[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా చైతన్యా తమ్హనే దర్శకత్వం వహించిన మరాఠీ సినిమా ‘కోర్ట్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘కోర్ట్’ (మరాఠీ)
‘కోర్ట్’ ద్వారా ఒక వైపు వ్యవస్థల ప్రహసనాన్ని ఎత్తి చూపుతూనే, మరోవైపు తాను ఆశిస్తున్న సామాజిక దర్పణాన్ని కళ్ళకు కట్టాడు. ఇదెప్పటికైనా సాధ్యమవుతుందా?
కథ
నారాయణ్ కంబ్లే (వీర సతీధర్) విప్లవ గాయకుడు. ప్రదర్శన లిస్తూంటాడు. ఇంకోవైపు పిల్లలకి పాఠాలు చెప్తూంటాడు. ఒక సభలో ఇతను పాడిన ఒక విప్లవ గీతంతో వాసుదేవ్ పవార్ అనే పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కేసుపెట్టి అరెస్టు చేస్తారు. డబ్బున్న లాయర్ వినయ్ వోరా (వివేక్ గోంబర్) ముందుకొచ్చి ఉచితంగా కేసు చేపడతాడు. కంబ్లే పాడిన పాటలో ఆత్మహత్యకి పిలుపేదీ లేదని వాదిస్తాడు. ముందుగా బెయిల్ మీద విడిపించేందుకు ప్రయత్నిస్తాడు. అనేక వాయిదాలు పడుతుంది. బెయిల్ లభించకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూతన్ (గీతాంజలీ కులకర్ణి) కేసుని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రవేశ పెట్టిన సాక్షులు విరుద్ధ సాక్ష్యాలిస్తారు. చివరికి వోరా పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా పవార్ మరణం డ్రైనేజీలో విషవాయుల వల్ల సంభవించిందని నిరూపించడంతో, కంబ్లేకి బెయిల్ మంజూరు చేస్తాడు సెషన్స్ జడ్జి సదావర్తే (ప్రదీప్ జోషి). ఆ లక్షరూపాయల పూచీకత్తు తానే కడతాడు వినయ్ వోరా.
కంబ్లే బెయిల్ మీద విడుదలవగానే మళ్ళీ అరెస్టు చేస్తారు పోలీసులు. ఈసారి ఉపా చట్టాన్ని ప్రయోగిస్తూ తీవ్ర అభియోగం మోపుతారు. అశ్విన్ భగత్ అనే తీవ్రవాదితో సంబంధాలున్నాయని, తీవ్రవాద సాహిత్యాన్ని జప్తు చేశామని, నగరంలో బాంబు దాడులకి పథకం పన్నాడనీ కేసు మోపుతారు. ఇది బూటకపు కేసని మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసి వాదిస్తాడు వోరా. ఉపా చట్టం కింద సెషన్స్ కోర్టు బెయిలు ఇవ్వజాలదనీ, హైకోర్టుకి వెళ్లమనీ బెయిల్ అప్లికేషన్ కొట్టేస్తాడు జడ్జి సదావర్తే. కోర్టు ముగుస్తుంది. చీకటి పడుతుంది. లైట్లార్పేసి తలుపులేస్తాడు ప్యూను. పూర్తి చీకటై పోతుంది. ఈ చీకటిని చూపిస్తూ వుండిపోతుంది కెమెరా…
ఎలావుంది కథ
పోలీసు, న్యాయ వ్యవస్థ రెండిటి పనీ పాటా లేని తనాన్ని చిత్రిస్తుంది కథ. పనీ పాటా లేకపోతేనే ఇలాటి కేసులతో కాల, ధన, మేధో హరణలకి పాల్పడతారు. చివరికి జడ్జి పార్కులో తనని చూసి నవ్వుతున్న పిల్లాడ్ని మరొకలా భావించి, చాచి కొడతాడు కూడా. పిల్ల వెధవలు కూడా నవ్వుతున్నారు న్యాయవ్యవస్థని చూసి. ఒక తప్పుడు కేసు బనాయించిందే గాక, ఆ కేసులోంచి బెయిల్ మీద వస్తే, తిరిగి ఇంకో బనాయింపు కేసుతో కోర్టుల మీద భారం పెంచే ధోరణిలో పోలీసు వ్యవస్థ వున్నంత కాలం – కోర్టుల్లో కోట్లకి కోట్ల కేసులు పెండింగులో అటకెక్కి పేరుకుంటూనే వుంటాయి.
