లోకల్ క్లాసిక్స్ – 30: లక్షద్వీప్ లక్!

0
2

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సందీప్ పంపల్లి దర్శకత్వం వహించిన జసేరీ సినిమా ‘సింజర్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘సింజర్’ (జసేరీ)

[dropcap]కే[/dropcap]వలం 70 వేల జనాభా గల లక్షద్వీప్ దీవుల్లో సినిమా థియేటర్లుండే అవకాశం లేదు. సినిమా పరిశ్రమ వుండే అవకాశం అసలే లేదు. అక్కడ ప్రదర్శనకి నోచుకునేదల్లా కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖకి చెందిన విద్యా సంబంధమైన వీడియో చిత్రాలే. కేరళ తీరం నుంచి 300 కిమీ దూరంలో అరేబియా సముద్రంలో నెలకొన్నఈ అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతంలో మాట్లాడే భాషలు జసేరీ, మహ్ల్ అనే రెండు భాషలు. జసేరీ ద్రవిడ భాషల కుటుంబానికి చెందిన మలయాళ మాండలికం. ఇందులో మలయాళం, తమిళం, అరబిక్ భాషలు కలిసి వుంటాయి. దక్షిణ ప్రాంతంలో మినికాయ్ వాసులు మహ్ల్ భాష మాట్లాడతారు. ఇది మాల్దీవుల భాషకి ఒక రూపాంతరం. ఈ దీవుల్లో మెజారిటీ ప్రజలు ముస్లిం మతస్థులు. పూర్వ కాలంలో తమ వర్తకులు తుఫానులో ఇక్కడికి కొట్టుకు వచ్చినట్టు నమ్ముతారు. వ్యవసాయం, చేపల వేట ప్రధాన వృత్తులు. ఇటువంటి భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యం గల లక్షద్వీప్ నుంచి జసేరీ భాషలో ఒక సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది సందీప్ పంపల్లికి.

సందీప్ పంపల్లి ‘మాతృభూమి’ దినపత్రికలో పనిచేస్తూ అనేక షార్ట్ మూవీస్ తీశాడు (ఇప్పుడు ముడి ఫిలిం లేదు కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ అనడం లేదు). అయితే ఇరాక్‌లో పరిణామాలు చూసి చలించాడు. దీని మీద సినిమా తలపెట్టాలనుకున్నాడు. లక్షద్వీప్‌ని సినిమా పరిధిలోకి తీసుకురావడమంటే ఎవరైనా నవ్వి పోయే పని. ఎవరు కొంటారు, ఎవరు చూస్తారు, ఎక్కడ ప్రదర్శిస్తారు. అసలు అక్కడికి వచ్చి తమ మీద సినిమా తీస్తామంటేనే ఒప్పుకోలేదు అక్కడి ప్రజలు. సినిమా తీస్తే ఏ గతి పడుతుందో అలావుంచి, అక్కడి ప్రజల్ని ఒప్పించడానికే నానా పాట్లు పడ్డాడు. అక్కడే మకాం వేసి జసేరీ భాష నేర్చుకున్నాడు. మూడేళ్ళ పాటు స్క్రిప్టు రాశాడు. రాసిన మళయాళ సంభాషణల్ని జసేరీలోకి మార్చడానికి స్థానికుల సహాయం తీసుకున్నాడు. నిర్మాతగా శిబు సుశీలన్ ముందుకొచ్చాడు. నటీనటులుగా శ్రిందా అర్హన్, మైథిలి, ముస్తఫా, సేతు లక్ష్మి కుదిరారు. షెడ్యూల్ కుదిరింది. కథని షూట్ చేయడం మొదలెట్టాడు. ఇలా లక్షద్వీప్ నుంచి మొట్ట మొదటి సినిమాగా 2018లో ‘సింజర్’ని తెరకెక్కించి చరిత్ర కెక్కాడు.

