి కాదు. బాస్ భార్యని వల్లో వేసుకున్న బాషుని బాస్ డిస్మిస్ చేసి పారేస్తాడు. అప్పటికే సంధ్యతో ఎంగేజ్‌మెంట్ కానిచ్చుకున్న బాషు, ఈ డిస్మిసల్‌తో పెళ్లి సమయానికి పరారవుతాడు. సంధ్య తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఇప్పుడేం చేయాలి? వాళ్ళ పరిస్థితి చూసి రాజారాం ముందుకొస్తాడు. కానీ రాజారాంతో పెళ్ళికి సంధ్య ఒప్పుకోదు. బాషుతో గర్భవతైంది. రాజారాం అభ్యంతరం లేదంటాడు. అది అతడి పెద్ద మనసా, జాలినా, లేక మొదట్నుంచీ ఆమె మీదున్న ప్రేమా స్పష్టం కాదు. ఇది కాదు ప్రశ్న.

ప్రశ్నేమిటంటే, కుందేలు- తాబేలు కథ ప్రకారం నిదానమే ప్రధానమని చివరికి బాషు మీద రాజారాందే విజయమైంది. బాగానే వుంది. మరి ఇదెలాటి విజయమైంది? చిట్ట చివరికి పోటీలో గెలిచిన తనకి ఎలాటి పూల గుత్తితో స్వాగతం లభించింది? వాడిన పూల గుత్తి. బాషు వాడేసిన పూల గుత్తి. మరకతో వున్న సహచరి సంధ్య.

అనవసర మరక ఇది. సంధ్యని బాషు లోబర్చుకున్నాడన్న ఈ మలుపు క్లయిమాక్స్‌కి కమర్షియల్ గిమ్మిక్కుగా పనికొచ్చిందేమో గానీ పాత్రల్ని దెబ్బతీసింది. కాన్సెప్ట్‌ని మార్చేసింది. ఈ మలుపు తీసేస్తే పోయేదేమీ లేదు. తరాలుగా వాడుకలో వున్న కుందేలు -తాబేలు కథ అదే స్వచ్ఛతతో వుండేది. నిదానం అప్రియ ప్రదాన ప్రధానమని డ్యామేజింగ్‌గా అర్థం మారేది కాదు.

యాక్టివ్ ఫరూఖ్ – పాసివ్ నసీర్

‘నా కంటే ఫరూక్ పాత్రే బావుంటుంది, నటించడానికి స్కోపుంది’ అని నసీరుద్దీన్ షా స్టేట్‌మెంట్. నిజమే, కథ ప్రకారం తను పాసివ్ పాత్ర. ఫరూఖ్ యాక్టివ్ పాత్ర. ఫరూక్ షేక్ వల్ల కథకి చాలా హుషారు వచ్చింది. పాత్ర కిలాడీ మార్కు ఆవారా సరుకే. దీనివల్ల డైనమిక్ డైలాగులు అతడికే పడ్డాయి. ఎన్నాళ్ళ నుంచో నసీర్ దీప్తీ నావల్‌కి నేరుగా ప్రేమ చెప్పలేక నసుగుతూంటే, ఫరూఖ్ వచ్చేసి రావడం రావడం ఖాతా తెరిచేస్తాడు – ఆమె ఆ తాళాల గుత్తేమిటని అతను పట్టుకున్న తాళం చెవుల్ని చూసి అడిగితే, ‘ఇది రిజర్వ్ బ్యాంకు వాల్ట్ తాళం చెవి, ఇది నిజాం ఖజానా తాళం చెవి, ఇది హేమమాలిని జివెలరీ బాక్సు తాళం చెవి, ఇది సమాజ సేవా ప్రతిష్టాన్ ట్రస్టు తాళం చెవి, ఇది నా గుండె గది తాళం చెవి!’ – అని రొమాంటిక్‌గా ఆమె మీదికి విసురుతాడు. పరంజపే రాసిన చాలా బెస్ట్ హ్యూమర్ సీను ఇది.

ఇంకోసారి నసీర్ దాచుకున్న మూడొందలు తీసి ఖర్చు పెట్టేస్తాడు ఫరూఖ్. దీని మీద మండి పడతాడు నసీర్. కబోర్డుకి తాళం వేయక పోవడం తన తప్పేనని బాధ పడతాడు. దీనికి ఫరూఖ్, ‘తాళాలేసే సంస్కృతికి నేను వ్యతిరేకం. నా వల్లయితే ప్రపంచంలో వున్న తాళాలన్నిటినీ పగుల గొట్టి పారేస్తా. తాళాలేయడమంటే సాటి మనుషుల పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించడమే’ అంటాడు.

ఇందులో నిగూఢార్ధముంది. నసీర్‌కి దెప్పి పొడుపుంది. కబోర్డుకి తాళం వేయకపోవడం గురించే అతను బాధపడుతున్నాడు. అసలు తాళం వేసి బాషుకి దూరంగా వుంచాల్సింది దీప్తీ నావల్‌ని. ఒక వేళ తాళం వేసినా, తాళాలేసే సంస్కృతికి వ్యతిరేకమైన ఫరూఖ్, ఆ తాళం పగుల గొట్టి దీప్తిని తీసికెళ్ళే పోతాడు. ఇంతటి ప్రమాదం పొంచి వుంటే నసీర్ ఏమిటో ఆలోచిస్తున్నాడు. పరంజపే రాసిన గొప్ప సీను ఇది.

ప్రారంభంలో ఇంకో సీను కథకి ముగింపుని తెలుపుతుంది. నసీర్, దీప్తీ ఇద్దరూ కలిసి నేమ్ ప్లేటు అమర్చే దృశ్యం. వీళ్ళిద్దరూ ఒకింటి వాళ్ళవుతారనే సందేశమిందులో వుంది.

ఈ రెండు పరస్పర విరుద్ధ పాత్రల్లో నసీర్, ఫరూఖ్‌లు సున్నిత హాస్యంతో రంజింప జేస్తూ పోతారు. దీప్తీ నావల్ హాస్య పాత్ర కాదు. కానీ లిబరేటెడ్ గర్ల్. ‘నువ్వు పాత కాలం దానిలా ఎందుకుంటావ్? 1982 లోకి రా’ అని ఫరూఖ్ అంటే, ‘నేను లిబరేటెడ్‌ని’ అంటుంది. కానీ అతడితో మోసపోయి నసీర్ తో రాజీ పడి పోతుంది.

తన గుట్టు బయటపడి పెళ్ళి ఎగ్గొట్టి ఉడాయించిన ఫరూక్ కథ అక్కడితో ముగిసిపోతుంది. ఆ తర్వాత అతను ఏం చేస్తూ వుండొచ్చు? బుద్ధి తెచ్చుకుని సక్రమంగా బ్రతకొచ్చా? అవకాశం లేదు. పీజీ ఓడ్‌హౌస్ కొటేషన్ ప్రకారం, తప్పు చేసిన వాడు తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడడు. ఆ తప్పు సరిగ్గా చేయనందుకు పశ్చాత్తాప పడతాడు. ఫరూక్ ఇకపైన చేసిన తప్పుల్లో తప్పుల్ని దిద్దుకుని ఇంకా మంచి తప్పుడు పన్లు చేస్తూ కంటిన్యూ అవచ్చు. ఆ క్యారక్టర్ అలాంటిది.

‘కథ’ లో పాటలు కూడా వున్నాయి కామెడీగా. సమాంతర సినిమాల్లో ఇది వినోద ప్రధాన సినిమా. 40 ఏళ్ల తర్వాత పాత బడినట్టు ఏమీ అన్పించదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వుంది.

Exit mobile version