[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా మణికౌల్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఉస్కీ రోటీ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘ఉస్కీ రోటీ’ (హిందీ/ఆర్ట్)
[dropcap]స[/dropcap]కల వర్గాల ప్రేక్షకుల్నీ అలరించే ప్రధాన స్రవంతి సినిమాలకి ప్రత్యామ్నాయంగా, 1950ల నుంచీ సత్యజిత్ రే చేతుల మీదుగా, పరిమిత వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సమాంతర సినిమాలనే వాస్తవిక సినిమాలు – లేదా ఆర్ట్ సినిమాలు రావడం ప్రారంభమయ్యాయనేది తెలిసిన చరిత్రే. సత్యజిత్ మార్గాన్ననుసరించి ఎందరో దర్శకులు ఆర్ట్ సినిమాల్ని ఒక ఉద్యమంగా కొనసాగించారు. ఇలా ప్రధాన స్రవంతి సినిమా సాంప్రదాయాల్ని బ్రేక్ చేస్తూ ఆర్ట్ సినిమాలు న్యూవేవ్‌ని సృష్టిస్తే, ఈ ఆర్ట్ సినిమా సాంప్రదాయాల్ని సైతం విచ్ఛిన్నం చేస్తూ ఇంకో తరహా ఆర్ట్ సినిమాలు న్యూవేవ్ అర్ధాన్ని మార్చేస్తే? అప్పుడది మణికౌల్ వేవ్ అవుతుంది. ఆయన రెబల్, రాడికల్ – పేరేదైనా ఆర్టు సినిమాల్ని ఓ మలుపు తిప్పిన తిరుగుబాటు దర్శకుడవుతాడు.
‘ఉస్కీ రోటీ’ (అతని రొట్టె)ని కవిత్వంగా చెప్పడంతో ఆగలేదు కౌల్. ఇంకా సాహిత్యం నుంచే కథానికల్ని తీసుకుంటూ, ‘దువిధ’ని చిత్ర కళలా చెప్పాడు, ‘సతాసే ఉట్తా ఆద్మీ’ని వాస్తు కళగా చెప్పాడు. కవిత్వంగా ‘సిద్ధేశ్వరి’ చెప్పాడు. సంగీతంగా ‘ద్రుపద్’ చెప్పాడు. ఇప్పుడు ‘ఉస్కీ రోటీ’ ని కవిత్వంగా ఎలా చెప్పాడో చూద్దాం…
కథ
హర్యానాలో ఒక పల్లె, ఆమె పేరు బాలో (గరిమ). ఆమె భర్త సుచా సింగ్ (గురుదీప్ సింగ్) బస్సు డ్రైవర్. భర్తని పేరుతోనే పిలుస్తుంది. ఆమెకో చెల్లెలు. సుచా సింగ్ నడిపే బస్సు పల్లె మీదనుంచే పోతుంది. ఆమె రొట్టెలు కట్టుకుని వెళ్ళి రోడ్డు మీద అందిస్తుంది. అతను తినేసి వెళ్ళిపోతాడు. అయితే ఈ రూట్లో అతను రోజూ ప్రయాణిస్తున్నా, ఒక్క మంగళవారమే ఇంటికొస్తాడు. అతను వేరే అమ్మాయిలతో కులుకుతున్నాడని ఆమె అనుమానం. తన ఇంటి బాధ్యతలు తను సక్రమంగా నెరవేర్చుకోవాలని అతడి దబాయింపు. రాజీపడి ఆమె జీవనం.
రోజూ లాగే ఈ రోజు రొట్టెలు తయారు చేసుకుని ఆదరాబాదరా బయల్దేరింది. ఆలస్యమైపోయింది. చెల్లెల్ని ఒకడు వేధిస్తున్నాడు. ఆ గొడవ చూసుకునేటప్పటికి ఆలస్యమై పోయింది. వచ్చి రోడ్డు పక్కన చెట్టు కింద బల్ల మీద కూర్చుంది రొట్టెల మూట వొళ్ళో పెట్టుకుని. ఈ ఆలస్యానికి బస్సు వెళ్లిపోయిందో లేదో తెలీదు. అడుగుదామంటే ఎవరూ లేరు. ఎదురుచూస్తూ ఎదురుచూస్తూ అలాగే కూర్చుంది.