ఇక సంవత్సరం పాటు క్షేత్ర స్థాయిలో కోర్టుల్నీ, పోలీసు వ్యవస్థనీ, కోర్టుల పనితీరునీ, న్యాయవాదుల వ్యవహార సరళినీ పరిశీలించాడు. ఈ సందర్భంగా ఒక ప్రసిద్ధి పొందిన మరాఠీ డాక్యుమెంటరీ దృష్టి కొచ్చింది. ‘జై భీమ్ కామ్రేడ్’ అన్న ఈ డాక్యుమెంటరీ 1997 లో రమాబాయిలో కుల హత్యల ఉదంతం ఆధారంగా నిర్మించారు. దళితుల మీద జరిగిన కులదాడికి నిరసనగా దళిత గాయకుడు విలాస్ ఘోగ్రే ఆత్మహత్య చేసుకున్న కథ ఇది.
దీన్నుంచి స్ఫూర్తి పొంది నారాయణ్ కంబ్లే అనే గాయకుణ్ణి సృష్టించి, అతడి పాట కారణంగా పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న అభియోగ కథగా మార్చుకున్నాడు. కథకి ఓ ప్రయోజనముండాలని వేళాకోళం కేసులతో వ్యవస్థల్ని హాస్యాస్పదంగా మారుస్తున్న వాస్తవాన్ని కళ్ల ముందు నిలబెట్టాడు. కొస మెరుపేమిటంటే, షూటింగు జరుగుతున్నప్పుడు తను తీస్తున్న కథకి తగ్గట్టే ఒక వీగిపోయే కేసులో నారాయణ్ కంబ్లే పాత్రధారిని అరెస్టు చేయడానికి పోలీసులొచ్చారు. ఆ పాత్రధారిని దాచేశాడు తను.
అతను సంపాదకుడు
నారాయణ్ కంబ్లే పాత్ర నటించిన వీర సతీధర్ ప్రముఖ మరాఠీ ద్వై మాసిక పత్రిక ‘విద్రోహి’ సంపాదకుడు. అంతేగాకుండా దళిత సామాజిక కార్యకర్త, నటుడు, గాయకుడు, రచయిత. నిజ జీవితంలో ఎన్నో కేసుల నుంచి నిర్దోషిగా విడుదలై వచ్చిన వాడు. న్యాయవ్యవస్థతో ప్రత్యక్ష అనుభవాలున్నాయి. ఈ సినిమా నటించాక ప్రపంచ దృష్టి నాకర్షించాడు. దీంతో తన సామాజిక పోరాటానికి మరింత ప్రోత్సాహం లభించింది. తను నటించిన ఈ పాత్రకి పౌరుషాలు, క్రోధావేశాలు, నినాదాలు, సిద్ధాంతాల వాదోపవాదాలు, ప్రశ్నించడాలూ వుండవు. నిజ జీవితంలో నిందితుడిలాగా కోర్టుకి హాజరవడం, వెళ్లిపోవడం. తన లాయర్‌తో కూడా చర్చలుండవు. బెయిల్ మీద విడుదలయ్యాక ప్రింటింగ్ ప్రెస్సులో పని చూసుకుంటూ వుంటే, పోలీసులు వచ్చి పిల్చుకు వెళ్తారు. నిశ్శబ్దంగా వాళ్ళ వెంట వెళ్తాడు ఇంకో బనాయింపు కేసుకి. బహిరంగ సమావేశంలో స్టేజి మీద సొంత గొంతుతో పాక్షికంగా పాటలు పాడే సందర్భాలు రెండుంటాయి. ఎక్కడా ఓవరాక్షన్ కాదుకదా సినిమా కోసం నటిస్తున్నట్టే వుండదు.