కథ

లక్షద్వీప్ రాజధాని కవరత్తిలో అన్సార్ (ముస్తఫా) మత్స్యకారుడు. అతడికి తల్లి (సేతు లక్ష్మి), చెల్లెలు సుహారా (మైథిలి) వుంటారు. సుహారా స్నేహితురాలు ఫిదా (శ్రిందా అర్హన్) వుంటుంది. ఆమెతో అన్సార్ ప్రేమలో పడతాడు. దీంతో ఇరువైపులా పెద్దలు సంబంధం అనుకుంటారు. అయితే పెళ్ళయే లోగా తామిద్దరం ఇరాక్ వెళ్లి పని చేసుకుని డబ్బులు సంపాదించుకుని వస్తామనీ, అప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా వుండొచ్చనీ అన్నకి నచ్చజెప్తుంది సుహారా. అలా ఇరాక్ బయల్దేరిన ఇద్దరూ అక్కడి సింజర్ పట్టణం చేరుకుంటారు. అక్కడ ఇళ్ళల్లో పనికి కుదిరిన వెంటనే ఐఎస్ టెర్రరిస్టుల అపహరిస్తారు. భారీ ఎత్తున అపహరించిన అక్కడి యజీదీ బాలికలూ స్త్రీలతో బాటు లైంగిక బానిసలుగా చేసుకుని, మూకుమ్మడి అత్యాచారాలకి పాల్పడతారు. ఈ వూహించని పరిణామాలకి ఆక్రందిస్తారు ఇద్దరూ. చివరికెలాగో భారత ప్రభుత్వం సహాయంతో స్వస్థలం చేరుకుంటారు. వాళ్ళ కన్యాత్వాలపై వూళ్ళో అనుమానాలు మొదలవుతాయి. ఫిదాని అడగలేక, పెళ్లిని కాదనలేక మానసిక సంఘర్షణకి లోనవుతాడు అన్సార్. చివరికి ఫిదాని అడిగేస్తాడు. ఆమె స్పృహతప్పి పడిపోతుంది. చూస్తే గర్భవతి.

గగ్గోలు లేస్తుంది. ఫిదాని వెలివేస్తారు. పెళ్లి రద్దవుతుంది. ఫిదా బ్రతుకు ఇరాక్‌లో కంటే దుర్భరం చేస్తారు. మౌనంగా చూస్తూంటాడు అన్సార్. చెల్లెలు సుహారా మీద కూడా అనుమానం వేస్తుంది. ఇక సుహారా చెప్పేస్తుంది తను కూడా ఐఎస్‌కి బలయ్యాననీ. ఆమెని కూడా వెలివేసి బ్రతుకు దుర్భరం చేస్తారు. ఇప్పుడు అన్సార్ సందిగ్ధంలో పడతాడు. ఫిదాని వదులుకున్నట్టు ఇప్పుడు చెల్లెల్ని కూడా వదిలెయ్యాలా? చెల్లెల్ని స్వీకరిస్తే ఫిదాని కూడా స్వీకరించాలి. ఏం చెయ్యాలి? పరిష్కార మేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

2014 లో ఇరాక్‌లోని సింజర్‌లో ఐఎస్ టెర్రరిస్టులు వేలాది యజీదీ పురుషుల్ని ఊచకోత కోసి, వాళ్ళ స్త్రీలని లైంగిక బానిసలుగా చేసుకున్న ఉదంతం దర్శకుణ్ణి చలింప జేసింది. ఈ ప్రేరణతో కథ చేశాడు. అయితే ఈ కథకి విశ్వసనీయత లేదనిపిస్తుంది. ఇరాక్ వెళ్లి ఐఎస్ బారిన పడ్డ భారత స్త్రీలెవరూ లేరు. పని మనుషులుగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంకే గల్ఫ్ దేశానికైనా వెళ్ళారేమో గానీ, ఏరి కోరి యుద్ధాల గడ్డ ఇరాక్ వెళ్ళగా వినలేదు. అలాటి వార్తలు రాలేదు. ఐఎస్ టెర్రర్ మూక అత్యాచారాలకీ, ఊచకోతలకీ పాల్పడింది యజీదీల పైనే. దీని మీద ‘సింజర్ -వేలీ ఆఫ్ ది షాడో’, ‘టుబి ఏ సోల్జర్’ అనే సినిమాలు కూడా వచ్చాయి- యజీదిల్ని విడిపించే కథలతో.