అటు పట్టణంలో సుచా సింగ్ లాడ్జిలో ఎంచక్కా తింటూ తాగుతూ కూర్చున్నాడు. మంచి మంచి పుష్టిగల వేడివేడి పరోటాలు, కోడి కూర. తిని తాగి పేకాటకి కూర్చున్నాడు. పేకాట అయ్యాక వేశ్య వొళ్ళో వాలిపోయాడు.
చెట్టుకింద ఎదురు చూపులతోనే వుంది బాలో. బస్సు జాడలేదు. ముసలివాడు ఆమెని చూసి, ఎంత సేపిలా కూర్చుంటావ్, బస్సు వెళ్లి పోయిందేమో అన్నాడు. సుచాసింగ్ రావాలిగా అంది. ఆ బస్సే రాదు. ఇంటి దగ్గర చెల్లెలెలా వుందోనని ఆందోళన. బస్సు వచ్చినా అతనాపుతాడని నమ్మకంలేదు. ఇక్కడ ఎక్కే దిగే ప్రయాణికులుంటేనే ఆపుతాడు. లేకపోతే ఆమెని చూసీ చూడనట్టు చూసి దూసుకుపోతాడు.
అతనంటే నీకెందుకింత ప్రేమని చెల్లెలంటే, వారంలో ఒక్క రోజయినా ఇంటికొస్తాడుగా అని ఆమె ఆశ. ఆ ఒక్క రోజు మంగళవారం అతను ఇంటికి రావడం కోసం ఎంతసేపైనా కూర్చుంటుంది ప్రతీ రోజూ రొట్టెలతో. ఇప్పుడు రాత్రయి పోయింది. ఇంటి దగ్గర చెల్లెలి పరిస్థితేమిటో తెలియడం లేదు. బస్సు వచ్చేదాకా ఇక్కడ కూర్చోవాల్సిందే. మళ్ళీ ముసలి వాడు వచ్చి, అదే ప్రశ్న. ఆమె నుంచి అదే జవాబు – సుచాసింగ్ రావాలిగా అని. రోడ్డు మీద గంటకొక వాహనం కూడా పోదు. పగలే జన సంచారముండదు. ఈ చీకట్లో తను తప్ప ఇంకెవరూ వుండే అవకాశం లేదు. ఈ చీకట్లో ఎంతసేపైనా ఎదురు చూస్తూ కూర్చోవాలి తప్పదు. ఒకసారిలాగే పోకిరీతో గొడవవల్ల ఆలస్యమైపోయింది. అప్పుడు తను రాలేదన్న కోపంతో వెళ్లిపోయాడు సుచాసింగ్. ఆ పై మంగళవారం రాలేదు.
ఈ రాత్రికి వస్తాడా? ఎంత రాత్రయినా తను ఎదురు చూడక పోతే ఆ కోపంతో వచ్చే మంగళవారం రాడు. ఇంతలో ఎందుకో ఇటు వైపు నుంచి తెల్లటి పొగ మేఘం ఒకటి కమ్ముకుంటూ తన మీదికే వస్తోంది…
ఎలావుంది కథ
హిందీ రచయిత మోహన్ రాకేష్ ఇదే పేరుతో రాసిన కథానికకి చిత్రానువాదమిది. దీనికి తనే సంభాషణలు రాశాడు. స్వాతంత్ర్య పూర్వం లాహోర్‌లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎమ్మే ఇంగ్లీషు చేసిన తను నాటక, నవలా రచయిత కూడా. ‘ఉస్కీ రోటీ’ తర్వాత ‘ఆషాఢ్ కే ఏక్ దిన్’ నాటకాన్ని మణికౌలే తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలూ వాస్తవిక సినిమా జగత్తులో మైలురాళ్ళ వంటివి. ‘ఉస్కీ రోటీ’లోని స్త్రీ బానిసత్వానికి మణికౌల్ భావోద్వేగరహిత చిత్రణే చేశాడు. ప్రధాన పాత్ర బాలోకి భావోద్వేగాల్లేనట్టే. బానిసకి భావోద్వేగాలేముంటాయి. ఆమె పాత్రని అర్థం జేసుకుంటే సినిమా ఇలా ఎందుకు డ్రైగా తీశాడు అర్ధమవుతుంది.