ఇంకో సందర్భంలో వీధిలో లాంగ్ షాట్ పెడతాడు. అంతదూరం నుంచి ఎవరోస్తారాని సూటిగా చూస్తూంటాం. ఇటు పక్క సందులోంచి వచ్చేసి నారాయణ్ కంబ్లే వెళ్లిపోతూంటాడు. ఇలాగని చెప్పి ఈ గిమ్మిక్కులు అదే పనిగా చేస్తూ పోలేదు ఈ రెండు సార్లు తప్ప.
ఒక సామాజిక కూర్పు
పాత్రల్ని నిర్ణయించు కోవడంలో సామాజిక కూర్పు స్పష్టంగా కన్పిస్తుంది. నిచ్చెన మెట్ల సామాజిక కూర్పు. జడ్జి ఉన్నత తరగతి కుటుంబానికి చెందిన వాడైతే, డిఫెన్స్ లాయర్ ఎగువ మధ్య తరగతి, అలాగే ప్రాసిక్యూటర్ మధ్యతరగతి, ఇక కంబ్లే, పారిశుద్ధ్య కార్మికుడు శ్రామిక కుటుంబాలకి చెందిన వాళ్ళు.
ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ల ఇళ్ల దగ్గర కుటుంబ జీవితాలు కూడా చూపిస్తాడు. ప్రాసిక్యూటర్ నూతన్ సాధారణ మధ్యతరగతి గృహిణి, వంట చేసుకుంటూ, భర్తా పిల్లల్ని చూసుకుంటూ, ఖర్చుల గురించి మాట్లాడుతూ వుంటుంది. ఎగువ మధ్య తరగతికి చెందిన డిఫెన్స్ లాయర్ వినయ్ వోరా కారులో తిరుగుతూ, ఎడాపెడా ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్లు షాపింగ్ చేసుకుంటూ, ఇంటి దగ్గర భార్యతో, తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూ వుంటాడు. ఇంటా బయటా ఎవరి జీవితాల్లోనూ ఉద్రేకాల్లేవు, ఘర్షణల్లేవు. పోలీసులు సహా ఎవరి సామాజిక, ఉద్యోగ విధులు వాళ్ళు శాంతంగా నిర్వహించుకుంటూ, విభేదాల్లేని భిన్నత్వంలో ఏకత్వపు ఆదర్శ సామాజిక దర్పణానికి ప్రతిబింబాలుగా వుంటారు. ఈ న్యాయవ్యవస్థ కథలో దర్శకుడు ఎవర్నీ విలన్లుగా చూపించలేదు. ఏ పక్షం వైఖరీ తీసుకోలేదు. ప్రతీ ఒక్కరూ వాళ్ళ స్పందనలతో రైటే. యూఆర్ ఓకే – అయాం ఓకే.
యూపీలో ప్రస్తుత సంచలన హాథ్రస్ ఉదంతంలో పోలీసులు బాధితుల గ్రామాన్ని దిగ్బంధం చేసి విలేఖర్లని కూడా రానీయలేదు. ఒక హిందీ ఛానెల్ విలేఖరిణి పోలీసులతో గొడవేసుకుంది. గ్రామంలోకి తోసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేసింది. పోలీసులు గోడ కట్టినట్టు నిలబడ్డారు. వాళ్ళలో ఉన్నతాధికారులు కూడా వున్నారు. తామేం చేయలేమనీ, పై నుంచి ఆదేశాలున్నాయనీ, తమ డ్యూటీ తాము చేస్తున్నామనీ, నిగ్రహం కోల్పోకుండా ఎంత ఓపికగా ఎంత సేపు నచ్చజెప్తున్నా విన్పించు కోవడంలేదు. నా డ్యూటీ కూడా నేను చేయాలని ఒకటే గొడవ. రెచ్చి పోతూ తన డ్యూటీ గురించి దబాయింపులు. పిచ్చి దానిలా చాలా ట్రోలింగ్ చేసింది, హెరాస్ చేసింది. కనీసం పావుగంట ఇది నడిచింది. చివరికి వెనుదిరగాల్సే వచ్చింది. ఇదంతా టీయార్పీ కోసం చేస్తే చేయవచ్చు. కానీ ఇలా డ్యూటీ వర్సెస్ డ్యూటీ సమస్య వచ్చినప్పుడు ఘర్షణ పడి ఏం చేస్తుంది. ఈ సమస్యకి మధ్యలో ఇంకో వ్యవస్థ డ్యూటీ కూడా వుంది. న్యాయ వ్యవస్థ. విలేఖర్లంతా కోర్టు కెళ్తే ఎవరి డ్యూటీ ఇప్పుడు ముఖ్యమో చెప్పడానికి కోర్టే వుంది. ఎవరి విధులు వాళ్ళు నిర్వహించుకుంటూ పోతే, అవతలి వాళ్ళ విధులు కూడా నిర్వహించుకోనిస్తే, అనవసర గొడవలు, అశాంతీ వుండవు. ఇదే ‘కోర్ట్’ కథ చెప్తోంది. విధులు కూడా భిన్నత్వంలో ఏకత్వంగా వుండాలన్న అర్ధంతో. కథలో ప్రింటింగ్ ప్రెస్సులో వుండగా పోలీసులొచ్చినప్పుడు నారాయణ్ కంబ్లే మాట్లాడకుండా వాళ్ళతో వెళ్లిపోయాడు. ఏయ్ పత్రికా స్వేచ్ఛకి అడ్డు పడుతారా, నా భావ స్వేచ్ఛని, మనో భావాల్నీ గాయపరుస్తారాని సొల్లు మాట్లాడి సిల్లీ సీను క్రియేట్ చేయలేదు, వాళ్ళు డొల్ల కేసు పెడుతున్నా సరే.
జడ్జి జీవితం
చివరికి కంబ్లేకి ఉపా చట్టం కింద సెషన్స్ కోర్టు బెయిలు ఇవ్వజాలదనీ, హైకోర్టుకి వెళ్లమనీ బెయిల్ అప్లికేషన్ని జడ్జి సదావర్తే కొట్టేశాక కోర్టు ముగుస్తుంది. చీకటి పడుతుంది. లైట్లార్పేసి తలుపులేస్తాడు ప్యూను. పూర్తి చీకటై పోతుంది. ఈ చీకటిని సుదీర్ఘంగా 46 సెకన్ల పాటు చూపిస్తూ వుండిపోతుంది కెమెరా… వ్యవస్థల విషాదానికి ప్రతీకగా.
ఇప్పుడు ముగింపు కంబ్లే మీద వుండదు, లాయర్ వోరా మీద వుండదు. ఇక జడ్జి జీవితం కూడా చూపించి ముగిస్తాడు దర్శకుడు. ఉన్నత తరగతికి చెందిన జడ్జి టూరిస్టులతో కలిసి టూరేసుకుంటాడు. రిసార్ట్స్‌లో ఆడి పాడి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాడు. లేడీస్‌తో జెంట్స్‌తో స్విమ్మింగ్ పూల్ బాల్ ఆడతాడు. తెల్లారి బెంచీ మీద కూర్చుని పేపరు చదువుతాడు. పిల్లల గుంపు వచ్చి ఒక్కసారిగా భయపట్టి పారిపోతారు. ఒక పిల్లాడు జడ్జిని చూసి అక్కడే పకపక నవ్వుతాడు. ఆ నవ్వులో ఇంకేదో అర్ధం చూసి, లాగి లెంప కాయిచ్చుకుంటాడు జడ్జి. పిల్ల నాకొడుకులకి కూడా అలుసైపోయింది కోర్టు!
తను చేయగల్గిందేమీ లేదు. తన వ్యవస్థ బావుండాలంటే ఇంకో వ్యవస్థ బావుండాలి. ఇంకో వ్యవస్థ బావుండాలంటే రెండూ కూర్చుని మాట్లాడుకోవాలి. ఎవరి ఆట వాళ్ళాడుకుంటూ వుంటే ఇలాగే చీకట్లో వుంటారు అందరూ లోకం నవ్వుతూంటే.