వాస్తవదూరమైన, వూహింప శక్యం గాని కథ చేశాడు. మానభంగ బాధితుల కథే చేయాలనుకుంటే దేశంలో నేపథ్యాలున్నాయి. ఎక్కడో అతకని పరదేశ నేపథ్యం అక్కర్లేదు. పైగా కథకి ఇచ్చిన ముగింపు పితృస్వామ్య భావజాలంతో వుంది. వూళ్ళో వాళ్ళందరి హింస భరించలేక ఫిదా అంటుంది చివరికి – తన మానాన తనని వదిలేస్తే కడుపులో పెరుగుతున్న టెర్రరిస్టు బిడ్డని మంచి ముస్లింగా పెంచుతానని. అంతేగానీ, అన్సార్ ఆమెని స్వీకరించే ఆలోచన చెయ్యడు. అటు ఐఎస్ చేతుల్లో గర్భవతులైన యజీదీ స్త్రీలని చూస్తే, యజీదీలు వాళ్ళని తమలో కలుపుకున్నారు. వెలివేసి వుంటే అది ఐఎస్ విజయమయ్యేది.

శాంతిని ప్రకటించడం ఈ సినిమా ఉద్దేశమన్నాడు దర్శకుడు. ఇది బాధితురాళ్ళు ఇద్దరితో శాంతి మాటున మెత్తని పితృస్వామ్య అహంకారంలా అయింది. ఇంత జరిగాక శాంతి ఏమిటి. పెళ్లాడబోయే అమ్మాయిని చెల్లెల్నిచ్చి ఎక్కడో దేశం కాని దేశం – అదీ టెర్రరిస్టుల మధ్యకి -డబ్బు సంపాదనకి పంపడమేమిటి. ఎత్తుగడ అసహజంగా వుంటే కథకి ముగింపు కూడా అసహజంగా వుంటుందని బిల్లీ వైల్డర్ చెప్పిన ప్రాథమిక సినిమా రూలు. ముగింపు కుదరాలంటే ఎత్తుగడ రిపేరు చేసుకోమన్నాడు. అసలు నేపథ్యమే కుదరనప్పుడు ఎత్తుగడ లేముంటాయి.

2019లో ఫ్రెంచి దర్శకురాలు కరోలిన్ ఫౌరెస్ట్ తీసిన ‘సిస్టర్స్ ఇన్ ఆర్మ్స్’ అనే ఫ్రెంచి మూవీలో ఇద్దరు ఫ్రెంచి యువతులు సిరియా వెళ్లి కుర్దిష్ దళాలతో చేరి ఐఎస్ మీద పోరాటం చేస్తారు. వాళ్ళతో ఐఎస్ అత్యాచారాలకి బలైన యజీదీ యువతి కూడా కలుస్తుంది. వాళ్లకి జరిగిన అవమానానికి, అన్యాయానికి తిరగబడి ఐఎస్‌కి దడ పుట్టించే కథతో ఇది వుంది.

2014లోనే ఇరాక్‌లో ఇరాక్ దళాలకీ, ఐఎస్ దళాలకీ పోరాటం జరుగుతునప్పుడు ఐఎస్ దళం 44 మంది భారత నర్సుల్ని బందీలుగా పట్టుకుంది. ఆస్పత్రి లోనే 23 రోజులు అమెరికాకి వాళ్ళ డిమాండ్స్ తో హై డ్రామా నడిచింది. చివరికి క్షేమంగా వదిలేశారు. వాళ్లతో ఎక్కడా అసభ్యంగా ప్రవర్తించలేదు. మీరు ఇండియన్స్, మీకు హాని చెయ్యమని చెప్పి వదిలేశారు. వీళ్ళంతా కేరళ నర్సులే.