కవితాత్మక సాంకేతికం
రెండొందలు ఆర్టు, హిందీ కమర్షియల్ సినిమాల సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు కెకె మహాజన్ కెమెరా కన్ను సృష్టించిన దృశ్య కావ్యం. ఇందులో పెయింటింగ్సే కనబడతాయి, కదిలే బొమ్మల తెలుపు నలుపు పెయింటింగ్స్. మణికౌల్ బ్రెసన్ శైలికి తెరమీద మహాజన్ కుంచె విరుపులు. శ్వేతం, నిశ్శబ్దం, నిశ్చలం బ్రెసన్ శైలి అని పైన చెప్పుకున్నాం. ఈ శైలిలో నటుల నటనకి చోటు లేదు. అంగ ప్రదర్శనకే అనుమతి. శ్వేతం అనేది నేపథ్యం. తెల్ల గోడలు, తెల్ల పొగ మేఘం, తెల్లటి ఆకాశం మొదలైనవి. ఈ శ్వేత నేపథ్యంలో నిశ్శబ్దం తాండవిస్తూంటుంది. సన్నివేశంలోని భావాన్ని వ్యక్తం చేయడానికే ఆయా వస్తువుల చప్పుళ్ళు వినపడతాయి. సంభాషణకీ సంభాషణకీ మనం నిరీక్షించాల్సినంత ఎడం వుంటుంది. ఇక నటులు నిశ్చల ఛాయా చిత్రాల్లా వుంటారు. సంభాషణలు పలికేటప్పుడు ముఖ భావాలుండవు. ముఖం కాదు ముఖ్యం, కాళ్ళూ చేతులూ ఏం చెప్తున్నాయనేది ముఖ్యం. నటులు కెమెరా వైపు కూడా చూడరు. భావోద్వేగాలూ డ్రామా వంటివి ఈ శైలికి వ్యతిరేకం. బ్రెసన్ దృష్టిలో నటులు నటులు కాదు, మానవ రూపానికి మోడల్స్. నటులు పాత్ర అంతర్ముఖాన్ని బహిర్గతం చేస్తారు, మోడల్స్ బాహిర్ రూపంతో అంతర్ముఖాన్ని ఊహాత్మకం చేస్తాయి. అంటే పాత్ర లోపల ఏం ఫీలవుతోందో అంతరార్థాన్ని మన వూహకి వదిలేస్తాయి.
చివరికి రాత్రెప్పుడో బస్సు వస్తుంది. రొట్టెలు తింటాడు. తిరిగి వెళ్లిపోతూంటే ‘మంగళవారం వస్తావుగా?’ అంటుంది. ఆమెవైపు చూసి బస్సుని పోనిస్తాడు. పొగ మేఘమే కదా. పొగ మేఘం వస్తుంది, ఆమెని ముంచెత్తి వెళ్లిపోతుంది. పట్టుకోవడానికి లేదు, అది ఆగేదీ లేదు. గాలిలో కలిసి పోవడమే …
యాభై ఏళ్లనాటి ఈ సినిమా ఇప్పుడెందుకు పనిగట్టుకుని చూస్తూ కూర్చోవాలంటే, ఇంకా చూస్తూ వుండాలంటే, పెరిగిన రకరకాల వొత్తిళ్ళతో జీవిస్తున్న మనిషి, ఇది చూస్తూ కనీసం రెండు గంటలు ధ్యానముద్రలో వుంటాడు. కవిత్వీకరించిన ఈ నిరీక్షణ – ఈ క్రియేషన్ – వొత్తిళ్లని దూరం చేసే మెడిటేషన్.