ఈ ఉదంతంతో సల్మాన్ ఖాన్ తో 2017 లో ‘టైగర్ జిందా హై’ తీశారు. దీన్ని మసాలా చేసి పాక్ నర్సుల్ని కూడా కలిపి, విచిత్రంగా రెండు దేశాల జెండాలు ఎగరేసుకుంటూ ఇండో – పాక్ జాయింట్ ఆపరేషన్ గా తీశారు.

నర్సులు వెళ్ళడం వేరు. నర్సుల్ని అక్కడి ప్రభుత్వం నియమించుకుంది. ప్రభుత్వ బాధ్యత వుంటుంది. ఇళ్ళల్లో పని మనుషులుగా వెళ్ళడం వేరు, పెళ్లి వుంచుకుని వెళ్ళడం అసలే వేరు. పెద్దలు కూడా ఎలా వెళ్ళనిస్తారన్నదీ ప్రశ్నే. బాధితులుగా తిరిగొస్తే ఆ పెద్దలే రాచి రంపాన పెట్టడం, తీర్పులు చెప్పడం అనాలోచిత కథాకథనాలుగా తేలాయి.

టెక్నికల్ అత్యుత్సాహం

నటనలు సహజత్వంతో వున్నాయి. ముస్తఫా, శ్రిందా, మైథిలి, సేతు లక్ష్మి బాగా నటించారు. ఐఎస్ టెర్రరిస్టులు తమ జీవితాల్లో సృష్టించిన కల్లోలాన్ని బాగా ప్రటించారు. ముస్తఫా స్నేహితుడు, సైకిలు షాపతను కూడా దృశ్యాల్ని రక్తి కట్టించారు. అయితే పాత్రల భావోద్వేగాలకి ఎడిటింగే అడ్డు పడింది. పాత్రలు అనుభవిస్తున్న బాధ ప్రేక్షకుల హృదయాల్లో ఇంకెలా కాసేపు షాట్స్‌ని నిలకడగా వుంచక, జంప్ కట్స్‌తో కమర్షియల్ ఎడిటింగ్ చేశాడు దర్శకుడు. సంగీతం కూడా కమర్షియల్ సినిమా సంగీతంలా భారీగా వుంది. కథనం కూడా కమర్షియల్ సినిమా కథనమే. ఈ సున్నిత జీవితాల గుప్పెడు కథకి సముద్రం మీద డ్రోన్ షాట్స్ తీయాల్సిన అవసరం లేదు. తీస్తున్నది హాలీవుడ్ యాక్షన్ సినిమా కాదు. ఇలా జానర్ మర్యాద కూడా పాటించలేదు. తొలిసారిగా తెరకెక్కిస్తున్న ఈ లక్ష ద్వీప్ మత్స్యకారుల జీవిత కథకి కావాల్సింది వీలైనన్ని టెక్నికల్, విజువల్ హంగామాలు కాదు. సహజ సౌందర్యం.

లక్షద్వీప్‌కి తొలి సినిమా ఇచ్చిన దర్శకుడుగా సందీప్ పంపల్లి పేరు చరిత్రలో వుంటుంది. చేసిన ప్రయత్నం చరిత్రలో నిలవాలంటే స్టయిలిష్ దర్శకత్వం కాకుండా ఆర్గానిక్ దర్శకత్వం చేసి వుండాల్సింది. అలాగే కథకి నేటివిటీలో ఒదిగే నేపథ్యం వుండాల్సింది. ఏమైనా దీనికి జాతీయ ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ నూతన దర్శకుడు అవార్డులు రెండు లభించాయి. అవార్డులు వస్తే మలయాళం ఫీల్డు నుంచి ఒక్కరూ ఫోన్ చేసి అభినందించలేదని తను బాధ పడుతున్నప్పుడు, బాలీవుడ్ నుంచి మహేష్ భట్ అభినందించడం ఊరట నిచ్చిందన్నాడు. శుభం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here